శ్రీకారాలు - శ్రీమిరియాలు | Sakshi
Sakshi News home page

శ్రీకారాలు - శ్రీమిరియాలు

Published Sun, Apr 26 2015 1:01 AM

sri ramana spl stories

సంసారి సుఖీ...
ఆ మధ్య ఇద్దరు స్వామీజీలు ఒక వేదిక మీద కలిశారు. ఇద్దరూ ఒక ప్రాంతం వారే. ఇద్దరికీ సొంత ఆశ్రమాలు, భక్తగణం ఉంది. పూర్వాశ్రమంలో ఇద్దరూ ఒకే చెక్‌పోస్ట్‌లో పనిచేస్తూ తనిఖీకొచ్చినవారి అపార్థాల వల్ల, ఇద్దరూ ఒకేసారి ఉద్యోగ విముక్తులైనారు. వేర్వేరు దారుల్లో విడిపోయి, వృత్తిరీత్యా ఉన్న సారూప్యత ప్రకృతిలో కూడా ప్రతిబింబించింది. ఎప్పుడెప్పుడో కొని పారేసిన తోటల్ని, దొడ్లని సంరక్షించుకోవలసిన అవసరం వచ్చింది. శిక్షని వరంగా మలుచుకున్నారు. కట్ చేస్తే ఇద్దరు స్వాములు, రెండు ఆశ్రమాలు. ఎవరి శిల్పం వారిది.

అయితే, రావల్సిన ముఖ్యనేత ప్రెస్‌మీట్‌లో చిక్కడి ఆలస్యం అవడంతో స్వాములకు మామూలు భాషణకు వ్యవధి దొరికింది. స్వామి స్వామి కష్టం సుఖం మాట్లాడుకుంటూ వినిపించారు.
 ‘‘ఆశ్రమం బోరులో నీళ్లు వస్తున్నాయా?’’
 ‘‘ఆ, ఏదో పర్వాలేదు. మీ పరిస్థితి?’’
 ‘‘గుట్టుచప్పుడు కాకుండా లాగిస్తున్నా. ఆశ్రమానికే నీళ్లు పుట్టించలేనివారు రాష్ట్రానికేమి తెస్తారని ఆక్షేపిస్తారు కదా!’’
 ‘‘... కరెంటు ఏం చేస్తున్నారు?’’
 ‘‘జనరేటరే. ఏసీలకి జీవి అలవాటుపడింది కదా!’’
 ‘‘భక్తుడా...’’
 ‘‘అబ్బే సొంత నిధులే. అసలే మార్కెట్ మందంగా ఉంది.’’
 ‘‘ఔ. గోశాల?’’
 ‘‘బావుంది. ఏవుంది, హళ్లి హళ్లి సున్నకి సున్న. కాని ఉండాలి. అది ఆశ్రమానికి హంగు.’’
 ‘‘పంటలు..?’’
 ‘‘ఆ... ఏవుంది. శ్రీనాథుడి వ్యవసాయమే.’’
 ‘‘ఆ మధ్య ఏనుగుని తెప్పించారని విన్నాం?’’
 ‘‘గున్న ఏనుగు. కేరళ నించి వచ్చింది. నా భక్తుడి కొడుకు సలహా ఇచ్చాడు. ఆశ్రమానికి ఆదాయ మార్గం చెప్పమంటే వాడు ఏనుగుని తగిలించాడు’’ నవ్వుతూనే, ‘‘వాడు విదేశాల్లో ధనార్జన మంత్రాలు నేర్చినవాడండోయ్.’’
 ‘‘చెప్పండి... చెప్పండి...’’
 
‘‘ఏనుగు ఆశ్రమానికి ఆకర్షణ అయింది. ఆదాయమూ పెరిగింది. పొద్దునపూట విష్ణు సంప్రదాయంలో నామాలు దిద్దుకుని భక్తుల్ని దీవిస్తుంది. సాయంత్రం పూట శైవ సంప్రదాయంలో అడ్డపట్టీలతో దీవిస్తుంది. తొండం తాకిస్తే పది. ఇదిగాక అరటిపళ్లు, చిలకడదుంపలు, చెరకు ముక్కలు వస్తాయి. పాపం ఒకపూట తిండి అదే సంపాయించుకుంటుంది. వారానికో రోజు అంబారీ ఉంటుంది. తలకి వంద. దాని ఖర్చులు, మావటీని అదే భరిస్తోంది. అంతో ఇంతో ఆశ్రమానికీ ఇస్తోంది. పైగా పేరు...’’
 
‘‘అది నిజమేలెండి. అదొచ్చాక మిమ్మల్నంతా ఏనుగుస్వామి అంటున్నారు. నాక్కూడా ఏదైనా దారి చూపించండి. అనుగ్రహ భాషణలతో బండి నడవడం కష్టమే.’’
 ‘‘మరే! జ్యోతిష్యం ఉంటే దాని ఆదాయం వేరు. విరుగుళ్లుంటాయి కదా.’’
 ‘‘ఔనౌను. అవి బోలెడు ఖరీదు. నేనొక కోతిని చేరదీశా.’’
 ‘‘విన్నాం... విన్నా.’’
 ‘‘అది కొన్నాళ్లు బానే ఉంది. ఆంజనేయస్వామి అంశగా మావాళ్లు కథనాలు ప్రచారంలోకి తెస్తుండగా, ఎవడో గిట్టనివాడు దానికి కల్లు అలవాటు చేశాడు.’’
 
‘‘చూశారా, లోకం పాపిష్టిది. ఆ తర్వాత?’’
 ‘‘దానికి కల్లు దొరక్కుండా కట్టడి చేశా. ఇంకేముంది, నామీద ఆగ్రహించి అప్పట్నించి నానా అల్లరీ మొదలుపెట్టింది. నేను అ.భాషణం చేస్తుంటే ఎదురుగా ఎత్తుగా కూచుని వెక్కిరించడం, కాయలు పిందెలు నామీద విసరడం... చాలా అసభ్యమైన శరీర భాషని ప్రదర్శించడం మొదలుపెట్టింది. చివరకు దాన్ని చూడటం భక్తులకు వినోదంగా మారింది.’’
 ‘‘మరి ఏ అడివికైనా తరిమించెయ్యక పోయారా?’’
 
‘‘ఆ ప్రయత్నం కలిసి రాలేదు. ఆఖరికి పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం రోజూ రెండు కొబ్బరి చిప్పలు, పది అరటిపళ్లు పెట్టేలా రాజీపడ్డాం. వేళప్రకారం ఆశ్రమానికి దూరంగా ఇవి పెట్టేస్తాం. అయినా అప్పుడప్పుడు తాగొచ్చి అల్లరి చేస్తూనే ఉంటుంది.’’
 ‘‘పోనీ పదో పరకో ఖర్చుపెట్టి సాంతం వదిలించుకోలేకపోయారా?’’
 ‘‘అదో పెద్ద కథ...’’ అని కొంచెం దగ్గరగా వాలి లో-గొంతులో ఆరంభించాడు.
 ఇంతలో ముఖ్యనేత కారుదిగి, అక్కడ నుంచే చేతులు జోడించి వేదికని సమీపించారు. కోతి కథ అక్కడాగింది. ఆ పెద్ద కథ నన్ను రకరకాలుగా తొలుస్తూనే ఉంటుంది.
 
కలవారి అబ్బాయి
బాగా డబ్బున్న మిత్రుడి ఇల్లు చక్కని పేకాట కేంద్రంగా భాసిల్లుతోంది. సువిశాలమైన సమశీతల గది, సుఖమైన కుర్చీలు, సమయానికి తగు పానీయాలతో బావుంటుంది. కాకపోతే ఒకే ఒక్క న్యూసెన్స్ ఏమిటంటే, ఏడెనిమిదేళ్ల యజమాని కొడుకు. వాడు చుట్టూ తిరుగుతూ ముక్కలు చూస్తూ కళ్లతో చేతులతో సైగలు చేస్తుంటాడు. వాడిని ఏమీ అనడానికి లేదు. చివరకు ఒక ఆటగాడు వాడిని నివారించగలిగాడు. ఏమిటి  చిట్కా, ఎట్లా కట్టడి చేశారని మిగిలిన చేతులు అడిగాయి. ‘‘ఆ... ఏవుంది. పిల్లవెధవకి సెల్‌ఫోన్ మప్పాను. ఇహ మన జోలికి రాడు’’ అన్నాడాయన.
 
