బుల్లెట్ | Sakshi
Sakshi News home page

బుల్లెట్

Published Sun, Jan 24 2016 12:04 AM

బుల్లెట్

  మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు -  30

 ‘‘నేనది నమ్మలేదు’’ కెప్టెన్ క్లెటిస్ వెంటనే చెప్పాడు. ‘‘కాని సాక్ష్యం మాత్రం ఇన్‌స్పెక్టర్ థియోడోర్ ఆ హత్య చేశాడని చెప్తోంది’’ ఎల్లరీ చెప్పాడు. క్లెటిస్ వెంటనే అడిగాడు. ‘‘మన పోలీస్ శాఖలో ఎవరైనా థియోడోర్ హంతకుడని నమ్ముతున్నారా?’’ ‘‘నాతో సహా ఎవరూ నమ్మట్లేదు.’’
 
 ‘‘అసలేం జరిగిందో మరోసారి చెప్పు’’ క్లెటిస్ ఇన్‌స్పెక్టర్ని ప్రశ్నించాడు.
 ‘‘ఇంటర్నల్ అఫైర్స్ నించి వచ్చిన ఓ డిటెక్టివ్ పోలీసు శాఖలోని లంచగొండి తనం మీద పరిశోధిస్తున్నాడు. అతను కొన్ని విషయాలని కనుగొన్నాడు. ఫలితంగా ఒకరిద్దరు జైలుకి వెళ్లచ్చు. అందుకని ఆ డిటెక్టివ్ తన రిపోర్ట్‌ని పై అధికారులకి సమర్పించక మునుపే అతన్ని ఇన్‌స్పెక్టర్ థియోడోర్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపాడు.’’
 
 ‘‘అందుకు సాక్ష్యం?’’
 ‘‘హతుడిని చంపిన రివాల్వర్ గుండు మీద గుర్తులు. అది థియోడోర్ సర్వీస్ రివాల్వర్ లోంచే వెలువడిందని బాలిస్టిక్ నిపుణులు నిర్ధారించారు.’’ ‘‘అసలు థియోడోర్ రివాల్వర్ బుల్లెట్ గుర్తులతో ఆ బుల్లెట్ మీది గుర్తులని ఎందుకు పోల్చి చూశారు?’’
 
 ‘‘ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ఆ గుండు థియోడోర్ సర్వీస్ రివాల్వర్ నించే వెలువడిందని ఉప్పందించారు. మీకు తెలుసుగా? మన శాఖలో ఎవరికైనా సర్వీస్ రివాల్వర్‌ని జారీ చేసే ముందు దాన్ని పేల్చి, ఆ గుండు మీది గుర్తులని నమోదు చేసుకుంటారు. ఇందువల్ల పోలీస్ రివాల్వర్ నించి వెలువడ్డ గుండుని ఎవరు పేల్చారన్నది తేలిగ్గా తెలుసు కోవచ్చు. ఆ ప్రకారం బాలిస్టిక్ నిపుణులు పోల్చి చూసి ధృవీకరించారు. కాని థియో డోర్ ఆ హత్య జరిగిన సమయంలో తన రివాల్వర్ తన దగ్గరే ఉందని గట్టిగా చెప్తున్నాడు.’’
 
 ‘‘ఇందులో ఏదో రహస్యం ఉంది. దాన్ని మనం ఛేదించాలి’’ క్లెటిస్ చెప్పాడు.
 ‘‘అందుకే మీ దగ్గరికి వచ్చింది. మన శాఖలో ఆ పని చేయగల సమర్థత ఒక్క మీకే ఉంది. థియోడోర్ లాంటి వజ్రాన్ని మనం పోగొట్టుకోకూడదని అంతా నిశ్చయించారు. పైగా అసలు హంతకుడు తప్పించుకోకూడదు. ఇది థియోడోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్.’’  ఎల్లరీ ఇచ్చిన ఆ ప్రింటవుట్‌ని క్లెటిస్ జాగ్రత్తగా చదివాడు.
 
 ‘నా రివా ల్వర్‌తో నేను హత్య చేశానని చెబుతోన్న ముందు రోజు షూటింగ్ రేంజ్‌లో కొద్ది సేపు షూటింగ్ ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత నించి రివాల్వర్ నాతోనే ఉంది. మళ్లీ దాన్ని పేల్చలేదు. నా కుటుంబం ఊరు వెళ్లడంతో మా ఇంట్లో నేనొక్కడ్నే ఉన్నాను. కాబట్టి నాకు తెలీకుండా దాన్ని ఎవరో దొంగిలించే అవకాశం కూడా లేదు. హత్య జరిగిన సమయంలో నేను ఒంటరిగా ఇంట్లో నిద్రపోతున్నాను. ఇంతకు మించి నాకేం తెలీదు.’
 
 ‘‘కనీసం ఆ సమయంలో టీవీ చూసినా ఆ కార్యక్రమం మీద ప్రశ్నించి, సరైన సమాధానాలు ఇస్తే కొంతదాకా రక్షించగలిగేవాళ్లం’’ క్లెటిస్ చెప్పాడు. ఎల్లరీ మాట్లాడలేదు. క్లెటిస్ కొన్ని క్షణాలు థియోడోర్ షూటింగ్ రేంజ్‌లో ప్రాక్టీస్ చేసే దృశ్యాన్ని ఊహించుకున్నాడు. ఈ విజువల్ ఇమాజినేషన్ అతను నేర పరిశోధనలో ఉపయోగించే ఓ టెక్నిక్. వెంటనే కళ్లు తెరిచి చెప్పాడు. ‘‘హత్యకి మోటివ్ ఎవరికి ఉంటుంది? ఎవరు లంచగొండులో వారికే.’’
 
 ‘‘అవును. థియోడోర్ లంచగొండి కాదు. కాబట్టే మన శాఖ అతనికి మద్దతుగా ఉంది.’’ ‘‘షూటింగ్ రేంజ్‌లో పని పూర్తయ్యాక పేల్చిన గుళ్లు ఏమవుతాయి?’’ ‘‘వాటిని సేకరించి ఓ డబ్బాలో వేస్తారు. ఆ లోహపు ముక్కల్ని రీసైక్లింగ్ ప్లాంట్‌కి పంపుతారు.’’ ‘‘పద. థియోడోర్‌ని ఓ ప్రశ్న అడగాలి’’ క్లెటిస్ చెప్పాడు.
   
 ‘‘అవును. నేను పేల్చిన అన్ని గుళ్లనీ సేకరించి వాటిని రీసైక్లింగ్ డబ్బాల్లో వేసే వెళ్ళాను’’ థియోడోర్ జవాబు చెప్పాడు. ‘‘షూటింగ్ రేంజ్‌లోంచి మధ్యలో బయటికి వెళ్లారా?’’ క్లెటిస్ ప్రశ్నించాడు.
 ‘‘నాకు ఫోన్ వచ్చిందని అక్కడి ఉద్యోగి చెప్తే వారి ఆఫీసు గదిలోకి ఓసారి వెళ్లా. కాని అప్పటికే అవతలివాళ్లు లైన్ కట్ చేసేశారు. మళ్లీ వచ్చి ప్రాక్టీస్‌ని కొనసాగించాను.’’ ‘‘మీతో పాటు ఆ సమయంలో ఎవరు ప్రాక్టీస్ చేశారు?’’
 
 ‘‘మీకు తెలుసుగా. కింది అధికారుల ముందు పై అధికారులు షూటింగ్ ప్రాక్టీస్ చేయరు. తమ గురి సరిగ్గా లేదని కింది వాళ్లు గ్రహిస్తే వారికి అది నామర్దా. అందు వల్ల పై అధికారులెవరూ లేరు. ఇన్‌స్పెక్టర్ వైస్ ఒక్కడే నాతో కలిసి ప్రాక్టీస్ చేశాడు.’’ ‘‘అతను మీరు మొదలెట్టిన కాసేప టికి వచ్చాడు. మీరు మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు కూడా వైస్ ఉన్నాడు కదా?’’
 
 ‘‘అవును. మీకెలా తెలుసు?’’
 ‘‘మళ్లీ మీకు ఫోన్ వచ్చి లైన్ డిస్‌కనెక్ట్ అయి ఉండాలి. లేదా మరే కారణంగానో మీరు బయటికి వెళ్లి ఉండాలి.’’
 ‘‘అవును. మళ్లీ ఫోన్ వస్తే అలాగే జరిగింది. ఇది మీకెలా తెలుసు?’’ థియోడోర్ ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు.
 ‘‘ఇన్‌స్పెక్టర్ వైస్ మిమ్మల్ని అక్కడ్నించి బయటికి పంపించడానికి కారణం మీ రివాల్వర్ బేరల్‌ని తస్కరించి, ఆ స్థానంలో తన రివాల్వర్ బేరల్‌ని మీ రివాల్వర్‌కి అమర్చడానికే. ఒకే కంపెనీ తయారీ చేసిన ఆటోమేటిక్ రివాల్వర్ల బేరల్స్‌ని ఒకదానిది మరొక దానికి అమర్చ వచ్చు. మీ బేరల్ అమర్చిన తన రివాల్వర్‌తో హత్య చేశాడు. దాంతో ఆ గుండు మీద మీ బేరల్ నించి వచ్చిన గుర్తులు కనిపించాయి.
 
 మళ్లీ మీరు ప్రాక్టీస్‌కి వచ్చినప్పుడు ఎవరి బేరల్స్‌ని వారి రివాల్వర్స్‌కి గుట్టు చప్పుడు కాకుండా అమర్చేశాడు. తర్వాత అజ్ఞాత వ్యక్తిగా ఇంటర్నల్ అఫైర్స్ శాఖకి ఫోన్ చేసి దృష్టి బేరెల్ మీదకి మళ్లించాడు. దాంతో హతుడికి తాకిన గుండు మీద మీ రివాల్వర్ బేరల్ గుర్తులు కనిపించాయి. అంతా ఆ రివాల్వర్‌తో మీరే అతన్ని చంపారనుకుంటారు.’’‘‘కరెక్టే. అందుకు ఇంతకుమించి మరో మార్గం లేదు’’ థియోడోర్ మొహంలో ఉత్సాహం తొంగి చూసింది.

 ‘‘కాని ఇది జడ్జి నమ్మాలి. దీనికి సాక్ష్యులు లేరు’’ ఇన్‌స్పెక్టర్ క్లెటిస్ ఆలోచనగా చెప్పాడు. ‘‘అవును. కనీసం మన శాఖలోని వారు ఇది నమ్ముతారు. వాళ్ల దృష్టిలో నేను హంతకుడ్ని కాను.’  ‘‘బాలిస్టిక్ రిపోర్ట్ ఇంకా గోప్యంగానే ఉంది. కాబట్టి మీరు ఓ అబద్ధం ఆడాలి. వైస్‌తో మాట్లాడాలని పిలిపించండి. రివాల్వర్ బేరల్స్‌ని అతను మార్చడం మీరు చూశారని, అతని బేరల్ గల మీ రివాల్వర్‌తో వైస్ హత్య చేశాడని అతనితో చెప్పండి. మేం వైస్‌తో అతని బేరల్ గుర్తులు హతుడి శరీరంలో దొరికిన గుండుతో సరిపోయాయి అని అబద్ధం చెప్తాం. ఆ నేరం మీ మీదకి వస్తుందని అతను తను చేసింది ఒప్పుకుంటాడు. అతని చేతే జరిగింది చెప్పిస్తే కాని ఇందులోంచి మీరు బయటపడలేరు.’’
 
 ‘‘ఇది తెలివైన ఆలోచన. థాంక్యూ’’ థియోడోర్ ఆనందంగా చెప్పాడు. ‘‘కాని వైస్ లంచగొండి కాదు కదా? అతను దేనికీ హత్య చేశాడు?’’... కాసేపాగి అమానంగా అడిగాడు. ‘‘లంచగొండులైన పై అధికాల ప్రాపకం కోసం’’... చెప్పాడు క్లెటిస్. వైస్‌కి శిక్ష పడింది.
 (ఆర్.టి.లాటన్ కథకి స్వేచ్ఛానువాదం)

Advertisement

తప్పక చదవండి

Advertisement