నాగరికత నిర్మాతలు | Sakshi
Sakshi News home page

నాగరికత నిర్మాతలు

Published Sun, Sep 15 2013 2:06 AM

నాగరికత నిర్మాతలు

చరిత్రలో ఏయే అద్భుతాన్ని ఏయే కారణాల వల్ల తలపెట్టినా, అది ఇంజనీరింగ్ వల్లే సాకారమైంది. ఫలానా రాజు ఫలానాది నిర్మించాడు, అంటున్న ప్రతిసారీ, అందులో లక్షలాది శ్రామికుల చెమటచుక్కలను ఒక ప్రణాళికతో వినియోగించుకున్న ఇంజనీర్ నైపుణ్యం ఇమిడివుంది. ఇప్పుడా శ్రామికులూ లేరూ, ఆ ఇంజనీర్లూ లేరు; కానీ మనిషి పురోగతికి ప్రతిబింబాలైన
 ఆయా నిర్మాణాలున్నాయి. సెప్టెంబర్ 15 ‘ఇంజనీర్స్ డే’ సందర్భంగా అలాంటి వాటిల్లో కొన్నింటినైనా తలుచుకోవడం ఈ కథనం ఉద్దేశం.
 
 ‘ఇదివరకే ఉన్నదాన్ని శాస్త్రవేత్తలు పరిశోధిస్తారు; కానీ ఇంజనీర్లు మునుపెన్నడూ లేనిది సృష్టిస్తారు,’ అన్నాడు సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. మనిషి తలెత్తి చూసే ఈ నిర్మాణాలు, మావనజాతి తలెత్తుకుని చూసుకోగలిగేవి కూడా! ఇలాంటివి భౌగోళికంగా ప్రస్తుతం ఎక్కడవున్నా అవి మానవాళి ఉమ్మడి మేధస్సుకు తార్కాణాలు; మనిషి సముపార్జించిన జ్ఞానానికి ఆకాశమెత్తు ఉదాహరణలు.
 
 గిజా పిరమిడ్, ఈజిప్ట్
 పిరమిడ్లు ఉత్తి సమాధులు మాత్రమే కాదు; ఆ కాలపు జ్ఞానాన్ని, మావన వనరుల శ్రమను కుప్పపోసిన నిర్మాణాలు. 146.5 మీటర్ల ఎత్తుతో గిజా పిరమిడ్ వేల సంవత్సరాలపాటు అత్యంత పొడవైన నిర్మాణంగా భాసిల్లింది. క్రీ.పూ.2504లో పూర్తయిన ఈ నిర్మాణంలో 23 లక్షల రాతి పలకలు వినియోగించారు. పెద్దవి ఒక్కోటి 25-80 టన్నుల బరువుంటాయి. వాటిని 800 కిలోమీటర్ల దూరంలోంచి తెచ్చారు. 55 లక్షల టన్నుల సున్నపురాయి, 8000 టన్నుల గ్రానైట్, 5 లక్షల టన్నుల మోర్టార్ ఖర్చయ్యింది. ఇప్పటికీ నిపుణులకు అర్థం కానిది ఏమంటే, అంత బరువైన రాళ్లను అంత ఎత్తుకు ఎలా తరలించారన్నదే!
 
 గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, చైనా
 చైనా అంతటి పెద్ద దేశం చుట్టూ గోడను నిర్మించాలన్న ఆలోచన వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటిది వాళ్లు సాధించారు. 8850 కిలోమీటర్ల పొడవుండే ఈ భారీ గోడ దశల వారీగా, వివిధ రాజవంశాల కాలంలో పూర్తయినా, కీలక నిర్మాణం మాత్రం క్విన్ షి హువాంగ్ హయాంలో క్రీ.పూ. 220-206 మధ్య కాలంలో జరిగింది. మంగోలుల దండయాత్రల నుంచి స్వీయ రక్షణార్థం నిర్మించిన ఈ గోడ మధ్యమధ్యన వాచ్‌టవర్స్, కోటకొమ్ములు ఉంటాయి. ఇది సముద్రమట్టానికి 980 మీటర్ల ఎత్తుంటుంది. మోర్టార్‌గా బియ్యప్పిండిని వాడటం విశేషం. మానవ శ్రమశక్తికీ, సంకల్పానికీ ఇది సుదీర్ఘ ఉదాహరణ.
 
 టెయౌటివాకన్, మెక్సికో
 క్రీ.పూ.100 కాలంలో నిర్మాణం ప్రారంభమైన ఈ నగర ఉచ్ఛదశలో రెండు లక్షల మంది నివాసం ఉండేవారు. ఖగోళ, భూమాపన, భౌగోళిక అంశాలు ఒకే రేఖ మీద నిలబడే అసాధారణ ప్రజ్ఞను వీళ్లు సాధించారు. ఉత్తర దక్షిణ అక్షాలను కలిపే రేఖకు ఈ నగరాన్ని అనుసంధానిస్తూ, సరిగ్గా ఆగస్టు 12న దానిమీద సూర్యుడు అస్తమించేట్టు చేశారు. వారు వాడిన మెసోఅమెరికన్ క్యాలెండర్ ప్రారంభమయ్యేది ఇదే తేదీన. అలాగే, ఈ నగరంలోని 71.2 మీటర్ల ఎత్తుగల ‘పిరమిడ్ ఆఫ్ ద సన్’ నిర్మాణానికి నునుపైన మీకా పలకలు అట్టడుగున వినియోగించారు. ఆధునిక యుగం ఎప్పటికోగానీ తెలుసుకోని ఇన్సులేషన్ ధర్మాన్ని వాళ్లు అప్పుడే గుర్తించారు. ఇంకా అనూహ్యం ఏమిటంటే, ఈ పలకల్ని వాళ్లు 3000 కిలోమీటర్ల దూరానున్న బ్రెజిల్ నుంచి తెప్పించడం!
 
 అక్వెడక్ట్ ఆఫ్ సెగోవియా, స్పెయిన్
 నీటి సరఫరా చేసే మార్గంలో లోతట్టు ప్రాంతాలు, లోయలు ఎదురైనప్పుడు ప్రవాహాన్ని సమరీతిగా ఉంచేందుకు ఈ ఆక్వెడక్ట్ (జలవాహమార్గం) అవసరమైంది. క్రీ.శ. 50లో దీని నిర్మాణం పూర్తయింది. 44 డబుల్ అర్చీలతో కలుపుకొని మొత్తం 167 అర్చీలున్నాయి. ఒక్కో అర్చీ 9 మీటర్ల ఎత్తుంటుంది. పొడవు 270 మీటర్లు. రోమన్ సామ్రాజ్యాధిపతి ట్రాజన్ కాలంలో 18 కిలోమీటర్ల దూరంలోని ఫ్రయో నది నుంచి సెగోవియా పట్టణానికి నీటిని తరలించడానికి దీన్ని నిర్మించారు. 24000 గ్రానైట్ బ్లాకులు వాడిన ఈ నిర్మాణంలో మోర్టార్ (ఇప్పటి సిమెంటు లాంటిది) వినియోగించకపోవడం విచిత్రం!
 
 సక్సయ్‌వమన్, పెరు
 ఇది ఉత్తి రాళ్ల పేర్పుగా కనబడితే మన తప్పేం కాదు. కాలం వెనక్కి వెళ్లి ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం అప్పుడు లేదు, అన్నది గుర్తిస్తేనే ఇందులో ఉన్న గొప్పతనం తెలుస్తుంది. సుమారు వెయ్యేళ్ల క్రితం, ఇన్కా సామ్రాజ్యపు రాజధాని ‘కూకో’లోని సైనిక స్థావరం ఇది. 400 మీటర్ల పొడవు, ఆరు మీటర్ల ఎత్తుగల ఈ గోడల కోసం వాళ్లు పెద్ద పెద్ద బండరాళ్లను వినియోగించారు. పెద్దది 120 టన్నులుండగలదు. వీటిని మూడు కిలోమీటర్ల అవతలి క్వారీలోంచి ఇక్కడికి ఎలా చేర్చారనేది ఇప్పటికీ ఆశ్చర్యమే! పైగా, ఈ రాళ్ల మధ్య పొందిక ఎంత చక్కగా ఉంటుందంటే, వాటిలోకి ఒక కాగితాన్ని కూడా దూర్చలేనంతగా! అందుకే ఎన్ని భూకంపాలు వచ్చినా ఇది తట్టుకుని నిలబడింది. దీని మీదకు దండెత్తిన స్పెయిన్ వాళ్లు అబ్బురపడి, కోపపు మెచ్చుకోలుతో, ఇలాంటివి దయ్యాలు మాత్రమే నిర్మించగలవు, అన్నారు.
 
 చాంద్ బావోరి, రాజస్థాన్
 పదవ శతాబ్దపు ఈ నిర్మాణం ఎడారి ప్రజల దాహార్తికి సంకేతం. నీటి కటకటకు జవాబుగా తవ్విన ఈ బావి వంద అడుగుల లోతుంటుంది. ఎవరైనా నీటిని తెచ్చుకునేందుకు వీలుగా 13 అంతస్తుల్లో 3500 మెట్లు నిర్మించారు. నడకను సులువు చేసేందుకు నేరుగా దిగువకు కాకుండా, పక్కకు నడిచేలా ఈ మెట్లు ఏర్పాటుచేయడం అప్పటి ఆలోచనాపరుల ప్రజ్ఞ. ఇంత సంక్లిష్ట నిర్మాణం ఆ కాలంలో ఎలా సాధ్యపడిందని ఇప్పటికీ అబ్బురమే. అందుకే దయ్యాలు ఒక్క రాత్రిలో కట్టేసి వెళ్లాయని స్థానికులు చెప్పుకునే గాథ!
 
 తాజ్‌మహల్, ఉత్తర ప్రదేశ్
 నిండుదనం, ఒక సంపూర్ణాకృతిని చూసిన అనుభూతి తాజ్‌మహల్ ఇస్తుందంటారు. ఇరవై ఏళ్లపాటు నిర్మాణం కొనసాగి 1653లో ముగిసింది. ఈ షాజహాన్ ప్రేమచిహ్నంలో 28 రకాల విలువైన రాళ్లు వినియోగించారు. వాటిని రాజస్థాన్‌లోని క్వారీల్లోంచి తెచ్చారు. పొద్దున గులాబీరంగులో, పగలు తెల్లగా, రాత్రి బంగారు కాంతిలో కనబడటం వీటి ప్రత్యేకత!
 
 ట్రాన్స్-సైబీరియన్ రైల్వే, రష్యా
 రష్యా రాజధాని నగరం మాస్కో నుంచి ఆ దేశపు చిట్టచివరి అంచుల్ని కూడా కలిపే రైల్వే నెట్‌వర్క్ ఇది. చివరి కేంద్రమైన వ్లాడివోస్టాక్ 9289 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందుకే ఇది ప్రపంచంలోనే పొడవైన రైల్వే లైనుగా వినుతికెక్కింది. 87 పట్టణాలు, నగరాలు; 6 టైమ్ జోన్లు; ఓల్గా, ఓబ్, ఓకా, కామా లాంటి 16 నదులు దాటుతూ ఈ నిర్మాణం సాగింది. 1904 పూర్తయిన ఈ రైల్వేలైనుకి చైనా, మంగోలియా, ఉత్తర కొరియాల్లోకి కనెక్టింగ్ ట్రాకులు ఉన్నాయి. సైబీరియాలాంటి ప్రాంతాల్లో మైనస్ 20 డిగ్రీల చలిని తట్టుకోగలిగే దృఢత్వం ఈ నిర్మాణపు గొప్పతనం!
 
 అకాషి కైక్యో బ్రిడ్జ్, జపాన్
 కోబ్ నగరాన్నీ, అవాజీ ద్వీపాన్ని కలిపే వంతెన ఇది. 1998కి ముందు ద్వీపంలోని జపనీయులకు పడవలు మాత్రమే ప్రయాణసాధనాలు. తుఫానుల వంటి వాటివల్ల కలిగే అంతరాయాలను, ఆ సమయంలో జరిగే ప్రాణనష్టాన్ని నివారించేందుకు ఈ బ్రిడ్జి నిర్మించారు. 1991 మీటర్ల పొడవుండే ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్. పర్ల్ బ్రిడ్జిగా కూడా పిలిచే దీనికోసం 20 లక్షల మంది పదేళ్లపాటు శ్రమించారు.
 
 గ్రాండ్ కేన్యన్ స్కైవాక్, అమెరికా
 భీతిగొలిపే లోతైన లోయ మీద నడిచే జలదరింపు అనుభవాన్ని ఇవ్వడానికన్నట్టుగా ఈ కేన్యన్ స్కైవాక్ నిర్మించారు. కొలరాడో నదికి 1219 మీటర్ల ఎత్తున ఉండే దీనిలో 450 మెట్రిక్ టన్నుల ఉక్కు, 37 మెట్రిక్ టన్నుల గాజు వినియోగించారు. 2007లో పూర్తయింది. పూర్తి భర్తీ అయిన 71 విమానాల్ని మోసేంత గట్టిగా ఉంటుంది.
 
 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతరిక్షం
 అంతరిక్ష పరిశోధనలకోసం 15 దేశాల భాగస్వామ్యంతో భూమికి 354 కిలోమీటర్ల ఎత్తున నిర్మించిన ఈ అంతరిక్ష ప్రయోగశాల కోసం 100 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. వేసుకున్న స్పేస్ సూట్‌లో ఏర్పడే ఏ కొంచెం చిరుగు కూడా ప్రాణాలకు ముప్పు తెచ్చే పరిస్థితుల్లో లక్ష మంది పనిచేశారు. ఆ లెక్కన ఇది అధునిక అద్భుతం! 1998 నుంచి నిర్మాణం కొనసాగుతూనే ఉంది.
 
 ఇవికాక... రెండు వేల గుహల్ని తొలిచి సృష్టించిన అజంతా, ఎల్లోరా గుహలు(మహారాష్ట్ర); 17.8 మీటర్ల ఏకశిలా బాహుబలి విగ్రహం(కర్ణాటక); దేవతలు, దయ్యాలు, యుద్ధవీరులు, సేవకుల లాంటి ప్రతీ వివరంలోనూ పనితనం కనబడి నేత్రానందం కలిగించే మీనాక్షి సుందరేశ్వరాలయం (తమిళనాడు); జవహర్‌లాల్ నెహ్రూ వంటి పెద్దమనిషితో ఆధునిక దేవాలయం అనిపించుకున్న నాగార్జున సాగర్(ఆంధ్రప్రదేశ్); సింధు నాగరికత తాలూకు హరప్పా నగర అవశేషాలు బయటపడిన ధోలవీర గ్రామం (గుజరాత్); కోణార్క్ సూర్య దేవాలయం(ఒరిస్సా), ఖజురహో దేవాలయాలు(మధ్యప్రదేశ్), జైసల్మేర్ కోట (రాజస్థాన్), ఎర్రకోట(ఢిల్లీ), నలంద విశ్వవిద్యాలయం(బీహార్), చార్‌మినార్(ఆంధ్రప్రదేశ్), స్వర్ణ దేవాలయం(పంజాబ్);


 ఇంకా... 77 కిలోమీటర్ల మేర నౌకాయానానికి వీలుగా అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్ని కలుపుతూ తవ్విన పనామా కాలువ(పనామా); 26 నెలల్లో 450 టన్నుల పేలుడు పదార్థాలు ఉపయోగించి తీర ప్రాంతాల్లోని కొండలను కరిగించి నిర్మించిన, అలస్కా నుంచి యుకాన్‌ను కలిపే న్యారోగేజ్ రైలు ‘వైట్ పాస్ అండ్ యుకాన్ రూట్’(కెనడా); 828 మీటర్ల ఎత్తులో స్వేచ్ఛగా నిలబడిన బుర్జ్ ఖలీఫా భవనం(దుబాయ్); హూవర్ డ్యామ్ (అమెరికా), మిల్లావు వియాడక్ట్(ఫ్రాన్స్), మాచు పిచ్చు(పెరు), కొలోజియం(ఇటలీ), లండన్ అండర్‌గ్రౌండ్ (ఇంగ్లండ్), గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ (అమెరికా), ఈఫిల్ టవర్ (ఫ్రాన్స్), పీసా టవర్ (ఇటలీ) లాంటి అద్భుత నిర్మాణమైన ఈ భువిపై ఉన్నాయి. మనిషి గొప్పోడే అంటే నమ్మేంత బలహీనతకు లోనుచేసే నిర్మాణాలివి. కళ, సంకల్పం, శ్రమ కలగలిసిన ఇంజినీరింగ్ పనితనం ఉన్న నిర్మాణాలివన్నీ. గగురుపాటు, జలదరింపు కలిగించేవే ఇవన్నీ. నోరువెళ్లబెట్టి చూసే సంభ్రమ క్షణాలను ఇవ్వగలిగేవే! ఇదంతా ఆర్థిక, సామాజిక, శాస్త్రీయ రంగాల్లో మనుషులు చేసిన ప్రయాణం. ఒక్కోసారి లార్జర్ దేన్ లైఫ్!
 
 మనిషి పుట్టినప్పటినుంచీ ఇంజనీరింగ్ ఉంది. విస్తుగొలిపే నిర్మాణాల్లోనే కాదు, జీవితమంతటా ఇంజనీరింగ్ ఉంది. 4500 ఏళ్ల క్రితం నాటి మహెంజోదారో ప్రపంచపు తొలి నగర స్థావరం. వేల సంవత్సరాలు వెలిగి కాలగర్భంలో కలిసిపోయిన ఈ నగరపు ఆనవాళ్లు ప్రస్తుత పాకిస్తాన్‌లో లభించాయి. వాటిని బట్టి, కొలిచినట్టుండే వీధులు, వాటికి ఇరుపక్కలా ఉండే భవనాలు, భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ సింధు నాగరికత ప్రత్యేకత. ఆధునిక ప్రపంచంలో ఇరవయ్యో శతాబ్దంలోగానీ వినియోగంలోకి రాని వ్యక్తిగత టాయ్‌లెట్ సిస్టమ్ కూడా ఇక్కడ ఉండేది!
 
 మనిషి జీవితాన్ని మరింత సులభతరం చేయడంలో ఇప్పుడు వాడుతున్న ఫోన్, కంప్యూటర్ కూడా ఇంజనీరింగ్‌లో భాగమే. కప్పీ, పలుగు, పార, నాగలి, చరఖా, ఆఖరికి సేఫ్టీ పిన్ కూడా ఎవరో ఒకరి తెలివితేటల్లోంచే పుట్టాయి. పనిని సులభతరం చేసే ప్రతిదీ మిషన్ అయినట్టుగా, జీవితాన్ని మరింత సులభతరం చేసే ప్రతివాళ్లూ ఇంజనీర్లే! ఆ ఇంజనీర్లందరినీ తలుచుకుంటూ...
 
 మోక్షగుండం విశ్వేశ్వరయ్య
 15 సెప్టెంబర్ 1860 14 ఏప్రిల్ 1962
 
 ఇంజనీర్స్ డే ఏమిటి?
 అప్పటి మైసూరు రాష్ట్రంలో తెలుగు మూలాలున్న కుటుంబంలో జన్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆ రాష్ట్రానికి దివానుగా పనిచేశారు. నైజాం రాజ్యంలో కూడా సేవలందించారు. హైదరాబాద్ నగరానికి మూసీ వరదల నుంచి కాపాడే రక్షణ వ్యవస్థ నిర్మించడంలో, కృష్ణరాజ సాగర డ్యామ్ నిర్మాణంలో, విశాఖపట్నం రేవు క్రమక్షయానికి గురవకుండా చూపిన పరిష్కారంలో, తిరుపతి-తిరుమల మధ్య రోడ్డు వేయడంలో కీలకపాత్ర పోషించారు. మైసూర్ సోప్ ఫ్యాక్టరీ, మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు కారకులయ్యారు. 1955లో భారతరత్న పురస్కారం ఆయన్ని వరించింది. నిండు నూరేళ్లు బతికిన ఈ సుప్రసిద్ధ ఇంజనీర్ జయంతినే ‘ఇంజనీర్స్ డే’గా జరుపుకొంటున్నాం.

Advertisement
Advertisement