న్యాయదేవత చేతిలో గులాబీ | Sakshi
Sakshi News home page

న్యాయదేవత చేతిలో గులాబీ

Published Sun, Feb 11 2018 12:35 AM

Mohammedali Karim Chagla was the first Indian to be honored - Sakshi

‘ఒక మహోన్నత న్యాయమూర్తి. ఒక గొప్ప పౌరుడు. వీటన్నిటికీ మించి సమున్నత మానవతావాది.’  బాంబే హైకోర్టు ప్రాంగణంలో ఉండే ఓ శిలా విగ్రహం కింద కనిపించే పదాలివి. ఒక్క బొంబాయి మాత్రమే కాదు, యావద్భారతం ఇచ్చిన ఆయనకు ఇచ్చిన నివాళి అది. ఆయన 1947లో ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ గౌరవం దక్కిన తొలి భారతీయుడు ఆయనే. భిన్న సంస్కృతులూ జీవన విధానాలూ ఉన్న భారతదేశంలో చట్టం ప్రాధాన్యం తిరుగులేనిదని నమ్మినవారాయన. మానవాళి అంతిమంగా అనుసరించవలసినది న్యాయశాస్త్ర పంథాయేనని ప్రగాఢంగా విశ్వసించిన రాజ్యాంగ నిపుణుడు. ఆయన మహమ్మదలీ కరీం చాగ్లా (సెప్టెంబర్‌ 30, 1900– ఫిబ్రవరి 9, 1981) లేదా ఎంసీ చాగ్లా.  న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు చాగ్లా. సుదీర్ఘ ప్రయాణం సాగించి మళ్లీ న్యాయవాదిగానే కోర్టుకు వచ్చి, న్యాయవాదిగానే తుదిశ్వాస విడిచారు. ఈ బారిస్టర్‌ మొదట బొంబాయి హైకోర్టులోనే, మరో గొప్ప బారిస్టర్, పాకిస్తాన్‌ వ్యవస్థాపకుడు మహమ్మదలీ జిన్నాకు సహాయకుడు. జిన్నా జాతీయవాది అవతారాన్ని విశేషంగా ఆరాధించారాయన. కానీ పూర్తి లౌకికవాదంతో రూపొందిన మోతీలాల్‌ నెహ్రూ నివేదికను జిన్నా తిరస్కరించడంతో, చాగ్లా తన గురువుకు వీడ్కోలు చెప్పేశారు. అది జాతీయవాదంలో మత ఆలోచనలకు బీజాలు పడుతున్న కాలం. అలాగే అఖిల భారత ముస్లింలీగ్‌ కార్యదర్శి పదవికి కూడా వీడ్కోలు పలికారు. తరువాత కేంద్రంలో మంత్రిగా విద్యకు, విదేశాంగ విధానానికి కూడా తనదైన శైలిలో మేధో సంపన్నతను అద్దారు. రాయబారిగా, అంతర్జాతీయ న్యాయస్థానంలో అడ్‌హాక్‌ జడ్జిగా పనిచేశారు. అత్యవసర పరిస్థితిని నిర్భయంగా ఎదిరించి ఇందిరను విమర్శించారు. వీఆర్‌ కృష్ణయ్యర్, నాని ఎ పాల్కీవాలా, చాగ్లాల పేర్లు ప్రస్తావించకుండా అత్యవసర పరిస్థితి చరిత్ర పరిపూర్ణం కాదన్న ఖ్యాతి తెచ్చుకున్నారు. ఇంత అరుదైన తన ప్రయాణం మొత్తానికి అక్షర రూపం కూడా ఇచ్చారు. అదే– ‘రోజెస్‌ ఇన్‌ డిసెంబర్‌’. 

చాగ్లా జీవనయాత్రలో తొలి అడుగు ఒంటరితనంతో ఆరంభమైంది. ముంబై నగరంలో ఒక సంపన్న షియా వ్యాపార కుటుంబంలో పుట్టిన చాగ్లా ఐదో ఏటనే తల్లిని కోల్పోయారు. ఆ శూన్యాన్ని ఆయన భర్తీ చేసుకున్న తీరు ఆయన భావి జీవిత చిత్రాన్ని నిర్మించి పెట్టింది. ఆ శూన్యాన్ని చాగ్లా పుస్తక పఠనంతో పూరించుకున్నారు. ఆ వయసులోనే ‘లైఫ్‌ ఆఫ్‌ గ్లాడ్‌స్టన్‌’ అనే పుస్తకం చదివారు. గ్లాడ్‌స్టన్‌ 1892–94 మ«««ధ్య ఇంగ్లండ్‌ ప్రధాని. ఆ గ్లాడ్‌స్టన్‌ చదువుకున్న క్రైస్ట్‌ చర్చ్‌ కళాశాల (ఆక్స్‌ఫర్డ్‌)లోనే తాను కూడా చదవాలని గట్టిగా వాంఛించారు చాగ్లా. ‘న్యాయాన్ని ఆలస్యం చేయడమంటే, న్యాయాన్ని నిరాకరించడమే’నన్న ప్రఖ్యాత, సమున్నత వ్యాఖ్య ఆయనదే. కానీ క్రైస్ట్‌ చర్చ్‌ కళాశాలలో చేరాలన్న చాగ్లా కోరిక నెరవేరలేదు. ఆక్స్‌ఫర్డ్‌లోనే లింకన్‌ ఇన్‌ కళాశాలలో బారెట్లా కోసం చేరారు. చిత్రం ఏమిటంటే, బారిస్టర్‌ కావాలని ఒక దశలో భావించిన గ్లాడ్‌స్టన్‌ ఆ కళాశాలలోనే చేరారు. అలా చాగ్లా కోరిక పాక్షికంగా నెరవేరినట్టే.  చాగ్లా రాజకీయ జీవితానికి ఆక్స్‌ఫర్డ్‌ శ్రీకారం చుట్టింది. ఆక్స్‌ఫర్డ్‌ మజ్లిస్‌కు ఆయన అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. లైబ్రరీ క్లబ్‌ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. స్మరించుకోదగిన ఇంకో విషయం కూడా ఉంది. బొంబాయి హైకోర్టులో తను సహాయకునిగా పనిచేసిన జిన్నా కూడా బారెట్లా పూర్తి చేసినది లింకన్‌ ఇన్‌ కళాశాలలోనే. 

1922లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత మహమ్మదలీ జిన్నా దగ్గర సహాయకునిగా చాగ్లా చేరారు. అంటే బొంబాయి హైకోర్టులో ప్రవేశించారు. 1922 నాటికి భారత రాజకీయాలలో జిన్నా కీర్తి అక్షరాలా నడిమింటి సూర్యుడిని తలపిస్తున్నది. హిందూ–ముస్లిం ఐక్యతకు ఆయనను రాయబారిగా అంతా కీర్తిస్తున్న కాలం. అలాగే న్యాయవాదిగా కూడా ఆయన కీర్తి జ్వాజ్వల్యమానంగా వెలిగిపోతున్న కాలం. అఖిలభారత ముస్లిం లీగ్‌ అధ్యక్షునిగా, బొంబాయి బార్‌లో సభ్యునిగా క్షణం తీరికలేని వ్యక్తి జిన్నా. అయినా ఒక్కరినే తన సహాయకుడిగా జిన్నా చేర్చుకునేవారు. అప్పుడు ఆ అవకాశం చాగ్లాకు దక్కింది. ఏడేళ్లు జిన్నా దగ్గర పనిచేశారు. 

అప్పటికి ముస్లింలీగ్‌ పాక్‌ విభజన కోసం పనిచేస్తున్న సంస్థ కాదు. ముస్లింల హక్కుల కోసం గట్టిగా పోరాడుతున్నప్పటికీ దేశాన్ని విభజించాలన్న అజెండా లేదు. చాగ్లా కూడా ముస్లిం లీగ్‌లో సభ్యుడిగా, చాలా చురుకుగా పనిచేశారు. జిన్నా అధ్యక్షుడు. చాగ్లా కార్యదర్శి. అప్పుడే 1927లో చాగ్లాను బొంబాయిలోని గవర్నమెంట్‌ లా కళాశాలలో ఆచార్యునిగా నియమించారు. ఇదొక మలుపు.
1927లోనే వచ్చిన సైమన్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికకు జవాబుగా మరొక నివేదికను తయారు చేయవలసిందని, రాజ్యాంగ ముసాయిదాను తయారు చేయవలసిందని మోతీలాల్‌ నెహ్రూను జాతీయ కాంగ్రెస్‌ కోరింది. దీనినే నెహ్రూ నివేదిక అంటారు. ఇది పూర్తిగా లౌకిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన రాజ్యాంగ ముసాయిదా. కానీ దీనిని జిన్నా వ్యతిరేకిస్తూ 14 సూత్రాలతో కూడిన ఒక నివేదికను ఇచ్చారు. ముస్లింలకు లక్నో ఒప్పందం ఇచ్చిన హామీలను ఇది విస్మరించిందని జిన్నా ఆరోపించారు. నిజానికి మోతీలాల్‌ రాసినవి కూడా 14 సూత్రాలే. అంటే నెహ్రూ నివేదికను నిరాకరించడమే జిన్నా ఉద్దేశం. ముస్లింలకు ఆయన ప్రత్యేక హక్కులు కోరారు. ఈ ధోరణిని వ్యతిరేకిస్తూ అనేకమంది ముస్లింలు జిన్నాను విడిచి వెళ్లారు. అందులో చాగ్లా ఒకరు. అలా అని గాంధీజీ విధానాలను కూడా చాగ్లా పూర్తిగా సమర్థించలేదు. ఖిలాఫత్‌ ఉద్యమాన్నీ, గాంధీజీ ఆ ఉద్యమానికి మద్దతు ఇవ్వడాన్నీ జిన్నా తీవ్రంగా విమర్శించినవారే. ఇలాంటి ధోరణులు రాజకీయాలలోకి ప్రవేశిస్తే, అవి రాజకీయాలకు అనివార్యంగా ఉండవలసిన సెక్యులర్‌ లక్షణాన్ని ధ్వంసం చేస్తాయనీ, తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయనీ జిన్నా బాహాటంగానే చెప్పారు. కానీ జాతీయ కాంగ్రెస్‌లో  గాంధీజీ తిరుగులేని నాయకునిగా అవతరించాక జిన్నా ఆ సంస్థకు దూరమై, క్రమంగా పాకిస్తాన్‌ ఏర్పాటును సమర్థించే ప్రబల శక్తిగా మారిపోయారు. చాగ్లా కూడా కొంతదూరం గురువు జిన్నా బాటలోనే ప్రయాణించారు. అంటే ఖిలాఫత్‌ ఉద్యమాన్ని సమర్థించరాదనే వాదమే వినిపించారు. కానీ దేశ విభజనకు అంగీకరించలేదు.

ఈ పరిణామం అత్యంత అవాంఛనీయం, విషాదకరం అన్నారు. అదొక ఉత్పాతమని చాగ్లా అభిప్రాయం. ఇది పచ్చి నిజం. ‘ప్రపంచం నిద్రిస్తున్న వేళ, భారత్‌లో స్వాతంత్య్ర యుగోదయం అయింది....’ అంటూ ఆగస్ట్‌ 14, 1947 అర్ధరాత్రి ఎర్రకోట మీద నెహ్రూ ఉద్వేగంగా ప్రసంగిస్తున్న సమయంలో లాహోర్, పంజాబ్‌ల మధ్య మత కల్లోలాల ఫలితంగా దాదాపు ఇరవై వేల మంది చనిపోయారు. నేల నెత్తురుతో తడిసింది. విభజన విషయంలో గాంధీజీలో కనిపించే ద్వైదీభావాన్ని చాగ్లా సహించలేకపోయారు. జిన్నా పాకిస్తాన్‌ ఏర్పాటు వాదానికి బలం చేకూర్చుతున్న క్రమంలో చాగ్లా మరో జాతీయవాది ఎస్‌ఏ బ్రెల్వీతో కలసి ముస్లిం నేషనలిస్ట్‌ పార్టీని స్థాపించారు. పాకిస్తాన్‌ ఏర్పాటు వాదాన్ని ఖండించడమే ఈ పార్టీ ఆశయం. స్వతంత్ర భారతదేశంలో బొంబాయి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలన్నది చాగ్లా అభిమతం. కానీ ఆ సీటును నెహ్రూ వీకే కృష్ణమీనన్‌కు కేటాయించేశారు. పక్కనే ఉన్న ఔరంగాబాద్‌ స్థానం నుంచి పోటీ చేయవలసిందని కాంగ్రెస్‌ సూచించింది. ముస్లింలు అధికంగా ఉన్న ఆ నియోజకవర్గం ‘సేఫ్‌ సీట్‌’ అని కూడా చెప్పింది పార్టీ. కానీ చాగ్లా నిరాకరించారు. ఎందుకంటే ముస్లిం ఓట్లతో నెగ్గడం ఆయన అభిమతానికి విరుద్ధం.

న్యాయ కళాశాలలో ఆచార్యునిగా పదవి చేపట్టిన నాటి నుంచి రాజకీయాలను వదిలి పూర్తిగా న్యాయశాస్త్ర అధ్యయనం మీదనే చాగ్లా కాలం గడిపారు. 1941లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ప్రభుత్వం నియమించింది. 1948లో అదే కోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి ఒక దశాబ్దం పాటు ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఈ మధ్యలోనే 1957–59 సంవత్సరాలలో అంతర్జాతీయ న్యాయస్థానం (దిహేగ్‌)లో అడ్‌హాక్‌ జడ్జిగా పనిచేశారు. తరువాత జవహర్‌లాల్‌ నెహ్రూ ఆయనను అమెరికాలో భారత రాయబారిగా (1958–61) నియమించారు. ఆపై ఇంగ్లండ్‌లో భారత హైకమిషనర్‌గా కూడా (1962–63) పని చేశారు. మళ్లీ నెహ్రూయే చాగ్లాను వెనక్కి తీసుకువచ్చి తన మంత్రిమండలిలో విద్యా శాఖ మంత్రిగా నియమించుకున్నారు. మంత్రిగా విద్యా శాఖ ఎలాంటి ఫలితాలు సాధించాలని మీరు కోరుకుంటున్నారని ఒక సందర్భంలో విలేకరులు అడిగారు. ఆయన చెప్పిన సమాధానం ఇది: అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి ఒక హిందువును వైస్‌ చాన్స్‌లర్‌గా నియమించినా, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయానికి ఒక ముస్లింను వైస్‌ చాన్సలర్‌గా నియమించినా విద్యార్థులు విస్తుపోకుండా ఉండే విధంగా సంస్కారాన్ని పెంచుకొనేటట్టు వారిని తీర్చి దిద్దడమే నా కోరిక అన్నారాయన. అంటే జిన్నా మధ్యలో వదిలేసిన హిందూ ముస్లిం ఐక్యతను చాగ్లా ముందుకు తీసుకువెళ్లేందుకు ఆలోచించారు. చివరిగా ఇందిర మంత్రివర్గంలో 1966–67 లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసి రాజకీయాల నుంచి విరమించుకున్నారు. ఇదొక అధ్యాయం. 

కేంద్రమంత్రిగా పనిచేసిన తరువాత చాగ్లా మరోసారి నల్లకోటు ధరించి కోర్టులో వాదించడం మొదలుపెట్టారు.  న్యాయశాస్త్ర తాత్వికతను చాగ్లా అర్థం చేసుకున్న తీరు అందరికీ మార్గదర్శకంగా ఉంటుంది. అసలు న్యాయవాద వృత్తి అంటేనే మేధస్సును క్రమశిక్షణలో ఉంచేదంటారాయన. ప్రజల నైతిక విలువలను చట్టంతో నిలబెట్టడం సాధ్యం కాదని కూడా అన్నారు. న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థలు రెండూ ఎప్పుటికీ దూరం పాటించాలన్నదే ఆయనే అభిప్రాయం. ఇక్కడ ఒక సంగతి చెప్పుకోవాలి. ఉమ్మడి మహారాష్ట్రకు మొరార్జీదేశాయ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బొంబాయి హైకోర్టులో ఒక న్యాయమూర్తి పదవి ఖాళీ అయింది. దానికి మొరార్జీ ఒక అభ్యర్థిని సిఫారసు చేశారు. అందుకు చాగ్లా అంగీకరించలేదు. నిజానికి ఆ అభ్యర్థి ముస్లిం. అయినా మరింత మెరుగైన పరిజ్ఞానం ఉన్న మరొక అభ్యర్థిని  చాగ్లా ఆ పదవిలో నియమించారు. ఒక న్యాయమూర్తి నియామకం పూర్తిగా ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉండాలనే చాగ్లా నిశ్చితాభిప్రాయం కూడా. న్యాయమూర్తుల సంఖ్యను పెంచడంతోనే నాణ్యమైన న్యాయం అందుతుందనుకోవడం సరికాదంటారాయన. వాదోపవాదాలు ముగిసినా తీర్పులను రిజర్వు చేసుకునే సంస్కృతి మంచిది కాదన్నారు. దీనిని ఆచరణలో చూపించారు. ఒక్క తీర్పును కూడా రిజర్వు చేయని ఏకైక న్యాయమూర్తిగా చాగ్లాకు పేరుంది. ఆయన ఒకే రోజున పది నుంచి పన్నెండు తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. 

పైన చెప్పినట్టు చాగ్లా, కృష్ణయ్యర్, పాల్కీవాలాల పేర్లు చెప్పకుండా అత్యవసర పరిస్థితి (1975–77) చరిత్ర సమగ్రం కాబోదు. అత్యవసర పరిస్థితి విధింపుతో, ఫలితంగా న్యాయ వ్యవస్థకు తగిలిన గదాఘాతంతో చలించి పోయిన వారిలో చాగ్లా ఒకరు. ప్రభుత్వం గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడినా మరుక్షణం సంకెళ్లు పడుతున్న కాలమది. అలాంటి సమయంలో చాగ్లా అరుణ్‌ సాథే అనే స్నేహితుడి విన్నపం మేరకు ఇద్దరు విపక్ష నేతల కోసం బెంగళూరు వెళ్లి హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసి వాదించారు. ఆ ఇద్దరు– అటల్‌ బిహారీ వాజపేయి, లాల్‌ కిషన్‌ అడ్వాణి. భారతీయ జనసంఘ్‌ సభ్యులు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి కర్ణాటక శాసన సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి నియమించిన పార్లమెంటరీ సంఘం తరఫున ఆ ఇద్దరు అక్కడికి వెళ్లినప్పుడు అరెస్టయ్యారు. ఇది చాలు, ఎమర్జెన్సీలో ఎలాంటి అణచివేత సాగిందో తెలియడానికి! 14 మంది న్యాయమూర్తులను ఇష్టానుసారం బదిలీ చేశారు. వారంతా ప్రభుత్వ వ్యతిరేకులు కాదు. చట్టాన్ని చట్టంలా చూడమని చెప్పినవారు మాత్రమే. అలాంటి సమయంలోనే చాగ్లా బొంబాయి హైకోర్టు ప్రాంగణంలో సభ పెట్టి ఇందిరను, ఎమర్జెన్సీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎమర్జెన్సీ తొలగింది. ఇందిర ఓడిపోయింది. కాంగ్రెస్‌ అధికారం కోల్పోయింది. జనతా పార్టీ ప్రయోగం కూడా విఫలమైంది. ఆ శిథిలాల నుంచి పుట్టినదే బీజేపీ.  డిసెంబర్‌ 29, 1980న బొంబాయి నగరంలోనే సమతా నగర్‌లో (బాంద్రా రిక్లమేషన్‌) జనతా పార్టీ నుంచి విడవడిన పాత జనసంఘ్‌ సభ్యులు తొలి ప్లీనరీ ఏర్పాటు చేశారు. అర లక్ష మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సభలోనే బీజేపీ పేరును ప్రకటించారు. ఆ సభకు ముఖ్య అతిథి ఎంసీ చాగ్లా. ఈ భారత  విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి, అప్పుడే ఆ పదవిని నిర్వహించి వచ్చిన వాజపేయిని అద్భుతమైన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అని కొనియాడారు. అంతేకాదు, ‘నా పక్కన కూర్చున్న అటల్, భావి భారత ప్రధాని’ అని కూడా ప్రకటించారు. 1973లో చాగ్లా రాసుకున్న ఆత్మకథ ‘రోజెస్‌ ఇన్‌ డిసెంబర్‌’. భవన్స్‌ సంస్థ ఇప్పటికి 15 పర్యాయాలు ప్రచురించింది. ఆ గులాబీలు తాత్కాలిక అందాలకి ప్రతీక. శీతాకాలంతో వచ్చే డిసెంబర్‌ వాటిని వాడిపోయేటట్టు చేస్తుంది. గులాబీలు ఆయన జ్ఞాపకాలు. వాటిని వాడిపోయేటట్టు చేసేది డిసెంబర్, అంటే కాలం. కానీ ఆ పరిమళం ఎప్పటికీ ప్రజాస్వామ్య ప్రియుల మనసులో గుబాళిస్తూనే ఉంటుంది.  
∙డా. గోపరాజు నారాయణరావు 

Advertisement
Advertisement