కింగ్ ఆఫ్ స్టీల్! | Sakshi
Sakshi News home page

కింగ్ ఆఫ్ స్టీల్!

Published Sat, Aug 27 2016 11:02 PM

కింగ్ ఆఫ్ స్టీల్!

మన దిగ్గజాలు
 
కష్టం అనుకుంటే... ఆ కష్టానికి పది కష్టాలు తోడై... విజయం ఎప్పుడూ కనిపించదు. ‘సాధించగలను’ అనే పట్టుదల ఉంటే కష్టం అనేది ఒంటరిదైపోతుంది. పోతూ పోతూ విజయాన్ని మన చేతిలో పెట్టి పోతుంది. ఇది సామాన్యుల విషయంలోనే కాదు అసామాన్యులని లోకం కీర్తించేవారి విషయంలోనూ జరిగింది.

 ‘ది కింగ్ ఆఫ్ స్టీల్’గా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ మిట్టల్ స్కూల్ చదువంతా హిందీ మీడియంలో సాగింది. కాలేజీ చదువు మాత్రం ఇంగ్లిష్ మీడియంలో హిందీ మీడియం నుంచి వచ్చిన విద్యార్థి, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడలేని విద్యార్థి ఈ కాలేజీలో చదవడం కష్టం అంటూ మొదట్లో  ప్రిన్సిపల్ సీటు నిరాకరించాడు. అయితే ప్రిన్సిపాల్ ఆలోచనా విధానం తప్పని తన ప్రతిభతో నిరూపించాడు మిట్టల్... కలకత్తా సెయింట్ జేవియర్ కాలేజీలో సీటు సంపాదించడమే కాదు  చదువులో ఎప్పడికప్పుడు భేష్ అనిపించుకున్నాడు. ఇంగ్లిష్ మీడియంలో చదవడం  మొదట కష్టంగానే అనిపించింది. అంతమాత్రాన మిట్టల్ వెనక్కు తగ్గలేదు. కష్టపడి చదివాడు. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. ‘ప్రతి ఒక్కరికీ  తనను తాను నిరూపించుకునే సమయం వస్తుంది. ఆ సమయంలో చేస్తున్న పనిపట్ల శ్రద్ధ, అంకితభావం, కష్టపడేతత్వం ఉంటే... ఎంత పెద్ద సవాలైనా ఎదుర్కోవచ్చు’ అంటారు మిట్టల్. కాలేజీ రోజుల్లో తెలుసుకున్న ఈ విజయసూత్రం ఆ తరువాత  వ్యాపారంలో కూడా ఆయన వెంటే నడిచింది.

ఒక స్టీల్‌మిల్‌ను స్థాపించడానికి లక్ష్మీ మిట్టల్ తండ్రి మోహన్‌లాల్ మిట్టల్ ఇండోనేషియాలో కొంత భూమి తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సాధ్యపడేలా లేదనుకొని భూమిని అమ్మాలనుకున్నారు. సెలవుల్లో భాగంగా ఇండోనేషియా వెళ్లిన లక్ష్మీ మిట్టల్ భూమిని అమ్మడం మీద కంటే సమస్య మూలం మీదే దృష్టి కేంద్రీకరించాడు.

‘ఈ ప్రాజెక్ట్‌లో మనం ముందుకు వెళ్లవచ్చు. వెనక్కి తగ్గాల్సిన పనిలేదు’ అని చెప్పి సమస్య పరిష్కారం అయ్యేలా చేసి ప్రాజెక్ట్‌ను పట్టాలకెక్కించాడు. అక్కడ ‘స్టీల్ మిల్’ను మొదలుపెట్టిన  తరువాత మిట్టల్‌కు వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.
 మెక్సికన్ గవర్నమెంట్ స్టీల్ పరిశ్రమను ప్రైవేటీకరించడానికి నిర్ణయం తీసుకుంది. తమ ప్రైవేటీకరణ ప్రక్రియలో ఆసక్తి చూపే ప్రపంచంలోని వివిధ స్టీల్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. జపాన్ పారిశ్రామికవేత్తలతో మాట్లాడినప్పుడు మిట్టల్ కంపెనీ పేరు సూచించడాన్ని బట్టి మిట్టల్ అప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న విషయం అర్థమవుతుంది.         
                                            

ట్రినిడాడ్ అండ్ టుబాగోలో ఒక ఉక్కు కంపెనీ నష్టాల బారిన పడింది. దానిని నష్టాల నుంచి బయటపడేయడానికి ఏవో ప్రయత్నాలు జరిగాయిగానీ అవేమీ ఫలించలేదు. ఈ పరిస్థితుల్లో ఆ కంపెనీని కొనుగోలు చేసి కొద్దికాలంలోనే లాభాల బాటలోకి తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు మిట్టల్. ఇది మాత్రమే కాదు... ప్రపంచంలో ఏ మూల నష్టాల్లో ఉన్న ఉక్కు కంపెనీ కనిపించినా దాన్ని కొనుగోలు చేసి లాభాలబాటలో పయనింపచేసేవారు. సరికొత్త వ్యూహాలతో నష్టజాతక కంపెనీలను లాభాలబాట పట్టించడంతో ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేవారు. తన తెలివితేటలతో ఎన్నో దేశాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు మిట్టల్. ‘ఆర్సెలర్’ కొనుగోలుతో మరో సంచలనాత్మక ముందడుగు వేశారు మిట్టల్.
 ఉక్కు తయారీలో అగ్రగామి అయిన  ‘ఆర్సెలర్’ను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ‘ఇదొక దుస్సాహసం’ అని అన్నవారు లేకపోలేదు. ఉక్కుతయారీతో పాటు మైనింగ్, షిప్పింగ్, ఆటోమోటివ్, ప్యాకేజింగ్, నిర్మాణ రంగాలలో పని చేస్తుంది ‘అర్సెలర్ మిట్టల్’ సంస్థ.

‘‘చాలా గట్టి పోటీని తట్టుకుంటూ ఇన్ని విజయాలు ఎలా సాధించారు?’’ అనే ప్రశ్నకు- ‘‘పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆ సమయంలో ఎదుటివారి గురించి ఆలోచించడం కంటే మన శక్తిసామర్థ్యాల గురించే ఎక్కువగా ఆలోచించాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. ఈ విషయంలో టీమ్‌వర్క్ ముఖ్యం. అప్పుడు ఎంత పెద్ద విజయాన్ని అయినా సాధించవచ్చు’’ అంటారు.

 దశాబ్దాలుగా ఉక్కుపరిశ్రమలో కొనసాగుతున్న లక్ష్మీ మిట్టల్ వర్తమానానికి అవసరమైన పాఠాలను తన గత అనుభవాల నుంచి నేర్చుకుంటారు. మిట్టల్‌కు విజయం తెలుసు. సంక్షోభం తెలుసు.  ఆ సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కోవడం తెలుసు. అందుకే లక్ష్మీ నారాయణ్ మిట్టల్ ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా నిలిచారు.
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement