నారదుడి గర్వభంగం | Sakshi
Sakshi News home page

నారదుడి గర్వభంగం

Published Sun, May 1 2016 12:38 AM

నారదుడి గర్వభంగం

పురానీతి
బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహర్షి నిరంతరం హరినామ సంకీర్తనం చేస్తూ త్రిలోక సంచారం చేసేవాడు. విష్ణుభక్తుల్లో అగ్రగణ్యుడిగా ముల్లోకాల్లో అందరూ ఆయనను గౌరవించేవారు. దాంతో లోకంలో తనను మించిన విష్ణుభక్తుడు ఎవరూ లేరనే గర్వం మొదలైంది నారదుడిలో. అయితే, ఆ మాటను సాక్షాత్తూ విష్ణువు నోటనే చెప్పించాలనుకున్నాడు నారదుడు. అనుకున్నదే తడవుగా వైకుంఠానికి వెళ్లాడు. శేషతల్పంపై విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును దర్శించుకుని, యథాప్రకారం హరినామ సంకీర్తనం ప్రారంభించాడు. మహావిష్ణువు మహదానందంగా నారదుడి సంకీర్తనను అరమోడ్పు కన్నులతో పరవశుడై ఆస్వాదించాడు. సంకీర్తనానంతరం నారదుడిని కుశల ప్రశ్నలు వేశాడు.
 
కుశల ప్రశ్నలు పూర్తయ్యాక నారదుడు తన మనసులోని మాటను బయటపెట్టాడు. ‘దేవా! నాదో చిన్న సందేహం. మీరే దానిని తీర్చాలి’ అంటూ వినయంగా అర్థించాడు. ‘ఏమా సందేహం? సంకోచించకుండా అడుగు’ అన్నాడు విష్ణువు చిరునవ్వులు చిందిస్తూ.  ‘ముల్లోకాల్లో మిమ్మల్ని కొలిచే భక్తులలో ఎవరు అగ్రగణ్యులో మీ నోటనే తెలుసుకోవాలని అనుకుంటున్నాను దేవా!’ అన్నాడు నారదుడు.
 
‘ఇదేమంత పెద్ద సందేహం... అదిగో! భూలోకంలో అటు చూడు... అక్కడ కనిపిస్తున్న పొలంలో పని చేసుకుంటున్నాడో రైతు..’ అన్నాడు.
 ‘చూశాను ప్రభూ!’ అన్నాడు నారదుడు. ‘అందరి కంటే అతడే నా భక్తుల్లో అగ్రగణ్యుడు’ అన్నాడు విష్ణువు. హతాశుడయ్యాడు నారదుడు. తన పేరే చెబుతాడనుకుంటే, ఎక్కడో మారుమూల గ్రామంలో పొలాన్ని సాగుచేసుకునే రైతు... రోజుకు నాలుగైదుసార్లు కంటే నారాయణుడిని తలచుకోని సామాన్యుడు.. తన భక్తుల్లో అగ్రగణ్యుడని చెప్పడానికి మహావిష్ణువుకు మనసెలా వచ్చిందని మథనపడసాగాడు.
 
నారదుడి అంతర్మథనాన్ని గ్రహించిన విష్ణువు... ‘నారదా! నువ్వే అతడి వద్దకు వెళ్లు. అతడి భక్తి ఏపాటిదో నీకే తెలుస్తుంది’ అన్నాడు.
 ఇదేదో తేల్చుకోవాలనుకున్నాడు నారదుడు. ‘సరే’ అంటూ భూలోకానికి వెళ్లాడు. నేరుగా ఆ రైతు ముందు ప్రత్యక్షమయ్యాడు. తన ఎదుట సాక్షాత్తూ నారద మహర్షి ప్రత్యక్షమవడంతో ఆ రైతు పరమానందభరితుడయ్యాడు.
 ‘అయ్యా! మహా విష్ణువు ఎలా ఉన్నారు? వైకుంఠంలో ఆయన క్షేమమేనా..? అభాగ్యుడిని, ఎప్పుడో తప్ప ఆయనను తలచుకునే తీరికే ఉండదు నాకు. మీ దర్శనంతో సాక్షాత్తూ విష్ణువునే చూసినంత ఆనందం కలుగుతోంది’ అంటూ నారదుడికి అతిథి మర్యాదలు చేశాడు.
 
నారదుడు తిరిగి బయలుదేరే ముందు... ‘అయ్యా! చిన్న కోరిక’ అన్నాడు ఆ రైతు. ఏంటో చెప్పమన్నట్లుగా చూశాడు నారదుడు. ఒక కుండలో పాలు తెచ్చి ఇచ్చాడు రైతు. ‘అయ్యా! నా కానుకగా ఈ పాలకుండను వైకుంఠానికి తీసుకువెళ్లి విష్ణుదేవులకు నివేదించండి’ అన్నాడు.  ‘అదెంత పని’ అంటూ నారదుడు పాలకుండ తీసుకుని వైకుంఠానికి బయలుదేరాడు. అయితే, పాలెక్కడ తొణికిపోతాయోననే భయంతో జాగ్రత్తగా కుండను పొదివి పట్టుకున్నాడు. మొత్తానికి ఎలాగోలా వైకుంఠానికి చేరుకుని విష్ణువును దర్శించుకున్నాడు. రైతు ఇచ్చిన పాలకుండను అందించాడు.
     
‘దేవా! ఆ రైతుకు ఎప్పుడో తప్ప నిన్ను తలచుకునే తీరిక ఉండదట. రోజుకు ఏ నాలుగైదుసార్లో తలచుకుంటాడట’ అన్నాడు ఫిర్యాదు చేస్తున్నట్లుగా. ‘ఈ పాలకుండను తెస్తున్నప్పుడు నువ్వు నన్ను ఎన్నిసార్లు తలచుకున్నావు?’... ప్రశ్నించాడు విష్ణువు. ‘ఒక్కసారి కూడా తలచుకోలేదు. నా దృష్టి మొత్తం పాలకుండపైనే ఉంది. పాలెక్కడ తొణికిపోతాయోననే ఆందోళనే నా మనసంతా నిండిపోయింది’ అని తలదించుకుని బదులిచ్చాడు నారదుడు.
 
‘రోజంతా శ్రమిస్తూ ఉన్నప్పటికీ నన్ను మరచిపోకుండా రోజుకు కనీసం నాలుగైదుసార్లు అయినా తలచుకుంటున్నాడు కదా ఆ రైతు?’ అన్నాడు విష్ణువు. ఆ మాటలతో నారదుడి గర్వం నశించింది. ఆ రైతు తనకంటే ఎందుకు గొప్ప భక్తుడో అర్థమైంది.

నీతి: ఎంతటి వాడికైనా గర్వం తగదు. గర్వంతో ప్రవర్తిస్తే భంగపడటమూ తప్పదు.

Advertisement
Advertisement