దొంగోడు | Sakshi
Sakshi News home page

దొంగోడు

Published Sat, Nov 19 2016 11:40 PM

దొంగోడు

పట్టుకోండి చూద్దాం

ఆరోజు కాస్త ఆలస్యంగా షాపు తెరిచాడు పరంధామయ్య. నిన్నటి రాత్రి ఒంట్లో నలతగా ఉండడంతో షాపు బాధ్యతలు హరికి అప్పగించి వెళ్లాడు. షాపులో పని చేసే ముగ్గురు కుర్రాళ్లలో హరి అంటే పరంధామయ్యకు గురి. ఏరోజూ తన పనిలో నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు కనిపించడు. తన సొంత షాపు అయితే ఎంత శ్రద్ధగా పని చేస్తాడో అంతకంటే శ్రద్ధగా పనిచేస్తాడు. జీతం పెంచమని ఏ రోజూ అడిగిన దాఖలా లేదు. అందుకే... హరి అంటే పరంధామయ్యకు ఇష్టం.

షాపు తాళాలు తెరిచి లోపలికి వెళ్లిన పరంధామయ్య అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు.హరి ఒక స్తంభానికి కట్టివేయబడి ఉన్నాడు. నోటికి అడ్డంగా పెద్ద జేబురుమాలు కట్టబడి ఉంది. వెంటనే కట్లు విప్పాడు పరంధామయ్య. ‘‘సార్... నిన్న రాత్రి  ఘోరం జరిగింది’’ అంటూ అక్కడున్న కుర్చీలో కూలబడిపోయాడు హరి. ‘‘ఎవరు ఇదంతా చేసింది?’’ కోపంగా అడిగాడు పరంధామయ్య.‘‘షాపు క్లోజ్ చేసే సమయంలో ముగ్గురు కుర్రాళ్లు లోనికి వచ్చారు. ఏంకావాలి? అని అడిగేలోపే... బలవంతంగా స్తంభానికి కట్టేశారు. షాపు తాళం చెవులను తీసేసుకున్నారు. షాపులో విలువైన వస్తువులు, క్యాష్ దోచుకొని బయట తాళం వేసి వెళ్లిపోయారు....’’ చెప్పుకుంటూ పోతున్నాడు హరి.హరి చెప్పింది వింటూనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు పరంధామయ్య.

‘‘రాత్రి నుంచి ఏమీ తిని ఉండవు. టిఫిన్ ఏమైనా చేశావా?’’ హరిని అడిగాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ.‘‘ఎక్కడిది సార్... ఇలా కట్లు విప్పానో లేదో నిస్సత్తువగా కుర్చీలో కూలబడిపోయాడు. మీరు రాగానే లేచాడు... అంతే’’ అని హరి మీద సానుభూతి కురిపించాడు పరంధామయ్య. ఇన్‌స్పెక్టర్ నరసింహ పరంధామయ్యను పక్కకు తీసుకువెళ్లి...‘‘మీ పనివాళ్లలో ఎవరి మీదైనా అనుమానం ఉందా?’’ అని అడిగాడు. ‘‘ఛా... ముగ్గురూ బంగారంలాంటోళ్లండి. పొరపాటున కూడా వారిని అనుమానించడానికి లేదు. హరి అయితే చాలా మంచోడు. ఎప్పుడైనా కూల్‌డ్రింక్ ఆఫర్ చేసినా తాగడు. నీళ్లు మాత్రం బాగా తాగుతాడు. వాడికి మర్యాద చేయాలంటే ఒక నీళ్ల బాటిల్ ఇస్తే సరిపోతుంది. పనోళ్లందరూ చాలా నమ్మకస్తులు. నాకు నా కుటుంబసభ్యులు ఎంతో వీళ్లు అంతే... ఆ దొంగలు దోచుకుపోతే దోచుకుపోయారు. హరికి హాని కలిగించకపోవడం మాత్రం కాస్త ఊరటగా ఉంది’’ అన్నాడు పరంధామయ్య.

‘‘మీ పనివాళ్లను వదిలేయండి. బయటి వ్యక్తులు ఎవరి మీదైనా అనుమానం ఉందా?’’ అని అడిగాడు ఇన్‌స్పెక్టర్. ‘‘అనుమానించ దగ్గ వ్యక్తులు నాకైతే ఎవరు కనిపించడం లేదు. షాపుకు వచ్చేవాళ్లలో ఎవరు దొంగో ఎవరు దొరో ఎలా తెలుస్తుంది! ఎవరినని అనుమానిస్తాం? పదిహేనేళ్లుగా షాప్ నడుపుతున్నాను. ఇలా ఎప్పుడూ జరగలేదు’’ అన్నాడు పరంధామయ్య.హరితో పాటు మరో ఇద్దరు పనివాళ్లను ఎంక్వైరీ చేశాడు ఇన్‌స్పెక్టర్. వారిని అనుమానించడానికి ఏ చిన్న కారణం కనిపించడం లేదు. పరంధామయ్య  చెప్పింది నిజమే అనిపించింది.

కొద్దిసేపటి తరువాత...
పేరు మోసిన యువ నేరస్థుల ఫోటోలను హరికి చూపిస్తూ... ‘‘వీళ్లలో ఎవరైనా ఉన్నారా?’’ అని అడిగాడు ఇన్‌స్పెక్టర్. ‘‘ఎవరూ లేరు సార్’’ అని చెప్పాడు హరి. అనేక రకాలుగా ఆలోచిస్తూ.... ‘‘వీరేందర్ ఎక్కడా?’’ అని హెడ్ కానిస్టేబుల్ గురించి అడిగాడు ఇన్‌స్పెక్టర్. ‘‘టాయిలెట్‌కి వెళ్లాడు సార్’’ అని చెప్పాడు అక్కడ ఉన్న కానిస్టేబుల్. ‘‘అబ్బ... ఎన్నిసార్లు వెళతాడయ్యా... నీళ్లు ఎక్కువగా తాగొద్దంటే వినడు’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ సిగరెట్ వెలిగిస్తూ. ఆయన మాటలకు అక్కడ ఉన్న వాళ్లు నవ్వారు. ఇంతలో ఇన్‌స్పెక్టర్ నరసింహ మదిలో మెరుపులా ఒక  ‘క్లూ’ మెరిసింది. ‘‘దొంగ దొరికిపోయాడు’’ అని గట్టిగా అరిచాడు. ఇంతకీ  దొంగ ఎవరు?

దొంగ ఎవరో కాదు... హరి! ఎక్కువగా నీళ్లు తాగే అలవాటు హరికి ఉంది. కట్లు విప్పగానే... హరి చేయాల్సిన, చేయక తప్పని మొదటి పని... టాయిలెట్‌కు వెళ్లిరావడం. వెళ్లకపోగా... సుమారు అరగంట పాటు... ఇన్‌స్పెక్టర్ వచ్చే వరకు కుర్చీలోనే కూర్చుండి పోయాడు. నీళ్లు ఎక్కువగా తాగే అలవాటు ఉన్న వ్యక్తి పది, పదకొండు గంటల తరువాత కూడా టాయిలెట్‌కు వెళ్లలేదంటే... ఇంతకంటే అనుమానించాల్సిన విషయం ఏదీ ఉండదు. తన ఫ్రెండ్స్‌తో కలిసి హరి దొంగతనానికి ప్లాన్ వేశాడు. అనుమానం రాకుండా కట్టివేయించుకున్నాడు.

Advertisement
Advertisement