సంస్కతం - సంస్కతి | Sakshi
Sakshi News home page

సంస్కతం - సంస్కతి

Published Sun, Apr 5 2015 1:34 AM

సంస్కతం - సంస్కతి - Sakshi

కవర్ స్టోరీ: తాను సంస్కరించబడినది, తనను చదివేవారిని సంస్కరించేది కనుక ఈ భాషకు సంస్కృత భాష అనే పేరు వచ్చింది. పది ఇంద్రియాలను, నవరసాలను, అష్టకష్టాలను, సప్త వ్యసనాలను, ఆరు రుచులను శత్రువులను, పంచ భక్ష్యాలను, నాలుగు దశలను, మూడు గుణాలను, రాగద్వేషాది ద్వంద్వాలను ఒక్కటిగా ఎలా ఎదుర్కొని పరిష్కరించుకొని ఆనందమయంగా జీవించాలో నేర్పే భూలోక పారిజాతం సంస్కృత భాష.
 
 ‘భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా’ (భారతదేశానికి సంస్కృత భాష, సంస్కృతి రెండు ప్రతిష్ఠాత్మకమైనవి) అనే తీర్మానం ద్వారా పెద్దలు సంస్కృతభాష అధ్యయనం భారతీయులందరికీ అత్యవసరమనీ, లాభదాయకమనీ ఎప్పుడో చెప్పారు. భారతీయ సంస్కృతి పరిరక్షణకు సంస్కృత భాష, సంస్కృత భాష పరిపుష్టికి భారతీయ సంస్కృతి పరస్పరం అన్యోన్యాశ్రయ పద్ధతిలో వర్ధిల్లుతాయి. అత్యంత ప్రాచీనమైన సింధు నాగరికత, భారతీయ సంస్కృతి సమాచారం స్పష్టంగా, సమగ్రంగా తెలుసుకోవడానికి అన్ని భాషలవారికీ, అన్ని సంస్కృతుల వారికీ ముఖ్యాధారం సంస్కృతమే. ప్రపంచంలో వున్న కొన్ని వేల భాషల్లో అతి ప్రాచీనమైన అభివృద్ధి చెందిన భాషగా సంస్కృతం భాషాశాస్త్రవేత్తలచే అంగీకరించబడింది.
 
 కేవలం వ్యవహారానికి మాత్రమే పనికివచ్చే భాషల్లో కొన్నింటికి మాత్రమే లిపి, పఠన లేఖనాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నిటికి మాత్రమే విలువైన సాహిత్యం, గ్రంథాలు ఉన్నతస్థాయిలో ఉన్నాయి. అటువంటి ఉన్నతస్థాయి వాఙ్మయంతో మానవజాతి ప్రగతిని, ఆలోచనాశక్తిని, సాంఘిక వ్యవస్థను ప్రతిబింబించే ఏకైక ప్రాచీనభాష సంస్కృతం. కనుక భారతీయులందరూ తప్పనిసరిగా సంస్కృత భాషను నేర్చుకోవాలని బాలగంగాధర తిలక్, మహాత్మాగాంధీ, బాబూ రాజేంద్రప్రసాద్, స్వామి వివేకానంద, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి భారతీయ మేధావులు, ఆధ్యాత్మిక, విజ్ఞానవేత్తలు ప్రబోధించారు. ఎందరో పాశ్చాత్య మేధావులు, శాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు సంస్కృతాన్ని అభ్యసించారు.
 
