మహా అమరవీరుడు

14 Apr, 2019 03:54 IST|Sakshi

ధ్రువతారలు

పది నిమిషాలలో ఓ నదిని సృష్టించడం సాధ్యమా?  శాంతియుతంగా సమావేశమైన పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది నిరాయుధుల మీద... మహిళలు... వారి చంకలలోని పసివాళ్లు... చేతులు పట్టుకుని బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు.. వృద్ధులు... యువకులు... మధ్య వయస్కులు... ఎలాంటి తరతమ భేదం లేకుండా, నిర్దాక్షణ్యంగా  జరిపిన కాల్పులు ఐదు నదులున్న పంజాబ్‌లో ఆరో నదిని పారించాయి.

అక్షరాలా అదొక నెత్తుటి నది. 
ఆ ఆరో నదిని పారించినవాడు జనరల్‌ రెజినాల్డ్‌ డయ్యర్‌– పది నిమిషాల వ్యవధిలోనే. ఇందుకు ఆదేశించినవాడు పంజాబ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఓడ్వయ్యర్‌. ఏప్రిల్‌ 13, 1919న పంజాబ్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన నరమేధానికి పట్టిన సమయం పది నిమిషాలే. ఆ రక్తస్రవంతి పంజాబ్‌ నేల మీద వారానికో పది రోజులకో ఇంకి పోయి ఉండవచ్చు. కానీ ఒక శతాబ్దం గడిచినా కూడా మానవాళి జ్ఞాపకాలలో ప్రవహిస్తూనే ఉంది. అలా ప్రవహిస్తూనే ఉంటుంది. జలియన్‌వాలా బాగ్‌ కాల్పుల మృతుల సంఖ్య 379 అని, క్షతగాత్రులు పదకొండు వందలని ప్రభుత్వం ప్రకటించింది. కాదు, మృతుల సంఖ్య వేయి దాటిందని భారత జాతీయ కాంగ్రెస్, ఆర్య సమాజ్, ఇతర పంజాబీ నేతల వాదన. రవీంద్రనాథ్‌ టాగూర్, మోతీలాల్‌ నెహ్రూ, మదనమోహన్‌ మాలవీయ వంటివారి గుండె మండింది. కానీ నెత్తురు మరిగినవాడు మాత్రం ఉద్దమ్‌సింగ్‌. జలియన్‌వాలా బాగ్‌ కాల్పుల తరువాత కర్ఫ్యూ విధించారు. ఆ నిర్భాగ్యుల భౌతికదేహాలు అలాగే ఉండిపోయాయి. రక్తం కారే గాయాలతో క్షతగాత్రులు నరకయాతన అనుభవించారు. మరునాడు జనరల్‌ డయ్యర్‌ స్వర్ణదేవాలయానికి వెళ్లాడు. దాని నిర్వాహకుడు (జతేతార్‌) అరూర్‌సింగ్‌ను పిలిచాడు. ఇక్కడ మరో సభ జరుగుతుందని చెప్పుకుంటున్నారు, ఏమిటని ప్రశ్నించాడు. అది వదంతేనని తేల్చాడు అరూర్‌. నిజానికి అక్కడ జనం పోగుపడితే, జలియన్‌వాలా బాగ్‌లో మాదిరిగానే ఎలాంటి కవ్వింపు లేకుండానే  కాల్పులు జరపాలని అతడికి కోరికగా ఉంది. కానీ సిక్కులు సిపాయీలలో తిరుగుబాటు వస్తుందని భయపడ్డాడు.

తరువాత అరూర్‌సింగ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఓడ్వయ్యర్‌ను స్వర్ణాలయానికి ఆహ్వానించి  ‘సిరోపా’తో (ప్రార్థనా స్థలానికి ప్రముఖులు, పెద్దలు వచ్చినప్పుడు కప్పే పవిత్ర వస్త్రం)  సత్కరించాడు. సిక్కు దీక్షకు ప్రతీకలైన కరవాలం, తలపాగా కూడా బహూకరించాడు. అంటే గౌరవ సిక్కుగా స్థానం కల్పించాడు (ఈ విషయాన్ని ఓడ్వయ్యర్‌ భార్య ధ్రువీకరించారు. డాన్‌ పత్రిక కూడా నివేదించింది). అక్కడితో ఆగకుండా జనరల్‌ డయ్యర్‌ను, అతని సహాయకుడు బ్రిగేడ్‌–మేజర్‌ కెప్టెన్‌ బ్రిగ్స్‌ను కూడా స్వర్ణాలయానికి అరూర్‌సింగ్‌ ఆహ్వానించాడు. జనరల్‌ డయ్యర్‌ జీవిత చరిత్ర రాసిన ఇయాన్‌ కోల్విన్‌ అనే చరిత్రకారుడు అరూర్‌సింగ్, డయ్యర్‌ మధ్య జరిగిన సంభాషణ గురించి రాశాడు. అంతకు ముందు నికల్సన్‌ అనే బ్రిటిష్‌ సైనికాధికారి సిక్కు మతం స్వీకరించినట్టే మీరు కూడా స్వీకరించాలని అరూర్‌ సింగ్‌ కోరాడు. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. కానీ మా ప్రభుత్వ నిబంధనలను బట్టి నేను ఈ ఉద్యోగంలో అంత జుట్టు పెంచకూడదు అన్నాడు జనరల్‌ డయ్యర్‌. మీరు సిగరెట్‌ తాగడం మానెయ్యాలన్నాడు అరూర్‌. నా వల్ల కాదన్నాడు డయ్యర్‌. మెల్లగా వదిలిపెట్టండి అన్నాడు అరూర్‌. ప్రయత్నిస్తాను, సంవత్సరానికి ఒక్క సిగరెట్‌ తాగుతాను అన్నాడు డయ్యర్‌. డయ్యర్‌ మీద ఇంత ప్రేమాభిమానాలు కనిపించాయి. 1857 తరహా కలహాన్ని, రక్తపాతాన్ని తప్పించినవాడిగా ఓడ్వయ్యర్‌నీ, డయ్యర్‌నీ బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఎగువ సభ శ్లాఘించింది. మార్నింగ్‌ పోస్ట్‌ అనే ఇంగ్లండ్‌ పత్రిక 26,000 పౌండ్లు వసూలు చేసి పంపించింది. బాధితులకి కాదు, బాధించినవారిని సత్కరించడానికి. ఈ నిధికి సాహిత్య నోబెల్‌ గ్రహీత రుడ్యార్డ్‌ కిప్లింగ్‌ తన వంతు సాయం చేశాడు. హంటర్‌ కమిషన్‌ నివేదిక వెలువడిన తరువాత ఈ దేశం విడిచి వెళ్లిన జనరల్‌ డయ్యర్‌కు (ఇతడు పంజాబ్‌లోనే పుట్టాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు) బహుమానంగా ఇచ్చిన మొత్తం 26,000 పౌండ్లు. డయ్యర్‌ 1927లో పక్షవాతంతో, మెదడులో నరాలు చిట్లి మరణించాడు.

