ఎర్రబొట్టమ్మాయి | Sakshi
Sakshi News home page

ఎర్రబొట్టమ్మాయి

Published Sun, Dec 24 2017 12:40 AM

new village story from funday - Sakshi

పెద్ద మలుపుంటాది. పెద్దమలుపంటే చాలా పెద్దది. ఆ రోడ్డుపై వెళ్లే వాహనం ఏదైనా ఆ మలుపు దగ్గరికి వచ్చేసరికి చాలా వరకు స్పీడు తగ్గించాల్సిందే. ఆ మలుపు దగ్గర నుంచి.. అంటే కచ్చితంగా ఆ మలుపు దగ్గర నుంచే..  సక్కగా ఒక నూరడగులు వేస్తే అదే మా ఊరు. మా ఊరు మధ్యలో ఒక ఒంక ఉంటాది. ఒంకకు అటువైపూ ఇటు వైపూ ఇళ్లుంటాయి. సుమారైన ఏ ఊరికైనా కనీసం నాలుగైదు వీధులైనా ఉంటాయి. మా ఊళ్లో మాత్రం వీధుల్లేవు. ఒంకకు పై వైపు కొన్ని ఇళ్లు, కింది వైపు కొన్ని ఇళ్లు ఉంటాయి. కింది వైపు ఉండే ఇళ్లలోనే ఉంటాది ఎర్రబొట్టమ్మాయి. ఎర్రబొట్టమ్మాయని ఎవరు పేరుపెట్టారో తెలీదు కానీ.. పెళ్లీడొచ్చినా ఆ పేరుతోనే అందరూ పిలుస్తుంటారు. పెద్ద కళ్లుంటాయి. పెద్దకళ్లంటే చాలా పెద్దవి. అరచేయంతుండాయని ఆడోళ్లంతా ఎర్రబొట్టమ్మాయిని ఆటపట్టిస్తుంటారు వాళ్ల ఇళ్లలో పని చేసేటప్పుడు. రెండు కళ్ల మధ్య ఉన్న అరిటాకంత విశాలమైన నుదురుపై పెద్ద బొట్టుపెట్టుకుంటాది. పెద్దబొట్టంటే భారతదేశం బొమ్మున్న అర్ధరూపాయి బిళ్లంత పెద్ద ఎర్రబొట్టు పెట్టుకుంటాది. తూరుపుసంధ్యల సూరీడి రంగు కూడా దిగదుడుపే. జడపొడూగ్గా ఉంటాది. పొడుగంటే చాలా పొడుగు. ‘నాటు పొట్లకాయంత పొడవుంటాదే’ అని జడపట్టుకొని లాగుతుంటారు ఎర్రబొట్టమ్మాయి సాటి ఆడపిల్లకాయలంతా. పసుపు, ఎరుపు వర్ణంతో ఎంతో అందంగా ఉంటాది. బలంగా ఉంటాది. బలంగా అంటే చాలా బలంగా ఉంటాది. 50 కేజీల బియ్యం సంచిని కూడా ఒక్క ఊదూటన  ఎత్తి అవతల పడేస్తాంటే మగోళ్లంతా కళ్లప్పగించి చూస్తుంటారు. 

నేను ఊళ్లో స్కూల్లో ఐదో తరగతి తరువాత సదివిన సదువంతా అనంతపురంలోనే. మా ఊరోళ్లంతా అక్కడే సదువుకుంటుండారు. ఊళ్లో సదువుకునేటప్పుడు ఎర్రబొట్టమ్మాయి, నేను ఒకే క్లాసు. అక్కడే పరిచయం. ఒక్కతే వచ్చేది. లేటుగా వచ్చేది. కొంచెం లేటుగా వచ్చినా శంకరయ్య అయ్యవారు ఏమీ అనేటోడు కాదు ఎర్రబొట్టమ్మాయిని. అదే ఒకసారడిగా అయ్యవారిని. జుట్టుపట్టుకొని, ఒంగోబెట్టి, ఈతబర్రతో రెండు సార్లు కొట్టాడు ఈపుపై.. నీకెందుకురా అని. స్కూల్లో ఎర్రబొట్టమ్మాయి వెనకాల కూర్చునేటోన్ని. అప్పుడు ఇప్పుడున్నంత పొడుగ్గా జడలేదు. అయినా జడపట్టుకు లాగేటోన్ని. మా శంకరయ్య అయ్యవారు నాకు తొడపాశం పెట్టేటోడు. ఒక్కోసారి వెనక లైన్లో కూర్చోబెట్టేటోడు. ఆయన ఒక్కాకు మూయాలని బయటికి వెళ్తానే మళ్లీ ఎర్రబొట్టమ్మాయి వెనకే కూర్చునేటోన్ని. ఇంగిట్ట కాదని అయ్యవారు సీటు పక్కనే కూర్చోబెట్టుకునేటోడు. అప్పుడు నేను అయ్యవారు తరువాత అయ్యవారు అంతగా ఫీలయ్యేవాడ్ని. బడి అయిపోతానే.. నేను, ఎర్రబొట్టమ్మాయి, మా ఇద్దరికంటే బాగా చదివే వినాయకం, కిష్కిందుడు, బోడి లక్ష్మీ కలిసి ఒంకలో చేపలు పట్టేందుకు వెళ్లేవాళ్లం. నేను, ఎర్రబొట్టమ్మాయే ఎక్కువ చేపలు పట్టేటోళ్లం. నేనైతే చేపలు తినను కానీ ఎర్రబొట్టమ్మాయి తీసుకెళ్లేది. ఇంట్లో ఏం చేస్తుందో తెలీదు. నేనెప్పుడూ అడగలేదు. ఐదో తరగతి తరువాత బోడి లక్ష్మీ వాళ్లు ఊరొదిలి వెళ్లిపోయారు. కిష్కిందుడు మా మామోళ్ల ఎనుములు మేపడానికి, వినాయకం గుళ్లో పూజారిగా అయిపోయినారు. ఎర్రబొట్టమ్మాయేమో మా ఇంట్లో పని చేయడానికి వచ్చేది. వాళ్లకంటే బాగా చదవని నేనేమో అనంతపురం పోయినా. సెలవుల్లో మాత్రమే ఇంటికి వస్తుంటా. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. ఊరికొచ్చినా జాతరకు. జాతరంటే గంగమ్మ జాతర. పుణ్యం పక్కనే  పాపం. మందుటాది. విందుటాంది. మా ఊళ్లో జరిగినట్టు జిల్లాలో ఎక్కడా జరగదు. ఒక కిలోమీటరు పొడుగూతా మనుషులే. కనీసమంటే 2వేల జీవాల తలలు తెగుతాయ్‌. జాతర జరిగిన మూడు రోజులూ.. మా ఊళ్లోని ప్రతి ఇంట్లో కనీసం 30 మందైనా బంధువులుండాల్సిందే, ఎర్రబొట్టమ్మాయింట్లో తప్పితే. ఈ జాతరకే కర్రెక్క కూడా వచ్చింది బొంబాయి నుంచి సంకలో మనవుడిని ఎత్తుకొని. కర్రెక్క గంజి కరువొచ్చినప్పుడు ఊరిడిచి బొంబాయికి పోయింది.. కూతురు, కోడలుతో. కర్రెక్క మొగుడు ఎప్పుడో రామారావు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చనిపోయాడని అప్పుడప్పుడు గుర్తు చేసుకూంటూ ఉంటుంది. కూతురుకి పెళ్లి చేసింది. అల్లుడు పెళ్లైన రెండో సంవత్సరమే కరెంటు పట్టుకొని చనిపోయాడు. కొడుకు కరువు కాలంలో పని దొరక్క ఇళ్లొదికలి ఎల్లిపోయాడు. అనంతపురం, బెంగళూరు, పులివెందుల, పొద్దుటూరులలో వెదికినా కనపడలే.  

ఎర్రబొట్టమ్మాయికి మూడేళ్లున్నపుడే వాళ్ల అమ్మానాన్న మా తోటలో పని చేస్తుండగా పిడుగుపడి చనిపోయారంట. ఇది నాకు ఇంటర్‌ కాలేజీ చేరేటప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ఎర్రబొట్టమ్మాయి ఒంటరిగానే ఉంటోంది ఒంక కింద గుడిసెల్లో. ఊళ్లో సదువు అయిపోతానే మా ఇంటికి, మా మామోళ్ల ఇంటికి పనికొచ్చేది. ఎండ మా ఇంటి గుమ్మం తొక్కక ముందే వచ్చేది. ఇంట్లో బోకులు తోమేది. కొట్టంలో పేడ కసువు ఎత్తేది. పాలు పితికేది. ఎంతిచ్చేవారో తెలీదుకానీ.. రెండు పాడి ఎనుములను కొనిచ్చాడు మానాన్న.. ఎర్రబొట్టమ్మాయికి, ఇంట్లో ఐదేళ్లు పనిచేసినందుకు ఇవ్వాల్సిన లెక్కతో. ‘‘ఎర్రబొట్టూ.. నువ్వు ఇంకా నాకు ఐదేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎల్లినప్పుడు ఇవ్వు’’ అని నాన్న అంటే..‘‘ఇన్నాళ్లు నమ్మకంగా పని చేసిందిగా ఏమొద్దులే’’ అంది అమ్మ.అప్పటి నుంచి ఆ ఎనుములే ఎర్రబొట్టుకు జీవనాధారం. ‘‘నెలకు ఎంతలేదన్నా  ఐదువేలు సంపాదిత్తున్నా రెడ్డీ’’ అందొకసారి మురిపెంగా. ‘‘పోన్లెమ్మే నువ్వన్నా సంపాదిత్తున్నావ్‌! నేను ఇంకా తింటూనే ఉండా’’ అంటే..‘‘నీకేంబా చేనుండాది. మడి ఉండాది. ఎలాగైనా బతికేత్తావ్‌.’’ అనేది.‘‘ఐదేలు సంపాదిత్తున్నా మీ మామకాడ మా నాన్న తీసుకున్న అప్పు తీరడమే లేదే.. అవేం లెక్కలో.. నాకిప్పటికీ అర్థం కాలే.. అడుగుదాం అంటే ఇంతెత్తుఎగురుతాడు.. ఏం చేద్దాం. నాబతుకింతే’’ అంటూ బాధపడింది ఉగాది పండుగరోజు. ‘‘తీరుతాదిలే ఎర్రబొట్టూ’’ అంటుండగానే.. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నట్టు.. ఠక్కున‘‘ఊళ్లో మొగోళ్లతో చాలా కష్టంగా ఉండాది. ఒంటి దాన్ని వావి వరస.. ముసలోడు ముతకోడు అనే తేడా లేకుండా పరాచకాలుడుతుండారు.. వాళ్లందరికీ చెల్లెళ్లు, కూతుళ్లుండారు కదా.. కులం తక్కువదాన్ని.. ఒంటిదాన్ని  అని కూడా చూడకుండా.. ఒకడు చెయ్యి పట్టుకుంటాడు.. ఒకడు జడలాగుతాడు.. ఇంకొకడు నడుంమీద చెయ్యేస్తాడు.. నిన్నల్యాకమొన్న మీ ఇంటెనకల ఉండే ముసలి నారాయణ ఏమే ఎర్రబొట్టూ సినిమాకొత్తావానైట్‌షోకి అంటూ పిలిసినాడు’’ అంటూ ఏడవడం మొదలు పెట్టింది.ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ‘‘సరేలే ఎర్రబొట్టు నాన్నకు చెబుతాలే’’ అని  అక్కడి నుంచి తప్పించుకొచ్చా. 

పులివెందులకు వెళ్లాలని మలపుదగ్గరికి పోయినా బస్సు ఎక్కేకి. బస్టాప్‌ దగ్గర పెద్దగా ఎవరూ లేకపోవడంతో నిశబ్ధంగా ఉంది. చిన్న గాలికి కూడా తాటి చెట్లు ఊగుతున్నాయి. ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. పక్కనే ఉన్న పూలతోట నుంచి వాసన ముక్కులను తాకుతోంది. ఎర్రబొట్టమ్మాయి ఎంత సేపటికింద వచ్చిందో కానీ మలపు దగ్గర ఉండే కానుగ చెట్టుకింద ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. కళ్లు ఎర్రగా ఉన్నాయి.. కొన్ని రోజుల నుంచి నిద్రలేనట్టుగా. కళ్లకింద చారలు కాటుకపెట్టినట్టు నల్లగా. కళ్ల నీళ్లు ధారగా. ఉదయం కావడంతో ఎర్రని కిరణాలు ఆమె ముఖంపై పడుతున్నాయి. ఉదయపు గాలికి ఎర్రబొట్టమ్మాయి ముంగురులు కదులుతున్నాయి. వాటిని చెవుల మీదికి సర్దుకుంటోంది. గాలికి మళ్లీ మళ్లీ కంటికి అడ్డం పడుతున్నాయి. కొన్నిసార్లు సర్దుకున్న తరువాత.. ముంగురలతో సంబంధం లేనట్లు వదిలేసింది. అప్పుడే పులివెందుల నుంచి ధర్మవరం వెళ్లే బస్సు మలపు దగ్గర నల్లని పొగవదులుతూ నిలబడింది. ఆ పొగ ఎర్రబొట్టమ్మాయిని కనిపించకుండా చేసింది కొన్ని క్షణాలు. కనీసం పొగకైనా కదలలేదు. దగ్గలేదు. ఎర్రబొట్టమ్మాయిని ఎప్పుడూ అలా చూడలేదు. వెనక నుంచి కర్రెక్క అవ్వ పిలుస్తూనే ఉంది పలకలేదు. కర్రెక్క అవ్వ ఎర్రబొట్టమ్మాయి దగ్గరకెళ్లింది. పిలిచినా శిలవలే నిటారుగా కూర్చొని ఉంది. రెండు చేతులు ఎర్రబొట్టమ్మాయి భుజాలపై వేసి గట్టిగా ఊపింది కర్రెక్క. తలపైకెత్తి చూసింది. కళ్ల నిండా ఎరుపు. రెప్పల అంచుల్లో నీళ్లు. ‘‘ఏందే ఎర్రబొట్టూ.. ఇలా ఏడుత్తాండవ్‌.. కష్టం మనిషికి కాక చెట్టుకు వత్తాదా? ఎప్పుడో తప్పు చేసినాం.. ఈడ పుట్టినాం.. ఎన్ని బిందెలు తోడితే ఏరు ఎండుతుంది? ఎంత ఏడ్చితే కాగు నిండుతాది’’ ఓదార్చుతోంది కర్రెక్క.

‘‘ఇట్టాంటి పనులు నేను చేయలేనే’’ అంటూ కర్రెక్క చేతులను విసిరికొడుతోంది ఎర్రబొట్టు.‘‘ఈ భూమిలో బాగుపడిన వాళ్లు పది మందైతే.. బాధలు పడుతున్న వాళ్లు పదివేల మంది. వాళ్లతో పాటే మనమూ.. మన జీవితాలు.. రాతలింతే’’ అని దగ్గరికి తీసుకుంది ఎర్రబొట్టమ్మాయిని. ‘‘నేను రానే కర్రెక్కా.. ఈన్నే ఉంటా.. ఎలాగైనా అప్పు తీర్చేత్తా’’ అని బతిమలాడుతోంది.‘‘రాకుంటే.. ఎట్టా తీరుతాదే అప్పు.. అమ్మనా అయ్యనా.. పాలమ్మి.. పెరుగమ్మి ఎంతని తీరుత్తావు.. నాతోపాటు వత్తే రెండేళ్లలో అప్పంతా తీర్చి.. లచ్చలు.. లచ్చలు సంపాదిత్తావు..’’ అని ఎడమ చేయి పైకిఊపుతూ నమ్మబలుతుకుతోంది కర్రెక్క.‘‘రాముడుండాడు.. రాజ్యముండాది.. లోను కావాలని గవర్నమెంటోళ్లకు అర్జీ ఇచ్చినా రేపో మాపో ఇత్తారు’’ అంటూ గట్టిగా ఏడుస్తోంది ఎర్రబొట్టు. ‘‘అవన్నీ జరిగే పనులు కాదు ఎర్రబొట్టూ. దేవుడు మనలాంటోళ్లకు కాదు.. లెక్కలున్నోళ్లకే! గవర్నమెంటోళ్లు ఇంగ సహాయం చేసినట్టే. అనుభవంతో చెబుతున్నా విను’’ అని ఎర్రబొట్టును కర్రెక్క ఒళ్లోకి తీసుకుంది. సముదాయిస్తోంది. కళ్లనీళ్లు తుడుస్తోంది. కర్రెక్క కౌగిట్లో ఒదిగిపోయింది ఎర్రబొట్టు. ఎవర్నో పురమాయించి ఓటల్‌ నుంచి ఇడ్లీ తెప్పించి ఎర్రబొట్టమ్మాయికి తినిపిస్తోంది కర్రెక్క. అప్పుడే పులివెందుల వైపు వెళ్లే బస్సు మలపు దగ్గరికి వచ్చి ఆగింది దట్టమైన పొదగ వదలులకుంటూ. ఆ పొగ వారిద్దరినీ కనిపించకుండా చేసింది. పొగ తెరలు తొలగిపోయే సరికి దూరంగా కనిపిస్తోంది ఎర్రబొట్టు.. కర్రెక్కతో.
- భరత్‌ రెడ్డి 

Advertisement

తప్పక చదవండి

Advertisement