ఊహాచిత్రం | Sakshi
Sakshi News home page

ఊహాచిత్రం

Published Sun, Jun 5 2016 12:01 AM

ఊహాచిత్రం

ప్రత్యేక ప్రశంస పొందిన కథ
‘‘హలో...’’ విసుగ్గా వినిపించింది అవతల గొంతు.
 ‘‘పోలీస్ కంట్రోల్ రూమేనా?’’ గుసగుసగా అడిగాను.
 ‘‘అది కూడా తెలియకుండానే ఫోన్ చేశావా?’’
 ‘‘అది కాదు సార్! మీరు పోలీసులు అని కన్ఫర్మ్ అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఫోన్ చేశాను.’’
 ‘‘అంటే మీ ఇంటికి వచ్చి నా ఐడీ చూపించమంటావా ఏంటి? ఇంతకీ నువ్ చేసింది విదేశీ టైస్టుల ఆచూకీ చెప్పటానికేనా?’’
 షాక్ తిన్నాను నేను. ‘‘నేను చెప్పదలచుకున్న విషయం ముందే మీకెలా తెలిసింది సార్?’’ అయోమయంగా అడిగాను.
 

‘‘ఇప్పటికి ఇవాళ ఇది నూట రెండో ఫోన్. ఇంతకుముందు ఫోన్ చేసిన నూటొక్క మంది చెప్పిందిదే! విదేశీ టైస్టులు తమ ఎదురుగా కూర్చుని ఉన్నారనీ... వచ్చి పట్టుకెళ్లమనీ ఆఫర్లిచ్చారు. సరే! నీ పేరూ నువ్వెందుకు ఫోన్ చేశావో చెప్పు.’’
 ‘‘నా పేరు సూరజ్ సార్! ప్రతిరోజూ రాత్రి రెండింటికి డ్యూటీ దిగే దురదృష్టవంతులు ఈ ఢిల్లీలో కొందరే ఉంటారు. వారిలో నేనూ ఒకడ్ని.

ఈ రోజు కూడా ఎప్పటిలానే డ్యూటీ దిగి రోడ్డుమీద నడుచుకుంటూ కీర్తినగర్ మెట్రో స్టేషన్‌కి బయలుదేరాను. రోజూ నా డ్యూటీ అయ్యాక రాత్రి రెండింటికి అక్కడకి వెళ్లి అక్కడ నుండి ఆనంద్ విహార్ స్టేషన్‌కి వెళ్తాను. అక్కడకు దగ్గర్లో ఒక రూములో ఉంటున్నాను నేను.’’
 ‘‘పాయింటుకి రా.’’
 ‘‘ట్రైన్ రావటానికి ఇంకా ఎనిమిది నిమిషాల సమయం ఉంది. అందుకని ఆవలిస్తూ టైం పాస్ చేస్తున్న నాకు ఒక పోస్టర్ కనిపించింది.’’
 
‘‘అది మేము వేసిన టైస్టుల పోస్టరై ఉంటుంది.’’
 ‘‘ఏ మాటకామాట చెప్పుకోవాలి. మీరు వేసిన ఊహాచిత్రం యమా క్లారిటీగా వచ్చింది సార్. ముఖ్యంగా అందులో ఉన్న అమ్మాయి కళ్లు... అబ్బబ్బ ఏం కళ్లు సార్ అవి.’’
 ‘‘నీక్కూడా అవి నచ్చాయటోయ్...’’
 ‘‘నీక్కూడా అంటున్నారంటే, మీక్కూడా ఆ కళ్లు నచ్చాయనేగా. అయినా అలాంటి నీలి కళ్లు నచ్చనివాడు ఎవడుంటాడు సార్?’’
 
‘‘హు! ఎంత నీలి కళ్లు ఉన్నా, ఏం లాభమోయ్? ఆ అమ్మాయి మన శత్రుదేశపు తీవ్రవాది. ఈ రోజు ఆగస్టు పదిహేను కదా! మన దేశంలో అరాచకం సృష్టించడానికి ఇంకొకడితో కలసి దొంగతనంగా మన దేశం వచ్చింది.’’
 ‘‘ఇవాళ ఆగస్టు పదిహేనా?’’ అని బుర్ర గోక్కుని, ‘‘అవును కదూ! ఇంకాసేపట్లో తెల్లారిపోతుంది. నేనింకా పద్నాలుగే అనుకుంటున్నాను. ఇంకో నాలుగైదు గంటల్లో మన ప్రధాన మంత్రి ఎర్రకోట మీద నుండి ప్రసంగం కూడా చేస్తారు. ఇంతకీ అరాచకం అంటే ఆ తీవ్రవాదులు ఏం చేద్దామనుకున్నార్సార్?’’ అడిగాను నేను.
 
‘‘వాళ్లు అన్ని పనులు మనకి చెప్పి చేస్తారా?’’ మళ్లీ విసుగ్గా అన్నాడు పోలీస్.
 ‘‘వాళ్లెందుకు చెప్పి చేస్తారు సార్? అయినా ఊహించి ఊహాచిత్రం వేయలేదూ. ఇది కూడా ఊహించి చెప్పండి సార్.’’
 ‘‘ఏం చెప్తామయ్యా! ట్రైన్లో బాంబులు పెట్టవచ్చు. ప్రజలు గుమిగూడి ఉన్న చోట బెల్టు బాంబు పేల్చుకుని అమాయకులను చంపవచ్చు.’’
 ‘‘అయ్య బాబోయ్! వింటుంటేనే భయం వేస్తోంది. కానీ ఆ ఊహాచిత్రం మాత్రం భలే ఉంది సార్. ఆ అమ్మాయి అలానే ఉంటుందని అంత కచ్చితంగా మీకు ఎలా తెలుసు సార్?’’
 
‘‘మన గూఢచారులు సమాచారం సేకరించారోయ్. అలాంటి వాళ్లు ఇచ్చిన సమాచారాన్ని గుదిగుచ్చి ఈ ఊహాచిత్రం తయారుచేశాం.’’
 ‘‘బాగా చేశారు సార్. నీలి కళ్లే కాదు, తీర్చిదిద్దినట్లున్న నాసిక, చిన్నటి సన్నటి పెదవులు... భలే అందంగా ఉంది సార్. ఆ అమ్మాయి పక్కన ఉన్న కుర్రాడు కూడా ఏమీ తక్కువ తినలేదు. అతని గిరజాల జుట్టుంది చూశారూ, భలే ప్రత్యేకంగా కనిపిస్తోంది. ముక్కు ఎముక విరిగినట్లు కొద్దిగా పక్కకి జరిగి ఉంది. ఆ కాస్త లోపం లేకపోతే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించేలా ఉన్నారు.’’
 
‘‘వాళ్లిద్దరికీ ఏదైనా పెళ్లి చేసే యోచనలో ఉన్నావా ఏంటి?’’ ఫెళ్లున నవ్వుతూ అన్నాడు కంట్రోల్ రూములో పోలీస్.
 ‘‘భలే జోకులేస్తారు సార్. ఇంతకీ మీ పేరు చెప్పలేదు?’’
 ‘‘రాథోడ్...’’
 ‘‘పేరుకు ముందు రౌడీ లేదా?’’
 ‘‘అందుకే మరి కోపం వచ్చేది. కాస్త చనువు ఇస్తే చంకనెక్కుతారు. అసలెందుకు ఫోన్ చేశావో చెప్పు.’’
 
‘‘సారీ సార్! తెల్లవారుజామున రెండింటికి డ్యూటీ దిగి ట్రైన్ ఎక్కటానికి స్టేషన్‌కి బయలుదేరి ఎదురుచూస్తున్నానా. ఇంతలో ట్రైన్ వచ్చింది. ఎక్కి కూర్చున్నాను. కంపార్టుమెంటు మొత్తంలో అయిదారుగురు కూడా లేరు. ట్రైన్ కానీ, బస్సు కానీ అంత ఖాళీగా ఉంటే ఒక ప్రాబ్లం ఉంది సార్, ఎక్కడ కూర్చోవాలో అర్థం కాదు.’’
 ‘‘నాక్కూడా సేమ్ ప్రాబ్లమ్.’’
 
