ఈ విజయుడు ఆపద్బాంధవుడు! | Sakshi
Sakshi News home page

ఈ విజయుడు ఆపద్బాంధవుడు!

Published Sat, Mar 19 2016 10:45 PM

ఈ విజయుడు ఆపద్బాంధవుడు!

ఆదర్శం

కొన్ని విషాదాలు విషాదాలకు మాత్రమే పరిమితమైపోతాయి. కొన్ని విషాదాలు మాత్రం...సరికొత్త పనులకు శ్రీకారం చుట్టేలా చేస్తాయి. ముంబాయిలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేసే విజయ్ ఠాకూర్ తాను ట్యాక్సీ డ్రైవర్ కావాలని ఎప్పుడు అనుకొని ఉండరు. అవుతానని కూడా ఊహించి ఉండరు.
 

విజయ్ జీవితంలో జరిగిన ఒక విషాదసంఘటన ఆయన చేస్తున్న వృత్తినే మార్చేసింది. 1982లో...మూడు నెలల గర్భిణి అయిన విజయ్ భార్య సరోజ్‌కు పొత్తికడుపులో నొప్పి మొదలైంది. తెల్లవారుజామున రెండు గంటల సమయం. భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి  విజయ్‌కి ఒక్క ట్యాక్సీ కూడా కనిపించలేదు. ఇక చేసేదేమిలేక అందేరి రైల్వేస్టేషన్‌కు వెళ్లి చాలా ఎక్కువ ఛార్జీ  చెల్లించి ఒక ట్యాక్సీని మాట్లాడుకొని భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో సరోజ్ గర్భం పోయింది. ఈ విషాదం విజయ్‌ని కుదిపేసింది.
 

‘‘నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దు’’ అనుకున్నారు బలంగా మనసులో. తాను చేస్తున్న ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్న విజయ్ ఆ తరువాత ఒక  ఫియట్ కారు కొనుగోలు చేసి ట్యాక్సీ పరిమిట్ తెచ్చుకున్నారు. పేద రోగుల నుంచి  డబ్బులు తీసుకోకుండా ఉచితంగా తన ట్యాక్సీలో హాస్పిటల్‌కు తీసుకువెళ్లడం మొదలుపెట్టారు. తనకు ఏ సమయంలో ఫోన్ చేసినా ఆఘమేఘాల మీద బయలుదేరి వెళతారు విజయ్ ఠాకూర్.
 

భద్రతతో కూడిన వైట్-కాలర్ ఉద్యోగాన్ని వదిలి విజయ్  ట్యాక్సీ డ్రైవర్‌గా మారడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆయన మంచితనాన్ని కొందరు వేనోళ్ల పొగిడారు. ‘నాలుగు రాళ్లు వెనకేసుకొని  శేషజీవితాన్ని హాయిగా గడపకుండా ఎందుకీ కష్టం?’ అన్నవాళ్లే ఎక్కువమంది. ‘‘నా నిర్ణయం పట్ల  ఎప్పుడూ ఒక్క నిమిషం కూడా పశ్చాత్తాపపడలేదు’’ అంటారు విజయ్. ‘‘ఫైర్‌ఫైటర్‌లా  నేను ఎప్పుడూ ఎలార్ట్‌గా ఉంటాను’’ అని చెప్పే విజయ్  అవసరంలో, ఆపదలో ఉన్నవారి నుంచి కాల్ వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళతారు.


ప్రైవేట్  అంబులెన్స్ ఛార్జీలు అందుబాటు ధరల్లో లేకపోవడం, ప్రభుత్వ అంబులెన్స్ సర్వీస్ అరుదుగా మాత్రమే అందుబాటులో ఉండడం కారణంగా తనలాంటి వారి సేవలు అవసరమవుతాయి అంటారు విజయ్. ఒకరోజు  తెల్లవారుజామున  రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదానికి గురైన ఒక కారును చూశారు విజయ్. ఆ కారులో ఎనిమిది నెలల కూతురితో  ఉన్న దంపతులు కనిపించారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. తండ్రి, పసిబిడ్డలు ప్రాణాలతో బయటపడ్డా  దురదృష్టవశాత్తు తల్లి మాత్రం చనిపోయింది. ఆమెకు చెందిన రెండు లక్షల విలువైన నగలను వైద్యులు విజయ్‌కు అందించారు. వాటిని హాస్పిటల్‌కు వచ్చిన బంధువులకు అప్పజెప్పారు విజయ్.
 

విజయ్‌కి  పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడానికి వాళ్లు సిద్ధపడినా  ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఇలా చెప్పుకుంటే పోతే...విజయ్‌లోని మంచితన గురించి చెప్పుకోవడానికి ఎన్నో ఉదహరణలు ఉన్నాయి. ‘‘డబ్బు కోసం, ప్రచారం కోసం ఏ పనీ చేయను. నేను సహాయపడినవారు క్షేమంగా ఉంటే చాలు...ఆ తృప్తికి మించిన విలువ ఏముంటుంది?’’ అంటారు విజయ్. ఎప్పుడు ఏ అవసరం ముంచుకొచ్చినా అర్థరాత్రి అయినా అపరాత్రి అయినా ‘నేనున్నాను’ అంటూ  తన ట్యాక్సీతో ప్రత్యక్షమై పేదల పాలిట ఆపద్బాంధవుడు అనిపించుకుంటున్నారు  విజయ్ ఠాకూర్.         

Advertisement
Advertisement