ద లవ్ క్వీన్ ఆఫ్ మలబార్ | Sakshi
Sakshi News home page

ద లవ్ క్వీన్ ఆఫ్ మలబార్

Published Sun, Mar 6 2016 1:13 AM

ద లవ్ క్వీన్ ఆఫ్ మలబార్

అది 1999వ సంవత్సరం, నవంబర్ మాసం... అరవై అయిదేళ్ల మహిళ ఫోన్ రిసీవర్ పట్టుకొని ఉంది. అవతల 38 ఏళ్ల యువకుడు. ఉర్దూలో తనకిష్టమైన కవితాపంక్తులను చదివి వినిపిస్తున్నాడు. వింటున్న ఆమె పెదవులపై చిరునవ్వు. 65 ఏళ్ల ముదిమిని ఓడిస్తున్న పసితనం కనపడుతోంది ఆమె ముఖంలో. వర్చస్సు, మేథస్సు పోటీపడ్తున్నట్టుండే ఆ తేజోమూర్తికి వివరిస్తున్నాడు యువకుడు.. తనను పెళ్లి చేసుకుంటే ఆమెనెంత అపురూపంగా చూసుకోగలడో అన్నది. ఇవతల అదే సమ్మోహన దరహాసం!
 
 తర్వాత మూడురోజులకు.. ఆమె అతని భార్య అయింది.  అతను ముస్లిం. పేరు సాదిక్ అలీ. ఇస్లామిక్ స్కాలర్, ముస్లింలీగ్ ఎంపీ. ఆమెను ముస్లిం మతం తీసుకొమ్మని కోరాడు సాదిక్. అతని కోరికను సమ్మతించిందామె. అప్పటి నుంచి కమలాసురయ్యాగా మారిపోయింది... కమలాదాస్. మలయాళ, ఇంగ్లిష్ సాహిత్యాభిమానులకు కమలామాధవికుట్టిగా అత్యంత ఇష్టురాలు. కేరళలోని త్రిస్సూర్‌జిల్లా పున్నవర్కుళంలో పుట్టింది. సనాతన బ్రాహ్మణ సంప్రదాయంలో పెరిగింది. కానీ ఆమె రచనలను మాత్రం స్త్రీవాద, ప్రజాస్వామిక సిరాతోనే రాసింది. విగ్రహారాధనకు వ్యతిరేకి.
 
  తిరుగుబాటు ధోరణి, ధైర్యం ఆమె నైజం కాబట్టే 65 ఏళ్ల వయసులో ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకొని ఇస్లాం మతం స్వీకరించగలిగింది. అదో పెద్ద సంచలనం. ఇరుగుపొరుగు, బంధువులు, రచయితలు, సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఆమె ముస్లింగా మారడాన్ని ఓ డ్రామాగా విమర్శించారు. అందుకే ఈ పెళ్లి తర్వాత జరిగిన పరిణామాల గురించి తన స్నేహితురాలు, కెనడియన్ రైటర్‌మెర్రిలీ వీజ్‌బోర్డ్‌కి ఉత్తరం రాసింది. ‘విమర్శల నుంచి నన్ను నేను రక్షించుకోవడానికే బుర్ఖాను ధరించాను’ అని చెప్పింది.  అయితే తర్వాత తన వివాహం గురించి, ఇస్లాంను స్వీకరించడం గురించి కూడా అంతే ధైర్యంగా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసింది.
 
 కమల పుట్టింది మలబార్ తీరంలోనైనా పెరిగింది మాత్రం కోల్‌కతాలో. తండ్రి వి.ఎమ్. నాయర్ తొలుత మలయాళం డైలీ ‘మాతృభూమి’కి మేనేజింగ్ ఎడిటర్. ఆ తర్వాత కోల్‌కతా వెళ్లాడు. వాల్‌ఫోర్డ్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో సీనియర్ ఆఫీసర్‌గా చేరాడు. ఆమె  బాల్యం అక్కడే గడిచింది. తల్లి నలప్పాట్ట్ బాలమణమ్మ మలయాళీ కవయిత్రి. రాసే కళను అమ్మనుంచే పుచ్చుకున్నా రాయడంలో ప్రేరణ మాత్రం మేనమామ నలప్పాట్ట్ నారాయణ మీనన్ ద్వారానే. ఆయనలాగే కమల చాలా చిన్నవయసులోనే కలంతో కవితలు అద్దడం మొదలుపెట్టింది. పదిహేనేళ్లకే గృహిణి అయింది. భర్త మాధవదాస్ బ్యాంక్ ఆఫీసర్. కమలలోని రచనాసక్తిని గమనించి ప్రోత్సహించాడు. కమల ప్రేమపిపాసి. రచన ఆమె తొలి ప్రేమే కాదు.. ఆమె వచనానికి అంశం కూడా. మలయాళంలో ఎన్నో కథలు, ఆంగ్లంలో ఇంకెన్నో కవితలు.. రెండు భాషల్లో మరెన్నో కథలు, కవితలు ఆమె కలానికి గొప్ప పరిచయాన్నిచ్చాయి.
 
 కాలమిస్ట్‌గా కూడా మారింది. స్త్రీల సమస్యల నుంచి  రాజకీయాల దాకా అన్నిటి మీదా పాళీని పరిగెత్తించింది. పేరుమోసిన కవులు, రచయితలందరూ మూస పదాలు, సంప్రదాయబద్ధమైన భావవ్యక్తీకరణలతో పాఠకులకు ఉక్కపోత సృష్టిస్తున్నవేళ.. కొత్త ఒరవడితో చల్లని తెమ్మెరలా వాళ్ల మనసులను తాకింది కమలాదాస్ కలం! ప్రేమ.. అది పంచే కోరిక.. ఏదైనా పురుషుడి నుంచి స్త్రీకి అందాలి. తప్ప స్త్రీ తనకు తానుగా  కోరకూడదు.. పంచకూడదు అనే నియమాలు సాహిత్యానికీ వర్తిసున్న సమయంలో వాటిని ఉండచుట్టి చెత్త బుట్టలో పడేసింది.
 
  ఫ్రెష్‌గా ప్రేమ, కోరికకు కొంగొత్త నిర్వచనం రాయడం మొదలుపెట్టింది. అదే నిజాయితీ, ముక్కుసూటి తనంతో 42 ఏళ్లకే ‘మై స్టోరీ’ పేరుతో ఆటోబయోగ్రఫీ రాసుకుంది. రాజకీయాలతో పెద్దగా చెలిమి లేకపోయినా... అనూహ్యంగా ‘లోక్ సేవా పార్టి’ అనే జాతీయ రాజకీయ పార్టీని స్థాపించింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. ప్రేమను శ్వాసించిన కమల...  ఆ ప్రేమను పొందిన క్షణాలను ఆస్వాదిస్తూ తన 75వ యేట 2009, మే31 పుణెలో తుది శ్వాస విడిచింది.   ఆమె స్నేహితురాలు మెర్రిలీ విస్‌బోర్ ్డ కమలను ‘ద లవ్ క్వీన్ ఆఫ్ మలబార్’గా వర్ణిస్తుంది. అదే పేరుతో  పుస్తకాన్నీ రాసింది.
 
 జీవితం ఎందుకంత చిన్నదో నన్ను అడగండి. అందులో ప్రేమ ఎంత చిన్నదో కూడా అడగండి. సంతోషం గురించి దాని విలువ గురించి కూడా అడగండి. ఎందుకంటే... వాటన్నిటినీ నేను చదివేశాను
 - కమలాదాస్
 - రమ
 

Advertisement
Advertisement