Sakshi News home page

క్షమించలేను

Published Sun, Aug 10 2014 12:16 AM

క్షమించలేను - Sakshi

అమ్మ... ఏ మనిషి జీవితానికైనా పునాది. జన్మనిచ్చిన నాటి నుంచి జన్మను చాలించే వరకూ కూడా బిడ్డే లోకంగా బతుకుతుంది తల్లి. కానీ మౌరీన్ అలా చేయలేదు. చేసి ఉంటే కొలెట్ జీవితం ఇలా ఉండేది కాదు. మౌరీన్ తనకు జన్మనిచ్చినా ఆమెను అమ్మా అని పిలవడానికి ఇష్టపడదు కొలెట్. ఎందుకని? అంతగా ఆ తల్లి ఏం చేసింది? ఈ బిడ్డ మనసు ఎందుకు విరిగింది?
 
‘‘వెరీగుడ్... నీకిక ఏ సమస్యా లేదు. యు ఆర్ పర్‌ఫెక్ట్‌లీ ఆల్‌రైట్’’
డాక్టర్ అన్న మాటకు నవ్వొచ్చింది నాకు. ఏ సమస్యా లేదట. నా జీవితమే ఒక సమస్యని ఆయనకు తెలియదు కదా.. అందుకే ఆ మాట అనివుంటాడు. లేదంటే ఆత్మహత్యాయత్నం చేసి, మృత్యుదేవత చిన్నచూపు చూస్తే బతికినదాన్ని పర్‌ఫెక్ట్‌లీ ఆల్‌రైట్ అని అంటారా ఎవరైనా!

డాక్టర్ నన్ను పరీక్షిస్తూ ఉంటే నేను గుమ్మం దగ్గర నిలబడి ఉన్న మా అమ్మనే చూస్తున్నాను. నా కూతురు బాగయ్యిందో లేదోనన్న ఆతృత ఆమెలో కించిత్ కూడా లేదు. నా చావు తనకు చుట్టుకుంటుందని భయపడి చికిత్స చేయించి ఉంటుంది తప్ప, నేను బతికినందువల్ల ఆమెకు ఏ ఆనందమూ కలగదు.కన్నతల్లి గురించి ఇలా మాట్లాడుతోందేమిటి అనుకుంటున్నారా? నా కథ తెలిస్తే నా మాటలు తప్పనిపించవు మీకు. కన్నతల్లి ఒడి సైతం క్రూరమృగపు నీడ అయిన దౌర్భాగ్యం నాది. ఉప్పెనంత శోకసంద్రంలో గుప్పెడంత మమత కోసం వెతికిన వెత నాది. ఈ లోకమంతా ప్రేమే నిండి ఉంటుందని అంటారు. అంత ప్రేమలో రవ్వంత కూడా నాకు దొరకలేదంటే నమ్ముతారా?!
 
అప్పుడు నాకు ఎనిమిదేళ్లు. సడెన్‌గా పోలీసులు వచ్చారు. నన్ను తమతో రమ్మన్నారు. ఎందుకు అని అడిగే ధైర్యం నాకు లేదు. అడగాలని కూడా అనిపించలేదు. మౌనంగా అనుసరించాను. వాళ్లు నన్ను తీసుకెళ్లి ఓ మహిళకు అప్పగించారు. ఆమె నన్ను తనతో తీసుకెళ్లింది. ‘దొంగతనం చేసినందుకు మీ అమ్మని అరెస్ట్ చేశారు, ఆమె వచ్చేవరకూ నువ్వు నా దగ్గరే ఉండాలి’ అంది. నా స్థానంలో మరెవ్వరూ ఉన్నా బెంబేలెత్తి ఉండేవారు. కానీ నేను మాత్రం సంతోషపడ్డాను. కొన్నాళ్లయినా మా అమ్మకు దూరంగా ఉండే అదృష్టం దక్కినందుకు పొంగిపోయాను. అక్కడ నాకో కొత్త ప్రపంచం పరిచయమయ్యింది. ఆ ప్రపంచం నిండా ఆనందమే!
 
ఆ ఆంటీ నన్ను బాగా చూసుకునేది. కడుపు నిండా తిండి పెట్టేది. ఆడుకోనిచ్చేది. ప్రతి ఆదివారం చర్చ్‌కి తీసుకెళ్లేది. కారులో క్యాండీస్ ఇచ్చి తినమనేది. నాకు కళ్లలోంచి నీళ్లొచ్చేవి. అవి మా అమ్మమీద బెంగతో వచ్చాయని ఆమె అనుకునేది. కానీ తనలాంటి అమ్మ లేదనే బాధతో వచ్చాయని ఆమెకు అర్థమయ్యేది కాదు. ఆరు నెలల శిక్ష ముగిశాక మా అమ్మ వచ్చింది. ఈ అమ్మకాని అమ్మను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు నేను పడిన బాధ అంతా ఇంతా కాదు. ఎవరైనా తల్లికి దూరమైతే బాధపడతారు. నేను తల్లి దగ్గరకు వెళ్లడానికి ఎందుకు బాధపడుతున్నాను అనే సందేహం వచ్చింది కదూ! అది నివృత్తి కావాలంటే... నా బతుకు పుస్తకంలోని ప్రతి పేజీ మీకు తెలియాలి.
 
భర్త స్కాట్‌తో సంతోషంగా కొలెట్
కొలెట్ ఇప్పటికీ కోలుకోలేదు. దుర్మార్గురాలైన తల్లి పెట్టిన బాధలు ఆమెను ఇంకా వేధిస్తూనే ఉన్నాయని డాక్టర్లు అంటున్నారు. అయితే భర్త, పిల్లల అనురాగం ఆమెను కాపాడుతోంది. మరో విషయం ఏమిటంటే... చిన్నప్పుడు తన గురించి ఎన్ని ఫిర్యాదులు అందినా పట్టించుకోకుండా వదిలేసిన ఎన్జీవో మీద కొలెట్ కేసు వేసింది. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న న్యాయస్థానం... కొలెట్‌కు భారీ నష్ట పరిహారాన్ని చెల్లించమంటూ సదరు సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. పిల్లలను హింసించేవారిని, ఆ హింసను చూస్తూ కూడా పట్టించుకోని వారిని శిక్షకు అర్హులుగా ప్రకటిస్తూ యూకే ప్రభుత్వం ‘సిండ్రెల్లా చట్టం’  రూపొందించింది.
    
బర్మింగ్‌హామ్ (ఇంగ్లండ్)... ఈ పేరు చెప్పగానే అందరికీ ప్యాలెస్ గుర్తొస్తుంది. కానీ అక్కడ రాజభవనాలే కాదు.. వెలుగు కూడా చొరబడని ఇరుకు నివాసాలూ ఉన్నాయి. అలాంటి ఓ ఇంట్లో ఉండేవాళ్లం మేము. నాకు ఊహ తెలిసేనాటికి మా అమ్మానాన్నలతో ఉన్నాను. కానీ ఊహ తెలిసిన కొన్నాళ్లకు మా నాన్న స్థానంలోకి మరో వ్యక్తి వచ్చాడు.  తానే నాన్నని అన్నాడు. అమ్మ అదే నిజమంది. దాంతో  అతడిని నాన్నా అని పిలవడం మొదలు పెట్టాను. కానీ తర్వాత అర్థమైంది, అతడు ‘నాన్న’ అన్న పిలుపునకు అనర్హుడని.
 
అతగాడికి నామీద కోపమెందుకో అర్థమయ్యేది కాదు. నన్నెందుకు ద్వేషించేవాడో అంతు పట్టేది కూడా కాదు. నన్ను చూస్తేనే ముఖం తిప్పుకునేవాడు. దగ్గరికెళ్తే తోసేసేవాడు. ఎవరి మీద కోపమొచ్చినా నా మీద చూపించేవాడు. పసిదాన్నని చూడకుండా పిడిగుద్దులు గుద్దేవాడు. తట్టుకోలేక అమ్మ దగ్గరకు పరుగెత్తేదాన్ని. మీ అమ్మ అయితే ఏం చేస్తుంది? ‘నా తల్లీ, ఎందుకేడుస్తున్నావే’ అంటూ గుండెల్లో పొదువుకునేది. కానీ మా అమ్మ ఏం చేసేదో తెలుసా? నన్ను దూరంగా తోసేది. ‘ఎప్పుడూ ఏడుస్తూ ఉంటావేంటే ఏడుపుగొట్టుదానా’ అంటూ మొట్టేది. నా అరుపులు ఆమె చెవులను చేరేవి కాదు. నా కన్నీళ్లు ఆమె మనసును తడిపేవీ కావు. అమ్మ అంటే ఇలానే ఉంటుందా అనిపించేంది. ఇల్లంటే నరకమేనేమో అని నా మనసు తలిచేది.
 
ఎవరితోనో ప్రేమలో పడి, అమ్మ వేసిన తప్పటడుగుకు ఫలితంగా పుట్టానట నేను. అందుకే ఆమెకు నేను నచ్చనట. నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండేది, వద్దనుకున్నా బయటపడ్డావ్ అని ఆమె అంటున్నప్పుడు నా చిన్ని గుండె పడిన వేదన ఎలా చెప్పాలి?! తప్పు చేసింది తను. శిక్ష ఏమో నాకా?! నన్ను చూస్తే తన తప్పు గుర్తొచ్చి బాధపడుతుందేమో అనుకున్నాను మొదట. కానీ తప్పు చేయడమే తన జీవితం అని ఆమె జీవితంలోకి వచ్చిపోతున్న మగాళ్లను చూశాక అర్థమైంది. అసహ్యం పెరిగింది. అమ్మ గురించి ఇలా మాట్లాడటం తప్పేమో. కానీ ఏనాడైనా అమ్మలా ప్రవర్తిస్తే కదా గౌరవించడానికి!
 
అమ్మ ప్రవర్తన నన్ను పిచ్చిదాన్ని చేసింది. ఓసారి మా పక్కింటావిడ చెప్పింది... ఊహ తెలియని వయసులో నేను మా వీధిలో ఏడుస్తూ తిరిగేదాన్నట. ఆకలితో గుక్కపెట్టి ఏడ్చేదాన్నట. చూసినవాళ్లు జాలిపడి ఎత్తుకునేవారట కానీ మా అమ్మ మాత్రం బయటికొచ్చి చూసేది కాదట. ఎలా చూస్తుంది? ఇంటిలోపల చీకటి గదుల్లో తప్పు చేయడంలో మునిగిపోయివుంటే?! వీధిలోని వాళ్లు విసిగిపోయి ఓ ఎన్జీవో వాళ్లకు విషయం చెప్పార్ట. వాళ్లు వచ్చి అడిగితే అంతా అబద్ధమని అమ్మ చెప్పిందట. దాంతో వాళ్లు వెళ్లిపోయారట. దొంగని దొంగతనం చేశావా అని అడగడంలో అర్థముందా?
 
కడుపులో దాచుకునేది తల్లి. కళ్లలో పెట్టుకుని పెంచుకునేది తల్లి. కానీ కళ్లముందే తప్పులు చేయడానికి అలవాటు పడింది నా తల్లి. తన భర్త కాని భర్త పిల్లల మీద ప్రేమ కురిపించి, నన్ను ఎంగిలాకులాగ విసిరేయాలనుకునేది నా తల్లి. సాయంత్రమైతే నేను నా గదిలోకి వెళ్లిపోవాలి. మళ్లీ పొద్దున్నే కిందికి రావాలి. మధ్యలో కనిపించానో... ఒంటిమీద వాతలు పడేవి. బాత్రూమ్‌కి వెళ్లాలంటే మెట్లు దిగి వెళ్లాలి. కానీ వెళ్తే చంపేస్తారని భయపడి పక్క తడిపేసేదాన్ని. ఆ తడిలోనే పొర్లాడేదాన్ని. దాహంతో నాలుక పిడచకట్టుకు పోతున్నా, ఆకలితో పేగులు మెలికలు పడుతున్నా.. కాలు కింద పెట్టడానికి వీల్లేదు. నరకం... ఘోర నరకం!
 
దేవుడా, ఎందుకిచ్చావు ఇలాంటి జన్మ అంటూ రాత్రంతా ఏడ్చి సోలిపోయేదాన్ని. పదే పదే ఇంటి నుంచి పారిపోయేదాన్ని. కానీ ఎక్కడికెళ్లాలో తోచక మళ్లీ ఆ నరక కూపానికే చేరేదాన్ని. మా టీచర్ దగ్గర నా బాధ చెప్పుకుని ఏడ్చేదాన్ని. ఆవిడ చాలాసార్లు ఎన్జీవోకి ఫిర్యాదు చేసింది. కానీ వారి నిర్లక్ష్యం నాకు శాపమైంది. నా జీవితం మా అమ్మ రాక్షస నీడలోనే మగ్గిపోయింది. బతుకు మీద ఆశ పోయింది. పదిహేనుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. కానీ మృత్యువు కూడా మా అమ్మలాంటిదే... నన్ను తృణీకరించింది!
 
