Sakshi News home page

నిజాలు దేవుడికెరుక: ముక్కలైంది దేహమా ? హృదయమా ?

Published Sun, Feb 16 2014 3:35 AM

నిజాలు దేవుడికెరుక: ముక్కలైంది దేహమా ? హృదయమా ?

ఇరవయ్యేళ్లు రాకుండానే మోడలింగ్ ప్రపంచాన్ని ఏలింది. ఇరవయ్యేళ్లు నిండకుండానే ప్రపంచాన్ని వదిలిపోయింది. ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతుందనుకున్న ఆమె... ఎత్తయిన భవనం మీద నుంచి పడి మరణించింది. అసలేం జరిగింది? ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా హత్య చేశారా? అమెరికాలో సంచలనం సృష్టించిన ప్రముఖ మోడల్ రుస్లానా మరణోదంతం... ఈవారం ‘నిజాలు దేవుడికెరుక’లో!
 
 జూన్ 28, 2008. మధ్యాహ్నం రెండున్నర కావస్తోంది. మన్‌హట్టన్ (అమెరికా)లోని 130 వాటర్‌స్ట్రీట్ రద్దీగా, వాహనాల రాకపోకలతో రొదగా ఉంది. ఎవరి పనుల మీద వాళ్లు హడావుడిగా తిరుగుతున్నారు. కార్లు వరుసకట్టి వస్తూ పోతూనే ఉన్నాయి. అంతలో... ఉన్నట్టుండి ఏదో బరువైన వస్తువు నేలమీద దబ్బున పడిన చప్పుడు. ఆ వెంటనే ఓ పెద్ద గావు కేక. అంత రొదలోనూ ఆ కేక అందరికీ స్పష్టంగా వినిపించింది. వేగంగా వెళ్లిపోతున్న కార్లకు సడెన్ బ్రేకులు పడ్డాయి. వడివడిగా సాగుతోన్న పాదాలు ఠక్కున ఆగిపోయాయి. అందరూ ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందా అని చూశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్కక్షణం కొయ్యబారిపోయారు.
 
 పన్నెండంతస్తులు ఉన్న ఒక అపార్ట్‌మెంట్ ఆవరణలో... రక్తపు మడుగులో పడివుంది ఓ అమ్మాయి. బాగా ఎత్తునుంచి పడిందని ఆమె శరీరం ఉన్న స్థితిని బట్టి అర్థమవుతోంది. ఎముకలు విరిగిపోయాయి. తల పగిలి రక్తం ధారగా రోడ్డు మీద పరుచుకుంటోంది. అందరూ ఆ అమ్మాయి వద్దకు పరుగులు తీశారు. కానీ ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేకపోయింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. క్షణాల్లో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కానీ అప్పటికే ఆమె ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ‘‘మైగాడ్... ఈమె రుస్లానా కదూ’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ ఆమెను చూస్తూనే. అప్పుడుగానీ ఎవరూ ఆమెని పరిశీలనగా చూడలేదు. చూసిన తర్వాత ఎవరికీ నోటమాట రాలేదు. ‘‘రుస్లానా చనిపోయిందా’’ అంటూ షాకయిపోయారు. పోలీసులు రుస్లానా దేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కి పంపించారు. ‘‘ప్రముఖ మోడల్ రుస్లానా చనిపోయింది. బహుశా సూసైడ్ కావచ్చు’’ అంటూ వార్త విడుదల చేశారు.
    
 రుస్లానా కొర్షునోవా... ఈ పేరుని ఎందరో యువకులు మంత్రంలా జపించారు. ఆమె రూపాన్ని మనసుల్లో నిలుపుకుని ఆరాధించారు. రష్యాలో పుట్టిన ఆ సౌందర్యం... అతి చిన్న వయసులోనే మోడలింగ్ ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకుంది. వోగ్ లాంటి ప్రముఖ పత్రికలన్నీ ఆమె చిత్రాన్ని కవర్ మీద ముద్రించేందుకు పోటీపడ్డాయి. కజకిస్తాన్ సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్నప్పుడు అక్కడ పుట్టింది రుస్లానా. ఐదేళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి, అన్నల సంరక్షణలో పెరిగింది. మహా తెలివైంది. రష్యన్, కజక్, ఇంగ్లిష్, జర్మన్ భాషలు అనర్గళంగా మాట్లాడేది. పదిహేనేళ్ల వయసులో రుస్లానాని చూసిన ఓ పత్రికవారు ఆమె ఫొటోని ప్రచురించారు. అంతే... ఆ ఒక్క ఫొటో ఆమె జీవితాన్ని మార్చేసింది. ప్రముఖ మోడలింగ్ ఏజె న్సీలు ఆమె ఇంటి తలుపు తట్టాయి. ఏడాది తిరిగేసరికి పెద్ద పెద్ద కంపెనీలకు మోడల్‌గా పనిచేసే స్థాయికి ఎదిగింది. పలు దేశాలు పర్యటించింది. చివరికి అమెరికాలో సెటిలయ్యింది. కన్నుమూసి తెరిచేలోగా ఇంత సాధించిన రుస్లానా... అర్ధంతరంగా కన్నుమూయడం అందరికీ పెద్ద షాక్! వర్ణించలేనంత అందం. ఇరవై నిండని లేత వయసు. బోలెడంత భవిష్యత్తు. ఆమె ఆత్మహత్య చేసుకుందా? ఇంత చిన్న వయసులో బలంతంగా ప్రాణాలు తీసుకుందా? అందరిలోనూ ఇదే ఆలోచన... ఆవేదన.
    
 ‘‘ఇది ఆత్మహత్యేనంటారా సార్’’
 సబార్డినేట్ అడిగిన ప్రశ్నకు చురుక్కున చూశాడు ఇన్‌స్పెక్టర్. ‘‘ఆ అనుమానం ఎందుకొచ్చింది?’’ అన్నాడు.
 ‘‘ఏం లేదు సార్. ఆ అమ్మాయి ఫేమస్ మోడల్ కదా? ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం తనకేముంటుంది?’’ తన సందేహాన్ని బయటపెట్టాడు.
 ‘‘మొదట నేనూ అలానే ఆలోచించాను. కానీ ఆమెది  హత్య అనడానికి ఎలాంటి ఆధారాలూ లభించలేదు. సూసైడేనేమో అనిపిస్తోంది.’’
 ‘‘అలాగైతే సూసైడ్ నోట్ పెట్టేది కద సార్’’
 సమాధానం చెప్పలేదు ఇన్‌స్పెక్టర్. సూసైడ్ నోట్ కోసం చాలా వెతికారు. అలాంటిదేమీ దొరకలేదు. ఎవరికీ చెప్పకుండా, ఏ కారణం లేకుండా ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? అంత అవసరం ఏమొచ్చింది?
 ఇలా ఆలోచిస్తుండగానే ఇన్‌స్పెక్టర్ మనసులో ఫ్లాష్‌లా మెదిలింది ఓ ఆలోచన. ‘‘రుస్లానాకి ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండాలి కదూ?’’ అన్నాడు సాలోచనగా.
 ‘‘అవున్సార్... మార్క్ కమిన్‌స్కీ. కొద్ది నెలల కిత్రమే బ్రేకప్ అయ్యారు. అంతకుముందు ఆటెమ్ పెర్షనాక్ అనే అతణ్ని ప్రేమించింది. అతడి నుంచి విడిపోయిన తరువాత మార్క్‌కి దగ్గరయ్యింది.’’  ‘‘ఇంకెందుకు లేటు... తీసుకురా ఇద్దరినీ’’ అంటూ ఫైల్‌లో తల దూర్చాడు ఇన్‌స్పెక్టర్.
    
 ‘‘చెప్పండి. రుస్లానా ఎందుకు చనిపోయింది?’’
 ఇన్‌స్పెక్టర్ ప్రశ్నకి ముఖముఖాలు చూసుకున్నారు మార్క్, ఆర్టెమ్‌లు. ‘‘మాకేం తెలుసు సార్’’ అన్నారు ముక్త కంఠంతో.
 ‘‘మరెవరికి తెలుస్తుంది?’’... ఇన్‌స్పెక్టర్ గొంతు ఖంగుమంది. ‘‘ఐడియా లేదు సార్. నాకయితే తెలీదు’’ అన్నాడు ఆర్టెమ్. ‘‘అంటే నాకు తెలుసనా?’’ కంగారుపడ్డాడు మార్క్. ‘‘ఎవరికి తెలుసు, ఎవరికి తెలీదు అని మీలో మీరు వాదించుకోనక్కర్లేదు. అది మేం తేలుస్తాం’’... కాస్త కరుగ్గా అన్నాడు ఇన్‌స్పెక్టర్. ‘‘తనూ నేనూ విడిపోయి చాలా కాలమయ్యింది సర్. తన మరణవార్త విని షాకయ్యాను. మా ఇద్దరికీ సరిపడలేదన్నమాటే గానీ తను చాలా మంచి అమ్మాయి. ఇలా అవుతుందని అనుకోలేదు’’... ఆర్టెమ్ గొంతులో బాధ కారణంగా జీర వచ్చింది. అతడు చెప్పేది నిజమేనని అది నిర్ధారించింది. నీ సంగతేంటి అన్నట్టు చూశాడు ఇన్‌స్పెక్టర్ మార్క్ వైపు. ‘‘తను చాలా ఎమోషనల్ సర్. ప్రతి చిన్నదానికీ ఫీలవుతుంది. నేనేమో హుషారుగా ఉండే టైపు. దాంతో ఇద్దరికీ స్పర్థలు వచ్చాయి. విడిపోయాం.’’ సబార్డినేట్ వైపు చూసి పెదవి విరిచాడు ఇన్‌స్పెక్టర్. వాళ్లిద్దరికీ సంబంధం ఉంటుందని అతడు కూడా అనుకోలేదు. కానీ ఏదైనా ఉంటే బయటపడుతుంది కదా అని ఓ రాయి వేశాడంతే. చేసేదేమీ లేక వాళ్లని పంపేశాడు.
 
అయితే, మార్క్ తనని వదిలేయడాన్ని తట్టుకోలేకే మరణించింది కాబట్టి ఆమె చావుకు మార్కే బాధ్యుడని కొందరు వాదించారు. అందుక్కారణం... రుస్లానా బ్లాగ్‌లో కన్పించిన వ్యాఖ్యలు. ‘‘ఒంటరినైపోయాను. హృదయం ముక్కలైతే ఇంత బాధా? దీన్నుంచి బయటపడాలని ఉంది. కానీ నావల్ల కావడం లేదు. నన్నెందుకు వదిలేశాడో అడగాలనుంది. కానీ ఫలితం ఉండదు’’... ఇలా ఎన్నో రాసింది రుస్లానా. కానీ ఎక్కడా మార్క్ పేరు రాయలేదు. అందుకే ప్రేమ విఫలమైన బాధతో ప్రాణాలు తీసుకుందంటూ కేసు క్లోజ్ చేశారు.
 రుస్లానాకి ఎత్తయిన ప్రదేశాలంటే భయమని, తొమ్మిదో అంతస్తునుంచి దూకే ధైర్యం ఆమె చేయలేదని స్నేహితులు అన్నారు. కొండ ప్రదేశాల్లో షూటింగ్ చేసేటప్పుడు ఆమె ఎంత టెన్షన్ పడేదో కొలీగ్‌‌స వివరించారు. కానీ ఆధారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే చట్టం, వారి మాటలను విన్పించుకోలేదు. రుస్లానా మరణం గురించి మరో ఆలోచన చేయలేదు. కేసును మళ్లీ తెరవనూ లేదు. అందుకే రుస్లానా మరణం, చరిత్రలో ఆత్మహత్యగానే మిగిలిపోయింది.
 
 రుస్లానాని కొందరు సెక్స్ రాకెట్లో ఇరికించాలని చూశారని, ఆమె కాదనడంతో చాలా వేధించారని, వాళ్లే ఆమెను చంపి ఉండొచ్చని రుస్లానా ఫ్రెండ్ ఒకామె చెప్పింది. కానీ సాక్ష్యాలు దొరకలేదు. మార్‌‌కతో విడిపోయాక మనోవేదనతో ఆమె ఓ మెడికల్ సెంటర్‌లో కౌన్సెలింగ్ క్లాసులు తీసుకుందని తెలిసింది. దాంతో మానసిక వ్యథే ఆత్మహత్యకు పురికొల్పిందన్నారు పోలీసులు.
 - సమీర నేలపూడి

Advertisement
Advertisement