‘‘కూర్చుని సెటిలయ్యానో లేదో ట్రైన్ పటేల్‌నగర్ చేరింది. అక్కడ మా కంపార్టుమెంట్లోకి ఒకమ్మాయి ఎక్కింది. నన్ను దాటుకుని వెళ్లి రెండు సీట్ల అవతల కూర్చుంది.’’
 ‘‘అందంగా ఉందా?’’ ఈసారి రాథోడ్ గుసగుసగా అడిగాడు.
 ‘‘అందం సంగతి పక్కన పెట్టండి. ఆ కళ్లున్నాయే. నీలి కళ్లు... అబ్బబ్బ ఒక్కసారి ఆ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తే మనల్ని మనం మరచిపోతాం. అంత బాగున్నాయి.’’
 ‘‘నీలి కళ్లా? మన తీవ్రవాది అమ్మాయివి కూడా నీలి కళ్లేగా? కొంపతీసి ఈ అమ్మాయి ఆ అమ్మాయేనా?’’
 
‘‘నాకూ అదే అనుమానం వచ్చింది. ఆ తరువాత మీరు స్టేషన్లో పెట్టిన పోస్టర్లో ఉన్న ఊహాచిత్రంతో ఆ అమ్మాయిని మనసులో పోల్చి చూడటం మొదలుపెట్టాను. ఒక కోణంలో చూస్తే మీరు వెతుకుతున్న అమ్మాయి  ఈ అమ్మాయే అనిపించింది. మరో కోణంలో చూస్తే కాదనిపించింది.’’
 ‘‘ఇంత అనాలిసిస్ నీకు అవసరమా? మాకు ఆచూకీ చెప్పు. మిగిలిన విషయాలు మేము చూసుకుంటాంగా.’’
 
‘‘మీరైనా ఎలా కనుక్కుంటారు సార్. ఆ అమ్మాయిని కొడతారా?’’
 ‘‘అవన్నీ నీకెందుకయ్యా? మా పద్ధతులు మాకుంటాయి.’’
 ‘‘అంతేలే సార్. అవన్నీ నాకెందుకు. వాళ్ల ఆచూకీ చెప్పాలనే మీకు ఫోన్ చేశాను.’’
 ‘‘అసలు విషయం అంత నెమ్మదిగా చెప్తావే? ఇంతకీ నువ్వు ఏ ట్రైన్లో ఉన్నావ్?’’
 ‘‘నేనిప్పుడు ట్రైన్లో లేను సార్...’’
 
‘‘అదేంటి ఇప్పటిదాకా ట్రైన్లో ఉన్నానన్నావుగా?’’
 ‘‘ట్రైన్లో ఉన్నాననలేదు. ట్రైన్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి కనపడిందన్నాను.’’
 ‘‘మరి ట్రైన్లో ఆ అమ్మాయి కనబడినప్పుడే ఎందుకు ఫోన్ చెయ్యలేదు?’’
 ‘‘మీ ఫోన్ నంబర్ అప్పుడు నా దగ్గర లేదు కాబట్టి.’’
 ‘‘పోస్టర్ చూశావుగా. అప్పుడు మా నంబర్లు నోట్ చేసి పెట్టుకోవద్దూ...’’
 ‘‘అంటే... అప్పుడు నిజంగా తీవ్రవాదులు కనపడతారని నేనెందుకు అనుకుంటాను సార్?’’
 ‘‘సరేలే.. తరువాత ఏం జరిగింది?’’
 
‘‘భయం వేసింది సార్. చెమట పట్టింది. గుండె వేగంగా కొట్టుకుంది. అంత భయంకరమైన తీవ్రవాదికి నేను ఇంత దగ్గర్లో ఉన్నాననుకునేసరికి...’’
 ‘‘నీకు ఏమేమి లక్షణాలు కనిపించాయో తరువాత తీరిగ్గా చెప్దువు. ముందు ఆ తీవ్రవాది ఎక్కడ ఉందో చెప్పు.’’
 