ఇక నావల్ల కాలేదు. ఆ ఈసడింపులు, చిత్రహింసలు భరించే శక్తి నాకు లేదనిపించింది. మళ్లీ ఆ ఇంటి గడప తొక్కకూడదని నిర్ణయించుకుని పద్దెనిమిదో ఏట ఇల్లు వదిలిపెట్టాను. ఓ చిన్న ఉద్యోగం చూసుకున్నాను. నా జీవితం నేను జీవించాలని నిర్ణయించుకున్నాను. శాపనార్థాలు వినబడవు. మూతి విరుపులు కనబడవు. ఆకలిని అణచుకోనక్కర్లేదు. స్వేచ్ఛను చంపుకోనక్కర్లేదు. కన్నీళ్లు లేవు. కష్టాలు గుర్తు రావు. నాకు నచ్చినట్టుగా బతకొచ్చు అనుకున్నాను. కానీ నేను శారీరకంగానే బయటికొచ్చాను తప్ప మానసికంగా కాదు. కన్నుమూస్తే పీడకలలు! అమ్మరూపం కదలాడగానే ఉలిక్కిపడి లేచేదాన్ని. ప్యానిక్ అటాక్స్ వచ్చి పిచ్చిదాన్ని అయ్యేదాన్ని. శాపగ్రస్తమైన నా బాల్యం నన్ను వెంటాడి భయపెట్టేది. ఆ జ్ఞాపకాలు పదే పదే నా జీవితంలోకి తొంగి చూసి వణికించేవి.
 
 అప్పుడే ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఆడ పిల్లలకు తల్లిని చేశాడు. కానీ అతడు మా అమ్మను మించిన క్రూరుడు. మొదట ప్రేమను ఒలకబోసినవాడు మెల్లగా హింసించడం మొదలు పెట్టాడు. నన్ను, నా పిల్లల్ని చంపేస్తానని బెదిరించేవాడు. పిల్లలతో పాటు బాత్రూమ్‌లో భయంగా దాక్కున్న రోజులు నాకింకా గుర్తున్నాయి. బిక్కుబిక్కుమంటూ చూస్తున్న నా చిట్టి తల్లుల్ని గుండెలకు అదుముకుని వెక్కి వెక్కి ఏడ్చిన క్షణాలు ఇంకా నన్ను గుచ్చుతూనే ఉన్నాయి.
 
 ఎలాగైతేనేం... వాడి కబంధ హస్తాల నుంచి తప్పించుకున్నాను. వాడి నీడ పడని చోటికి నా పిల్లల్ని తీసుకుని పారిపోయాను. కష్టపడి వాళ్లను పెంచడం మొదలుపెట్టాను. వాళ్ల చుట్టూ అందమైన ప్రపంచాన్ని అల్లుకోవడం ప్రారంభించాను. అప్పుడే మా ప్రపంచంలోకి చొరబడ్డాడు స్కాట్ ఎలియట్. నా మీద మనసు పడ్డాడు. గత అనుభవాలు నన్ను హెచ్చరించడంతో దూరం జరిగాను. దగ్గర కాలేనని చెప్పాను. అర్థం చేసుకున్నాడు. అంగీకారం కోసం ఎదురు చూశాడు. చివరకు నా మనసును గెలుచుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకుని నా పిల్లలకు తండ్రిగా మారాడు. నాకంటే ఎక్కువగా నా పిల్లలను ముద్దు చేస్తాడు. మా ఇద్దరికీ ఇద్దరు పిల్లలు కలిగినా తనకు పుట్టని నా బిడ్డలను కూడా గుండెల్లో పెట్టుకుంటాడు.
 
ఇప్పుడు నా చుట్టుపక్కలంతా సంతోషమే ఉంది. కానీ నా గుండెల్లో ఎక్కడో ఓ మూల మా అమ్మ ఇంకా ఉంది. అప్పుడప్పుడూ భయపెడుతూంటుంది. ప్యానిక్ అటాక్స్‌తో నేను వణికిపోతుంటే నా భర్త, పిల్లలు నన్ను హత్తుకుంటారు. ఆ స్పర్శలో నీకు మేమున్నామనే భరోసా కనిపిస్తుంది.  అది చాలు నాకు గత జీవితపు చేదును మరచిపోవడానికి. అది చాలు బతుకులో అమృతాన్ని నింపుకోవడానికి!

(పలు ఇంటర్వ్యూలు, తను రాసిన ‘అన్ ఫర్‌గివబుల్’ అనే పుస్తకంలో కొలెట్ చెప్పిన విషయాల ఆధారంగా)
 - సమీర నేలపూడి

Advertisement
Advertisement