మరి, ఓడ్వయ్యర్‌? 
ఉద్దమ్‌ సింగ్‌ కాల్చి చంపాడు. ఉద్దమ్‌సింగ్‌ని మహా అమరుడు అని పిలుస్తారు. ఆయన జలియన్‌వాలా బాగ్‌ కాల్పులకు ప్రత్యక్ష సాక్షి. ఈ దురంతం సాగించిన వాడి మీద పగ తీర్చుకోవడానికి ఆయన ఇరవై ఒక్క సంవత్సరాలు వేచి ఉన్నాడు. ఉద్దమ్‌సింగ్‌ (డిసెంబర్‌ 26, 1899–జూలై 31, 1940) ఒక పేద కుటుంబంలో పుట్టాడు. పటియాలా సంస్థానంలో ఉన్న సునామ్‌ వారి స్వగ్రామం. ఇది పంజాబ్‌లోనే సంగ్రూర్‌ జిల్లాలో ఉంది. ఉద్దమ్‌ అసలు పేరు షేర్‌సింగ్‌.  తండ్రి తెహల్‌సింగ్‌ కాంభోజ్‌ ఉపాలీ అనే గ్రామంలో రైల్వే క్రాసింగ్‌ దగ్గర కాపలాదారు. తల్లి నారాయణ్‌ కౌర్‌. ఆయన బాల్యం అందమైనది కాదు. తల్లి 1901లోనే కన్నుమూశారు. తండ్రి 1907లో పిల్లలను అక్షరాలా అనాథలను చేసి మరణించారు. పేద కుటుంబం కాబట్టి షేర్‌సింగ్‌ను, ఆయన అన్నయ్య ముక్తాసింగ్‌ను అమృత్‌సర్‌లో ఉన్న  కేంద్ర ఖల్సా అనాథ శరణాలయంలో చేర్పించారు. అక్కడే ఆయనకు సిక్కు మతం ఇచ్చి, ఉద్దమ్‌సింగ్‌ అని పేరు మార్చారు. అన్నయ్య పేరును సాధుసింగ్‌ అని మార్చారు. అదేం దురదృష్టమో సాధుసింగ్‌ పదేళ్ల తరువాత, అంటే 1917లో ఉద్దమ్‌ను ఏకాకిని చేసి హఠాత్తుగా చనిపోయాడు. 1918లో ఉద్దమ్‌ మెట్రిక్యులేషన్‌ చదివిన తరువాత అనాథాశ్రమాన్ని వీడి వెళ్లిపోయాడని అంటారు. కానీ ఆయన జలియన్‌వాలా బాగ్‌ కాల్పులను దగ్గర నుంచి చూడడానికి కారణం, అనాథాశ్రమంలో ఉండడమే కారణమన్న వాదన కూడా ఉంది. ఏమైనా మొదటి ప్రపంచయుద్ధం, గదర్‌ పార్టీ ఆనాడు పంజాబ్‌ను అతలాకుతలం చేసిన కాలమది. ఎటు చూసినా రాజకీయ అలజడే. 

ఏప్రిల్‌ 13న, 1919 వైశాఖి. ఆ రోజు పంజాబీలకు ముఖ్యమైన పండగలలో ఒకటైన ఉగాది. ఒక చోట పశువులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన చూసి వచ్చిన జనమంతా జలియన్‌వాలా బాగ్‌లో ఏర్పాటు చేసిన రాజకీయ సమావేశానికి హాజరయ్యారు. అప్పుడే జనానికి మంచినీళ్లు అందించే స్వచ్ఛంద సేవకులలో ఒకనిగా ఉద్దమ్‌ కూడా పనిచేశారు. ఈ స్వచ్ఛంద సేవకులను ఖల్సా అనాథ శరణాలయం పంపించింది. కాల్పులు జరుగుతుండగా రత్తన్‌దేవి అనే ఆవిడ భర్త గాయపడ్డాడని, అతడిని సురక్షిత ప్రాంతానికి తరలించే పనిలో ఉండగానే ఉద్దమ్‌కు తూటా గాయం తగిలిందని చెప్పే సమాచారం కూడా ఉంది. అదంతా చూసిన తరువాత ఉద్దమ్‌ ఆంగ్ల జాతి మీద కక్ష పెంచుకున్న మాట నిజం.  1920 చివర ఉద్దమ్‌ కూలీగా తూర్పు ఆఫ్రికా వెళ్లిపోయాడు. అక్కడ నుంచి అమెరికా చేరుకున్నాడు. డెట్రాయిట్‌లో ఉన్న ఫోర్డ్‌ కంపెనీలో టూల్‌ మేకర్‌గా ఉద్యోగం చేశాడు. తరువాత శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాడు. అక్కడే ఆయనకు గదర్‌ పార్టీ సభ్యులతో పరిచయం ఏర్పడింది. ఇందులో ఎక్కువగా పంజాబీ సిక్కులే పనిచేసేవారు. భార™Œ లో సాగుతున్న ఇంగ్లిష్‌ దుష్ట పాలనను అంతం చేయడానికి అమెరికా ఆసరాగా సాయుధ విప్లవం తీసుకురావడమే గదర్‌ పార్టీ ఉద్దేశం. ఆ పార్టీలో చేరిన తరువాత అమెరికా అంతా తిరుగుతూ మద్దతు కూడగట్టే యత్నం చేశారు. ఆ క్రమంలో ఆయన షేర్‌సింగ్, ఉదేసింగ్, ఫ్రాంక్‌ బ్రెజిల్‌ పేర్లతో సంచరించేవారు.

గదర్‌ ఏ గంజ్‌ అనే పత్రికను ఆయన నడిపేవారు. ఈ దశలోనే 1927లో భారతదేశం రావలసిందిగా తను ఎంతో ఆరాధించే భగత్‌సింగ్‌ నుంచి పిలుపు వచ్చింది. కానీ భారతదేశం రాగానే ఆయనను అరెస్టు చేశారు. ఐదేళ్లు కారాగార శిక్ష పడింది. అక్టోబర్‌ 23, 1931న బయటకు వచ్చిన ఉద్దమ్‌కు అనేక బాధాకరమైన విషయాలు తెలిశాయి. అందులో ఒకటి 1931, మార్చి 23న భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లను ఉరి తీసిన సంగతి. ఇంకొకటి– జలియన్‌వాలా బాగ్‌ కాల్పులకు పాల్పడిన జనరల్‌ డయ్యర్‌ 1927లో చనిపోయాడు. ఉద్దమ్‌ తన స్వగ్రామం చేరుకున్నాడు. కానీ ఆయన మీద నిరంతర నిఘా ఉండేది. భగత్‌సింగ్‌ ఆరంభించిన హిందుస్తాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌లో ఆయన సభ్యుడు. పోలీసుల కన్నుగప్పడానికి మళ్లీ ఒక కొత్త పేరు పెట్టుకున్నాడు. అది – మహమ్మద్‌ సింVŠ  ఆజాద్‌. వృత్తి బోర్డుల మీద వ్యాపార ప్రకటనలు రాయడం. ఈ పేరుతో రహస్యంగా  లండన్‌ వెళ్లాలని ఆయన ఆలోచించారు. ఎందుకు? డయ్యర్‌ చనిపోయినా, కాల్పులకు ఆదేశాలు ఇచ్చిన నాటి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఓడ్వయ్యర్‌ బతికే ఉన్నాడు. అతడిని చంపాలి. 

మొదట పోలీసు వేషంలో కశ్మీర్‌ చేరుకున్నారు ఉద్దమ్‌. అక్కడ నుంచి జర్మనీ వెళ్లపోయారు. అక్కడ నుంచి ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఆపై  ఆస్ట్రియా చేరుకున్నారు. ఇవన్నీ దాటుకుంటూ వచ్చి 1934 నాటికి లండన్‌ చేరుకున్నారు. తూర్పు లండన్‌లో 9, ఆడ్లర్‌ స్ట్రీట్, వైట్‌చాపెల్‌ అనే చోట మకాం ఏర్పాటు చేసుకున్నారు. ఒక కారు కూడా కొన్నారు. ఆయన అక్కడ గడిపిన తీరు చిత్రంగా ఉంటుంది. పెయింటర్‌గా, వ్యాపార ప్రకటనలు రాసే కళాకారునిగా, మోటార్‌ మెకానిక్‌గా ఆయన అవతారాలు ఎత్తాడు. ఆఖరికి అలెగ్జాండర్‌ కోర్డా అనే ఆయన నిర్మించిన ఒకటి రెండు చిత్రాలలో అతిథి నటునిగా కూడా వేషాలు వేశారు.  మొత్తానికి ఒకరోజు మైఖేల్‌ ఓడ్వయ్యర్‌ ఒక సమావేశానికి వస్తున్న సంగతి ముందుగానే తెలుసుకున్నాడు ఉద్దమ్‌. కాక్స్‌టన్‌ హాలులో సెంట్రల్‌ ఏసియన్‌ సొసైటీ, ఈస్ట్‌ ఇండియా అసోసియేషన్‌ సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడాలి. ఆ కార్యక్రమం మార్చి 13, 1940న జరిగింది. అప్పటికే ఉద్దమ్‌ ఒక పబ్‌లో ఒక సైనికుడిని ఒక రివాల్వర్‌ను సంపాదించాడు. ఒక పుస్తకం లోపల పేజీలు రివాల్వర్‌ పట్టడానికి అనుకూలంగా తొలిచి, అందులో దానిని దాచి హాలులోకి వెళ్లాడు ఉద్దమ్‌. ఇక సమావేశం ముగుస్తుందనగా ఉద్దమ్‌ వేదిక ముందుకు వెళ్లి ఒడ్వయ్యర్‌కు గురిపెట్టి రెండుసార్లు రివాల్వర్‌ కాల్చాడు. ఒకటి గుండెలలో దూసుకుపోయింది. మరొకటి ఊపిరి తిత్తులను చీల్చుకుంటూ వెళ్లింది. అక్కడికక్కడే ఒడ్వయ్యర్‌ మరణించాడు. ఉద్దమ్‌ పోలీసులు వచ్చేదాకా అక్కడే నిలబడి ఉన్నాడు. అక్కడే ఉన్న ఇండియా వ్యవహారాల కార్యదర్శి జెట్‌లాండ్‌ మీద కూడా కాల్పులు జరిపి గాయపరిచారాయన. ఉద్దమ్‌ చర్య హేయమైనదని గాంధీ, నెహ్రూ ప్రకటించారు.

ఉద్దమ్‌ను బ్రిక్స్‌టన్‌ జైలులో ఉంచారు. అక్కడ తన నిరసన వ్యక్తం చేస్తూ 42 రోజులు ఆయన నిరాహార దీక్ష చేశారు. చివరికి జైలు అధికారులు ఆయనకు బలవంతంగా ఆహారం అందించారు. పాత బీలే అనేచోట ఉన్న సెంట్రల్‌ క్రిమినల్‌ కోర్టులో జూన్‌ 4, 1940న జస్టిస్‌ అట్కిన్సన్‌ ఆయనను విచారించాడు. ఉద్దమ్‌ తరఫున నాడు ఉద్దండులైన సెయింట్‌ జాన్‌ హచిన్సన్, వీకే కృష్ణమీనన్‌ వాదించారు. జలియన్‌వాలా బాగ్‌ రక్తపాతానికి ప్రతీకారంగానే తాను ఈ హత్య చేశానని, ఆ శిక్ష ఓడ్వయ్యర్‌ తగినదేనని ఉద్దమ్‌ న్యాయమూర్తికి చెప్పాడు. మాతృదేశం కోసం చనిపోవడానికి తాను సిద్ధంగానే ఉన్నానని కూడా వెల్లడించాడు. ఇందుకు ఇరవై ఒక్క ఏళ్లుగా వేచి ఉన్నానని, నా జీవిత ధ్యేయం నెరవేరిందని ధైర్యంగా ప్రకటించారాయన. ఉద్దమ్‌ ఉపన్యాసం పత్రికలలో రాకూడదని న్యాయమూర్తి ఆదేశించాడు. జూలై 31న పెంటన్‌విల్లే కారాగారంలో ఆయనను ఉద్దమ్‌ను ఉరి తీశారు. అక్కడే ఖననం చేశారు. 1974లో ఆయన శరీర శకలాలు కొన్ని తెచ్చి ఆయన స్వగ్రామంలో సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు.  (జలియన్‌వాలాబాగ్‌ సంఘటనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా)
డా. గోపరాజు నారాయణరావు 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు