'సాంగ్‌'రే బంగారు రాజా | Sakshi
Sakshi News home page

'సాంగ్‌'రే బంగారు రాజా

Published Sun, Jun 19 2016 12:31 AM

'సాంగ్‌'రే బంగారు రాజా

ఘంటసాల పాట ఫైనల్ టేక్ ముందు చుట్ట కాల్చేవారట.
 
మధువొలకబోసే నీ చిలిపికళ్లు
అవి నాకు వేసే బంగారు సంకెళ్లు...
అడగకనే ఇచ్చినచో అది మనసుకందము...

 
వి.రామకృష్ణ అంటే సూపర్‌స్టార్. ఘంటసాల తర్వాత అక్కినేని, కృష్ణంరాజు, శోభన్‌బాబు... వీళ్లందరూ వి.రామకృష్ణనే కోరుకున్నారు. వి.రామకృష్ణ ‘శారద నను చేరదా’... వంటి సూపర్‌హిట్స్ పాడుతున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

హిందీలో సూపర్‌హిట్ అయిన ‘ఆరాధన’ తెలుగులో ‘కన్నవారి కలలు’గా రీమేక్ అయ్యింది. అతి కొద్ది సినిమాలు చేసినా గొప్ప పాటలు చేసిన వి.కుమార్ మ్యూజిక్ ఇచ్చాడు. కన్నవారి కలలులో ప్రతి పాట హిట్. ‘ఒకనాటి మాట కాదు... ఒకనాడు తీరిపోదు’... ‘మధువొలకబోసే నీ చిలిపికళ్లు’.... అన్నీ వి.రామకృష్ణ, సుశీల గొంతుల్లో మెరిశాయి.చిత్రం: కన్నవారి కలలు (1974)
సంగీతం: వి.కుమార్
గానం: వి.రామకృష్ణ, సుశీల
రచన: రాజశ్రీ

 
శివ శివ శంకర భక్తవ శంకర
శంభో హరహర నమో నమో....
పుణ్యం పాపం ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు/ ఏ లీల చేయాలి నీ సేవకు...

 
శంకరుణ్ణి స్తుతిస్తూ తెలుగు సినిమాల్లో చాలా పాటలు ఉన్నాయి. కాని భక్త కన్నప్పలో ఈ పాట మాత్రం శివాలయాల్లో మోగే గౌరవాన్ని పొందింది. ఇందులో ఒక గిరిజన భక్తుని ఆమాయకత్వం, సమర్పణ, పరమాత్ముని పట్ల భయభక్తులు కాకుండా అనురాగం కనిపించడమే కారణం.  ‘పున్నెము పాపము తెలియని నేను... పూజలు సేవలు తెలియని నేను’... అంటాడు భక్తుడు.

‘గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు’... అనడంలో ఆ దగ్గరితనం చాలా బాగుంటుంది. నటించిన కృష్ణంరాజుకు, తీసిన బాపుకు, పాడిన రామకృష్ణకు, చేసిన సత్యంకు, రాసిన వేటూరికి మారేడు దళాల మాల వేయదగ్గ పాట ఇది.
 
చిత్రం: భక్త కన్నప్ప (1976)
సంగీతం: సత్యం
రచన: వేటూరి; గానం: వి.రామకృష్ణ

Advertisement
Advertisement