Sakshi News home page

ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో!

Published Sun, Aug 20 2017 12:39 AM

ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో!

పౌరాణిక పితామహుడు కమలాకర కామేశ్వరరావుగారి దర్శకత్వంలో వచ్చిన ‘వినాయక విజయం’ చిత్రంలోని ‘ఎవరవయా’ పాటలో ఎంతో కొత్తదనం ఉంది. పార్వతీదేవి తన కుమారుడిని  ‘ఎవరవయా ఎవరవయా’ అంటూ ప్రశ్నించడంతో ప్రారంభమవుతుంది. ఈ పాటను జోల పాటలాగ చేయమంటారా అని నాన్నగారు (ఎస్‌.రాజేశ్వరరావు) అడిగితే, ‘ఇది జోల పాట కాదు, గంభీరంగా ప్రశ్నిస్తున్నట్లుగా రావాలి’ అని చెప్పారట. అందువల్ల ఈ పాటను నాన్నగారు మిశ్ర ఖమాస్‌ రాగంలో స్వరపరిచారు. పాటంతా ఒకే లొకేషన్‌లో తీస్తున్నారు కాబట్టి, రాగమాలికలో చేయవలసిన అవసరం లేదని, ఒకే రాగంలో చేయమని కోరారట దర్శకులు.

 నాన్నగారికి ఆస్థాన గాయని పి.సుశీల... ‘ఈ పాట జోలపాటలా పాడాలా’ అని అడిగారట. అందుకు రాజేశ్వరరావుగారు, ఈ పాటలో బాలుడిని నిద్రపుచ్చట్లేదు, ఊయలపాట కాదు, ఆశ్చర్యంగా ప్రశ్నిస్తూంది. కాబట్టి పాటలో ఆశ్చర్యంతో, గంభీరంగా ప్రశ్నించడం కనపడాలని దర్శకులు నిర్దేశించిన విషయం  వివరించారట. ఇది ఈ పాట నేపథ్యం.‘అసలు నువ్వు ఎవరివయ్యా, ఏ అద్భుత ప్రదేశం నుంచి వచ్చి ఈ అమ్మ ఒడిలోకి చేరావు’ అని ఆశ్చర్యంగా గంభీరంగా ప్రశ్నిస్తుంది పార్వతి ఆ పసిబాలుడిని. తన ఒంటి నలుగుతో రూపొందిన బాలుడు, తాను తయారుచేసుకున్న బాలుడు తనకే ఆశ్చర్యం కలిగించడంతో పిల్లవాడిని ప్రశ్నిస్తుంది పార్వతి. తన బిడ్డ ఎంతటివాడో అనుకుంటుంది.

‘ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో గాని........ పూజలలో మొదటిపూజ నీదేనేమో’ అని బాలుడిని చూస్తూ తన ఆశ్చర్యాలను ప్రకటిస్తుంది తల్లి. కళ్లు మెరుస్తుంటే, అవి కాంతులీనే జ్యోతులేమో అని ప్రశ్నించింది. ఆ పసిబాలుడి నవ్వులలో పలికే అర్థాలు వేదమంత్రాలేమో అని ఆశ్చర్యపోయింది. అసలు దేవతలందరిలోకీ తొలిదేవత ఇతడేనేమో, భక్తులు తొలి పూజ చేసేది ఈ బాలుడికేనేమో అనే సంభ్రమాన్ని ప్రదర్శించింది.
‘చిట్టిపొట్టి నడకలు –

 జిలిబిలి పలుకులు....... ఈరేడు లోకాలు ఏలేవో’ ఎన్ని లోకాలు ఏలుతావో నువ్వు... అని పసిబాలుడిని ఆనందాశ్చర్యాలతో ప్రశ్నించింది తల్లి. ఈ పాట ఒక చిత్రమైన ప్రయోగం. పసిబాలుడికి సాధారణంగా జోలలు పాడతారు. కాని ఇందులో ఈ బాలుడు ఊయలలో ఊగే వేలుపు. అందుకే ఆ బాలుడికి జోల పాడకుండా, తన సందేహాలన్నీ ప్రశ్నిస్తూ పాడుతుంది తల్లి. ఇది కమలాకర కామేశ్వరరావుగారి ప్రతిభ. వారి దర్శకత్వం, కృష్ణశాస్త్రి కలం, నాన్నగారి సంగీతం, సుశీలమ్మ గళం అన్నీ కలిసి ఎంతో మధురంగా వచ్చింది ఈ పాట.
 – సంభాషణ: డా. వైజయంతి

Advertisement
Advertisement