రాజస్థానీ కిచెన్ | Sakshi
Sakshi News home page

రాజస్థానీ కిచెన్

Published Sun, Aug 9 2015 1:01 AM

Rajasthani Kitchen

మావా కచోరీ

కావలసినవి: మైదా - 1 కప్పు, నెయ్యి- 2 చెంచాలు, గోరు వెచ్చని నీళ్లు - అరకప్పు, క్రీమ్- అరకప్పు, పాలపొడి-1 కప్పు, డ్రైఫ్రూట్స్ - పావుకప్పు, యాలకుల పొడి- అరచెంచా, చక్కెర - 3 చెంచాలు
 
తయారీ: స్టౌమీద గిన్నె పెట్టి పాలపొడి, క్రీమ్ వేసి, దగ్గరగా అయ్యే వరకూ ఉడికించాలి. దీన్నే ‘మావా’ అంటారు. ఈ మావాలో డ్రైఫ్రూట్స్, చక్కెర, యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి.

ఓ గిన్నెలో మైదా, నెయ్యి, నీళ్లు వేసి ముద్దలా చేసుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, వాటిని చపాతీల్లా ఒత్తి, మధ్యలో మావా పెట్టి, ఫొటోలో చూపినట్టు చుట్టేయాలి. తర్వాత వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసి... బాదం, పిస్తా పప్పులతో అలంకరించాలి.  
 
గట్టా కడీ

కావలసినవి: శెనగపిండి - అరకిలో, కారం - 3 చెంచాలు, పసుపు - 1 చెంచా, ఉప్పు - చిటికెడు, నూనె - 4 చెంచాలు, కొత్తిమీర తరుగు - 2 చెంచాలు
 గ్రేవీ కోసం: పెరుగు - 1 కప్పు, కారం - 1 చెంచా, పసుపు - అరచెంచా, ఇంగువ - చిటికెడు, ఉప్పు - తగినంత, ధనియాల పొడి - 1 చెంచా, జీలకర్ర - అరచెంచా
 
తయారీ: ఓ బౌల్‌లో శెనగపిండి, కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి. దీనిలో కొద్దిగా నీరు పోసి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, నూనెలో ఎరుపురంగు వచ్చేవరకూ వేయించి పక్కన పెట్టాలి. మరో బౌల్‌లో పెరుగు, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర, ఇంగువ వేసి బాగా కలపాలి. స్టౌమీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేయాలి. ఇందులో పెరుగు మిశ్రమం వేసి, తక్కువ మంట మీద మరిగించాలి. మిశ్రమం చిక్కబడ్డాక శెనగపిండి ఉండలను వేసి మూతపెట్టాలి. మరీ దగ్గరగా అవ్వకుండా కాస్త పల్చగా ఉండ గానే దించేసి కొత్తిమీర చల్లుకోవాలి. ఇది రోటీల్లోకి బాగుం టుంది.
 
బంజారీ గోస్ట్

కావలసినవి:
మటన్ - అరకిలో, ఉల్లిపాయలు - పావు కిలో, గరం మసాలా - 50 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు, కారం - 25 గ్రా., పసుపు - 1 చెంచా, ధనియాల పొడి - 2 చెంచాలు, పెరుగు - 1 కప్పు, ధనియాలు - 2 చెంచాలు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా
 
తయారీ: నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేయాలి. రెండు నిమిషాలు వేయించాక పెరుగు, మటన్ వేసి మూత పెట్టాలి. కాసేపు ఉడికించాక ధనియాలను దంచి కూరలో వేయాలి. మూత పెట్టేసి, సన్నని మంటమీద కూర దగ్గరగా అయ్యేవరకూ ఉడికించి దించేసి కొత్తిమీర చల్లాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement