ఆపరేషన్ స్కూల్ చలో! | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ స్కూల్ చలో!

Published Sat, Nov 19 2016 11:05 PM

ఆపరేషన్ స్కూల్ చలో! - Sakshi

ఆదర్శం

రెండు నెలలు... వెనక్కి వెళదాం. ఉద్రిక్తత, హింసాత్మక ఘటనలతో కాశ్మీరు అట్టుడికిపోతోంది. రోడ్లు బ్లాకై పోయాయి. బడులు బందైపోయాయి. నేషనల్ హైవేలో రాళ్లు, పెట్రోలుబాంబులు భయపెడుతున్నాయి. ‘యాపిల్ సీజన్’ తెల్లముఖం వేసింది. ఇల్లు విడిచి బయటికి రావడమే ఒక సాహసకృత్యంగా మారింది.  ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ‘కామ్‌డౌన్’ ఆపరేషన్ చేపట్టింది. లోయలో ఒకవైపు సాధారణ పరిస్థితి నెలకొల్పడానికి ప్రయత్నిస్తూనే, మరోవైపు స్థానికులలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, పిల్లల్లో భయాన్ని పోగొట్టడానికి ‘ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ’లో భాగంగా... వారితో సన్నిహితంగా కలిసిపోయేవారు సైనికులు. ఇక్కడితో మాత్రమే ఆగిపోలేదు. పిల్లల చదువులు దెబ్బతినకుండా ‘స్కూల్ చలో’ ఆపరేషన్ చేపట్టింది సైన్యం.

ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల గురించి బెంగపడడం స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే... ఆందోళనకారులు ఎన్నో స్కూళ్లను ధ్వంసం చేశారు, కొన్ని నెలల నుంచి స్కూళ్లన్నీ మూతబడ్డాయి. పిల్లలు చదువు మరిచిపోయే పరిస్థితి ఏర్పడింది.‘‘ఫలానా స్కూలు దగ్ధం చేశారు... లాంటి వార్తలు విన్నప్పుడల్లా నా గుండె కాలిపోయినట్లు అనిపించేది. ఇది మంచి పద్ధతి కాదు. సమాజానికి మంచిది కాదు. విద్య లేని సమాజానికి జీవం ఉండదు’’ అని ఆవేదన చెందాడు ముజఫర్ అనే ఉపాధ్యాయుడు. ఆయనలాగే ఎంతో మంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కన్నీరు కార్చారు. దూరమైన చదువును పిల్లలకు చేరువ చేయడానికి  ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచించారు మేజర్ జనరల్ అశోక్ నరుల. ఈ ఆలోచన నుంచి పుట్టిందే ‘స్కూల్ చలో’ ఆపరేషన్.

‘‘నేను కేవలం ఆర్మీ ఆఫీసర్‌గా ఆలోచించడం లేదు. ఇద్దరు పిల్లల తండ్రిగా ఆలోచిస్తున్నాను. పిల్లలు చదువుకు దూరమైతే ఒక తండ్రిగా నేను ఎంత బాధపడతానో అలాంటి బాధను చాలామంది తల్లిదండ్రులలో చూశాను. ఆ బాధను పోగొట్టి... పిల్లలను బడికి చేరువచేయడమే మా స్కూల్ చలో ఆపరేషన్ ఉద్దేశం’’ అంటున్నారు మేజర్ జనరల్ అశోక్.

అనుకోవడం వేరు అనుకున్నదాన్ని ఆచరణలోకి తీసుకురావడం వేరు. అందుకు ఓపికి కావాలి. పట్టుదల కావాలి. అవి సైనికులలో ఉండడం వల్లే ‘స్కూల్ చలో’ బండి పట్టాల మీదికి వెళ్లింది. అయితే మొదట అది అంత సజావుగా ఏమీ సాగలేదు.‘‘మీ పిల్లలను స్కూలుకు పంపించండి’’ అంటూ సైనికులు గడప గడపకు వెళ్లారు.‘‘పెద్దవాళ్లే బయటికి వెళ్లడానికి జంకుతున్నారు. పిల్లల్ని ఎలా పంపిస్తాం? చదువు కంటే వాళ్ల  క్షేమం మాకు ముఖ్యం’’ అనే తల్లిదండ్రులే ఎక్కువగా కనిపించారు. అలాంటి వాళ్లతో అనేకరకాలుగా మాట్లాడి, వాళ్లలో ధైర్యం నింపి, పిల్లలకు చదువు అనేది ఎంత ముఖ్యమో సూక్ష్మంగా అవగాహన పరిచి ‘స్కూలు చలో’ ఊపందుకోవడానికి  ఓపిగ్గా కృషి చేశారు. మొదట్లో... స్కూళ్లలో పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు సైతం వెనకడుగు వేసేవారు. ‘ఎందుకొచ్చిన సమస్య!’ అన్నట్లుగానే ఉండేది వారి వైఖరి. అలాంటి వాళ్లలో కూడా తమ మాటలతో మార్పు తేవడమే కాదు... వారే స్వయంగా పిల్లలను సమీకరించి స్కూల్‌కు తీసుకువెళ్లేలా చేశారు.

‘మాకు డబ్బు వద్దు. కీర్తి వద్దు. పుస్తకాలు  కావాలి. బడి కావాలి’ అని పిల్లల నోటి నుంచి వినిపించే నినాదాలు తమ పిల్లలను స్కూలుకు పంపడానికి ఇష్టపడని తల్లిదండ్రులను కూడా ప్రభావితం చేసి స్కూలుకు పంపేలా చేస్తున్నాయి. పిల్లలకు చదువు చెప్పించడమే కాదు ఆటపాటలు, వ్యక్తిత్వవికాసం... తదితర విషయాలలో శిక్షణ ఇప్పిస్తుంది ఆర్మీ. ‘నవజవాన్’ అనే క్లబ్ ఏర్పాటు చేసింది. ఈ క్లబ్‌లో పిల్లలు, పెద్దలు ఆటల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. కొత్త మెలకువలు, ఆటలను నేర్చుకుంటారు. ‘జైజవాన్, జై కిసాన్’ అని పిల్లలు పాఠాల్లో చదువుకుంటారు. తాము జై కొట్టే జవాన్ తమ దగ్గరికి వచ్చాడు.‘నేనున్నాను’ అంటూ కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాడు. విజ్ఞాన లోక ద్వారాలు తెరిచాడు. జై జవాన్!

Advertisement
Advertisement