ష్...గప్... షిప్! | Sakshi
Sakshi News home page

ష్...గప్... షిప్!

Published Sun, Jun 12 2016 5:15 PM

ష్...గప్... షిప్!

పట్టుకోండి చూద్దాం
గత మూడు రోజులుగా సంతోషస్వర్గంలా ఉన్న   జపాన్ షిప్... ఆ రోజు మాత్రం కల్లోలంగా ఉంది. అరుపులు, కేకలతో దద్దరిల్లుతోంది. హయాషీ గట్టిగా అరుస్తున్నాడు. అతడి కళ్లు కోపంతో ఎర్రబారాయి. రెండు చేతులతో గుండెలను బాదుకుంటూ బిగ్గరగా ఏడుస్తున్నాడు...  ‘‘సర్... ఈ నీళ్లు తాగండి...’’ అని గ్లాస్‌లో నీళ్లు ఇచ్చి హయాషీ కన్నీళ్లు కర్చీఫ్‌తో తుడిచాడు  ఆ షిప్‌లో ఉన్న ఇటలీ హౌజ్‌కీపర్. నీళ్లైతే తాగాడు గానీ... ఏడుపు మాత్రం ఆపలేదు హయాషీ. ‘‘ఈ రవి నా వల్లే చనిపోయాడు... నిజంగా నా వల్లే చనిపోయాడు’’ అని ఏడుస్తున్నాడు హయాషీ.
 
హయాషీ ఎవరు?
జపాన్‌లో ప్రముఖ వ్యాపారవేత్త హయాషీ.
 వ్యాపార నిమిత్తం ఏ దేశానికి వెళ్లినా ఆ దేశంలో కొందరిని ఆత్మీయ స్నేహితులను చేసుకుంటాడు.
 వ్యాపార నిమిత్తం ఒకసారి హయాషీ హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడే హయాషీ, రవిలు స్నేహితులయ్యారు.
 
గోల్కొండ కోట చూడడానికి వచ్చినప్పుడు హయాషీకి అనుకోకుండా పరిచయం అయ్యాడు రవి.
 హయాషీలాగే రవి కూడా తడుముకోకుండా ఇంగ్లిష్ మాట్లాడగలడు.
 గోల్కొండ కోట గురించి మాత్రమే కాదు...
 ప్రఖ్యాత జపాన్ ఆర్టిస్ట్ హోకుసై నుంచి ప్రిన్స్ షోటుకు వరకు రవి అనర్గళంగా మాట్లాడడం, హయాషీని ఆశ్చర్యానికి గురి చేసింది. రవి తెలివితేటలకు అబుర్బపడిపోయాడు హయాషీ. ఆ రోజు కొండాపూర్‌లోని తన ఇంటికి తీసుకువెళ్లి హయాషీకి ఘనంగా ఆతిథ్యం ఇచ్చాడు రవి.
 
రవి నోటి నుంచి విన్న ‘మేరా జూతా హై జపానీ’ పాట హయాషీకి తెగ నచ్చేసింది.
 అలా ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు.
 ప్రతి ఆరునెలలకొకసారి నచ్చిన స్నేహితుడితో కలిసి పసిఫిక్ మహాసముద్రంలో నౌకా విహారం చేయడం హయాషీ అలవాటు. ఈసారి నౌకా విహారానికి ఇండియా నుంచి రవిని ఆహ్వానించాడు.
 ఎలా చనిపోయాడు?
 
రవి చాలా లావుగా ఉంటాడు.
 తనకు గుండెకు సంబంధించిన సమస్యలేవో ఉన్నట్లు ఒకసారి మాటల మధ్యలో హయాషీకి చెప్పాడు రవి.
 నిద్రలోనే రవి గుండె పోటుతో చనిపోయి ఉంటాడని ఊహించాడు హయాషీ.
 
నిర్జీవ స్థితిలో ఉన్న రవిని మరోసారి చూస్తున్నప్పుడు....
 హయాషీ దృష్టి హఠాత్తుగా... రవి చేయి, మెడ మీద పడింది.
 రవి చేతికి ఉన్న ఖరీదైన రోలెక్స్ వాచ్, మెడలో ఉన్న డైమండ్ చైన్ కనిపించడం లేదు.
 మనసులో ఏదో అనుమానం!
 ‘‘ఇది సహజమైన చావు కాదు... హత్య’’ అన్నాడు గట్టిగా.
 
అక్కడ ఉన్న వాళ్లు అది విని అదిరిపోయారు.
  ఈ జపాన్ షిప్‌లో బ్రిటన్, శ్రీలంక, ఇటలీ, జర్మనీ దేశాలకు చెందిన సిబ్బంది ఉన్నారు.
 ‘‘ఈ హత్య మీలో ఒకరు చేసుంటారని  నమ్ముతున్నాను. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి’’ అని ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు హయాషీ. వాటికి సిబ్బంది ఇలా సమాధానాలు చెప్పారు...
 ‘‘నేను కోల్డ్ స్టోరేజ్ రూమ్‌లో ఉన్నాను. నాకేమీ తెలియదు’’ అన్నాడు బ్రిటిష్ కుక్.
 
‘‘నేను జెనెరేటర్ రూమ్‌లో జెనరేటర్ చెక్ చేస్తున్నాను’’ అన్నాడు శ్రీలంక ఇంజనీర్.
 ‘‘ఒంట్లో నలతగా ఉండడంతో చాలాసేపు పడుకున్నాను’’ అన్నాడు జర్మన్ హౌస్ కీపర్.
 ‘‘నేను  షిప్ టాప్‌లో ఉన్నాను’’ అన్నాడు ఇటాలియన్ హౌస్‌కీపర్.
 ‘‘అక్కడ నువ్వేం చేస్తున్నావు?’’ అని అడిగాడు హయాషీ.
 
‘‘మీ దేశ జాతీయ జెండా తలకిందులై కనిపించింది. అలా ఉండడం గౌరవం కాదని దాన్ని సరిచేశాను’’ అన్నాడు ఇటలీ హౌస్ కీపర్.
 నలుగురి సమాధానాలు విన్న తరువాత హంతకుడు ఎవరో కనిపెట్టాడు హయాషీ.
  ఆ నలుగురిలో హంతకుడెవరో మీరు చెప్పగలరా?
 
అద్దంలో ఆన్సర్
కుడివైపు నుంచి అద్దం పెట్టుకుని చదవండి
ఆ హంతకుడు ఇటలీ హౌస్ కీపర్. జపాన్ జెండా ఎలా ఉంటుంది? తెల్లటి జెండాపై  ఎర్రటి వృత్తం ఉంటుంది. ఈ జెండాను తలకిందులుగా  ఎగరేసిన తేడా ఏమీ కనిపించదు. ఇటలీ హౌస్ కీపర్ అబద్ధం చెబుతున్నాడని అతని సమాధానం చెప్పకనే చెప్పింది.

Advertisement
Advertisement