శల్యసారథ్యం.. కర్ణుడి పరాజయం | Sakshi
Sakshi News home page

శల్యసారథ్యం.. కర్ణుడి పరాజయం

Published Sun, May 7 2017 12:52 PM

శల్యసారథ్యం.. కర్ణుడి పరాజయం

మద్రదేశపు రాజు శల్యుడు. పాండురాజు భార్య మాద్రికి స్వయానా అన్న. పాండవులకు మేనమామ. యుద్ధంలో పాండవులకు సహకరించడానికి బయలు దేరాడు. దారిలో దుర్యోధనుడు కుట్రతో ఆయనకు ఘనస్వాగతం పలికాడు. అడుగడుగునా బ్రహ్మరథం పట్టాడు. శల్యుడు అది ధర్మరాజు చేస్తున్న సత్కారమనే అనుకుని ఆనందంగా స్వీకరించాడు. యుద్ధభూమికి చేరుకున్నాక కానీ నిజం తెలిసి రాలేదు. అప్పటికే చాలా ఆలస్యం అయింది.

యుధిష్ఠిరుడి దగ్గరకు వెళ్లి, ‘‘నాయనా! నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రుడివి. మీ పక్షాన నిలబడి యుద్ధం చేయాలని బయలు దేరాను. అయితే దుర్యోధనుడు దుర్బుద్ధితో నాకు ఘనంగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశాడు. అవి మీరే చేసి ఉంటారనే భ్రమంతో నేను వాటన్నింటినీ స్వీకరించాను కాబట్టి అతడు దుర్మార్గుడైనప్పటికీ నేను అతని పక్షానే యుద్ధం చేయాల్సి వస్తోంది. కానీ నీవు ధర్మపరుడివి, రాజనీతిజ్ఞుడివి కాబట్టి ఈ విపత్కర పరిస్థితి నుంచి బయట పడే ఉపాయం ఆలోచించు’’ అన్నాడు.

ఏమి చేయమంటార ని ధర్మరాజు కృష్ణుడిని సలహా అడిగాడు. అప్పుడు కృష్ణుడిలా చెప్పాడు. ‘‘దుర్యోధనుడి సైన్యంలో కర్ణుడు మహాపరాక్రమవంతుడు. భీష్మ, ద్రోణులు కూడా పరాక్రమవంతులైనప్పటికీ వారు మనస్పూర్తిగా ధర్మరాజు విజయం కోరుకుంటున్నవారే. కాని కర్ణుడు  అలా కాదు. దుర్యోధనుడికి ప్రాణమిత్రుడు. పొరపాటున కూడా అతడు ఓడిపోవాలని కోరుకోడు. పరశురాముడి శిష్యుడు, మహావీరుడు అయిన కర్ణుడిని ఓడించడం అసంభవం. అయితే, శల్యుడు మాత్రమే ఈ అసంభవాన్ని సంభవం చేయగల సమర్థుడు. కాబట్టి, మీరు శల్యుడిని కర్ణుడి రథసారథ్యం వహించమని కోరండి’’ అని చెప్పాడు.

అప్పుడు ధర్మరాజు శల్యుడిని ‘‘మామా! కర్ణుడు కురుసేనకు సైన్యాధిపతి అయినప్పుడు మీరు అతని రథసారథిగా ఉంటూ, అతని మనోబలాన్ని నిరంతరం తగ్గిస్తూ ఉండాలి. ఇందుకోసం మీరు కర్ణుడి వ్యక్తిగత జీవితంలోవి, దుర్యోధనుడి సైన్యంలోని లోటుపాట్లు వినిపిస్తూ, అతన్ని, అతని సైన్యాన్ని నిరంతరం నిందిస్తూ, అతని మనోబలాన్ని కృంగదీయండి’’ అని కోరాడు.

అందుకు అంగీకరించిన శల్యుడు పాండవులు కోరినట్లే సరైన సమయానికి సారథ్యం వహించి, కర్ణుడిని, అతని సైన్యాన్ని నిందిస్తూ, అంచలంచలుగా అతని మనోబలాన్ని దెబ్బతీశాడు. దాంతో కర్ణుడు యుద్ధంలో ఏకాగ్రతను కోల్పోయి, కౌరవుల పరాజయానికి పరోక్ష కారకుడయ్యాడు. అందుకే ఎవరైనా మన పక్షంలోనే ఉంటూ, మనోబలాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతుంటే అలాంటి వారిని శల్యసారథ్యం చేస్తున్నారంటారు.  

ఇక్కడ మనం తెలుసుకోవలసినవి ఏమిటంటే... మనవాడే కదా అని నిర్లక్ష్యం చేయరాదు. మర్యాదలు చేశారు కదా అని మొహమాటానికి పోయి దుర్మార్గుల పక్షం వహించరాదు. మనోబలం దెబ్బతింటే ఎంతటి వీరుడైనా బీరువు కావలసిందే!

Advertisement
Advertisement