 ఇండియా గవర్నర్ జనరల్‌గా పనిచేసిన లార్డ్ వార్న్ హేస్టింగ్స్ సంస్కృతభాషాధ్యయనం అవసరమని ప్రోత్సహించారు. ‘వివాదార్ణవ సేతువు’ అనే న్యాయశాస్త్ర గ్రంథాన్ని సంస్కృతంలో వ్రాయించాడు. ఇది పెర్షియన్, ఆంగ్ల భాషల్లోకి అనువదించబడింది. సంస్కృత భాషా వాఙ్మయ విశేషాలను ఆంగ్లంలో ప్రకటించిన తొలి గ్రంథం ఇది. పద్దెనిమిదో శతాబ్దంలో ఎందరో పాశ్చాత్యులు సంస్కృత భాషను నేర్చుకొని వారి భాషల్లోకి ఎన్నో సంస్కృత గ్రంథాలను అనువదించారు. వారిలో మొదటివాడు చార్లెస్ విల్కిన్స్. ఈయన చాలా శ్రమపడి సంస్కృతం నేర్చుకొని దాని గొప్పదనాన్ని యూరప్ ఖండానికి తెలియచేశాడు. భగవద్గీతను, హితోపదేశాన్ని ఆంగ్లంలోకి అనువదించి ప్రకాశించాడు. సర్ విలియమ్ జోన్స్ సంస్కృతంలో మహాపండితుడై మనుస్మృతిని, శాకుంతలాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. యూరప్‌లో నాగరలిపి అక్షరాలు పోత పోసి గ్రంథ ముద్రణ చేసిన మహానుభావుడు. ెహ న్రీ థామస్ కోలే బ్రూక్ సంస్కృత భాషలోని ధర్మశాస్త్ర, దర్శన, వ్యాకరణ, గణిత, జ్యోతిష శాస్త్ర గ్రంథాలను ఇంగ్లీషులోకి అనువదించాడు. జర్మనీ, ఫ్రాన్సు దేశీయులు ఎంతోమందిని ఈయన సంస్కృత పండితులుగా తయారుచేశాడు.
 
 అలెగ్జాండర్ హేమిల్టన్, ఫ్రెడిరిక్ ష్లెగల్, ఆగష్ట్ విల్‌హెల్మ్‌వాన్ ష్లెగల్, ఫ్రాంజ్ బాప్ప్, బర్నాఫ్, లాసెన్, రోసెన్, థియొడర్ బెన్పీ, మాక్స్‌ముల్లర్, రుడోల్ఫ్ రాఢ్, ఆటో బోయిట్లింగ్, థియొడర్ ఔఫ్రెట్, జార్జి బ్యూలర్, గెల్డ్‌నర్, చార్లెస్ రాక్వెల్ లాన్‌మన్, మెక్‌డానెల్, బెరిడేల్ కీత్ మొదలైన పాశ్చాత్య పండితులు ఎందరో సంస్కృత గ్రంథాలను, వేద శాస్త్రాలను జర్మన్ భాషలోకి, ఆంగ్లంలోకి అనువదించి సంస్కృత భాష గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజెప్పారు.
 
 తాను సంస్కరించబడినది, తనను చదివేవారిని సంస్కరించేది కనుక ఈ భాషకు సంస్కృత భాష అనే పేరు వచ్చింది. సంస్కృత భాషలో ఖగోళ, భౌతిక, రసాయన, వృక్ష, జంతు, గణిత శాస్త్రాల వంటి ఆధునిక శాస్త్ర విషయాలెన్నో నిక్షిప్తమై ఉన్నట్టు నిరూపింపబడుతున్నాయి. ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన రిలేటివిటీ సిద్ధాంతం, భౌతికశాస్త్ర శక్తి పరిణామ సిద్ధాంతం, పరమాణు స్వరూపం మొదలైన సిద్ధాంతాలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలలో సంస్కృతంలో గోచరిస్తున్నాయి. అణువిస్ఫోటన కాంతిని చూడగానే భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగంలోని దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాస్సదృశీ సాస్యాత్ భాసస్తస్య మహాత్మనః॥
 (ఆకాశంలో ఒక్కసారిగా వేయి మంది సూర్యులు ఉదయిస్తే ఏర్పడే కాంతి ఆ మహాత్ముని తేజస్సుకు సాటి వస్తుంది) అనే శ్లోకం పాశ్చాత్య శాస్త్రవేత్తలకు గుర్తు వచ్చినట్లు చె ప్పారంటే సంస్కృత భాషాధ్యయన ఫలితం ఎంత గొప్పదో గ్రహించవచ్చు. సంస్కృత గ్రంథాలను ఆంగ్లంలో  చదివిన ఆంగ్లేయ పండితులు మళ్లీ జన్మ ఉంటే భారతదేశంలో పుట్టి ప్రత్యక్షంగా సంస్కృతం చదువుకోవాలని కోరుకున్నారంటే భారతీయులు ఎంత అదృష్టవంతులో చెప్పేదేముంది? మనస్తత్వం, వ్యక్తిత్వ వికాసం, ధైర్యం, కార్యశీలత, కర్తవ్య బోధతో ఎన్నో శాస్త్రాలకు అనుసంధానమైన భగవద్గీత ద్వారా ప్రపంచంలో ఎందరో మహానుభావులు, నాయకులు, శాస్త్రవేత్తలు ఉత్తేజితులైనారు. బాలగంగాధర తిలక్ వ్రాసిన గీతాభాష్యంలో ఖగోళ, భౌగోళిక, సామాజిక, సాంకేతిక శాస్త్ర విషయాలను ప్రస్తావించి నిరూపించారు. గాంధీ మహాత్ముడు తనకు ఏ సమస్య వచ్చినా భగవద్గీతలో ఏదో ఒక శ్లోకం పరిష్కారం చూపిస్తుందని చెప్పాడు.
 
 అపారమైన సంస్కృత భాషా సాహిత్యాల పరిచయం, అవగాహన నేటి సమాజానికి మరింత అవసరం. దానిలో కనీస పరిజ్ఞానం పిల్లలకూ పెద్దలకూ ఎంతో అవసరం. ‘అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయష’ అని ఎగతాళిగా వెక్కిరింపుగా మాట్లాడిన మాట అక్షరసత్యంగా అనేక పరిశోధనల్లో నిరూపితమౌతోంది. జాతి కుల మతాలకు అతీతంగా సంస్కృతభాష జ్ఞానభాండాగారమనే దృష్టితో అత్యంత ఆధునికమైన ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో అమెరికా, జర్మనీ వంటి దేశాలలో ఎన్నో విశ్వవిద్యాలయాలు సంస్కృత భాషా పీఠాలు స్థాపించి అధ్యయనం చేయిస్తున్నాయి.
 
 వేదం అంటే జ్ఞానం. శాస్త్రం అంటే శాసించేది. పురాణం అంటే నిత్యనూతనమైనది. కావ్యం అంటే మనోహరంగా సందేశాన్ని ఇచ్చేది. ఇతిహాసం అంటే జరిగినదాన్ని యధాతథంగా అందించేది. ఇలా సాగే సంస్కృతభాషా సాహిత్యం కోట్లాది సంవత్సరాల మానవజాతి ప్రగతికి మణిదర్పణంలా వెలుగొందుతోంది. ‘సంస్కృతం మృత భాష’ అనే సిద్ధాంతానికి కాలం చెల్లింది. దండయాత్రలతో పరాయి పరిపాలనలో ఇతర భాషల ఆధిపత్యం భారతదేశంలో పెరిగింది. ఒకప్పుడు రాజకీయపాలనా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతిక అధ్యయనాలు సమస్తమూ సంస్కృత భాషలో జరిగిన చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి.
 
 ‘జననీ సంస్కృతంబు సకల భాషలకును’ అనే భావనతో, గౌరవంతో భారతదేశంలోని అన్ని భాషలూ వర్ధిల్లుతున్నాయి. అందరికీ అనుసంధాన భాషగా, అంతర్జాతీయ భాషగా సంస్కృత భాష భిన్నత్వంలో ఏకత్వ కేంద్రంగా జాతిని తీర్చిదిద్దుతోంది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దం నాటి గ్రీకుల నుండి క్రీస్తుశకం పద్దెనిమిది పందొమ్మిది శతాబ్దాల వరకూ ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు, ఇంగ్లీషు మొదలైన విదేశీ బృందాలు భారతదేశం పైకి దండయాత్రల రూపంలోనో, వర్తక వాణిజ్యాల పేరుతోనో ప్రవేశించారు. దానికి కారణం ఊహాతీతమైన ధనసంపదే కాక అనంతమైన విజ్ఞానం, సంస్కృతి ఈ దేశాల్లో విలసిల్లటమే. ఇక్కడి సంపదను వారి దేశాలకు తరలించినట్లే సంస్కృత భాషనూ, వాఙ్మయాన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. పదహారో శతాబ్దంలో పోర్చుగీసు వ్యాపారి ఫిలిపోశాసెట్టి  సంస్కృతానికీ ఐరోపా ఖండంలోని ప్రధాన భాషలకూ సంబంధాన్ని చూపించాడు. పద్దెనిమిదో శతాబ్దంలో సర్ విలియం జోన్స్ సంస్కృతం, గ్రీకు, లాటిన్ మొదలైన భాషలు ఒకే కుటుంబానికి చెందినవని సోదాహరణంగా చుట్టరికాన్ని కలుపుకొన్నాడు.
 
 ఉదా: మాతా - మదర్, పితా - ఫాదర్, భ్రాతా - బ్రదర్ వంటివి. ప్రాచీన భారతీయ నాగరికతకు, వికాసానికి సజీవ చిహ్నాలయిన వేదాలు, శాస్త్రాలు, శ్రుతి స్మృతి పురాణేతిహాసాలు అధ్యయనం చేయటానికి నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలకు అనాదిగా వేలాదిమంది విదేశీయులు భారతదేశానికి వచ్చారు. నాటి నుంచి నేటి కంప్యూటర్ విజ్ఞానం వరకూ సంస్కృత భాష మానవజాతికి మార్గదర్శకమౌతోంది. కంప్యూటర్ సాంకేతిక భాషగా సంస్కృత భాష మాత్రమే పనికి వస్తుందని దాన్ని కంప్యూటర్ భాషగా శాస్త్రజ్ఞులు ప్రకటించారు. నేడు సంస్కృత భాషాధ్యయన ఆవశ్యకత మరింతగా పెరిగింది. మీమాంసా శాస్త్రానికీ కంప్యూటర్ విజ్ఞానానికీ ఉన్న పోలికలు ‘వేదాలలో కంప్యూటర్ విజ్ఞానం’ అనే గ్రంథంలో నిరూపిస్తూ శ్రీవేదభారతి సంస్థ ప్రచురించింది. అలాగే ‘వేదాలలో శాస్త్రీయ సాంకేతిక విషయాలు’ అనే పుస్తకంలో గణితశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, వైద్య శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం, వృక్ష, జంతు శాస్త్రాలు, వ్యవసాయ విధానాలు మొదలైనవాటి మూలాలను గుర్తించి ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఇటీవల ప్రకటించిన ‘వేద శాస్త్రాల సంక్షిప్త పరిచయం’లో డా.రేమెళ్ల అవధానులు గారు ‘వేద శాస్త్రాలు - ఆధునిక విజ్ఞానం’ అనే శీర్షికలో ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు.
 
 స్వామి వివేకానంద
 మానవజాతి ప్రగతిని, ఆలోచనాశక్తిని, సాంఘిక వ్యవస్థను ప్రతిబింబించే ఏకైక ప్రాచీనభాష సంస్కృతం. కనుక భారతీయులందరూ తప్పనిసరిగా సంస్కృత భాషను నేర్చుకోవాలని బాలగంగాధర తిలక్, మహాత్మాగాంధీ, బాబూ రాజేంద్రప్రసాద్, స్వామి వివేకానంద, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి భారతీయ మేధావులు, ఆధ్యాత్మిక, విజ్ఞానవేత్తలు ప్రబోధించారు.
 
 చార్లెస్ విల్కిన్స్
 చార్లెస్ విల్కిన్స్  చాలా శ్రమపడి సంస్కృతం నేర్చుకొని దాని గొప్పదనాన్ని యూరప్
 ఖండానికి తెలియచేశాడు. భగవద్గీతను, హితోపదేశాన్ని ఆంగ్లంలోకి అనువదించి ప్రకాశించాడు.
 
 హెన్రీ థామస్ కోల్‌బ్రూక్
 ెహ న్రీ థామస్ కోలే బ్రూక్ సంస్కృత భాషలోని ధర్మశాస్త్ర, దర్శన, వ్యాకరణ, గణిత, జ్యోతిష శాస్త్ర గ్రంథాలను ఇంగ్లీషులోకి అనువదించాడు. జర్మనీ, ఫ్రాన్సు దేశీయులు ఎంతోమందిని ఈయన సంస్కృత పండితులుగా తయారుచేశాడు.
 
 అమీబా అనే పదం కృష్ణయజుర్వేదంలో ‘ఇషేత్వా.... ...అనమీవాః’ అనే మంత్రంలో ఉంది. ‘ష్టీమ ఆర్ద్రీకరణే’ అనే  వ్యాకరణ సూత్రంలో ‘స్టీమ్’ సంస్కృత పదమని తెలుస్తోంది. మంత్ర పుష్పంలో ‘తిర్యగూర్ధ్వమధశ్శాయీ’ అనే వాక్యం గణిత సూత్రం. ‘అణోరణీయాన్ మహతో మహీయాన్’ అనే తైత్తరీయ ఉపనిషత్తు పరమాణువును చెబుతోంది. ఒకటి తరువాత పన్నెండు సున్నాల వరకు అంకెలు రుద్రాభిషేక మహాన్యాసంలో ఉన్నాయి. సూర్యచంద్రులు ఒకే రాశిలోకి వచ్చి చంద్రుడు కనిపించక పోవడాన్ని అమావాస్య పేరుతో సూచించిన ఖగోళ విజ్ఞానం, భూకంపాలను గుర్తించటానికి వరాహమిహిరుడు రాసిన ‘బృహత్‌సంహిత’ అనే జ్యోతిశ్శాస్త్ర గ్రంథంలో చూడవచ్చు. వైద్యశాస్త్రంలో సూదిమందు (ఇంజెక్షన్) విధానం అధర్వణ వేదం చెప్పింది. హైడ్రోజెన్‌కు చెందిన ఐసోటోప్సు ‘ఏకతాయ స్వాహా, ద్విత్వాయ స్వాహా, త్రితాయ స్వాహా’ అనే కృష్ణయజుర్వేద మంత్రంలో ఉన్నాయి.
 
 ఆధునిక శాస్త్ర సాంకేతిక విషయాల కోసం మాత్రమే కాక, మానవుడు ఆరోగ్యంగా ప్రశాంతంగా, ఆనందంగా బ్రతకటానికి కావలసిన ఎన్నో సూత్రాలు, సూక్తులు ధర్మన్యాయ నీతి శాస్త్రాలుగా సంస్కృత భాషలో నిక్షిప్తమై ఉన్నాయి. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ’ అన్న నాలుగు మాటలే మానవ జీవితానికి దిశానిర్దేశం చేస్తున్నాయి. ‘స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యమ్’ (చదువుకో, చదువు చెప్పు), ‘నా శ్లీలం కీర్తయేత్’ (అశ్లీలం పలుకరాదు)... ‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన’(ఫలితంకోసం ఆందోళన పడితే పని మీద ఏకాగ్రత చెదురుతుంది.
 
  పని ఏకాగ్రతతో చెయ్యి. ఫలితం గురించి ఆలోచించకు) అనే గీతావాక్యం మానసిక ఆందోళనలకు, నిరాశ నిస్పృహలకు, ఆత్మహత్యలకు, అహంకారానికి, ఆత్మాధిక్య న్యూనతా భావాల వంటి మానసిక రుగ్మతలకు చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. మానవ సంబంధాలు, వ్యక్తిత్వ వికాసం, వ్యక్తీకరణ నైపుణ్యం వంటి ఆధునిక పరిభాషలన్నీ సంస్కృత భాషలోని భారత, భాగవత, రామాయణాల్లో, మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి వంటి స్మృతి గ్రంథాల్లో, భర్తృహరి సుభాషితాలు, పంచతంత్రం, హితోపదేశం వంటి అనేక గ్రంథాల్లో ఉదాహరణలతో సహా లభిస్తాయి. క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, మానసిక వికాసం, అత్యుత్తమ బుద్ధి జీవనం లాంటివన్నీ నిశ్శబ్దంగా అందచేసే స్థాయిలో సంస్కరించబడిన భాష సంస్కృత భాష. పది ఇంద్రియాలను, నవరసాలను, అష్టకష్టాలను, సప్త వ్యసనాలను, ఆరు రుచులను శత్రువులను, పంచ భక్ష్యాలను, నాలుగు దశలను, మూడు గుణాలను, రాగద్వేషాది ద్వంద్వాలను ఒక్కటిగా ఎలా ఎదుర్కొని పరిష్కరించుకొని ఆనందమయంగా జీవించాలో నేర్పే భూలోక పారిజాతం సంస్కృత భాష. ‘వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే’(మానవజాతిని సంస్కృత భాష మాత్రమే తీర్చిదిద్దుతుంది).
 ‘జయతు సంస్కృతమ్’
  - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

Advertisement

తప్పక చదవండి

Advertisement