నేటి జీవన వేదం | Sakshi
Sakshi News home page

నేటి జీవన వేదం

Published Sun, Sep 20 2015 12:09 AM

నేటి జీవన వేదం - Sakshi

వేద వ్యాప్తికి తిరుమలలోని వేద విజ్ఞానపీఠం ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది.  వేద ధర్మాలు కొనసాగించటం, పరమాత్మ తత్వాన్ని జన బాహుళ్యంలోకి తీసుకెళ్లటం, తిరుమల దేవాలయంలో స్వామికి జరిగే నిత్య పూజా కైంకర్యాలు, ఉత్సవాదులు విశేషంగా నిర్వహించేందుకు, వేదభూమిలో భవిష్యత్ పండిత అవసరాలు తీర్చటమే లక్ష్యంగా వేద పాఠశాల కార్యాచరణతో ముందుకు సాగుతోంది.
 
తిరుమల తిరుపతి దేవస్థానం వేద విద్యార్థుల జీవనానికి సంపూర్ణ భరోసా ఇస్తోంది. అందులో భాగంగా వేదపాఠశాలలో విద్యార్థిగా రికార్డుల్లో నమోదు చేసుకున్న రోజునే 12 ఏళ్ల కోర్సు చేసే వేదవిద్యార్థికి రూ.3 లక్షలు టీటీడీ బ్యాంకులో డిపాజిట్ చే స్తుంది. 2007 ధర్మకర్తల మండలి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలోని బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్సు పూర్తి అయ్యేనాటికి ఆ విద్యార్థికి సుమారు రూ.9 లక్షల దాకా అందుతోంది. ఇక ఎనిమిదేళ్ల కోర్సులో భాగంగా ఆగమ- స్మార్త- ప్రబంధ విద్యార్థులకు రూ. లక్ష డిపాజిట్ చేసి, కోర్సు పూర్తి కాగానే వడ్డీతో కలిపి ఆ విద్యార్థులకు అందజేస్తారు.
 
వేదం: ఋగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం (తైత్తిరీయశాఖ), కృష్ణ యజుర్వేదం (మైత్రాయణి శాఖ), సామవేదం (కౌధమ శాఖ, జైమినిశాఖ), అధర్వణ వేదం. ఏడేళ్లు, పన్నెండేళ్ల వేద విద్య కోర్సుల్లో మొత్తం 300 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అడ్మిషన్ పొందాక టీటీడీ విద్యార్థిపేరుతో రూ.3 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేస్తోంది.  ఏడేళ్ల కోర్సుతో రూ.6 లక్షలు, పన్నెండేళ్ల కోర్సు తర్వాత రూ.9 లక్షల నగదు అందిస్తోంది.
 
దివ్యప్రబంధం: ఈ విభాగంలో  మొత్తం 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఎనిమిదేళ్ల కోర్సులో చేరే విద్యార్థిపేరుతో  రూ.లక్ష డిపాజిట్ చేసి, పూర్తయ్యాక రూ.3 లక్షల నగదు అందిస్తున్నారు.
 
ఆగమాలు: వైఖానస, పాంచరాత్ర, చాత్తాద శ్రీవైష్ణవ , శైవ, తంత్రసారాగమా ల్లో మొత్తం 300 మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఎనిమిదేళ్ల కోర్సుల్లో చేరే విద్యార్థి పేరుతో రూ.లక్ష డిపాజిట్ చేసి కోర్సు పూర్తి అయ్యాక రూ.3 లక్షల నగదు అందిస్తున్నారు.
 
స్మార్తం: ఋగ్వేద, శుక్ల యజుర్వేద, కృష్ణయజుర్వేద, వైఖానస స్మార్త కోర్సుల్లో  300 మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఎనిమిదేళ్ల కోర్సులో చేరే విద్యార్థి పేరుతో లక్ష డిపాజిట్ చేసి కోర్సు పూర్తయ్యాక రూ.3 లక్షల నగదు అందిస్తున్నారు.
 
వేద విద్యార్థులకు ఇతర సౌకర్యాలు
ఏడాదిలో నాలుగు జతల వస్త్రాలు, పుస్తకాలు, చాపలు, శాలువ, భోజనం పళ్లెం, గ్లాసు ఇస్తారు. ప్రతి నె లా సబ్బులు, బట్టల సబ్బులు, కొబ్బరినూనె, విద్యా, వైజ్ఞానిక యాత్రలు, దేవాలయాల సందర్శనకు తీసుకెళతారు. ధనుర్మాసం, బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాల్లో స్వామి దర్శనం, విద్యార్థి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు తీసుకెళతారు. పాఠశాలల్లో క్రికెట్, వాలీబాల్, షటిల్ బాట్మెంటన్  క్రీడాంశాలల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.  

తిరుమల ఆలయంలో  నిర్వహించే నిత్య ఉత్సవాల తరహాలో విద్యార్థుల చేతుల మీదుగా  మాదిరి ఉత్సవాలు నిర్వహిస్తారు. టీటీడీ వేద పాఠశాలల్లో  వివిధ విభాగాల  కోర్సులు  పూర్తి చేసిన 90 శాతం విద్యార్థులు టీటీడీ పరిధిలోనే స్థిరపడి ఉపాధి పొందుతున్నారు.  మిగిలినవారు దేశ విదేశాల్లోని ప్రముఖ ఆలయాల్లో అర్చకులు, పండితులుగా జీవనం సాగిస్తున్నారు.
 
1884 నుంచి 2015 వరకు అంటే 131 ఏళ్లలో టీటీడీ వేద పాఠశాలల ద్వారా కోర్సులు పూర్తిచేసి సుమారు 20 వేల మంది వేద పండితులు, అర్చకులు, పౌరోహితులుగా ఉపాధి పొందుతున్నట్టు టీటీడీ రికార్డుల ద్వారా తెలుస్తోంది. మరికొందరు విదేశాల్లో అర్చకవృత్తిని కొనసాగిస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు.
 
నేటి పెద్ద జీయరైన గోవింద రామానుజ జీయర్ స్వామి నాటి వేద పాఠశాల విద్యార్థే. శ్రీవారి కైంక ర్య బాధ్యతలు పర్యవేక్షించే ప్రస్తుత ఆలయ పెద్ద జీయరు, మూడేళ్ల క్రితం పరమపదించిన శ్రీరంగ రామానుజ జీయరు స్వామివారు కూడా వేదపాఠశాల విద్యార్థులే! ఇదే తరహాలో ఇక్కడ విద్యను అభ్యసించిన ఎందరెందరో విద్యార్థులు అత్యున్నత స్థానాల్లో ఉండటం విశేషం.

Advertisement
Advertisement