నింగిని గెలిచింది! | Sakshi
Sakshi News home page

నింగిని గెలిచింది!

Published Sun, Mar 6 2016 1:07 AM

నింగిని గెలిచింది!

 ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. జీవితంలో ముందుకు సాగాలంటే... అలా ఉండటం చాలా అవసరం. ఆ లక్షణం నాకు ఉండబట్టే... నేను విషాదాల్లో సైతం నవ్వగలిగాను. పడినప్పుడల్లా లేచి నిలబడగలిగాను
 - సరళా థక్రాల్
 
 ‘‘ఏవండీ... నాకు కూడా పైలట్ అవ్వాలని ఉంది. చిన్నప్పట్నుంచీ నాకు ఆకాశంలో ఎగరాలని ఆశ.’’1935వ ప్రాంతంలో ఓ మహిళ... ఓ ఇంటి కోడలు... ఒక వ్యక్తికి అర్థాంగి... ఓ బిడ్డకు తల్లి... ఈ మాట అన్నదంటే ఊహించడం కష్టం. ఎందుకంటే మహిళ అంటే గడప లోపల జీవించేది తప్ప గడప దాటి వెళ్లదగినది కాదు అన్న అభిప్రాయం బలంగా పాతుకుపోయిన కాలమది. ఆడదాని ఆశలు మనసు పొరల మాటున ఉండాలే తప్ప మాటల్లో వెలువడకూడదని శాసించిన సమయమది. కానీ అవేవీ సరళ మనసుకు కళ్లెం వేయలేకపోయాయి. ఆమె కోరికను పెదవులు దాటి రాకుండా కట్టడి చేయలేకపోయాయి.అన్నదే కానీ చాలా భయపడింది సరళ. ఒకవేళ భర్త కోప్పడితేనో? తన ఆశను అత్తింటివారు అపార్థం చేసుకుంటేనో?
 
 కానీ అలా జరగలేదు. సరళ భర్త పీడీ శర్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కళ్లతోనే అంగీకారం తెలిపారు. మీరేం అంటారు అన్నట్టు భయంభయంగా మామగారివైపు చూసింది సరళ. ‘మన ఇంట్లో మీ ఆయనతో కలిపి ఇప్పటికి తొమ్మిది మంది పైలట్లు ఉన్నారు. నువ్వూ కలిస్తే పదిమంది అవుతారు’ అన్నారా యన నవ్వుతూ.  సరళ సంతోషం అంబరానికి ఎగసింది. కన్ను మూసి తెరిచేలోగా ఆమె ఎక్కిన విమానం కూడా అంబరంలో అడుగిడింది. విమానాన్ని నడిపిన తొలి మహిళగా ఆమె పేరు చరిత్ర పుటల్లో లిఖితమయ్యింది.
 
 ఆకాశానికి ఎగిరిన క్షణంలో ఒక్కటే అనుకున్నారు సరళ... ‘ప్రతి మగవాడి విజయం వెనుకా ఓ ఆడది ఉంటుంది అంటారు. కానీ ఆడదాని విజయం వెనుక మగవాడూ ఉంటాడని తొలిసారి తెలిసి వచ్చింది. నా భర్తే లేకుంటే నా ఈ ఆశ నెరవేరేది కాదు. ఆయన నాతో ఉన్నంత కాలం నా పయనం ఆగదు.’ ఆమె సంతోషం చూసి దేవుడికి కన్ను కుట్టిందో ఏమో... సరళ భర్తని తన దగ్గరకు తీసుకు పోయాడు.
 
  ఓ విమాన ప్రమాదంలో సరళ భర్త శాశ్వతంగా ఆమెను వదిలిపోయాడు. ఆ విషాదం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ అదే తలచు కుంటూ కుమిలిపోలేదామె. తన భర్త అండతో సాధించిన విజయాన్ని వృథాగా పోనివ్వకూడదనుకున్నారు. కమర్షియల్ పైలట్ లెసైన్సును పొంది తన భర్త ఆశను నెరవేర్చాలనుకున్నారు. కానీ దురదృష్టం ఆమెను మరోసారి వెంటాడింది. రెండో ప్రపంచ యుద్ధం మొదలై సివిల్ ట్రైనింగ్ పూర్తిగా రద్దయ్యింది.
 
 ఒక గాయం పూర్తిగా మానకముందే మరో గాయం. ఒక కన్ను తడి ఆరేలోపే మరో కంట కన్నీటి సంద్రం. ఓ పక్క తోడు దూరమైంది. మరోపక్క ఆశ ఆవిరైంది. ఏం చేయాలో తెలియని స్థితిలో చాలాకాలం కొట్టుమిట్టాడారు సరళ. తర్వాత లాహోర్ వెళ్లిపోయారు. ఓ కాలేజీలో చేరి ఫైన్ ఆర్‌‌ట్సలో డిగ్రీ సంపాదించారు. వాటర్ పెయిం టింగ్‌తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్, జ్యూయెలరీ మేకింగుల్లో నైపుణ్యం సంపాదించి వాటినే తన జీవన భృతిగా మార్చుకున్నారు. తర్వాత దేశం విడిపోవడంతో తన జన్మస్థమైన ఢిల్లీకి వెళ్లిపోయారు. పి.పి. థక్రాల్‌ను రెండో వివాహం చేసుకున్నారు.
 
 ఇరవై నాలుగేళ్లకే వైధవ్యం వంటి భయంకర విషాదం... ఇరవై ఒక్కేళ్లకే విమానం నడిపిన విజయానందం... ఈ పడటాలూ లేవటాలూ సరళకు చాలా పాఠాలు నేర్పాయి. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, ఉన్నప్పుడు ప్రతి క్షణాన్నీ మనకు తగ్గట్టుగా మార్చుకోవాలి అని నమ్మారామె. వేసే ప్రతి అడుగూ విజయ తీరాలకే చేరాలని అనుకున్నారు. ఫ్యాషన్ డిజైనర్‌గా సైతం ప్రత్యేక గుర్తింపు పొందారు. విజయలక్ష్మీ పండిట్ లాంటి మహామహులకి దుస్తులు డిజైన్ చేసేంత ఖ్యాతి గడించారు. 2008 మార్చిలో కన్ను మూసేవరకూ కూడా సరళ విజేతగానే బతికారు, విజేతగానే మిగిలారు!        ఠి
 
 సరళ భర్త ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కళ్లతోనే అంగీకారం తెలిపారు. మీరేం అంటారు అన్నట్టు భయంభయంగా మామగారివైపు చూసింది సరళ.
 

Advertisement
Advertisement