గౌరవించుకుంటే...భార్యాభర్తలు హిట్ పెయిర్! | Sakshi
Sakshi News home page

గౌరవించుకుంటే...భార్యాభర్తలు హిట్ పెయిర్!

Published Sat, Jan 23 2016 11:32 PM

గౌరవించుకుంటే...భార్యాభర్తలు హిట్ పెయిర్! - Sakshi

ఇంటర్వ్యూ
 చాలా తక్కువ మాట్లాడుతుందని కరీనాకు పేరు. కానీ మాట్లాడే కొద్ది మాటల్లో కూడా ఎన్నో విలువైన విషయాలు చెబుతుందామె. ఇప్పుడు తన గ్లామర్ సీక్రెట్స్ గురించి, తన ఇష్టాయిష్టాల గురించి, తన కాపురం గురించి సింపుల్‌గా, స్పష్టంగా చెప్పింది. భార్యాభర్తల బంధం గురించి విలువైన విషయాలూ పంచింది. లేట్ చేయకుండా చదవండి మరి!
 
 పెళ్లయ్యాక అందం తగ్గుతుందంటారు... కానీ మీ విషయంలో అలా జరగలేదే?
 పెళ్లయిన తర్వాత బాధ్యతల ఒత్తిడి పెరిగి, మెయింటెయిన్ చేయలేకపోతారు చాలామంది. కానీ టైమ్ మేనేజ్‌మెంట్ తెలిసినవాళ్లకు ఒత్తిడి పెరగదు. నేను తిండి, వ్యాయామం, ఇంటి పనులు, షూటింగులు... అన్నిటినీ బాగా ప్లాన్ చేసుకుంటాను. అందుకే ఒత్తిడి ఫీలవను.

 గ్లామర్ కోసం ఇంకేం చేస్తారు?
ఫుడ్ విషయంలో చాలా డిసిప్లిన్డ్‌గా ఉంటాను. లేవగానే జ్యూస్, తర్వాత పరాఠా కానీ ఉప్మా కానీ తీసు కుంటాను. కాసేపయ్యాక బ్రౌన్ బ్రెడ్ శాండ్‌విచ్, లంచ్ టైమ్‌లో ఇంట్లో వండిన చపాతీ, పప్పు, కూరగాయల సలాడ్ తింటాను. సాయంత్రం గుప్పెడు డ్రైఫ్రూట్స్‌తో పాటు సోయా మిల్క్, రాత్రికి డిన్నర్‌లో వెజిటబుల్ కర్రీతో చపాతీ లేక పెరుగుతో బ్రౌన్ రైస్ తింటాను. రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గ్లాసుల నీళ్లు తాగుతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నా డైట్ ప్లాన్ మారదు.
 
మరి ఎక్సర్‌సైజ్?
 చేస్తాను. కానీ పనిగట్టుకుని జిమ్‌లకు వెళ్లను. అసలు వెళ్లాల్సిన పని కూడా లేదు. ఇంట్లోనే చాలా రకాల వ్యాయామాలు చేసుకోవచ్చు. బాల్కనీలోనే వాకింగ్, జాగింగ్ చేయవచ్చు. యోగా, ధ్యానం చేయవచ్చు. నేనూ అవే చేస్తుంటాను.

మీలో మీకు నచ్చేదేంటి?
 ముక్కుసూటితనం.

మీలో మీకు నచ్చనిది?
 పర్‌ఫెక్షనిజం. అన్నింట్లో పర్‌ఫెక్ట్‌గా ఉండటం మంచిదే. కానీ మరీ అతిగా తాపత్రయపడటం అంత మంచిది కాదు.  అది ఓ రకంగా బలహీనతే.

ఎదుటివారిలో మీకు నచ్చేది?
 నిజాయతీ. మంచైనా చెడైనా ముఖమ్మీద మాట్లాడేవాళ్లే నాకిష్టం.

ఇతరులకు మిమ్మల్ని దూరంగా ఉంచేది?
 ఇగో. అది కొందరిలో మితిమీరి ఉంటుంది. అలాంటివారికి చాలా దూరంగా ఉంటాను. ఇగో చాలా చెడ్డది. అది ఎలాంటి వారి మధ్యనైనా చిచ్చు పెట్టేస్తుంది. అందుకే నేను ఎక్కువ, నువ్వు తక్కువ అన్న భావనను మనసులో చేర నివ్వకూడదు. ఓ సమయంలో నేను ఐదు సినిమాలు చేస్తున్నప్పుడు సైఫ్ చేతిలో సినిమాలు లేవు. దాన్ని అడ్డుపెట్టుకుని కొందరు సైఫ్‌ని రెచ్చగొట్టాలని చూశారు. ఇగో లేదు కనుక తను పట్టించుకోలేదు.

  సైఫ్‌లో మీకు నచ్చే విషయాలేంటి?
 చాలా కూల్‌గా ఉంటాడు. వీలైనంత వరకూ అన్నీ పాజిటివ్‌గానే ఆలోచిస్తాడు, పాజిటివ్‌గానే తీసుకుంటాడు.

 కానీ తనకి కోపం ఎక్కువని..?
 అనుకుంటారు. కానీ నిజానికి తను చాలా కూల్. కాకపోతే ఎవరైనా లిమిట్స్ దాటితే త్వరగా రియాక్ట్ అయిపోతాడంతే. అయినా కోపం రాని మనిషెవరుంటారు? నేను చాలా సూటిగా మాట్లాడతాను. దాన్ని చాలామంది యాటిట్యూడ్ అని, యారొగెన్‌‌స అని అంటారు. ఏం చేస్తాం?

కారణం లేకుండా అనరు కదా?
 కారణం ఉండాలనేముంది? నేను నచ్చనివాళ్లకు నేనేం చేసినా తప్పుగానే ఉంటుంది. అలాంటివాళ్ల కోసం మన స్వభావాన్ని మార్చేసుకోవాలా? ఎవరి వ్యక్తిత్వం వారిది. ఎవరి భావోద్వేగాలు వారివి. మనం మనలా ఉండాలి తప్ప ఎవరి కోసమూ మారిపోకూడదు. భార్యా భర్తలమే అయినా సైఫ్, నేను ఒకరి కోసం ఒకరం మారిపోలేదు. ఎవరిని వారిలానే ఇష్టపడ్డాం. అందుకే మేం బెస్ట్ పెయిర్ అయ్యాం.

మీలా మంచి జంట అవ్వడానికి మీరిచ్చే సలహాలు..?
 సలహాలిచ్చేంత గొప్పదాన్ని కాదు. కానీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు, ఒకరి పట్ల ఒకరు నిజాయతీగా నడచు కున్నప్పుడు, ఒకరిని ఒకరు గౌరవించు కున్నప్పుడు... ప్రతి జంటా హిట్ పెయిరే.

 కెరీర్ బాగుంది. కాపురమూ బాగుంది. మరి తర్వాత?
 ప్రశ్న అర్థమైంది. పిల్లలు పుట్టాక వారితోనే సమయం గడపడంలో ఆనందం ఉంటుంది. అది మన బాధ్యత కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకది సాధ్యం కాదు. కాబట్టి పిల్లల గురించి మెల్లగా ఆలోచిస్తాను.    

Advertisement

తప్పక చదవండి

Advertisement