ఆమె ప్రేమకు రూపం చాలు | Sakshi
Sakshi News home page

ఆమె ప్రేమకు రూపం చాలు

Published Sun, Oct 19 2014 1:38 AM

ఆమె ప్రేమకు రూపం చాలు

 ప్రేమకు ప్రేమ తప్ప ఇంకేమీ కారణం కాదు... అని నమ్మిందో పాతికేళ్ల అమ్మాయి. తను ప్రేమించిన వాడి ప్రేమను కూడా ఆశించలేదు. జస్ట్ తను ప్రేమించింది అంతే. అదెలా సాధ్యం అంటారా... సాధ్యమే. ఎందుకంటే ఆమె ప్రేమించింది ఓ వ్యక్తిని కాదు, ఓ వ్యక్తి రూపాన్ని. ట్విలైట్ సిరీస్ వినోదంలో ప్రధాన పాత్రధారి అయిన ఎడ్వర్డ్ కులెన్‌పై లారెన్ అడ్కిన్స్ మనసు పారేసుకుంది. ఆరడుగుల ఆయన కటౌట్ చూసి మురిసిపోయిన ఈ సుందరి, ఎడ్వర్డ్‌ను కాకుండా తాను మురిసిపోయిన కటౌట్‌నే పెళ్లాడింది. అది కూడా ఆషామాషీగా కాదు, లాస్‌వెగాస్ నగరంలో అందరూ చేసుకున్నంత ఘనంగానే పెళ్లి చేసుకుంది.
 
  తమ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు పాటించాల్సిన పద్దతులన్నీ పాటించింది. ‘‘ఇందులో వింతేం లేదు. నాకు అతను అంటే ప్రేమ. ప్రేమకు అత్యుత్తమ నిర్వచనం ఈ ప్రపంచంలో ఏముందో దాని అర్థాన్ని సార్థకం చేయగలిగినంత ప్రేమ ఉంది. అందుకే పెళ్లాడాను’’ అని పేర్కొంది. ఊరికే వార్తల్లో వ్యక్తిగా నిలవడానికి ఆమె ఇలా చేయలేదు. నిత్యం ఆ కటౌట్‌తో పిక్నిక్ వెళ్తుంది, డేట్ చేస్తుంది, రెస్టారెంట్‌కు వెళ్తుంది. ఒకటేమిటి... ఆ కటౌట్‌ను తను భర్తగా భావించి, తను పత్నిగా జీవిస్తోంది. నువ్వు చేసింది కరెక్టేనా అని మీడియా ఆమెకు వేసిన ప్రశ్నకు ‘‘చాలా మంది నవదంపతుల కంటే మేము సంతోషంగా ఉన్నాం’’ అని నోరుమూయించింది.

Advertisement
Advertisement