కృష్ణాతీరంలో పుణ్యక్షేత్రాలు | Sakshi
Sakshi News home page

కృష్ణాతీరంలో పుణ్యక్షేత్రాలు

Published Sun, Aug 7 2016 11:26 AM

కృష్ణాతీరంలో పుణ్యక్షేత్రాలు

మన దేశంలో నదీతీరాలలో పుణ్యక్షేత్రాలకు కొదువ లేదు. అన్ని నదుల మాదిరిగానే కృష్ణాతీరంలోనూ అనేక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టిన కృష్ణానది తీరం పొడవునా పలు ప్రాచీన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో తెలుగునేలలో సుప్రసిద్ధి పొందిన కొన్ని పుణ్యక్షేత్రాల గురించి కృష్ణా పుష్కరాల సందర్భంగా...
 
బెజవాడ కనకదుర్గమ్మ
కృష్ణాజిల్లా నడిబొడ్డున విజయవాడ నగరంలో కృష్ణానదీ తీరంలో కొలువుతీరి ఉంది కనకదుర్గ దేవాలయం. దక్షిణాదిన ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో బెజవాడ కనకదుర్గ ఆలయం ఒకటి. కనకదుర్గమ్మ ఇక్కడి ఆలయంలో స్వయంభువుగా వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. కీలుడనే యక్షుడు ఇక్కడ తపస్సు చేశాడట.

అమ్మవారిని తన హృదయంలో కొలువుండమని కోరుకున్నాడట. ఇక్కడే పర్వతాకారంలో నిరీక్షిస్తూ ఉండమని, కృతయుగంలో రాక్షసవధ తర్వాత కోరిక చెల్లిస్తానని దుర్గమ్మ బాస ఇచ్చిందట. కృతయుగంలో మహిషాసుర సంహారం తర్వాత కీలుడికి ఇచ్చిన వాగ్దానం మేరకు కీలాద్రిపై వెలసిందట.
 
 నాటి నుంచి ఇంద్రాది దేవతలు ఇక్కడకు వచ్చి అమ్మవారిని పూజించడంతో ఈ కొండకు ఇంద్రకీలాద్రిగా పేరువచ్చిందని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. బ్రహ్మదేవుడు ఇక్కడ పరమేశ్వరుడిని ప్రతిష్ఠించాలని తలచి వంద అశ్వమేధ యాగాలు చేశాడట. సంతుష్టుడైన పరమేశ్వరుడు జ్యోతిర్లింగరూపంలో వెలశాడు.

బ్రహ్మదేవుడు మల్లి, కదంబ పుష్పాలతో పరమేశ్వరుడిని పూజించడంతో ఇక్కడ కొలువైన పరమశివుడు మల్లికార్జునుడిగా ప్రసిద్ధి పొందాడు. ద్వాపరయుగంలో అర్జునుడు ఇంద్రకీలాద్రిపై తపస్సు చేయగా, పరమేశ్వరుడు అతడిని పరీక్షించదలచి కిరాతుడి రూపంలో వచ్చి ద్వంద్వ యుద్ధం చేశాడని, అర్జునుడి భక్తికి మెచ్చి అతడికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడని కూడా పురాణాలు చెబుతున్నాయి.
 
ఈ క్షేత్రాన్ని సందర్శించిన జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఇక్కడి జ్యోతిర్లింగం అదృశ్యంగా ఉండటాన్ని గమనించి, అమ్మవారి ఆలయ ఉత్తరభాగాన మల్లికార్జునుడిని పునఃప్రతిష్ఠించారు. అప్పటివరకు ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి శాంతింపజేశాడు. నాటి నుంచి కనకదుర్గమ్మ శాంతస్వరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తోంది.
 
 శ్రీశైల మల్లన్న
భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగా లలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా కర్నూలు జిల్లాలోని శ్రీశైలానికి గల ప్రత్యేకత నిరుపమానం. కృష్ణానదీ తీరంలో సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో నల్లమల అడవుల్లో వెలసిన ఈ పురాతన పుణ్యక్షేత్రంలో పరమశివుడు మల్లికార్జునుడిగా, అమ్మవారు భ్రమరాంబికగా వెలిశారు.

