అక్షర జ్యోతి | Sakshi
Sakshi News home page

అక్షర జ్యోతి

Published Sun, Mar 6 2016 12:22 AM

అక్షర జ్యోతి

 ‘‘కదలిరండి... చదువుకోండి. స్వశక్తితో నిలవండి. శ్రమించండి. విజ్ఞానం, ధనం ఆర్జించండి. విజ్ఞానం లేకుంటే... అన్నీ నిష్ర్పయోజనమే. వివేచన లేదంటే... మనం వింత పశువులమే.
 - సావిత్రీబాయి
 

 సంఘ సంస్కరణ... స్త్రీ విద్య... కుల వివక్షపై పోరాటం... వితంతువులకు తగిన గౌరవం కోసం ఉద్యమం... ఇవన్నీ ఇప్పటికీ మనం చూస్తున్న విషయాలే! వింటున్న మాటలే!! ఈ అంశాలను తల కెత్తుకొని పోరాడు తున్న వాళ్ళను ఉద్యమకారులనో, స్త్రీవాదులనో, మరొకటో ఇప్పుడు అంటున్నాం.  కానీ, ఇప్పటికి 150 ఏళ్ళ క్రితమే వీటి కోసం గళం విప్పి, కదం తొక్కిన మనిషి, అందునా మహిళ ఒకరు ఉన్నారంటే నమ్ముతారా? బ్రిటిషువారి ఏలుబడిలోనే ఒక అమ్మ మరెందరో అమ్మల అవస్థల్ని తప్పించడం కోసం ఈ పోరాటం చేసిందంటే మీరేమంటారు? అలాంటి మహిళను ఏమనాలి? అందుకే, ఆధునిక భారతదేశంలో తొలితరం స్త్రీవాది... సావిత్రీ బాయి ఫూలే.
 
  స్త్రీల అభ్యున్నతికి పోరాడే వారికి నిరంతర స్ఫూర్తి. పద్దెనిమిదో శతాబ్దంలోనే ఇంతటి చైతన్యదీప్తి మన దేశంలో మార్గదర్శనం చేసిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆలోచనల్లో, ఆచరణలో కాలానికన్నా ముందున్న సంఘ సంస్కర్త్రి, కవయిత్రి సావిత్రి తన 66 ఏళ్ళ జీవితంలో అధికభాగం సమాజసేవకే అంకితం చేశారు. 1831 జనవరి 3న మహారాష్ర్టలోని నైగావ్‌లో రైతు కుటుంబంలో పుట్టారు సావిత్రి. తొమ్మిదేళ్ళప్పుడు 12 ఏళ్ళ జ్యోతీరావ్ ఫూలేతో పెళ్ళయింది.
 
 అప్పట్లో అన్నీ బాల్య వివాహాలే. పైగా మరణాల రేటు ఎక్కువ. దాంతో, యుక్త వయస్సు రాక ముందే ఎంతోమంది ఆడపిల్లలు వితంతువులుగా మారేవారు. ఆ వితంతువులకు గుండు కొట్టించి, సాదా ఎర్రరంగు చీర కట్టించే వారు. వాళ్ళు కఠోర నియమాలతో జీవితం సాగించాల్సి వచ్చేది. సావిత్రీబాయి ఈ ఆచారాన్ని వ్యతిరేకిస్తూ, వితంతువులకి శిరోముండనం చేయరాదని క్షురకులపై సమ్మె నిర్వహించారు. అలాగే, లైంగిక అత్యాచారానికి గురైన స్త్రీలు సమాజ నిందకు వెరచి ఆత్మహత్య చేసుకోవడమో, కడుపున పుట్టిన పసికందుల్ని చంపేయ డమో చేస్తున్నట్లు సావిత్రి గమనించారు. లైంగిక అత్యాచారానికి గురై గర్భవతు లైనవారి కోసం ‘బాలహత్యా ప్రతిబంధక్ గృహ’ అనే సంరక్షణ కేంద్రం పెట్టారు.
 
 మహిళల్ని బానిసల్లా చూసే రోజుల్లో అధ్యాపకురాలైన తొలి భారతీయ మహిళ కూడా సావిత్రీబాయే! పుణేలోని భిడే వాడాలో 1848లో బాలికల కోసం ఆ దంప తులు తొలిసారి పాఠశాల పెట్టారు. వివిధ కులాలకు చెందిన 8 మంది బాలికలు తొలి రోజునే బడిలో చేరారు. ఉద్యోగానికి ఆడ వాళ్ళు బయటకెళ్ళడం అపచారమనే ఆ రోజుల్లో ఆమె బడికి వెళుతుంటే, మగవాళ్ళు రాళ్ళు విసిరేవారు. బురద, పేడ చల్లేవారు. దాంతో సావిత్రి ఖరాబైన దుస్తులు మార్చు కోవడానికి రోజూ తనతో మరో చీర తీసు కెళ్ళాల్సొచ్చేది! అయినా 1851 నాటికల్లా 150 మంది బాలికలతో 3 స్కూళ్ళు నడిపే స్థాయికెళ్ళారు. చదువు మధ్యలో ఆపకుండా ఉండేందుకు పిల్లలకు ప్రోత్సాహకంగా స్టయిపండ్‌లూ ఇచ్చేవారు.
 
 కుల, లింగ వివక్ష పాటిస్తూ, మను షుల్ని తక్కువగా చూసే పద్ధతిని రూపు మాపాలని ఆమె కృషి చేశారు. అస్పృశ్యు లుగా అందరూ దూరం పెడుతున్నవాళ్ళ కోసం 1868లోనే ఆమె తమ ఇంట్లో బావి తవ్వించారు. వాళ్ళంతా మంచినీటి కోసం దాన్ని వాడుకొనేలా చూశారు. పక్షవాతానికి గురైన భర్తకు దగ్గరుండి సేవచేసిన సావిత్రి, ఆయన చనిపోయినప్పుడు హిందూ ఆచారాల్ని తోసిపుచ్చి, చితి కుండ చేత పట్టి, అంతిమయాత్రలో ముందు నిలిచారు. జ్యోతీరావ్ ఫూలే, సావిత్రి దంపతులకు పిల్లలు లేరు.
 
  ఒక బ్రాహ్మణ వితంతువు బిడ్డ అయిన యశ్వంత్‌రావ్‌ను పెంచుకున్నారు. డాక్టర్‌గా శిక్షణ పొందిన అతనూ తల్లితో పాటు సమాజసేవలో నడిచారు. 1897 ప్రాంతంలో పుణే పరిసరాల్లో భయం కర ప్లేగు వ్యాధి వ్యాపించింది. అప్పుడు రోగులకు చికిత్స అందించడానికి పుణేకు దగ్గరలో, జనావాసాలకు దూరంగా ససానే మాలాలో సావిత్రి తన బిడ్డతో కలసి చికిత్సాలయం ఏర్పాటుచేశారు. తానే స్వయంగా రోగుల్ని తీసుకువెళ్ళి, చికిత్స చేయించేవారు. అలా రోగుల బాగోగులు చూస్తున్నప్పుడే ఆమెకూ ప్లేగు సోకింది. రోగులకు సేవ చేస్తూనే 1897 మార్చి 10న ఆమె కన్నుమూశారు. ఆమె కవితా సంపు టాలు ‘కాబ్య ఫూలే’, ‘బవన్ కషీ సుబోధ్ రత్నాకర్’ మరాఠీ సాహిత్యంలో ప్రసిద్ధం.
 
 ఒక్కమాటలో ఆధునిక భారతదేశంలో స్త్రీ విద్యకు సావిత్రి ఆద్యురాలు. ఇవాళ చదువుకుంటున్న ఆడవాళ్ళందరూ ఆమెకు బుుణగ్రస్థులే. పుణేలో ‘హెరిటేజ్ వాక్’కు వెళితే, సావిత్రి స్థాపించిన బాలికల బడి ఇప్పటికీ సందర్శనీయ స్థలం. ఇవాళ్టికీ అనేకచోట్ల ఆమె జీవితంపై మరాఠీ నాటక ప్రదర్శన జరుగుతుంటే, ఆడిటోరియవ్‌ు హౌస్‌ఫుల్. అలా ఆ స్త్రీమూర్తి జీవితం ఇన్నేళ్ళ తర్వాతా లక్షలమందికి స్ఫూర్తినిస్తోం దంటే అంతకన్నా మణిదీపమెవరుంటారు! చిత్రమేమంటే, జ్యోతిబా ఫూలేకు ఆలస్యంగానైనా భారత సామాజిక విప్లవ పితామహుడిగా గుర్తింపు వచ్చింది. కానీ, ఆయనకు బాసటగా నిలిచి, భారతీయ స్త్రీల స్వేచ్ఛకు శ్వాసనిచ్చిన సావిత్రీబాయ్‌కి దేశ వ్యాప్తంగా అంత గుర్తింపునిచ్చామంటారా!
 
 ఆడవాళ్ళు బయటకెళ్ళడం అపచారమనే ఆ రోజుల్లో ఆమె బడికి వెళుతుంటే, మగవాళ్ళు రాళ్ళు విసిరేవారు. బురద, పేడ చల్లేవారు. దాంతో సావిత్రి ఖరాబైన దుస్తులు మార్చుకోవడానికి రోజూ తనతో మరో చీర తీసుకెళ్ళాల్సొచ్చేది!
 
     - రెంటాల

Advertisement
Advertisement