మెడ... ఒక బహుళార్థ సాధక అవయవం! | Sakshi
Sakshi News home page

మెడ... ఒక బహుళార్థ సాధక అవయవం!

Published Sun, Mar 5 2017 1:50 AM

మెడ... ఒక బహుళార్థ సాధక అవయవం!

‘‘ఒక అంశం మీద ఎవడి ఆలోచన వాడిది. కానీ తమ ఆలోచనే కరెక్ట్‌ అని ప్రతివాడూ అనుకుంటూ ఉంటాడు’’ అంటూ ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు మా రాంబాబు గాడు. ‘‘అవున్రా. అచ్చం నువ్వు ఎప్పుడూ అనుకునేటట్టే’’ అన్నాను కాస్త సెటైరిక్‌గా. ‘‘ఎవడికి వాడు తాము అనుకునేదే కరెక్ట్‌ అనుకుంటాడు కదా. కానీ ఇక్కడ బ్యూటీ ఏంటంటే... అలా అనుకునే ప్రతివాడూ కరెక్టేరా’’

‘‘అదెలా? ఏదో ఒకటి కరెక్ట్‌ అవుతుంది గానీ... ప్రతివాడిదీ కరెక్ట్‌ ఎలా అవుతుంది? ఒకడిది ఒప్పు అయితే... ఆ మరో వాదం తప్పు కావాల్సిందే కదా’’ అన్నాను. ‘‘నేను చెప్పిందే çకరెక్ట్‌ అనేందుకు ఎన్నో ఉదాహరణలు చెప్పగలను. మొన్న మా అమ్మ ఏమన్నదో తెలుసా? ‘మెడ అనేది ఉండబట్టే కద నాయనా మనం గోల్డ్‌ చైనూ, మంగళసూత్రాలూ  వేసుకోగలుగుతున్నాం’ అంది. మరి మా నాన్న ఏమన్నాడో తెలుసా? ఆయన ప్రఖ్యాత కవి కదా. కీలక అవయవమైన సదరు ‘మెడ’ను ఆయన చూసిన దృష్టి కోణమే వేరు.

‘మనకు మెడ ఉండబట్టే కదరా... సన్మానాలు, సమ్మేళనాలూ జరిగినప్పుడు శాలువాలు... అవీ కప్పించుకోగలుగుతున్నాం. దండలూ గట్రా వేయించుకోగలుగుతున్నాం.  శాలువా కప్పించుకోడానికి ఒంట్లోని ఏ ఇతర అవయవానికి ఈ సౌకర్యం ఉంది చెప్పు’ అంటూ విశ్లేషణాత్మక ధోరణితో ఒక చిన్న లెక్చర్‌ ఇచ్చాడు మా తండ్రిగారు. ఒకవైపు కన్నతల్లీ, మరోవైపున కన్నతండ్రి. ఇప్పుడు చెప్పు... వీళ్లలో ఎవరి వాదనను కరెక్ట్‌ అంటావ్‌. మరెవరి వాదనను కాదంటావ్‌?’’ అడిగాడు వాడు.

‘‘ఒరేయ్‌... ఇవే మాటలు వాళ్లు అన్నారో లేదో నాకు తెలియదు. నువ్వు అనుకునే మాటల్నే వాళ్ల నోట్లో పెడుతున్నావేమో అనిపిస్తోంది. నీ ధోరణి నాకు తెలియనిది కాదు కదా’’ అన్నాను.
‘‘నిజంరా బాబూ.. అంతెందుకు మొన్న కొందరు రాజకీయ కార్యకర్తలూ, వాళ్ల నాయకులూ పిచ్చాపాటీ మాట్లాడుతున్నప్పుడు ‘మెడ–దాని బహుళ ఉపయోగాలు’ అనే అంశం గురించి మరిన్ని విషయాలు తెలిశాయి’’  

‘‘ఏమిటవి?’’
‘‘గతంలో మరో పార్టీ వారు... ఇంకో పార్టీలో చేరదలిస్తే... ఫలానా పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారంటూ న్యూస్‌పేపర్లలో వచ్చేది. కానీ తీరా చూస్తే అక్కడ తీర్థం ఉండదూ... పరికించి చూస్తే ప్రసాదమూ ఉండదు. అయితే ఈమధ్య ఇక్కడ ప్రాక్టికల్‌గా వయబుల్‌ అవుతున్న ఒక  కొత్త మాట పుట్టుకొచ్చింది. అలా అమల్లోకి వచ్చిన ఆ టర్మినాలజీ అక్షరాలా ఆచరణలో జరుగుతోంది కూడా. అదే... ‘కండువా మార్చుకోవడం’. ఒక పార్టీవాడు మరో పార్టీలో చేరాడే అనుకో. వెంటనే సదరు కొత్త పార్టీ వారి కండువాను ఎంతో ఇష్టంగా తొడుక్కుంటారు.

 ఆపేక్షగా తడుముకుంటాడు. గతంలో ఇలాంటి కండువా తరహా ఐడీ కార్డులు ఉండేవి కాదు. ఇక రెండు పార్టీల వారు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటున్నారనుకో. పెళ్లిలో దండలు మార్చుకున్నట్లుగానే... అవతలి పార్టీ కండువాను... ఇవతలి పార్టీవాడికీ... ఇవతలి వాడు అవతలి వాడికీ కప్పుతుంటారు. అదీ లేటెస్టు రాజకీయ కల్చరు. ఇలా కండువాలు మార్చుకోవాలంటే, మనం ఏ పార్టీ వాళ్లమో లోకానికి చెప్పాలంటే మెడ ఉండి తీరాలి కదా అన్నది ఈమధ్యే రాజకీయాల్లో చేరిన మా డియరెస్టు ఫ్రెండు అభిప్రాయం’’ అంటూ సుదీర్ఘంగా వివరించాడు.

మా మాటలు వింటున్న మా బుజ్జిగాడు కూడా ఎంటరయ్యాడు. ‘‘నాన్నా నాకొకటి అనిపిస్తోంది. మొన్న నాకు జ్వరంగా ఉందంటే నన్ను మన పిల్లల డాక్టర్‌ గారి దగ్గరికి తీసుకెళ్లావు కదా. ఆయన స్టెతస్కోపుతో పరీక్షించాక దాన్ని మెళ్లో వేసుకున్నారు. మనుషులకు మెడ ఉండబట్టి సరిపోయింది గానీ... ఒకవేళ మెడ అనేదే లేదనుకో. పాపం... మాటిమాటికీ స్టెత్‌ ఎక్కడ పెట్టుకోవాలన్న విషయంలో డాక్టర్లకు కాస్త ఇబ్బందే అయ్యేది కదూ’’ అంటూ ఆ సంభాషణలోకి జొరబడ్డాడు.

అప్పటికే మా రాంబాబుగాడి మాటలకే నాకు మెడ... అదే... గొంతులోంచి మాటపెగల్లేదు. ఇక మావాడి మాటలు విన్న తర్వాత అసలు మెడలోంచి... అదే పీకలోంచి మాటే బయటకు రాదేమోననే అనుమానం వచ్చింది. అక్కడితో ఆగలేదు మా బుజ్జిగాడు... ‘‘అన్నట్టు నాన్నా... తన వెన్నుతో పాటు పక్కనే ఉన్న చెయ్యి బాగా నొప్పెడుతున్నాయని మన పక్కింటి అంకుల్‌ మెడకు పట్టీ వేసుకున్నారు కదా. ఇప్పుడు కాస్త రిలీఫ్‌గా ఉందండీ అని నీతో అన్నారు కూడా. చూడు... పాపం... అదే ఆ అంకుల్‌కు మెడ అనేదే లేదనుకో. పాపం... పట్టీ ఎక్కడ వేసుకునే వారు? అంతేకాదు... మొన్న మా స్కూల్లో నా క్లాస్‌మేట్‌ ఒకడు ఆటలాడే సమయంలో గోడ మీది నుంచి దూకినప్పుడు చెయ్యి ఫ్రాక్చరైంది చూడూ. వాడు కూడా చేతికి ప్లాస్టర్‌ వేసుకొని, ఆ చెయ్యి కదలకుండా ఉండటానికి మెడ నుంచి వేలాడేలా స్లింగ్‌ వాడుతున్నాడు. పాపం మెడ అనేదే లేకపోతే వాడి చెయ్యి బాగుకావడం బాగా కష్టమయ్యేదీ, లేటయ్యేది కదా. అన్నట్టు నేను స్కూల్‌ ఐడీ కార్డు వేసుకోవాలన్నా దాని మీద డిపెండ్‌ కావాల్సిందే కదా నాన్నా’’ అన్నాడు వాడు మా రాంబాబు గాడి మాటలకు మరింత వత్తాసు ఇస్తున్నట్లుగా.

‘‘చూశావా... మన బుజ్జిగాడు కూడా నా మాటే నిజం చేస్తున్నాడు. మెడ గురించి అటు అధికారపక్షాలూ, ఇటు ప్రతిపక్షాలూ ఇద్దరూ కరక్టే. అలాగే ఇక్కడ వైద్యం చేసే డాక్టరూ, చికిత్స తీసుకునే పేషెంటూ... ఇలా ఈ ఇరువర్గాలూ మెడను తమ తమ ప్రయోజనాలకోసం ఎడాపెడా ఎలా వాడుకుంటున్నాయో చూడు’’ అంటూ తన వాదనను సమర్థించుకున్నాడు రాంబాబు గాడు. ప్చ్‌.... వాళ్ల సంభాషణ విన్న తర్వాత నాకు అనిపించిన ఒకే ఒక మాట ఏమిటంటే... ‘మనకు మెడ ఉన్నది జలుబు చేసినప్పుడు జండూబామ్‌ పూసుకోడానికీ, వీపున్నది విక్స్‌ పులుముకోడానికీ, నుదురన్నది ఉన్నది అమృతాంజనం రాసుకోడానికీ మాత్రమే’నని.
– యాసీన్‌

Advertisement
Advertisement