Sakshi News home page

స్నాక్ సెంటర్

Published Sun, Jul 3 2016 12:48 AM

స్నాక్ సెంటర్ - Sakshi

మ్యాంగో రవ్వ ఇడ్లీ    
కావలసినవి: ఉప్మా రవ్వ - 1 కప్పు, మామిడిపండ్ల గుజ్జు - 1 కప్పు, పంచదార - 1 కప్పు, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, యాలకులపొడి - పావు టీ స్పూన్, ఎండుకొబ్బరి తురుము - పావు కప్పు, సార పప్పు - 1 టీ స్పూన్ లేదా జీడిపప్పు - 4
 
తయారీ: ముందుగా స్టౌ ఆన్ చేసి పెనం పెట్టి నెయ్యిని వేడి చేసుకోవాలి. అందులో రవ్వను కాస్త రంగు మారేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రవ్వలో మామిడిపండ్ల గుజ్జును వేసి బాగా కలపాలి. తర్వాత అందులో పంచదార వేసి బాగా కలపాలి. ఆపైన కొబ్బరి తురుము, యాలకులపొడి వేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని అందులో పెట్టాలి. అలాగే ఓ గిన్నెలో నీళ్లు పోసి, ఈ ప్లేట్లను అందులో పెట్టి స్టౌపై పెట్టాలి. ఏడెనిమిది నిమిషాల తర్వాత తీసి చూడండి.. నోరూరించే మ్యాంగో స్వీట్ ఇడ్లీ రెడీ. బయటికి తీసిన ఇడ్లీలపై సార పప్పు లేదా జీడిపప్పును పెట్టి గార్నిష్ చేసుకోవాలి. వీటిని ఫ్రిడ్జ్‌లో రెండు గంటలు పెట్టి పిల్లలకు సర్వ్ చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు.
 
 
రాగి స్నాక్స్
కావలసినవి: రాగి పిండి - ఒకటిన్నర కప్పు, బియ్యం పిండి - 1 కప్పు, శనగ పిండి - 1 కప్పు, మినప పిండి (మినప పప్పును గ్రైండ్ చేసుకోవాలి), జీలకర్ర - 1 టేబుల్ స్పూన్, కారంపొడి - 2 టీ స్పూన్లు, ఇంగువ - పావు టీ స్పూన్, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా
 
తయారీ: ముందుగా నాలుగు రకాల పిండ్లను పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. తర్వాత అవి చల్లారాక ఓ పెద్ద గిన్నెలో వేసి బాగా కలపాలి. అందులో జీలకర్ర, ఉప్పు, కారం, ఇంగువ వేయాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లను పోసుకుంటూ పిండి మిశ్రమాన్ని ముద్దగా చేసుకోవాలి. తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకొని.. మురుకులు (జంతికలు) చేసే సాధనంలో పెట్టి ఒత్తుకోవాలి. ఆపైన స్టౌపై బాణలి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. తర్వాత అందులో ఈ మురుకులను కాల్చుకోవాలి. ఒక్క షేప్ అనే కాకుండా వివిధ షేపుల్లో ఈ మురుకులను తయారు చేసుకోవచ్చు.
 
మష్రూమ్ కట్‌లెట్
కావలసినవి: సన్నగా తరిగిన మష్రూమ్స్ - రెండున్నర కప్పులు, ఉడికించిన బంగాళాదుంప (చిదుముకోవాలి) - 1 కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు - అర కప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్, పసుపు - పావు టీ స్పూన్, కారంపొడి - అర టీ స్పూన్, జీలకర్ర పొడి - అర టీ స్పూన్, ఉప్పు - తగినంత, శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఉప్మా రవ్వ - ఒకటిన్నర కప్పు, నూనె - సరిపడా
 
తయారీ: స్టౌపై ప్యాన్ పెట్టి నూనె పోసి, వేడెక్కాక ఉల్లిపాయలు వేయాలి. ఆపైన అల్లం- వెల్లుల్లి పేస్ట్, తరిగిన మష్రూమ్స్ వేసి వేయించాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత శనగపిండి వేసి స్టౌను చిన్న మంటపై పెట్టి దింపేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిదిమిన బంగాళాదుంపతో కలపాలి. ఆపైన కొత్తిమీర తరుగును వేసి కలిపి, కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకొని గుండ్రంగా ఒత్తి ఉప్మా రవ్వలో ముంచాలి. ఇప్పుడు వాటిని పెనంపై నూనె చుక్కలు వేసుకుంటూ రెండువైపులా కాల్చుకోవాలి. (డీప్‌ఫ్రై కూడా చేసుకోవచ్చు)

Advertisement

తప్పక చదవండి

Advertisement