మనసున మనసై బ్రతుకున బ్రతుకై... | Sakshi
Sakshi News home page

మనసున మనసై బ్రతుకున బ్రతుకై...

Published Sun, Apr 5 2015 1:01 AM

మనసున మనసై బ్రతుకున బ్రతుకై...

నా పాట నాతో మాట్లాడుతుంది
 పాట    :    మనసున మనసై
 చిత్రం    :    డాక్టర్ చక్రవర్తి (1964)
 గీతం    :    }}
 సంగీతం    :    ఎస్.రాజేశ్వరరావు
 గానం    :    ఘంటసాల
 
 నాతో శ్రీశ్రీ పాట మాట్లాడింది-
 ‘‘కవితామృతలావా’ జనకుడు నా తండ్రి శ్రీశ్రీ. శ్రీ అంటే అమృతం. శ్రీ అంటే విషం - నిఘంటికార్థం.  నా దృష్టిలో శ్రీ అంటే పూలపర్వతం. మరొక శ్రీ అంటే నిప్పుల పర్వతం.  లేకుంటే హృదయంలో నిదురించే చెలిని చకోరమై వరించటాలు, అనుకరించటాలుండవు. జాబిల్లి తొలిరేయి వెండిదారాలల్లడాలుండవు. తూరుపు సిందూరపు మందారాలు పూయవు. దివిని వదలి భువికేతెంచిన తేనెలవెన్నెల సోనలూ ఉండవు. అందుకే ‘పూల పర్వతం’ అన్నా. ‘నిప్పుల పర్వతం’ అనే మాటకు నిరూపణలు, ఉదాహరణలు నీకు అక్కర్లేదని నాకు తెలుసు’’ అని మొదలెట్టింది నాతో శ్రీశ్రీ పాట.  ‘‘తమరెవరు?’’ అనగానే ‘‘డాక్టర్ చక్రవర్తి చిత్రంలో ఆత్రేయ రాసాడని చాలామంది ఇప్పటికీ అపోహపడే ‘మనసున మనసై’ పాటని’’ అంది.

 హీరో ఏఎన్నార్ ‘నీ కోసం నేనున్నాను’ అనే ‘తోడు’ ఉండడానికన్న గొప్ప అదృష్టం లేదు అనేది పాటగా చెప్పాలి. మొదలెట్టాడు శ్రీశ్రీ.
 దర్శకుడు చెప్పింది పల్లవిలోనే చెప్పటమా? మొదటి చరణంలో చెప్పాలా, రెండో చరణంలో చెప్పాలా? సందర్భం, సన్నివేశం రచయిత ప్రతిభ, పరిణతి, ఔచిత్యం తెలిసిన నేర్పరితనాన్ని  బట్టి ఉంటుంది.  ‘‘అదిగో ఆ కొండపైన ఒక కుటీరంలో ఓ మునికన్య’’ ‘‘అదిగో మునికన్య’’ ఎలా అయినా కథ, మాట మొదలెట్టొచ్చు. అలాగే పాట కూడానూ. అందుకే శ్రీశ్రీ-  ‘‘మనసున మనసై - బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము - అదే స్వర్గము’’ అని ఆ భాగ్యంలేని కథానాయకుని హృదయాన్ని ఆవిష్కరిస్తూ పల్లవించాడు. తరువాత ఆ పల్లవికి కొనసాగింపుగా ఆ తోడు ఏయే సందర్భాల్లో అవసరం అని ప్రశ్నించుకుని పల్లవిని కనెక్ట్ చేయాలనుకున్నాడు. (పల్లవి- చరణం పాలు అన్నంలా కలిసిపోవాలి కానీ ఎంత కలిపినా కలవని పెరుగు - వడ్లలా వుండొద్దు.)
 అందుకే ఆశలు తీరనపుడు కలిగే ఆవేశంలో, ఆశయం కోసం పోరాడే సమయంలో, ఆశలు తీరడానికి అవుతున్న ఆలస్యంలో కలిగే ఆవేదనలో, ఏ ఆశాదీపాలు వెలగని చీకటి మూసేసిన ఏకాంతంలో తోడొకరుండిన అదే భాగ్యమని పల్లవికి జతవుతాడు.
 
 ఇక రెండో చరణంలో ఎలాంటి తోడుకావాలో చెప్పాలనుకున్నాడు. సూదిరంధ్రమంత సందు దొరికితే సముద్రాన్ని దూర్చి సమాజానికి చేతనత్వం ఇవ్వాలని సామాజిక మేలుకొలుపుల కవేలుపు (కవివేలుపు) కదా శ్రీశ్రీ! (నాకూ ఈ అలవాటుంది సందు దొరికితే కవిత్వాన్నో, సమాజ శ్రేయస్సునో దూర్చడం.)  నీ వృత్తిని, నీ సంపాదనను, నీ బ్యాంక్ బాలెన్సు, నీ పలుకుబడి, పదవి, పరపతి, హోదాలు చూడకుండా... నీ వేళ్లకు వజ్రపుటుంగరాలు, నీవు వేసుకునే దుస్తుల చిరుగులు ఇవేవి చూడక ‘‘నిన్ను నిన్నుగా ప్రేమించే - నీ కోసం ఆనంద బాష్పాలు, దుఃఖబాష్పాలు ఒలికిస్తూ నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన... అని పల్లవిని అందుకుంటాడు.
 
 ఎలాంటి ఆపద సమయంలో - విషాద సమయంలో అనే ప్రశ్న వేసుకుని ‘మరోసారి’ మూడోచరణంగా చెపుతాడు. చెలిమి కరువైన వేళ, వలపు అరుదైన వేళ, గుండె బండగా మారినవేళ, నీ బాధ తెలిసి ఓదార్చి ఒడిచేర్చి నీడగా నిలిచే తోడొకరుండిన... అని పల్లవితో చరణాన్ని మమేకం చేస్తాడు.  ...అని ‘మరో ప్రపంచం’లోకి వెళ్లింది. శ్రీశ్రీకి తోడుగా ఉండాలని శ్రీశ్రీ పాట!

 - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత

Advertisement
Advertisement