ఇక్కడి గిరిజనులు మలన్నను తమ అల్లుడిగా, భ్రమరాంబికను తమ కుమార్తెగా భావిస్తారు. మల్లన్న, భ్రమరాంబల రథోత్సవం వారి చేతుల మీదుగానే జరగడం ఇక్కడి ఆనవాయితీ. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో పాండవులు ఈ ఆలయాన్ని సందర్శించుకున్నారని ప్రతీతి.
 
ఆదిశంకరాచార్యులు ఈ ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారిని స్తుతిస్తూ భ్రమరాంబికాష్టకం, పరమేశ్వరుడిని స్తుతిస్తూ శివానందలహరి విరచించారని కూడా ప్రతీతి. ఇక్కడ తపస్సు చేసిన శిలాదుడనే మహర్షికి పరమశివుడి అనుగ్రహం వల్ల పర్వతుడు, నందీశ్వరుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. వారిలో పర్వతుడు శివుడి కోసం తపస్సు చేసి, స్వామిని మెప్పించాడట. పర్వతుడి కోరిక మేరకు అతడిని కొండగా మార్చి, పరమశివుడు అక్కడే కొలువై ఉండిపోయాడట.

కైలాసంలో ఒంటరిగా మిగిలిన పార్వతీదేవి, ప్రమథ గణాలు స్వామివారిని వెదుక్కుంటూ వచ్చి, వారు కూడా ఇక్కడే కొలువయ్యారని స్థలపురాణం చెబుతోంది. అలాగే, చంద్రవంశపు రాజు చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతిని అనుగ్రహించిన పరమశివుడు ఆమె కోరిక మేరకు ఆమె అర్చించిన మల్లెపూల దండను శిరస్సుపై ధరించి, మల్లికార్జునుడయ్యాడని కూడా ప్రతీతి.
 
మొవ్వలో మువ్వగోపాలుడు
కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో మువ్వగోపాలుడు వెలశాడు. ఆయన భక్తుడైన వాగ్గేయకారుడు క్షేత్రయ్య మువ్వగోపాలుడిపై పదాలు అల్లాడు. సంప్రదాయ సంగీత ప్రపంచంలో అవి క్షేత్రయ్య పదాలుగా ప్రసిద్ధి పొందాయి. ఆ భాగవతోత్తముడికి గుర్తుగా మువ్వగోపాలుడి ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహానికి ఎదురుగా నిలువెత్తు క్షేత్రయ్య విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. భక్తి, శృంగార రసాలతో స్వామిని కీర్తిస్తూ క్షేత్రయ్య రచించిన పదాలను సంగీతకారులు నేటికీ ఆలపిస్తూనే ఉన్నారు.

ఆయన పదాలకు నర్తకులు నేటికీ నాట్యమాడుతూనే ఉన్నారు. మొవ్వ గ్రామానికి చేరువలోనే ఉన్న కూచిపూడి తెలుగు సంప్రదాయ నృత్యమైన కూచిపూడి నృత్యానికి పుట్టినిల్లు. మొవ్వకు రెండు గంటల దూరంలో మంగళగిరికి చేరువలో ఉన్న కాజ గ్రామం నారాయణ తీర్థుల జన్మస్థలం. నారాయణ తీర్థులు విరచించిన తరంగాలు కూడా నేటికీ సంగీత, నృత్యాభిమానులను ఓలలాడిస్తూనే ఉన్నాయి.
 
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు
కృష్ణాజిల్లాలో విజయవాడకు చేరువలోని మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వరుడు లింగాకారంలో కొలువై ఉన్నాడు. సర్పదోష నివారణకు, రాహుకేతు దోషనివారణకు ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి భక్తులు ఇక్కడకు వస్తూ ఉంటారు. చర్మవ్యాధులు ఉన్నవారు ఈ ఆలయంలో పూజలు చేస్తే నయమవుతాయనే నమ్మకం ఉంది.

అలాగే, సంతానం లేని దంపతులు ఈ ఆలయ ప్రాంగణంలో ఒకరోజు నిద్ర చేస్తే వారికి తప్పక సంతానం కలుగుతుందని కూడా భక్తులు నమ్ముతారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు స్థలపురాణం చెబుతోంది. అగస్త్య మహర్షి ఈ క్షేత్రాన్ని దర్శించుకుని, సుబ్రహ్మణ్యేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో అర్చించుకున్నాడని ప్రతీతి.
 
వేదాద్రి లక్ష్మీనరసింహుడు
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని చిల్లకల్లు గ్రామానికి చేరువలో కృష్ణానదీ తీరాన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచరూపాత్మకుడిగా వెలశాడు. జ్వాలా సాలగ్రామ వీర యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. ఇక్కడ పర్వతశిఖరంపై స్వామి జ్వాలానరసింహ స్వామిగా స్వయంభువుగా వెలశాడు.

కృష్ణానది ఒడ్డున సాలగ్రామ నరసింహస్వామిగా, ఆలయ ప్రాంగణంలో యోగానంద నరసింహస్వామిగా, లక్ష్మీనరసింహస్వామిగా వెలసిన స్వామివారిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తుంటారు. వేదాద్రికి చేరువలోని గరుడాద్రిపై స్వామి వీరనరసింహస్వామిగా వెలసి భక్తుల పూజలందుకుంటున్నాడు.
 
శ్రీకాకుళ శ్రీమహావిష్ణువు
కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో కృష్ణానదికి పశ్చిమ తీరాన శ్రీకాకుళం గ్రామంలో శ్రీమహావిష్ణువు శ్రీకాకుళేశ్వరుడిగా వెలశాడు. దక్షిణాదిని పరిపాలించిన తొలి తెలుగు ప్రభువులు శాతవాహనుల రాజధాని ఇదే. ఇక్కడ దక్షిణ హస్తంలో శంఖం, వామహస్తంలో చక్రం, కంఠంలో సాలగ్రామమాల ధరించిన శ్రీమహావిష్ణువు రూపం అత్యంత ప్రసన్నంగా కనిపిస్తుంది.

ఇక్కడ స్వామివారి మెడలో కనిపించే మాల వంటి సాలగ్రామ మాలలు తిరుపతి, ర్యాలి దేవాలయాల్లో మాత్రమే కనిపిస్తాయి. అనంత దండ భూపాలుడు ఈ దేవాలయానికి రాజగోపురం నిర్మించాడు. శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయ ప్రాంగణంలోనే ‘ఆముక్తమాల్యద’ రచించాడు.
 
కొండంత కోటప్ప
గుంటూరు జిల్లాలోని కోటప్పకొండపై పరమశివుడు త్రికూటేశ్వరుడిగా వెలశాడు. నరసారావుపేటకు వాయవ్యాన 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం అసలుపేరు కొండకావూరు. జనాల వాడుకలో ఇది కోటప్పకొండగా స్థిరపడింది. ఈ క్షేత్రంలో వెలసిన 687 అడుగుల భారీ పరమశివుని విగ్రహాన్ని చూడాలంటే తల పెకైత్తాల్సిందే. గుండరాయలు అనే రాజు 18వ శతాబ్దిలో కొండపై ఉన్న ఈ ఆలయానికి 703 మెట్లతో మార్గాన్ని నిర్మించాడు.

రుద్రశిఖరం, విష్ణుశిఖరం, బ్రహ్మశిఖరం అనే మూడు శిఖరాల నడుమ వెలసినందున ఇక్కడ పరమశివుడు త్రికూటేశ్వరుడిగా పేరు పొందాడు. రుద్రశిఖరం మీద ఉన్న చిన్న దేవాలయంలో త్రికూటేశ్వరుడు లింగాకారంలో దర్శనమిస్తాడు. దాదాపు 1600 అడుగుల ఎత్తున ఉన్న కోటప్ప కొండపై దేవాలయానికి ఎదురుగా ఎనిమిది చిన్న చిన్న కొలనులతో పాటు కొండపై మరిన్ని కొలనులు కూడా ఉండటం విశేషం. ఈ కొండ మీదకు ఎన్నో రకాల పక్షులు వస్తూ ఉంటాయి. అయితే, ఒక్క కాకి కూడా కనిపించదు. ఒక ముని శాపం కారణంగా ఇక్కడకు కాకులు రావని చెబుతారు.
 
మంగళగిరి పానకాల నరసింహుడు

బెజవాడ కనకదుర్గ ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి కొండ మీద లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. నరసింహుడు ఇక్కడ పానకాల స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. భక్తులు ఇక్కడ నిత్యం స్వామికి పానకాన్ని నివేదిస్తారు. స్వామి సంతోషంగా పానకాన్ని సేవిస్తాడు. స్వామి పానకం సేవిస్తున్నప్పుడు గుటక వేసిన శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది.

స్వామి నోటిలో పోసిన పానకంలో సగం బయటకు వచ్చేస్తుంది. అయితే, స్వామి నోటిలో పోసిన పానకం ఎక్కడకు వెళుతోందో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని రహస్యమే. పానకం తయారీకి నిత్యం బెల్లం వినియోగిస్తున్నా ఇక్కడ ఒక్క ఈగ కూడా కనిపించకపోవడం ఈ క్షేత్రంలోని మరో విచిత్రం.
 
వైకుంఠవాసుడి వైకుంఠపురం
కృష్ణా-గుంటూరు జిల్లాల సరిహద్దులో కృష్ణాతీరాన క్రౌంచపర్వతంపై శ్రీవేంకటేశ్వరుడు అలమేలుమంగా సమేతంగా వెలశాడు. వైకుంఠవాసుడు వెలసిన ఈ గ్రామం వైకుంఠపురంగా ప్రసిద్ధి పొందింది. కాకతీయుల కాలంలో చిన్న రమణ, పెద్ద రమణ అనే సోదరులకు వేంకటేశ్వరస్వామి కలలో కనిపించి, అమరావతికి ఈశాన్యంగా ఉన్న కొండపై తాను వెలసినట్లు చెప్పాడట.

ఉదయమే ఆ సోదరులు అక్కడకు వెళ్లి చూడగా స్వామివారు సాలగ్రామరూపంలో దర్శనమిచ్చారట. కొండపై స్వామివారు వెలసిన గుహ చుట్టూ కొండవీటి రాజులు ముఖమండపాన్ని నిర్మించారు. ఆ తర్వాత రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పూర్తిస్థాయిలో ఆలయ నిర్మాణం చేసి, మహారాజ గోపురం నిర్మించారు.
 
 అమరేశ్వరుడి అమరారామం
గుంటూరు జిల్లాలో కృష్ణాతీరంలోని అమరావతి గ్రామంలో పరమశివుడు అమరేశ్వరుడిగా వెలశాడు. దేశంలోని పంచారామాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందిన అమరావతినే ధాన్యకటకం అని, ధరణికోట అని కూడా పిలుస్తారు. బౌద్ధుల ప్రాభవానికి నిదర్శనంగా ఇక్కడ సుప్రసిద్ధ బౌద్ధస్థూపం నేటికీ నిలిచి ఉంది. శాతవాహనులు అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించారు. అమరావతి క్షేత్రంలో అమరేశ్వరుడు పాలరాతి శివలింగంగా వెలశాడు. అమరేశ్వరుడు ఇక్కడ బాలాచాముండీ సమేతంగా పూజలందుకుంటున్నాడు. శివలింగం పైభాగాన ఎర్రని చారిక కనిపిస్తుంది. లింగం పెరిగిపోతుండటంతో పైన శీల వేశారని, అప్పుడు చిందిన రక్తమే నేటికీ ఎర్రగా కనిపిస్తోందని చెబుతారు.  
 
ఆలంపురి జోగులాంబ

 తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపురంలో నల్లమల అడవులకు చేరువలో కృష్ణా, తుంగభద్రా నదుల పవిత్ర సంగమ ప్రదేశంలో జోగులాంబ కొలువై ఉంది. దేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఆలంపురి జోగులాంబ ఆలయం అత్యంత పురాతన క్షేత్రం. స్కాంద పురాణంలో ఈ శక్తిపీఠం ప్రస్తావన ఉంది.

ఇక్కడ పరమశివుడు బ్రహ్మేశ్వరుడిగా, అమ్మవారు జోగులాంబగా వెలశారు. శైవులకు, శాక్తేయులకు ఇది అత్యంత పవిత్ర క్షేత్రం. ఈ ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కల్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు జోగులాంబను ఆరాధించేవారని ప్రతీతి.

ఆలంపురంలో జోగులాంబ శక్తిపీఠంతో పాటు, క్రీస్తుశకం ఏడో శతాబ్దిలో బాదామి చాళుక్యులు నిర్మించిన పురాతన నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేయగా, పరమశివుడు ప్రత్యక్షమై అతడికి సృష్టించే శక్తిని ప్రసాదించాడని స్కాందపురాణం చెబుతోంది. అందుకే ఇక్కడ వెలసిన పరమశివుడు బ్రహ్మేశ్వరుడిగా ప్రసిద్ధి పొందాడని ప్రతీతి.
 
 కూడలసంగమనాథుడు
 కర్ణాటకలోని బాగల్‌కోటె జిల్లాలో కూడలసంగమ గ్రామంలో కృష్ణాతీరాన సంగమనాథుడిగా వెలసిన పరమశివుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. అచేశ్వరుడికి, కాళేశ్వరుడికి అంకితం చేస్తూ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి పురాతన శాసనాల ద్వారా తెలుస్తోంది.

పన్నెండో శతాబ్దికి చెందిన జఠావేద ముని సంగమనాథుడు ఇక్కడ విద్యాకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయన శిష్యులైన బసవేశ్వరుడు, చన్న బసవన్న, అక్కనాగమ్మ ఈ ప్రాంతంలో వీరశైవాన్ని ప్రచారం చేశారు. కూడల సంగమనాథుని ఉద్దేశించి బసవేశ్వరుడు రచించిన వచనాలు కన్నడ సాహిత్యంలో చాలా ప్రసిద్ధి పొందాయి.
 
 బీచుపల్లి ఆంజనేయుడు
 తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా బీచుపల్లి గ్రామంలో కృష్ణానదీ తీరం వద్ద ఆంజనేయుడు వెలశాడు. శ్రీకృష్ణదేవరాయల గురువుల్లో ఒకరైన వ్యాసరాయస్వామి ఉత్తరభారత యాత్రను ముగించుకుని తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో బీచుపల్లి వద్ద అనుష్ఠానాలు కావించుకుంటున్నప్పుడు యోగదృష్టితో ఒక బండరాతి కింద ఆంజనేయస్వామి విగ్రహాన్ని కనుగొన్నారు.

విగ్రహాన్ని వెలికితీయించిన తర్వాత విగ్రహానికి నదిలో స్నానం చేయించి, విగ్రహాన్ని కనుగొన్న చోటనే నిలిపి ఉంచారు. సూర్యోదయానికి ముందు ఆ విగ్రహం వద్దకు ఎవరు వస్తారో, వారిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పి గ్రామస్థులను అక్కడ కాపలాగా ఉంచారు. మరునాటి వేకువన ఒక బోయ బాలుడు మేకలను తోలుకుంటూ విగ్రహం వద్దకు వచ్చాడు.

గ్రామస్థులు అతడిని స్వామివారి వద్దకు తీసుకురాగా, స్వామివారు అతడికి మంత్రోపదేశం చేసి, ఆంజనేయుడికి పూజారిగా నియమించారు. అప్పటి నుంచి బోయవారే ఈ ఆలయానికి పూజారులుగా ఉంటూ వస్తున్నారు. గద్వాల రాజులు ఈ ఆలయానికి ప్రాకారాన్ని నిర్మించి, పూజారులకు జీవనభృతి కల్పించారు.  
 
 మహాబలేశ్వర్‌లో కృష్ణమ్మగుడి
 మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పడమటి కనుమల నడుమ ఉన్న మహాబలేశ్వర్ కృష్ణానది జన్మస్థానం. కొండశిఖరంపై కృష్ణానది పుట్టిన స్థలంలో రత్నగిరి రాజులు కృష్ణమ్మకు ఆలయాన్ని నిర్మించారు. కృష్ణా నదీమాతను మరాఠీలు ‘కృష్ణాబాయి’గా పిలుచుకుంటారు. అందువల్ల ఇది కృష్ణాబాయి ఆలయంగా ప్రసిద్ధి పొందింది.

అశ్వత్థమూలంలో జన్మించిన కృష్ణానది శివలింగం మీదుగా గోముఖం నుంచి వెలువడి, దిగువన నిర్మించిన రాతికుండంలోకి చేరుతుంది. అశ్వత్థమూలాన్ని విష్ణుపాదంగా భావిస్తారు. విష్ణుపాదం నుంచి పుట్టిన గంగ శివుని శిరస్సుపైకి చేరినట్లే, ఇక్కడ కృష్ణానది శివలింగాన్ని అభిషేకిస్తూ సన్ననిధారగా ప్రవహిస్తుంది.

మహాబలేశ్వర్‌లోని మహాబలేశ్వర ఆలయం, దీనికి చేరువలోనే వెన్నా, కోయినా, సావిత్రి, గాయత్రి నదులు కృష్ణానదిలో చేరే చోట వెలసిన పంచగంగా ఆలయం చాలా పురాతనమైనవి. దేవగిరిని పాలించిన యాదవరాజులు ఇక్కడ పంచగంగా ఆలయాన్ని నిర్మించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement