విశ్లేషణం: ఎగిసిపడే కెరటం... | Sakshi
Sakshi News home page

విశ్లేషణం: ఎగిసిపడే కెరటం...

Published Sun, Mar 2 2014 12:10 AM

విశ్లేషణం: ఎగిసిపడే కెరటం... - Sakshi

ప్రజల అటెన్షన్ తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందంటారు అమితాబ్. ఆ బిడియం, ఆ ఇబ్బంది ఆయన బాడీ లాంగ్వేజ్‌లో స్పష్టంగా కనిపిస్తాయి.
 
 ఆరడుగుల ఆజానుబాహుడు... మంత్రముగ్ధులను చేసే కంఠస్వరం... ఘనమైన కుటుంబ వారసత్వం... సూపర్‌స్టార్ వైభవం... మరణం అంచులదాకా వెళ్లి వచ్చిన అనుభవం... రాజకీయ రంగప్రవేశం... బోఫోర్స్ కుంభకోణంలో దేశద్రోహిగా అపవాదు... వ్యాపారం దివాళా... అయినా అలిసిపోలేదు. ఎగిసిపడే కెరటంలా మళ్లీ పైకి లేచారు. ఆయన నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, గాయకుడు, రాజకీయ నాయకుడు, టీవీ యాంకర్... వీటన్నింటికీ మించి... మంచి కొడుకు, మనసున్న భర్త, బాధ్యతెరిగిన తండ్రి, ప్రేమను పంచే తాత. సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్. 71 సంవత్సరాల వయసులోనూ తరగని నటనాదాహం ఆయన సొంతం.
 
 బిడియస్తుడైన సూపర్‌స్టార్
 అమితాబ్ స్వరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... సినిమాల్లో ఆవేశంగా డైలాగ్స్ చెప్పినా... ఇంటర్వ్యూలలో, సభల్లో మాట్లాడేటప్పుడు నిదానంగా, గంభీరంగా మాట్లాడతారు. కుడివైపు కిందకు చూస్తూ తనతో తాను మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటారు. ఆ తర్వాతనే తలెత్తి ఎదుటివారివైపు చూస్తారు. అయితే అది కాసేపే. ఆ తర్వాత మళ్లీ కిందకు చూస్తూ మంద్రస్వరంతో మాట్లాడతారు. ఆ సమయంలో ఆయన గతానుభవాలను గుర్తుచేసుకుంటారు... వాటిని అనుభూతి చెందుతారు... ప్రశ్నించుకుంటారు. ఇవన్నీ ఆయన అనుభూతి ప్రధాన వ్యక్తిత్వమున్నవారని చెప్తాయి. నటుడిగా ఆయన ఎంతో జోష్ ఉన్న పాత్రలు పోషించినా.. వ్యక్తిగతంగా ఆయన బిడియస్తుడనే చెప్పాలి.
 
 ప్రజల అటెన్షన్ తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందంటారు అమితాబ్. ఆ బిడియం, ఆ ఇబ్బంది ఆయన బాడీ లాంగ్వేజ్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన కాలుమీద కాలువేసుకుని దర్జాగా కూర్చున్నప్పటికీ... అప్పుడప్పుడూ చేతులు కాళ్లమధ్యలో దాచుకోవడం అందులో భాగమే. అంతేకాదు అప్పుడప్పుడూ హాండ్‌కఫ్స్‌ను సవరించుకోవడం, చేతివేళ్లు క్రాస్ చేయడం కూడా నెర్వస్‌నెస్‌ను దాచుకునే ప్రయత్నంలో భాగమే.  అలాగే మాట్లాడేటప్పుడు పెదవులను నాలుకతో స్పృశించడం ద్వారా ఆయన తన మాటలను నిగ్రహించుకుంటారని అర్థమవుతుంది. అయితే మాట్లాడేటప్పుడు రెండు చేతులను ఓపెన్‌గా ఉంచడం, హస్తాలను పైకి ఉంచడం ఆయన ఓపెన్‌గా ఉంటారని చెప్తాయి.
 
 నటనే శ్వాస...
 1970, 80 దశాబ్దాల్లో బాలీవుడ్‌లో అమితాబ్ హవా నడిచింది. ఫ్రెంచి దర్శకుడు ఫ్రాంకోయిస్ ట్రఫాట్ ఆ కాలాన్ని ‘ఒన్ మ్యాన్ ఇండస్ట్రీ’ అన్నాడు. బిగ్‌బీ మాత్రం తనకు నటన రాదంటారు! ‘‘నటుడిగా నా కెరీర్ గురించి నాకెప్పుడూ విశ్వాసం లేదు. నేను సూపర్‌స్టార్‌ని కాదు. సినిమాల్లో పనిచేయడాన్ని ఎంజాయ్ చేస్తానంతే’’ అంటారు. ఆ మాటలు ఆయన సంస్కారానికి దర్పణం. ఆరు పదుల వయసులోనూ ‘పా’లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయడం ఆయన నటనాతృష్ణను వ్యక్తీకరిస్తాయి.
 


 భవిష్యత్ దృక్పథం...
 స్నేహితుడు రాజీవ్‌గాంధీ ఆహ్వానం మేరకు రాజకీయ రంగప్రవేశం చేసి, బోఫోర్స్ కుంభకోణంలో దేశద్రోహానికి పాల్పడ్డాడన్న అపవాదును ఎదుర్కొన్నారు అమితాబ్. 1982లో ‘కూలీ’నిర్మాణంలో గాయపడి మరణం అంచులదాకా వెళ్లి వచ్చారు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ ద్వారా నిర్మాతగా మారి దివాళా తీశారు. కానీ ఆయనేనాడూ కుంగిపోలేదంటే కారణం ఆయన ‘భవిష్యత్ దృక్పథ’మే. కొందరు గతాన్ని తలచుకుంటూ కుంగిపోతే, మరికొందరు తప్పులనుంచి పాఠాలు నేర్చుకుని, అందమైన భవిష్యత్తు ఉంటుందని విశ్వసించి శ్రమించి సాధిస్తారు. అమితాబ్ అలాంటి దృక్పథం కలవారు. నేనెప్పుడూ గతాన్ని తలచుకోను, భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తానని చెప్తారు.
 
  ‘‘నేను నా జీవితాన్ని సహజంగా, సాధారణంగా జీవించాను. కానీ అప్పుడప్పుడూ వివాదాలు వస్తూనే ఉన్నాయి. అవి ఒక్కోసారి నాకే ఆశ్చర్యం కలిగిస్తాయి. నేను గడ్డం పెంచితే అది టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటోరియల్‌కు చేరింది’’ అంటూ నవ్వేస్తారు. ఇలాంటి సానుకూల దృక్పథమే ఆయనను అనేక పరాజయాలు, అవమానాలనుంచి బయటపడేసింది. అమితాబ్ కుటుంబం గురించి చెప్పకుండా ఈ విశ్లేషణ ముగిస్తే అసంపూర్తిగా ఉంటుంది... ఎందుకంటే ఆయన పూర్తిగా కుటుంబం మనిషి. తల్లిదండ్రులను, భార్యను, సంతానాన్ని, వారసులను ప్రేమించే మనిషి.
 - విశేష్, సైకాలజిస్ట్

Advertisement

తప్పక చదవండి

Advertisement