ఆజన్మం: ఒక ప్రాక్టికల్ ఆంటీ | Sakshi
Sakshi News home page

ఆజన్మం: ఒక ప్రాక్టికల్ ఆంటీ

Published Sun, Sep 22 2013 2:50 AM

ఆజన్మం: ఒక ప్రాక్టికల్ ఆంటీ

నవోదయా ఎంట్రన్స్ కోచింగ్ కోసం వాడు మా మామయ్య వాళ్లింటికి కొన్నాళ్లు పేయింగ్ గెస్టుగా వచ్చాడు. వాడిదీ నా వయసే. ఇద్దరమూ మెంటల్ ఎబిలిటీ బొమ్మలతో కుస్తీ పడుతుండేవాళ్లం. వాడు పదే పదే నన్ను ఒక ప్రశ్న అడిగేవాడు: ఇక్కణ్నుంచి సిటీకి వెళ్లడానికి ఏ నంబర్ బస్సెక్కాలి?
 
 ఈ మూడు తెలిస్తే చాలనుకున్నాను; కానీ వాటిని చుట్టుముట్టి ఇతర లోకం కూడా ఉంటుందన్న ఊహ లేకపోవడం వల్ల గజిబిజిపడ్డాను. ధైర్యం సడలిపోయింది. కోచింగ్ ఇలా అయిపోతే అలా ఎక్కేస్తా, అన్నట్టుండేది వాడి ఆత్రం. ‘229’ అని చెప్పినదానికి బదులుగా, వాళ్లింటి ‘ట్రిప్లెక్స్ నంబర్’ నాకు చెప్పేవాడు.ఇంకో దూరపు మామయ్య వాళ్లు కూకట్‌పల్లిలో ఉంటారు. మా ఊరికి వచ్చినప్పుడల్లా మమ్మల్ని రమ్మని పిలిచేవాళ్లు. అటేవుంటాడు; కనీసం రాజయినా రావొచ్చుగదా, అన్నారు. ఇల్లు కనుక్కోవడం ఈజీ అని చెప్పారు. బస్టాపులో దిగితే వేపచెట్టు కనబడుతుంది; దగ్గరే టీవీ రిపేర్ షాపుంటుంది; మామయ్య టీవీ మెకానిక్ కాబట్టి, అక్కడికొస్తే ఇంటికి వచ్చేసినట్టే!
 
 ఒకానొక సాయంత్రం, ఇంకా నిక్కరు ధరించే వయసులో, నేను వేసుకున్న ప్రణాళిక తప్పడంతో, హాస్టలుకు వెళ్లడానికి ఆలస్యమైపోయి, నగరంలో చిక్కుపడ్డాను. ఈ చిక్కును విడదీసుకున్నట్టూ ఉంటుంది, అటు మామయ్య వాళ్లింటికి వెళ్లినట్టూ ఉంటుంది, పనిలో పనిగా ఆ ట్రిప్లెక్స్ నంబర్ కంఠతా ఉంది కాబట్టి వాణ్నీ కలవొచ్చు. చీకటికి భయపడాల్సిన పనేమీలేదు!
 
 తీరా వెళ్తే- బస్టాపు, వేపచెట్టు, టీవీ మెకానిక్ షాపు; ఇవి తప్ప అన్నీ కనబడ్డాయి. ఈ మూడు తెలిస్తే చాలనుకున్నాను; కానీ వాటిని చుట్టుముట్టి ఇతర లోకం కూడా ఉంటుందన్న ఊహ లేకపోవడం వల్ల గజిబిజిపడ్డాను. ధైర్యం సడలిపోయింది. అంతకుముందు వాణ్ని కూడా కలవొచ్చు అనుకున్నది, వాణ్ని మాత్రమే కలవడం అత్యవసరమైంది. వాడు దొరికాడు. ఆరో క్లాసులో చూసిన ముఖాన్ని ఎనిమిదిలోనూ ఇట్టే గుర్తుపట్టాడు. నా కొండగుర్తులతో మామయ్య ఇల్లు గాలించాం. లాభం లేకపోయింది. ఇక, రాత్రికి అక్కడే భోంచేశాను. పడుకున్నాను.
 నవోదయాలో వాడికి సీటు వచ్చినట్టు లేదు; తెల్లారి మామూలు స్కూలుకు బయలుదేరుతున్నాడు. వాడివల్లే ఆంటీవాళ్లు నాకు పరిచయం కాబట్టి, ఇక వాడు లేనప్పుడు ఇంట్లో ఉండటం ఉచితమా! వాడితోపాటే నేనూ పోబోతే, తినేసి వెళ్లిపోరా, అన్నాడు.
 
 నేను దూరం వెళ్లాల్సినవాణ్ని కాబట్టి, అది సహజమైన ఆదరంగానే భావించి ఆగిపోయాను.
 నిమిషం గడిచిందో లేదో! మళ్లీ నీకు తోవ తెలీదు; వాడితో కలిసి వెళ్లు, అంది ఆంటీ.
 ‘ఉండు బిడ్డా, తినిపోదువు’ తరహా పల్లె వాతావరణానికి ఇది పూర్తి విరుద్ధం. ఉన్నట్టుండి నన్ను పరాయివాడిని చేసిన కారణమేంటో అర్థం కాక, స్లిప్పర్స్ వేసుకుని గబగబా బయటికి పరుగెత్తాను.
 
 ఒక ప్రాక్టికల్ అంకుల్
 
 దసరా సెలవుల తర్వాత అనుకుంటాను, మళ్లీ రెసిడెన్షియల్ స్కూల్‌కు వెళ్తున్నాను. ఉన్నట్టుండి బస్టాండులో మా క్లాస్‌మేట్ కనబడ్డాడు. వాళ్ల నాన్న వాణ్ని దింపడానికి వస్తున్నాడు. అయితే, నేనూ వాళ్లతో కలిసివెళ్లొచ్చు!
 ముగ్గురం బస్సెక్కాం. మా నాన్నుంటే టికెట్ తీసుకోరు; నువ్వూ ఫ్రీగా రావొచ్చురా, అన్నాడు వాడు కొంచెం గర్వంగా. అంకుల్ బస్సు డ్రైవరని నాకు తెలుసు; కానీ డ్రైవరుకు ఇంత వెసులుబాటు ఉండగలదని తెలీదు.
 సికింద్రాబాద్‌లో బస్సు దిగాం. కీసరగుట్ట బస్సు పట్టుకున్నాం. సీటు దొరికింది. ఇద్దరమూ కూర్చున్నాం. డెరైక్టు బస్సే కాబట్టి పిల్లలమే అయినా మేం వెళ్లిపోగలం! ఇక అక్కడితో ఉంటానని చెబుతూ, అంకుల్ నాతో అన్నాడు: బాబూ, ఇక్కడిదాకా నీకు టికెట్ నేను తీసుకున్నాను; ఇప్పుడు మా వాడికి నువ్వు తీసుకో. లౌక్యానికి సంబంధించిన కాఠిన్యమేదో నన్ను క్షణకాలం స్తంభింపజేసినా, ‘సరే అంకుల్,’ అని తలూపాను.
 - పూడూరి రాజిరెడ్డి

Advertisement
Advertisement