స్నాక్ సెంటర్ | Sakshi
Sakshi News home page

స్నాక్ సెంటర్

Published Sun, Jul 10 2016 12:36 AM

స్నాక్ సెంటర్ - Sakshi

పొటాటో ప్యాన్‌కేక్స్
కావలసినవి:  ఉడికించిన బంగాళాదుంప (చిదుముకోవాలి) - 2 కప్పులు, గుడ్లు - 2 (కావాలనుకుంటేనే), మైదాపిండి - 1 టేబుల్ స్పూన్, అల్లం - వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్, మిరియాల పొడి - అర టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు - 2 టీ స్పూన్లు, చీజ్ - 1 టీ స్పూన్ ఉప్పు - కావలసినంత, నూనె - సరిపడా
 
తయారీ: ముందుగా బౌల్‌లో గుడ్లను కొట్టి, సొనను వేసుకోవాలి. అందులో మైదాపిండి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో చిదిమిన బంగాళాదుంపను వేసి కలపాలి. తర్వాత స్టౌ ఆన్ చేసి, పెనం పెట్టుకోవాలి. కొద్దికొద్దిగా బంగాళాదుంప మిశ్రమాన్ని చేతులోకి తీసుకొని ఫొటోలో కనిపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. వాటిని ఆ పెనంపై నూనెను చల్లుకుంటూ రెండువైపులా కాల్చుకోవాలి. అంతే... ఎంతో రుచికరమైన పొటాటో ప్యాన్‌కేక్స్ రెడీ. వీటిని చీజ్, ఉల్లికాడలతో గార్నిష్ చేసుకోవాలి. చేసుకోవచ్చు.
 
ఓట్స్ దోశ
కావలసినవి: ఓట్స్ - 1 కప్పు, ఉప్మా రవ్వ - పావు కప్పు, బియ్యం పిండి - అర కప్పు, పుల్లటి పెరుగు - పావు కప్పు, జీలకర్ర - 1 టీ స్పూన్, మిరియాల పొడి - పావు టీ స్పూన్, అల్లం - వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు - పావు కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 2 టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, తరిగిన కొత్తిమీర - పావు కప్పు, నూనె - సరిపడా
 
తయారీ: ముందుగా ఓట్స్‌ను కాస్త రంగు మారే వరకు వేయించాలి. అవి పూర్తిగా చల్లారాక, మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో రవ్వ, బియ్యం పిండి, పెరుగు, మిరియాల పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి. దాంట్లో నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. స్టౌ పై పెనం పెట్టి ఆ మిశ్రమాన్ని దోశగా వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసి రెండువైపులా కాల్చుకోవాలి. వీటిని ఏదైనా చట్నీ లేదా సాస్‌తో సర్వ్ చేసుకోవచ్చు.
 
టోస్ట్ స్టిక్స్
కావలసినవి: బ్రెడ్ ముక్కలు (మందంగా ఉన్నవి) - 4, గుడ్లు - 2, పాలు - పావు కప్పు, ఉప్పు - చిటికెడు, పంచదార - పావు కప్పు, దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూన్, వెనిల్లా ఎసెన్స్ - 1 టీ స్పూన్ (కావాలనుకుంటేనే), నూనె - సరిపడా
 
తయారీ: ముందుగా ఒక్కో బ్రెడ్‌ను నాలుగు ముక్కలుగా కట్ చేసి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ బౌల్‌లో గుడ్లను కొట్టి సొనను వేయాలి. అందులో పాలు, వెనిల్లా ఎసెన్స్, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత బ్రెడ్ ముక్కలను ఈ మిశ్రమంలో ముంచి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరోపక్క ఓ ప్లేట్‌లో పంచదార, దాల్చినచెక్క పొడిని చల్లుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కలను ఆ ప్లేట్‌లో రోల్ చేయాలి. ఆ టోస్ట్ స్టిక్స్‌ను స్వీట్ సాస్‌తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదుర్స్. (డీప్ ఫ్రైకి బదులుగా పెనంపై చపాతీలు కాల్చుకున్నట్లు కాల్చుకోవచ్చు)

Advertisement

తప్పక చదవండి

Advertisement