బావను పెళ్లి చేసుకోవచ్చా? | Sakshi
Sakshi News home page

బావను పెళ్లి చేసుకోవచ్చా?

Published Sat, Sep 3 2016 11:31 PM

బావను పెళ్లి చేసుకోవచ్చా?

సందేహం
నేను డిగ్రీ పూర్తి చేశాను. నేను మా బావ లవ్‌లో ఉన్నాం. ఇద్దరికీ వయసులో మూడేళ్ల తేడా ఉంది. మా అమ్మానాన్నలది మేనరికం పెళ్లి. నేను, మా బావ పెళ్లి చేసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డలకు సమస్యలు తలెత్తుతాయని, మేనరికం మంచిది కాదని చాలామంది చెబుతున్నారు. నాకు మా బావ అంటే చాలా ఇష్టం. అతన్ని వదులుకోలేను. నా సమస్యకు పరిష్కారం ఏమైనా ఉందా?
 - లావణ్య, హైదరాబాద్
 

మేనరికపు పెళ్లిళ్ల వల్ల, అంటే దగ్గరి రక్తసంబంధీకులు పెళ్లి చేసుకున్నప్పుడు వారి జన్యువులలో ఏ చిన్న సమస్య ఉన్నా, ఇద్దరి జన్యువులు బిడ్డకు సంక్రమించడం జరుగుతుంది కాబట్టి పుట్టే బిడ్డలో అది బయట పడుతుంది. ముందు తరాల వాళ్లవి కూడా మేనరికపు పెళ్లిళ్లే అయితే పుట్టే బిడ్డకు సమస్యలు తలెత్తే అవకాశం ఇంకా పెరుగుతుంది. మామూలుగా పెళ్లి చేసుకునేవారి పిల్లల్లో జన్యు సమస్యలు, అవయవ లోపాలు, ఇతర సమస్యలు 2-3 శాతం ఉంటే, మేనరికపు పెళ్లిళ్ల వల్ల పుట్టే పిల్లల్లో ఈ సమస్యలు 4-6 శాతం వరకు ఉండవచ్చు. అంటే రెట్టింపు అన్నమాట. అంతేకాని మేనరికపు పెళ్లిళ్ల వల్ల పుట్టే పిల్లలందరికీ సమస్యలు ఉంటాయనేమీ లేదు.

పెళ్లికి ముందుగా మీరిద్దరూ ఒకసారి జెనెటిక్ కౌన్సెలర్‌ను సంప్రదించండి. మీ కుటుంబంలోని అందరి వివరాలు, వారిలో ఉండే సమస్యలు వంటివి అన్నీ అడిగి తెలుసుకుని, వివరాలన్నింటినీ విశ్లేషించి మీకు పుట్టబోయే బిడ్డలకు సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయో తెలిపే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే మీరిద్దరికీ రక్తపరీక్ష చేసి చూస్తారు. జెనెటిక్ కౌన్సెలర్లు కూడా మీకు పుట్టబోయే బిడ్డలకు జన్యు సమస్యలు వస్తాయని గాని, లేదని గాని నూటి నూరు శాతం ముందుగానే చెప్పలేరు. అయితే, వీలైనంత వరకు మేనరికపు పెళ్లిళ్లను నివారించడమే క్షేమం. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకున్నా, పుట్టబోయే బిడ్డలకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే, వాటిని నివారించడానికి ఎలాంటి మందులు, ఇంజెక్షన్లు లేవు. కాకపోతే బిడ్డ కడుపులో ఉన్నప్పుడే కొన్ని రకాల జన్యు సమస్యలు, అవయవ లోపాలు గుర్తించడానికి మూడో నెల చివరలో ఎన్‌టీ స్కాన్, డబుల్ మార్కర్ టెస్ట్ లేదా క్వాడ్రుపుల్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

ఐదో నెల చివరలో 2డీ ఎకో స్కాన్ చేయించుకుంటే గుండెలో రంధ్రాలు వంటివి ఉన్నట్లయితే ముందుగానే తెలుసుకోవచ్చు. కొన్ని రకాల జన్యు సమస్యలు, అవయవ లోపాలు బయటపడినప్పుడు, వాటికి చికిత్స లేనప్పుడు పుట్టిన తర్వాత జీవితాంతం బాధపడే కంటే ముందుగా తెలుసుకోవడం వల్ల వద్దు అనుకుంటే ఐదో నెల లోపల అబార్షన్ చేయించుకునే అవకాశాలు ఉంటాయి. కాకపోతే, కొన్ని రకాల పరీక్షలు చేయించుకున్నా, పుట్టబోయే బిడ్డలో ఎటువంటి సమస్యలూ ఉండవని నూటికి నూరు శాతం చెప్పలేము. మూగ, చెవుడు, బుద్ధిమాంద్యం, మెటబాలిక్ డిజార్డర్, హార్మోన్ల లోపాలు వంటివి బిడ్డ పెరిగే కొద్దీ బయటపడతాయి.
 
నా వయసు 24 ఏళ్లు, పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మాత్రలు రాసిచ్చారు. అవి వేసుకుంటే నొప్పి తగ్గుతోంది. ప్రతిసారీ నొప్పి ఉంటోంది. అలాగని మాత్రలను ఎక్కువగా వాడితే దుష్ఫలితాలు ఉంటాయేమోనని భయంగా ఉంది. నాకు బలపాలు, సుద్దముక్కలు తినే అలవాటు ఉంది. మంచిది కాదని తెలిసినా మానుకోలేకపోతున్నాను. ఏం చేయాలో సలహా ఇవ్వగలరు.
 - శశి, నూజివీడు

 
మెచ్యూరైన తరువాత కొందరిలో హార్మొన్స్ సక్రమంగా పనిచెయ్యడానికి సంవత్సరం నుండి రెండు సంవత్సరాల సమయం పట్టవచ్చు. దానివల్ల ఆ సమయంలో పీరియడ్స్ సక్రమంగా ఉండకపోవచ్చు. వేరే సమస్యలు ఏమీ లేనప్పుడు దాని వల్ల ఇబ్బంది ఏమీ లేదు.
 పీరియడ్స్ సమయంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. అవి విడుదలయ్యే మోతాదును బట్టి గర్భాశయం కండరాలు కుదించుకుని బ్లీడింగ్ బయటకు రావడం వల్ల కొందరిలో కడుపు నొప్పి వస్తుంది. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి  నొప్పి తీవ్రత ఉంటుంది. ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంటే, నొప్పి ఉన్న రోజులలో రోజుకు రెండు చొప్పున నొప్పి నివారణ మాత్రలు వాడవచ్చు. నెలకి రెండు రోజులు నొప్పి  మాత్రలు వాడడం వల్ల ప్రమాదం ఏమీలేదు.
 
కొందరిలో గర్భాశయంలో గడ్డలు, అండాశయంలో సిస్ట్‌లు వంటి ఇతర సమస్యలు ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉండవచ్చు. అశ్రద్ధ చేయకుండా ఒకసారి స్కానింగ్ చేయించుకొని, గర్భాశయంలో కాని, అండాశయాలలో ఏమైనా  సమస్యలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం మంచిది. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు.
 
రక్తం తక్కువ ఉన్నప్పుడు బలపాలు, చాక్‌పీస్‌లు, బియ్యం వంటివి తినాలని అనిపిస్తుంది. కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల,  అవి శరీరం లోపల రక్తాన్ని పీల్చుకోవడం వల్ల రక్తం తగ్గి బలపాలు తినాలనిపిస్తుంది. కాబట్టి నువ్వు ఒకసారి రక్తం ఎంత ఉందో complete blood picture (cbp) పరీక్ష చేయించుకొని రక్తం తక్కువ ఉంటే, పెరగడానికి ఆకుకూరలు, పప్పులు, పండ్లు, మాంసాహారంతో పాటు ఐరన్ మాత్రలు వేసుకోవాలి. అలాగే నులి పురుగులకు కూడా ఆల్‌బెండజోల్ మాత్ర ఒక్కటి తీసుకోవచ్చు.
- డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్

Advertisement
Advertisement