ఇప్పుడే అందిన ఎస్‌ఎమ్మెస్
మిషన్ కాకతీయలో చెరువులు నిండుతున్నాయని తెలిసి ఎక్కడెక్కడి కప్పలు వలస వస్తున్నాయిట!
 
కలెక్షన్ కింగ్
పౌరాణిక నాటకాలకి తెనాలి పెట్టింది పేరు. అప్పట్లో కిరీటాలు ధరించే హేమాహేమీలంతా తెనాలిలోనే ఉండేవారు. ఆ రోజుల్లో మాధవపెద్ది వెంకట్రామయ్య దుర్యోధన వేషానికి ఫేమస్. పులిపాటి వెంకటేశ్వర్లు అర్జున పాత్రకు ప్రసిద్ధి. రాజరాజు గెటప్‌లో మాధవపెద్ది రంగస్థలానికి కాంతి తెస్తే, పాండవ మధ్యమునిగా పులిపాటి స్టేజికి కళ తెచ్చేవారు. ఒక నాటకాల కాంట్రాక్టరు ట్రూపు నాటకానికి బేరం కుదరక మాధవపెద్దిని కాదని పులిపాటిని బుక్ చేసుకువెళ్లాడు.

తెనాలిలో ఈ రాజరాజు ఇల్లు పార్థుని ఇల్లు ఎదురు బొదురుగానే ఉండేవి. మాధవపెద్ది తమ్ముడూ అని ఆదరంగా పిలిస్తే, పులిపాటి అన్నగారూ అని ఆదరంగా పిలిచేవారు. చీరాలలో తెల్లవారుజామున నాటకం పూర్తికాగానే పులిపాటి ఇంటికి చేరారు. తను లేని నాటకం ఏపాటి రక్తికట్టిందో తెలుసుకోవాలని మాధవపెద్దికి ఆత్రుతగా ఉంది.
 
సాంతం ఇంట్లో అడుగుపెట్టకుండానే, ‘‘ఏం తమ్ముడూ నాటకం ఎట్లా నడిచింది’’ అంటూ ఎదురింట్లోంచి కేక వినిపించింది. ‘‘బ్రహ్మాండం అన్నగారూ’’ మారు పలికారు పులిపాటి. ‘‘కలెక్షన్ ఏమాత్రం?’’ - మళ్లీ మాధవపెద్ది. ‘‘ముప్పై మూడు బాటా, ఇరవై రెండు నాటు. అన్నీ ఎడంకాలువే’’ అని పులిపాటి జవాబు. పేరుకి ఉద్యోగ విజయాలు నాటకం గాని అయింది పాదుకా పట్టాభిషేకం!
 
చర్చనీయం
చంద్రబాబు చైనాలో పర్యటిస్తున్నారు. పెట్టుబడులకు గాలం వేస్తున్నారు. వాళ్లు సానుకూలంగా స్పందిస్తున్నారని కూడా చెబుతున్నారు. నిజానికి చైనావాళ్లు మనవాళ్లే! కవి సమ్రాట్ విశ్వనాథ ఒకచోట రాశారు కూడా. చాలాకాలం కిందట చయనాదులు చేసే చార్వాకం సోకి దూరమైపోయి, కైలాస గిరులు దాటి స్థిరపడిపోయారని, వారే చయనీయులని విశ్వనాథ నొక్కి వక్కాణించారు. ఈ సంగతి వాళ్లకి వివరిస్తే మరింత సానుకూలంగా స్పందిస్తారేమో?
 
నిజంగానే..
తన అద్భుతమైన కార్టూన్లతో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికని సుసంపన్నం చేసిన సుధీర్ తైలాంగ్ పూర్వీకులు తెలంగాణ ప్రాంతీయులు.
 
పెన్ డ్రాప్స్
 ‘‘మీ నమ్మకమే మా పెట్టుబడి’’
 - ఓం ఫట్ చిట్స్
 ‘‘నూరు శాతం నిజం’’ - ఓ ఖాతాదారుడు.
 నేలను నమ్మితే ఏముందిరా
 నేలను అమ్మితే లాభముందిరా!
హీరోయిన్లు వెలిసిపోయిన తల్లి వేషాలకు దిగినట్టు - గొప్ప గొప్ప పోస్టులు నిర్వహించినవారు సలహా సంఘాలకు చేరతారు. వాటికి గోళ్లు, పళ్లు ఉండవు.
 - శ్రీరమణ

Advertisement
Advertisement