బోయవాని సత్యవ్రతం | Sakshi
Sakshi News home page

బోయవాని సత్యవ్రతం

Published Sun, Feb 26 2017 2:01 AM

బోయవాని సత్యవ్రతం

పూర్వం అరుణి అనే ముని ఉండేవాడు. ఆయన దేవకీ నదీతీరంలో నియమ నిష్ఠలతో కూడి, నిత్యం ధ్యానమగ్నుడై ఉండేవాడు. ఓరోజు ఆయన ఎప్పటిలాగే స్నానం చేయడానికని తన దండకమండలాలు, నారదుస్తులు ఒడ్డున పెట్టి, స్నానం చేయడానికని నదిలో దిగబోతుండగా, ఒక వేటగాడు అక్కడికి వచ్చి, ఆ దుస్తులు, దండకమండలాలు తనకు ఇచ్చెయ్యమని బెదిరించాడు. ముని అతనివైపు తదేకంగా చూశాడు. మహా తపశ్శాలి అయిన ఆ ముని కరుణాపూరితమైన చూపులతో ఆ వేటగాడిలోని క్రూరత్వం నశించిపోయింది. ఆ స్థానంలో దయ, జాలి, పెద్దల యెడల గౌరవం చోటు చేసుకున్నాయి.

 వెంటనే తన విల్లంబులను, ఇతర ఆయుధాలను తీసి కిందపడవేసి, తల వంచి భక్తితో మునికి నమస్కరించి, ‘‘మహానుభావా! మీ కన్నులలో ఏమి మహత్తు ఉన్నదో కానీ, మీరు నన్ను చూసిన మరుక్షణం నాలోని హింసాప్రవృత్తి నశించింది. మనసులో తెలియని శాంతి, స్థిమితం నెలకొంది. మీ చూపులకే అంత శక్తి ఉంటే, మీ వాక్కులకు ఇంకెంతో మహిమ ఉండి ఉంటుంది కాబట్టి, దయచేసి నాకు ఏదైనా మంత్రాన్ని ఉపదేశించండి, నేను నా హింసాప్రవృత్తిని విడనాడి, భూతదయను కలిగి ఉండి, ఆ మంత్రాన్ని జపిస్తూ, నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను’’అని ప్రాధేయపడ్డాడు. ముని మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ వేటగాడు మాత్రం మునిని వదిలిపెట్టకుండా ఆయననే  అనుసరిస్తూ, సపర్యలు చేస్తుండేవాడు. ఇలా ఉండగా, ఓనాడు ముని దర్భపొదల నుంచి దర్భలను సేకరిస్తూ ఉండగా,  ఎక్కడినుంచో పులి వచ్చి మీదపడింది. అక్కడే ఉన్న ఆ బోయవాడు తన చేతనున్న గొడ్డలితో దాని మీద ఒక్క దెబ్బ వేశాడు. ముని పులి వంక చూసి, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని అన్నాడు. ఆ మంత్రం చెవిన పడగానే పులి దివ్యదేహాన్ని ధరించి, మునికి నమస్కరించి, ‘‘అక్కడి నుంచి వెళ్లిపోయింది. అదంతా చూస్తూ ఉన్న బోయవాడితో ముని ‘‘ఎప్పడూ సత్యాన్నే పలుకు, తినకూడనిది ఏదీ తినవద్దు. దీనినే వ్రతంలా ఆచరించు’’ అని చెప్పి వడివడిగా సాగిపోయాడు.

 మహాత్ముల చేష్టలకు అర్థాలు వేరుగా ఉంటాయి కదా! ఆ బోయవాడు అదే మహద్భాగ్యంగా భావించి, నాటినుంచి ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతూ, అహింసావ్రతాన్ని చేపట్టి, నిష్ఠగా పాటించసాగాడు. ఓరోజున వేటగాడికి అడవిలో ఎంత వెదికినా ఆహారం దొరకలేదు. దాంతో పండుటాకులను తినబోయాడు. అప్పుడు అశరీరవాణి వాటిని తినవద్దు అని పలికింది. ఆ రోజంతా ఉపవాసం ఉన్నాడు. మర్నాడు కూడా అలాగే జరగడంతో కటిక ఉపవాసం ఉంటూ, ముని పాదపద్మాలనే మనసులో తలచుకుంటూ ధ్యానంలో నిమగ్నమై పోయాడు. రోజులు గడిచాయి.

ఓ రోజు దుర్వాస మహర్షి అక్కడకు వచ్చాడు. ఆయనను చూసి భక్తితో నమస్కరించి, ‘‘స్వామీ! దయచేసి నా ఆతిథ్యం స్వీకరించండి’’ అని పలికాడు బోయవాడు. అతను బక్కచిక్కి ఉన్నాడు కానీ, ముఖంలో దివ్య వర్చస్సు ఉట్టిపడుతోంది. అతన్ని పరీక్షించాలని దూర్వాసుడు ‘‘వత్సా! నాకు బాగా ఆకలిగా ఉంది. మృష్టాన్న భోజనం చేయాలని ఉంది. నువ్వే నిరాహారంతో ఉన్నట్టుగా కనిపిస్తున్నావు. ఇక నాకేమీ పెట్టగలవు?’’ అనడిగాడు. అప్పుడతను ఒక పాత్ర తీసుకుని, పక్కనున్న గ్రామానికి బ్రాహ్మణుల ఇళ్లకు భిక్షాటనకు వెళ్లాడు. ప్రతి ఒక్కరూ అతన్ని ఆదరించి, బోలెడన్ని శాకపాకాలను పాత్రలో నింపి పంపారు.

అతను సంతోషంతో ముని వద్దకు వచ్చి ‘‘స్వామీ! దయచేసి భిక్ష స్వీకరించండి’’ అని కోరాడు. దూర్వాసుడు నేను స్నానం చేయనిదే ఏమీ తినను. నది చూడబోతే చాలా దూరంలో ఉంది. నేను అక్కడికి వెళ్లలేను. నీవే నా స్నానానికి ఏర్పాట్లు చేయి’’ అన్నాడు. ఆ వ్యాధుడు దేవకీ నది వద్దకు వెళ్లి, భక్తితో నమస్కరించి, ‘‘అమ్మా! నేను దూర్వాస మహర్షికి ఆతిథ్యం ఇవ్వదలచుకున్నాను. ఆయన స్నానానికి ఇక్కడకు రాలేని పరిస్థితులలో ఉన్నాడు. నేనే గనక సత్యం పలికే వాడినయితే నువ్వు నాతోబాటు వచ్చి, ముని స్నానానికి సహకరించు!’’ అని కోరాడు.

దేవకీ నది వెంటనే అతని వెంట వచ్చింది. దూర్వాసుడు నదిలో స్నానం చేసి అతని, ఆతిథ్యం స్వీకరించాడు. ‘‘నాయనా! నీ సత్యనిష్ఠకు, భక్తిశ్రద్ధలకు సంతోషించాను. ఇక నుంచి నీవు సత్యవ్రతుడనే పేరుతో ప్రసిద్ధుడవవుతావు. అంతేకాదు, సకల శాస్త్రాలలోనూ పాండిత్యాన్ని పొందుతావు’’ అని ఆశీర్వదించాడు. అతనే తర్వాతి కాలంలో రాజయ్యాడు. మహాత్ములు చెప్పిన దానిని శ్రద్ధగా విని, దానిని నిష్ఠతో పాటించడం వల్లనే కదా, సత్యవ్రతునికి అంతటి ఖ్యాతి లభించింది! అందుకే పెద్దల మాట పెరుగన్నం మూట!

Advertisement

తప్పక చదవండి

Advertisement