Sakshi News home page

స్నాక్ సెంటర్

Published Sun, Oct 9 2016 1:48 AM

స్నాక్ సెంటర్ - Sakshi

రవ్వ అప్పాలు
కావల్సినవి: నీళ్లు - 1 కప్పు, పంచదార లేదా బెల్లం తురుము - పావు కప్పు, ఉప్మా రవ్వ - అర కప్పు, ఎండు కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - పావు టీ స్పూన్, నెయ్యి లేదా నూనె - సరిపడా

తయారీ: ముందుగా నీళ్లను ఓ గిన్నెలో వేడి చేసుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు, అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేయాలి. ఇప్పుడు ఆ నీటిలో ఓ చేతితో రవ్వను వేస్తూ, మరో చేతితో కలుపుతూ ఉండాలి (అలా చేస్తే, రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది). ఆ తర్వాత ఆ మిశ్రమంలో పంచదార లేదా బెల్లం తురుము, యాలకుల పొడి, ఎండు కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి.

స్టౌ మంట తగ్గించి, 2-3 నిమిషాల తర్వాత మిశ్రమాన్ని దింపేయాలి. మిశ్రమం పూర్తిగా చల్లారాక, దాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకొని ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి లేదా నూనెను రాసుకొని వాటిని కాస్తంత ఒత్తి పక్కన పెట్టుకోవాలి. అలా పిండి మొత్తం అయిపోయాక, వాటిని నెయ్యి లేదా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే రవ్వ అప్పాలు రెడీ. వీటిని తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల నవరాత్రులప్పుడు స్పెషల్‌గా చేసుకుంటారు.
 
రొసాబొళి
కావల్సినవి: పనీర్ (పొడి) - 1 కప్పు, ఉప్మా రవ్వ - 2 టీ స్పూన్లు, యాలకుల పొడి - 1 టీ స్పూన్, పంచదార పొడి - 1 టీ స్పూన్, పాలు - 2 కప్పులు, కుంకుమ పువ్వు - చిటికెడు, పంచదార - 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు ముక్కలు) - 1 టేబుల్ స్పూన్ (గార్నిష్ చేసుకోవడానికి), నూనె - సరిపడా
 
తయారీ:
ఓ గిన్నెలో పనీర్ పొడి, రవ్వ, అర టీ స్పూన్ యాలకుల పొడి, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం మెత్తగా అయ్యాక, దాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకొని ఫొటోలో కనిపిస్తున్న ఆకారాల్లో ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో పాలు పోసి, కలుపుతూ మరిగించాలి. తర్వాత అందులో కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి, పాలు సగం ఇంకిపోయే వరకు మరిగించాలి. ఆపైన అందులో పంచదార వేసి, 10 నిమిషాల వరకు స్టౌను సిమ్‌లో పెట్టాలి. మరోవైపు స్టౌపై ప్యాన్ పెట్టి, నూనెను వేడి చేయాలి. ఆ తర్వాత అందులో పనీర్ టిక్కాలను ఫ్రై చేసుకోవాలి. వాటిని పక్కనే సిమ్‌లో ఉన్న పాలలో వేసి దింపేయాలి. చివరగా వీటిని డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోవాలి. ఈ రొసాబొళిని ఒడిశా రాష్ట్రంలో దసరాకు తప్పనిసరిగా చేస్తారు.
 
బనానా షీరా
కావల్సినవి:
ఉప్మా రవ్వ - 1 కప్పు, అరటిపండ్లు - 3, యాలకుల పొడి - పావు టీ స్పూన్, నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు, పంచదార - అర కప్పు, కుంకుమ పువ్వు - చిటికెడు, వేడి పాలు - రెండున్నర కప్పులు, డ్రై ఫ్రూట్స్ (బాదం, ఎండు ద్రాక్ష, జీడిపప్పు ముక్కలు) - 1 టేబుల్ స్పూన్
 
తయారీ: ముందుగా స్టౌపై ప్యాన్ పెట్టి, కాస్తంత నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అందులో రవ్వను దోరగా వేయించాలి. ఇప్పుడు అరటి పండ్లను ముక్కలుగా చేసుకొని, అందులో వేసి కలపాలి. తర్వాత ఆ మిశ్రమంలో వేడి పాలు పోసి కలపాలి. ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్ ముక్కలు (కావాలంటే వీటిని కూడా నెయ్యిలో వేయించుకోవచ్చు), యాలకుల పొడి వేయాలి. ఆపైన ఆ మిశ్రమంలో పంచదార వేసి, 2-3 నిమిషాలు స్టౌను సిమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు కుంకుమ పువ్వును అందులో వేసి, మరో మూడు నిమిషాలు సిమ్‌లోనే ఉంచాలి. అంతే... ఎంతో రుచికరమైన బనానా షీరా రెడీ. ఈ స్వీట్ మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో దసరా స్పెషల్.

Advertisement

తప్పక చదవండి

Advertisement