ఒక చేత్తో ఆట... మరో చేత్తో వ్యాపారం... | Sakshi
Sakshi News home page

ఒక చేత్తో ఆట... మరో చేత్తో వ్యాపారం...

Published Sun, May 3 2015 1:55 AM

ఒక చేత్తో ఆట... మరో చేత్తో వ్యాపారం... - Sakshi

భారత జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా వస్తారా? అని ఆస్ట్రేలియన్ లెజండరీ క్రికెటర్ స్టీవ్‌వాను మీడియా ఆరాతీస్తే.. ‘టీమిండియాపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తట్టుకోవడం కష్టం. అంత సాహ సం నేను చేయలేనేమో..’ అంటూ సమాధానం ఇచ్చాడాయన. కోచ్‌గా రావడానికి స్టీవ్‌కు ధైర్యం లేదు. ఎందుకంటే.. జట్టు ఓడితే ఆటగాళ్లతో పాటు కోచ్‌ను కూడా తూర్పారబట్టే చరిత్ర మనది. మరి ఇలాంటి జట్టులో సభ్యులుగా ఉన్న క్రికెటర్లు మాత్రం  నూటా ఇరవై కోట్ల మంది ఆశలను మోస్తూ కూడా ఇతర రంగాల్లో కూడా రాణించేస్తున్నారు!

ఒక్కో ఆటగాడు ఒక్కోరకమైన ఆలోచనలతో సైడ్‌బిజినెస్‌లు చేసుకొంటున్నారు. మరి వీరిని సమర్థులు అనుకోవాలో...ఆటపై అంకితభావం తగ్గిన వాళ్లు అనుకోవాలో మాత్రం అర్థం కాదు.

 
ముందుగా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ నుంచి సంపదను తోడి వ్యాపారాలు చేస్తున్న వ్యక్తిగా ఫోర్బ్స్ పత్రిక విశ్లేషణల్లో చోటు సంపాదించాడు. మ్యాచ్‌ఫీజులు, ఐపీఎల్, ఎండార్స్‌మెంట్ ద్వారా మాత్రమే కాకుండా తన వ్యాపారాల ద్వారా ధోనీ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని ఫోర్బ్స్ అంచనా. ధోనీకి రిథీ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ఉంది. దీనికి తోడు దేశవ్యాప్తంగా జిమ్ కమ్ ఫిట్‌నెస్ సెంటర్లున్నాయి. హీరో హాకీ ఇండియా లీగ్‌లో రాంచీ ప్రాంచైజ్‌కు యజమాని మహేంద్ర సింగ్‌ధోనీయే. అలాగే మోటార్ రేసింగ్ స్పోర్ట్స్‌లోని ఒక జట్టులో కూడా ధోనీకి వాటాలున్నాయి.
 
ధోనీ చూపిన దోవలో...     
వన్డే క్రికెట్‌లో ధోనీకి డిప్యూటీగా ఉన్న విరాట్ కొహ్లీ కూడా కెప్టెన్ చూపిన బాటలోనే నడుస్తున్నాడు. ఇటీవలే విరాట్ కూడా జిమ్ కమ్ ఫిట్‌నెస్ సెంటర్ల నిర్వహణ వ్యాపారంలో ముందడుగు వేశాడు. విరాట్ అండ్ కంపెనీ 90 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సెంటర్లను ప్రారంభించనుంది. మలిదశలో మరో వందకోట్ల రూపాయలను జోడించి వ్యాపారాన్ని విస్తరిస్తారట. చిజెల్ ఫిటెనెస్ సంస్థ విరాట్‌తో భాగస్వామి. ఇతడికే ఇండియన్ సూపర్‌లీగ్‌లో ఆడే ఎఫ్‌సీ గోవా ఫుట్‌బాల్ జట్టులో వాటా కూడా ఉంది.
 
వీళ్లకే కాదు...
జట్టులో చోటు కోసం తీవ్రమైన ప్రయత్నాలే సాగిస్తున్న యువరాజ్ సింగ్‌కు మొబైల్ ఆధారిత బ్యూటీ అండ్ వెల్‌నెస్ స్టార్టప్ వ్యోమోలో వాటాలున్నాయి. కొంతకాలం కిందట జాతీయ జట్టులో స్థానం కోల్పోయి ఐపీఎల్‌కు పరిమితమైన రాబిన్ ఊతప్పకు ‘ఐ టిఫిన్’ అనే ఫుడ్ స్టార్టప్‌లో వాటాలున్నాయి. జట్టులో స్థానం లేకపోయినా ఐపీఎల్‌తో కనిపిస్తున్న జహీర్‌ఖాన్, హర్బజన్ సింగ్‌లకు కూడా రెస్టారెంట్ వ్యాపారాలున్నాయి.
 
జాతీయ జట్టు సభ్యులైన ఆటగాళ్లు ఇలా వ్యాపారాలపై దృష్టి సారించడం అభిమానులను ఒకింత నిరాశపరుస్తుంది. వీళ్లు ఆటకే పరిమితమైతే మంచిదనేది వారి అభిప్రాయం. వ్యాపారాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే జాతీయ జట్టులో స్థానం మాత్రం ఎప్పుడూ ఉండదు. అయితే సెలెక్టర్లు, బీసీసీఐ మాత్రం ఆటగాళ్ల ఈ వ్యక్తిగత వ్యాపారాల గురించి పట్టించుకోవడం లేదు.
 - జీవన్
 
సచిన్, సౌరవ్‌లు ఫెయిలయ్యారు!
ఒకరు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ బాగా అభిమానించే అటగాడు, మరొకరు జాతికి బాగా ఇష్టమైన కెప్టెన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో వీళ్లకంటూ ప్రత్యేక స్థానం ఉంది. మరి క్రికెటర్లుగా దశాబ్దాలకు దశాబ్దాల పాటు రాణించిన వీళ్లు వ్యాపారవేత్తలుగా మాత్రం రాణించలేకపోయారు. సచిన్ ముంబైలో ‘టెండూల్కర్స్’ అనే రెస్టారెంట్‌ను, ‘సచిన్స్’ అనే కేఫ్‌ను కొన్ని సంవత్సరాల కిందట ప్రారంభించాడు.

హొటలియర్‌గా పేరు పొందిన మార్స్ గ్రూప్ అధినేత సంజయ్ నారంగ్‌తో కలసి సచిన్ వీటిని ప్రారంభించాడు. అయితే ఈ ఫుడ్ బిజినెస్ కలసి రాకపోవడంతో మాస్టర్ వాటిని మూసివేశాడు. బెంగాలీదాదా గంగూలీ కోల్‌కతాలో ‘సౌరవ్స్’ పేరుతో నాలుగంతస్తుల భవనంలో రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. అది కూడా సచిన్ వ్యాపారాలదారిలోనే నడిచి మూతపడింది. విశేషం ఏమిటంటే.. వీరి స్పూర్తితో రెస్టారెంట్ బిజినెస్‌లోకి ప్రవేశించిన ఢిల్లీ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్‌కు కూడా చేదు అనుభవమే మిగిలింది. ఢిల్లీలో వీరూ ప్రారంభించిన రెస్టారెంట్ మూతపడింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement