Sakshi News home page

కన్న ప్రేమ ప్రేమ కానదా?

Published Sun, May 25 2014 1:35 AM

కన్న ప్రేమ ప్రేమ కానదా? - Sakshi

‘సరసిజనేత్ర! యేటికి విచారము? నా కుశలత్వమేర్పడన్
 నర సుర యక్ష కింపురుష నాగ సభశ్చర సిద్ద సాధ్య కి
 న్నరవర ముఖ్యులం బటమునన్ లిఖియించిన జూచి నీ మనో
 హరుగని‘‘వీడెపొ’’మ్మనిన యప్పుడె వానిని నీకు దెచ్చెదన్’
 
 ప్రేమ వివాహమా? పెద్దలు నిశ్చయించిన వివాహమా? ఏది సముచితం! అనే చర్చను కొన్ని దశాబ్దాలుగా కాలేజీల్లోనూ, బయటా యువత కేంద్రంగా జేసి సాగిస్తూనే ఉన్నాం. యువత ఇష్టపడి చేసుకునే ప్రేమ వివాహాలే సముచితమని కొందరంటే, పెద్దలు నిశ్చయించి చేసే సంప్రదాయ వివాహాలే సమంజసమని మరి కొందరంటారు.
 
 యుక్తవయసు వచ్చిన వారు వారి అభీష్టం మేరకు ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పేంటి? పెద్దలెందుకు కాదనాలి? అనేది ఆవేశపు యువత ప్రశ్న. కన్నవారుగా పిల్లల పట్ల తమకు బాధ్యత ఉండదా? అన్ని కోణాల్లో మంచి చెడు ఆలోచించి, వారి బంగారు భవిష్యత్తుకోసమే కదా! తాము మంచి సంబంధం వెతికి మరీ పెళ్లి చేస్తామంటే ఎందుకొద్దంటారు? అని సంప్రదాయిక వాదులు నిలదీస్తుంటారు. అంతా సవ్యంగా సాగినపుడు రెండూ సముచితమే! అనుకోనిదేదైనా జరిగితేనే, ‘అదుగో! అందువల్లే జరిగింద...’ని పరస్పరం నిందించుకోవడం కూడా మామూలే!
 
 పెళ్లి అనేది ఉమ్మడి జీవనయానం కోసం చేసుకునే పరస్పర అంగీకారపు ఒప్పందమనేదే సముచితమైన నిర్వచనమైతే... ప్రేమ వివాహం, పెద్దలు నిశ్చయించిన పెళ్లి, రెంటిలోనూ మంచి-చెడులుంటాయని అంగీకరించాలి. దేన్నీ మూఢంగా అంగీకరించడానికి/తిరస్కరించడానికి లేదు. పురాణకాలంలోనూ ఈ సంఘర్షణ ఉండిందనీ, తమ అభీష్టం నెరవేరాలంటూనే, పిల్లల ఆలోచనల్నీ తలిదండ్రులు పరిగణనలోకి తీసుకున్న సందర్భాలూ ఉన్నాయని ఈ పద్యం చెప్తోంది. పోతన రాసిన శ్రీమద్భాగవతం దశమస్కందంలో బాణాసురుడనే రాక్షసుడి వృత్తాంతముంది. వివాహ విషయమై కూతురికి  భరోసా కల్పిస్తున్నాడు...  ‘...ఎందుకమ్మా విచారిస్తావ్, నీకు నచ్చిన వాడినే తెస్తాను’ అంటాడు బాణాసురుడు.
 
  కానీ, అదంత సూటిగా ఉండదు, చూడండి ఏమంటున్నాడో! ‘...నా కుశలత్వమేర్పడన్...’ అంటే, ముందు తనకు సంతృప్తి కలగాలట. ఎంపిక అవకాశం విస్తారంగానే ఉంది. మనం రాక్షసులం కనుక రాక్షస వరున్నే కోరుకోమనలేదు. రాక్షసేతరులైన నర, సుర, గంధర్వ, సిద్ద, సాధ్య, నాగ, యక్ష, కిన్నెర, కింపురుష... ఇలా ఏ ముఖ్యుల్నైనా సరే! కాకపోతే, తాను ప్రాథమికంగా సమాచార సేకరణ చేస్తాడు, తనకు సంతృప్తికలిగిన ప్రకారం ఒక జాబితా సిద్ధం చేయిస్తాడు. వివరాలతో కూడిన వారి చిత్రపటాలు గీయిస్తాడు. వివరాలు-చిత్తరువు చూసిన ఆమె, ‘ఇదుగో! ఇతడే నా మనసును దోచినవాడు’ అని చెబితే చాలట, అప్పుడు వాడినే ఆమెకు వరుడిగా తెస్తానంటాడు. ఇదేదో, ఉన్నంతలో నయమే కదా! అనిపిస్తుంది. కన్నవారి బాగోగులు చూసే తలిదండ్రులుగా వారు కొంత ప్రాథమిక కసరత్తు చేసి, ఆ పైన పిల్లల అభీష్టాన్నీ పరిగణనలోకి తీసుకొని పెళ్లి సంబంధం ఖరారు చేయడం! ఇంతకన్నా ఎవరైనా ఏం కోరుకుంటారు? కానీ బాణాసురుడి  కుమార్తె పెళ్లి ‘విషయ’ంలో తలచిందొకటయితే, జరిగింది వేరొకటి, అది వేరే విషయం.
 
 ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం, ఎక్కడో దూరాన యుద్ధభూమిలో ఉన్న బాణాసురుడు, రాజధాని నగరంలో ఉన్న మంత్రికి ఓ లేఖ పంపుతాడు. ఒక అవకాశం దొరికి, తమ శత్రువైన కృష్ణుడి మనవడు (మన్మథుని కొడుకు) అనిరుద్దుడి చేతే ఆ లేఖ పంపుతాడు. ఉత్తరంలో ఏముందో చూసుకోకుండానే నగరి దాకా చేరుకొన్న ఆ యువకుడు పొలిమేర ఉద్యానవనంలో నిద్రపోతూ సేదదీరుతున్నపుడు, అనుకోకుండా ఆయన సంచీలోని ఉత్తరాన్ని దొంగచాటుగా చదువుతుంది ‘విషయ’అనే ఆ రాజకుమారి. తన వేలి గోళ్లను కంటి కాటుకలో అద్ది మూడు చోట్ల అక్షరాలు మారుస్తుంది. ‘ఇతడు మనకహితుడు, విషమునిచ్చి చంపుము’ అని ఉత్తరంలో ఉంటే, ‘ఇతడు మనకుహితుడు, విషయనిచ్చి పంపుము’ అని మారుస్తుంది, ఆయన్ని ఇష్టపడింది కనుక. పాపం! ఇవేమీ తెలియని మంత్రి అలాగే చేస్తాడు. యుద్ధభూమి నుంచి వచ్చాక, జరిగింది తెలిసి బాధపడటం తప్ప ఏమీ చేయలేక పోతాడు బాణాసురుడు.
 
 కథ అలా ఉంటే ఉండనీ, మనం వాస్తవం లోకి వద్దాం. నిజమైన ప్రేమ ఏంటో లోతుగా తెలియక, ప్రేమ-వ్యామోహం మధ్య అంతరాన్ని కూడా గ్రహించలేని స్థితిలో కొట్టుకుపోతున్న యువత పెద్దల మాటల్ని పెడచెవిన పెట్టడం, వారి మనసును గ్రహించకపోవడం దురదృష్టకరం. తమకు నచ్చడం, తలిదండ్రులకు సంతృప్తికలగడం... రెండు పరస్పర భిన్నమైన వేర్వేరు విషయాలేం కావు. రెండూ జరగాలని కోరుకోవడంలో తప్పు లేదు.
 - దిలీప్‌రెడ్డి

Advertisement

What’s your opinion

Advertisement