‘‘ఆ అమ్మాయిని తీవ్రవాది అనుకోవటానికి మనసొప్పలేదు సార్. అలా అని భారం మీ మీద వేద్దామా అంటే మీ నంబర్ లేదు. ఏమి చెయ్యాలో అర్థంకాక ఎంతో మధనపడ్డాను. ఇంతలో ట్రైన్ రాజీవ్ చౌక్ స్టేషన్ చేరింది. ఆ అమ్మాయి ట్రైన్ దిగింది.’’
 ‘‘ఆ అమ్మాయి ట్రైన్ దిగిందా? మరి నువ్వేం చేశావ్?’’
 ‘‘నేను కూడా దిగాను. మీకు సహాయం చేయటానికి ఆ అమ్మాయిని వెంబడిద్దామనుకున్నాను.’’
 ‘‘వెరీ గుడ్. రెస్పాన్సిబుల్ సిటిజన్ అంటే నీలా ఉంటాడు. ఇప్పుడా అమ్మాయిని వెంబడిస్తున్నావన్నమాట.’’
 ‘‘లేదు సార్.’’
 
‘‘నిన్ను పొగిడినంతసేపు మర్యాద నిలబెట్టుకోలేదు. ఆ అమ్మాయిని ఎందుకు వెంబడించటం లేదో చెప్పు.’’
 ‘‘ఆ అమ్మాయి స్టేషన్ బయటకు వెళ్లనే లేదు. ఇంక నేను వెంబడించేది ఎక్కడ? తను అక్కడే ప్లాట్‌ఫాం మీదే ఒక కుర్చీలో కూర్చుంది. ఎవరికోసమో ఎదురు చూడసాగింది. కొంతసేపటికి మరో యువకుడు అక్కడకి వచ్చాడు. సరాసరి ఆ అమ్మాయి దగ్గరికి నడిచాడు.’’
 
‘‘అప్పుడు నువ్వేం చేస్తున్నావ్?’’
 ‘‘స్టేషన్లో మీ ఊహాచిత్రం పోస్టర్ కనిపిస్తుందేమో మీ ఫోన్ నంబర్ దొరుకుతుందని వెతుకుతున్నాను.’’
 ‘‘మరి దొరికిందా?’’
 ‘‘టాయిలెట్ పక్కన దొరికింది.’’
 ‘‘ఛీ ఛీ... పోస్టర్ అతికించటానికి అంతకంటే మంచి చోటు దొరకలేదా?’’
 ‘‘దానికి నేనేం చేస్తాను సార్.’’
 ‘‘ఆ విషయం ఇక వదిలెయ్. ఇప్పుడు ఆ పోస్టర్‌మీద నంబర్ చూసి నువ్వు ఫోన్ చేస్తున్నావు. అంతేనా.’’
 
‘‘అవున్సార్. కరెక్టుగా గెస్ చేశారు.’’
 ‘‘అంటే నువ్వు ఇప్పుడు రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో ఉన్నావు. నీ ఎదురుగా ఆ తీవ్రవాదులు ఉన్నారు. అంతేనా?’’
 ‘‘నేను ఉన్నమాట నిజమే! వాళ్లు తీవ్రవాదులా కాదా అన్నది ఇంకా తేలలేదు.’’
 ‘‘ఆ అమ్మాయికి నీలి కళ్లు ఉన్నాయన్నావు. ముక్కూ, కన్నూ కూడా పోస్టర్లో ఉన్నట్లే ఉన్నాయా?’’
 ‘‘ఇక్కడ పోస్టర్లో అమ్మాయి మొహం చిరిగిపోయింది సార్.’’
 
‘‘అక్కడ పోస్టర్లో చిరిగిపోతే ఏమయిందయ్యా, ఇంతకుముందు స్టేషన్లో చూశావుగా?’’
 ‘‘ఇప్పుడా పోలికలు సరిగ్గా గుర్తుకురావటం లేదు.’’
 ‘‘సరే! నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ అమ్మాయి సంగతి వదిలిపెట్టు. పక్కన ఉన్నవాడు ఎలా ఉన్నాడు? గిరజాల జుట్టు ఉందా?’’
 ‘‘ఉంది.’’
 ‘‘ముక్కు విరిగి ఉందా?’’
 ‘‘అలానే ఉంది.’’

 ‘‘ఇద్దరికీ వీపు మీద పెద్ద పెద్ద బ్యాగులున్నాయా?’’
 ‘‘మీరు వాళ్లని చూసినట్లే చెప్తున్నారు. ఉన్నాయి.’’
 ‘‘వాళ్ల నడుముకు బెల్టు బాంబు కూడా కట్టుకుని ఉంటారు.’’
 ‘‘అది మాత్రం కనబడటం లేదు. లూజు లూజు బట్టలు వేసుకున్నారు.’’
 ‘‘ఇది మరో సంకేతం. అన్నీ సరిపోతున్నాయి. వీళ్లే వాళ్లు. నువ్వక్కడే ఉండు. నేను ఇప్పుడే ఫోర్స్ తీసుకుని వస్తున్నాను.’’
 ‘‘ఎక్కడ ఉండమంటారు?’’
 ‘‘ఇంకెక్కడ? రాజీవ్ చౌక్ స్టేషన్లో. అక్కడేగా ఆ అమ్మాయి కూర్చుని ఉందని చెప్పావ్. ఇంకొకడు కూడా అక్కడికేగా వచ్చింది.’’
 
‘‘కరెక్టే సార్. నేను చెప్పినప్పుడు అక్కడే ఉన్నారు. మీ ప్రశ్నలకి సమాధానం చెప్తున్న సమయంలో ఇంకో ట్రైన్ ఎక్కారు.’’
 ‘‘ఇంకో ట్రైన్ ఎక్కారా? మరి నువ్వేం చేస్తున్నావ్?’’
 ‘‘నేను కూడా అదే ట్రైన్ ఎక్కాను. ఎల్లో లైన్ ట్రైన్.’’
 ‘‘ఎటు వైపు వెళ్లేదో చెప్పరా మగడా...’’
 ‘‘విధాన్ సభ వైపు వెళ్లేది.’’
 ‘‘నేను ఇప్పుడే అందరినీ అలర్ట్ చేస్తున్నాను. ఫోర్స్ తీసుకుని బయలుదేరుతున్నాను. నీ ట్రైన్ వెళ్లే దారిలో వస్తున్నాను. నువ్వు మాత్రం నాతో టచ్‌లో ఉండు.’’

 ‘‘సారీ సార్! అలా చెయ్యలేను.’’
 ‘‘ఎలా చెయ్యలేవు?’’
 ‘‘మీతో టచ్‌లో ఉండలేను.’’
 ‘‘ఏం..?’’ రూఫ్ ఎగిరిపోయేటట్లు అరిచాడు రాథోడ్.
 ‘‘రెండు కారణాలు. ఒకటి నా సిమ్‌లో బ్యాలెన్స్ అయిపోవచ్చింది. రెండోది ట్రైన్లో ఆ తీవ్రవాదుల ఎదురుగా తప్ప మరో సీటు లేదు. నేను అక్కడ కూర్చుని మీతో మాట్లాడటం బాగోదు. కాబట్టి కాసేపటి తరువాత నేను చేస్తాను.’’
 ‘‘హలో... హలో...’’ అంటున్న రాథోడ్ మాటలు వినిపించుకోకుండా ఫోన్ కట్ చేశాను.
 
ఆ తరువాత నాలుగైదు సార్లు రాథోడ్ ఫోన్ చేసినా నేను ఎత్తలేదు. నా ఎదురుగా ఉన్న నీలి కళ్ల అమ్మాయి, పక్కన ఉన్న అబ్బాయితో ఏదో మాట్లాడుతోంది. ఇద్దరూ ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుని పారవశ్యం పొందుతున్నారు. ఇంకాసేపట్లో బాంబు పేల్చుకుని చనిపోయేవారిలో ఇంత ప్రేమా? అనిపించింది. మళ్లీ ఆలోచిస్తే చనిపోతున్నారు కాబట్టే అంత ప్రేమేమో అని అనుకున్నాను.
 
ఎట్టకేలకు ట్రైన్ కాశ్మీరీ గేట్ స్టేషన్ చేరుకుంటుంటే తీవ్రవాద అనుమానితులిద్దరూ లేచి నిలబడ్డారు. వారు అక్కడ దిగబోతున్నారని అర్థమై నేను కూడా లేచి నిలబడ్డాను. ఇక మళ్లీ రాథోడ్‌కి ఫోన్ చెయ్యాలి. లేకపోతే వీళ్లు చెయ్యి దాటి పోయే అవకాశం ఉంది. అందుకే రింగ్ చేశాను.
 ‘‘ఏమయ్యావ్? ఎక్కడ ఉన్నావ్?’’ ఆందోళనగా అడిగాడు రాథోడ్.
 ‘‘వాళ్లు ట్రైన్ దిగారు. నేను కూడా దిగాను. స్టేషన్ బయటకు వెళ్లే దారిలో వారు నడుస్తుంటే నేను అనుసరిస్తున్నాను.’’
 ‘‘వెరీ గుడ్. వాళ్లేం చేస్తున్నారు?’’ ఉత్సాహంగా రాథోడ్.
 
‘‘ఒకరి కళ్లల్లోకి మరొకరు చూసుకుంటూ తన్మయత్వంలో ఉన్నారు.’’
 ‘‘నేచురల్. ఆఖరిసారి చూసుకుంటున్నారు కాబట్టి ఆ మాత్రం ఎమోషన్ ఉంటుంది. ఇక డౌటే లేదు. వీళ్లు వాళ్లే! అంతా అనుకున్నట్లే జరుగుతోంది. మేము కూడా ఇక్కడే స్టేషన్ బయట ఉన్నాం. వాళ్లు బయటకు రాగానే అదుపులోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తాం’’ అంటుంటే ఫోన్ కట్ అయింది.
 చూసుకుంటే నా ఫోన్లో బ్యాలెన్స్ నిల్ అయింది. ఇంతలో ముందు నడుస్తున్న జంట మెట్రో స్టేషన్లోని ఒక కాఫీ షాపు ముందు ఆగారు.
 
ఆ షాపు దగ్గరే నేను కూడా ఆగి ఫోన్ రీచార్జ్ చేయించుకున్నాను. రెండు నిమిషాల్లో బ్యాలెన్స్ ఫోన్లోకి వస్తుందనీ, ఆ తరువాత ఫోన్ చేసుకోవచ్చనీ చెప్పాడు షాపువాడు. ఈలోపు ఒక కాఫీ ఆర్డరిచ్చాను. అక్కడే కాఫీ తాగుతున్న తీవ్రవాద అనుమానిత జంట నన్ను పలకరించారు.
 ‘‘హలో బాస్! ఎందుకు మమ్మల్ని అనుసరిస్తున్నావ్?’’ అడిగారు వారిద్దరూ.
 ‘‘నేనా? నేను మిమ్మల్ని ఎందుకు ఫాలో చేస్తాను?’’ తడబడుతూ అడిగాను.
 
‘‘మా నాన్న పురమాయించిన ప్రైవేట్ డిటెక్టివ్ నువ్వేనా?’’ అందా అమ్మాయి.
 ‘‘సారీ! మీ నాన్న ఎవరో నాకు తెలియదు’’ అని చెప్పాను. ఈసారి నిజం చెప్తున్నాను కాబట్టి తడబడలేదు. ఆ అమ్మాయి నా కళ్లలోకి సూటిగా చూసి చిన్నగా నవ్వి, ‘‘మీ మాటలు నమ్ముతున్నాను. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అర్ధరాత్రి పారిపోయి వచ్చాం.

ఇంకాసేపట్లో ఆర్య సమాజ్‌లో మా పెళ్లి. మీరు కూడా వస్తే సంతోషం...’’ చెప్పిందా అమ్మాయి.
 ‘‘కంగ్రాచ్యులేషన్స్...’’ అంటూ వారిని అభినందిస్తుంటే నాకు గుర్తొచ్చింది రాథోడ్ బయట ఈ జంట కోసం ఎదురు చూస్తుంటాడని. అతనికి నిజం చెప్పకపోతే వీళ్లని తీవ్రవాదులని కాల్చి పారేసినా దిక్కులేదు. బ్యాలెన్స్ కూడా రావటంతో మళ్లీ ఫోన్ చేశాను.
 ఫోన్ రింగయింది.
 ‘‘హలో...’’ అన్నాడు రాథోడ్. అతని గొంతులో ఎగ్జయిట్‌మెంట్ పొంగి పొర్లుతోంది. ‘‘ఎక్కడున్నావ్?’’
 ‘‘నేను స్టేషన్లో ఉన్నాను.’’
 
‘‘బయటకు రాకుండా మంచి పని చేశావ్. ఇక్కడ ఫైరింగ్ కూడా జరిగింది’’ రాథోడ్ మాట్లాడుతుంటే బ్యాక్‌గ్రౌండ్లో అనేక శబ్దాలు వినపడుతున్నాయి.
 ‘‘అవన్నీ తరువాత. నేను చెప్పిన సంగతి..’’
 ‘‘నేను చెప్తోంది కూడా అదే. స్టేషన్లో నుండి బయటకు వస్తున్న ఆ నీలి కళ్ల అమ్మాయిని, పక్కన ముక్కు విరిగిన అబ్బాయినీ చూసి ఆపాను.

అచ్చు నువ్వు చెప్పినట్లే ఉన్నారు. కానీ మనం అనుకున్న దానికన్నా వాళ్లు చాలా షార్పుగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పట్టుబడటానికి ఇష్టపడలేదు. రివాల్వర్లు తీసి ఫైరింగ్ చేయటం మొదలుపెట్టారు. నేను ముందే హెచ్చరించి ఉండటంతో మా వాళ్లు కూడా తయారుగా ఉన్నారు. వాళ్లని అవలీలగా లొంగదీశారు.’’
 ‘‘నమ్మలేకపోతున్నాను...’’ ఎదురుగా కాఫీ తాగుతున్న నీలి కళ్ల అమ్మాయినీ, ముక్కు విరిగిన అబ్బాయినీ చూస్తూ అన్నాను. వీళ్లు నా ఎదురుగా ఉంటే అక్కడ పట్టుబడింది ఎవరు?
 
‘‘తీవ్రవాదులు దాదాపు తమ లక్ష్యం చేరుకున్నారు. ఇక్కడ నుండి కాలి నడకన వెళ్లే దూరంలో ఎర్రకోట ఉంది. వాళ్లు అక్కడ దాకా వెళ్లి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో! వారి నడుము చుట్టూ బెల్టు బాంబులే కాదు, వారి వీపులకున్న బ్యాగుల నిండా ఆర్డీఎక్స్ నింపి ఉంది. వందల మంది చనిపోయేవారు. ఈ క్రెడిటంతా నీదే. ఎక్కడున్నావ్? త్వరగా రా. నువ్వు ఊహించనంత బహుమతి ఇప్పిస్తాను.’’
 ‘‘వస్తున్నాను...’’ చెవి పక్క నుండి ఫోన్ దూరం జరుపుతూ అన్నాను.
 
‘‘ఎక్కడికి? మా పెళ్లికి వస్తున్నారా?’’ మళ్లీ అడుగుతోంది ఆ నీలి కళ్ల అమ్మాయి.
 ‘‘కుదరకపోవచ్చు. ఇంతకీ ఆ బ్యాగులో ఏమున్నాయి. ఇంట్లో నుండి పట్టుకొచ్చిన నగలా? అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు?’’ వారి వీపుకి ఉన్న బ్యాగును చూపిస్తూ అడిగాను.
 ‘‘ఇవి పెళ్లికి కావలసిన సామాను’’ బ్యాగ్ తెరచి చూపిస్తూ అంది ఆ నీలి కళ్ల పిల్ల.
 ఆ కుర్రాడికి ఒక చేత్తో షేక్‌హ్యాండ్ ఇస్తున్న నెపంతో మరో చేత్తో అతని నడుము చుట్టూ చెయ్యి వేసి తడిమి చూశాను. అక్కడ బెల్టు బాంబు కాదు కదా మామూలు బెల్టు కూడా లేదు.
 ‘‘బై...’’ అంటూ వాళ్లు స్టేషన్ బయటకు వెళ్లబోయారు.
 
‘‘అటు కాదు, వెనుక దారి నుండి వెళ్లండి. ముందు వైపు ఏదో గొడవ జరిగిందట..’’ చెప్పాను.
 ‘మళ్లీ వాళ్లు రాథోడ్ దృష్టిలో పడితే అనుమానపడతాడు - నా మీద..’ అనుకుంటూ స్టేషన్ బయటకు నడిచాను నా బహుమతి స్వీకరించటానికి.
 - పుట్టగంటి గోపీకృష్ణ

Advertisement

తప్పక చదవండి

Advertisement