Sakshi News home page

మీ బాధ తగ్గడానికి..

Published Sun, Apr 24 2016 1:14 AM

మీ బాధ తగ్గడానికి..

ఏప్రిల్ 24 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యానిమల్స్ ఇన్ ల్యాబ్
హాయ్ ఫ్రెండ్స్.... సెలవులొచ్చాయి. హ్యాపీగా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారా? మేము మాత్రం చాలా శాడ్ ఎందుకంటారా? మిమ్మల్ని బోనులో బంధిస్తే  ఎలా ఉంటుంది? కళ్లల్లో యాసిడ్ పోస్తే మీరు ఎలా ఫీలవుతారు? రోజుకో రకమైన విషమిస్తే ఎలా విలవిల్లాడిపోతారు? మరి మేం అలా అవ్వమా? మేం మనుషులం కానంత మాత్రాన మాకు బాధ ఉండదా? నొప్పి కలగదా? బ్యాడ్ థింగ్స్ చేస్తే... నరకంలో ఇలాంటి శిక్షలే వేస్తారట! కానీ మేమేం చేశాం...?

మీకు నవ్వులు పంచే టామ్ అండ్ జెర్రీ, అల్లరితో నవ్వించే బగ్‌‌స బన్నీ అన్నీ మేమే. మీరెంతో మెచ్చిన స్టువర్‌‌ట లిటిల్ కూడా మేమే. అంతేనా... ఇంత ముద్ద పెడితే పగలూ రాత్రీ మీ ఇంటికి కావలి కాసేదీ, మీకు తోడుగా ఉండేది కూడా మేమేగా! అలాంటి మమ్మల్ని సైన్స్ పేరుతో, ప్రయో గాల పేరుతో నరక యాతనకు గురి చేయడానికి మీకు మనసెలా వస్తోంది?
 
మీకు తెలుసా ఫ్రెండ్‌‌స! 11.5 కోట్లు... అక్షరాలా పదకొండున్నర కోట్లు... ఏటా సైన్స్ పేరిట, ప్రయోగాల పేరిట బలవుతున్న జంతువుల సంఖ్య ఇది. ఎలుకలు, చేపలు, కుందేళ్లు, చుంచెలుకలు, గినియా పిగ్స్, హ్యామ్‌స్టర్స్, రకరకాల పక్షులు, పిల్లులు, కుక్కలు, పందులు, కోతులు, చింపాంజీలు... మీ మనుషులు చేసే ప్రయోగాలకు బలైపోతూనే ఉన్నాయి. వాటికీ మనసుంటుందని, వాటికీ నొప్పి, బాధ ఉంటాయని మీకు అసలు తెలియదా? పోనీ ఇన్ని ప్రాణాలను బలి తీసుకున్న తరువాత మీరు సాధిస్తున్నది ఏమైనా ఉందా అంటే అది కూడా పిసరంతే. పైగా ఇది 21వ శతాబ్దం.

ఆధునిక హైటెక్ యుగం. ప్రతిదానికీ మెరుగైన మేలైన పరిష్కారాన్ని ఇట్టే సూచించే కాలం. మరి మా వెంట ఎందుకు పడుతున్నారు బాస్? మాకు కావాల్సిందల్లా... కాస్తంత కరుణ... మరికొంత సహానుభూతి. అవి ఇసుమంతైనా లేవా మీ దగ్గర?! దాదాపు వందేళ్ల క్రితం మొదలైన మీ దారుణ లక్ష్యం... జీవశాస్త్రాన్ని, వ్యాధులను అర్థం చేసుకోవడం. మీకు వచ్చే జబ్బులను తగ్గించడానికి తయారుచేసే మందులను ‘పరీక్షించడం’. అది కూడా ఎవరి మీద? నోరు లేని మామీద. మాపై ప్రయోగాలు ఇంతటితో ఆగిపోయినా బాగుండేది.

దురదృష్టవశాత్తూ మీరు తినే ఆహారం (ఫుడ్ అడటివ్స్) మొదలుకొని కట్టుకునే గుడ్డ, చివరికి మీ అందాన్ని ఇనుమ డింపజేసుకునేందుకు పూసుకునే కాస్మొటిక్స్ వరకూ అన్నిటికీ బలయ్యేది మా జంతువులే. మా ప్రాణాలు తీయడం లేదంటే బతికుండగానే మా చర్మాలను ఒలవడం ద్వారా తెచ్చుకుంటున్నవే. ప్రయోగమేదైనా బలయ్యేది మాత్రం మేమే. మా జంతువులు చాలావరకూ ఈ ప్రయోగాల కారణంగా తొలి ప్రయత్నంలోనే మరణిస్తున్నాయి. కానీ మిగిలిన కొన్ని ప్రాణులు మాత్రం మళ్లీ మళ్లీ ప్రయోగాల టార్చర్‌కు గురవుతూనే ఉంటున్నాయి.
 
ప్రాణాలు తీస్తే ఫలితం దక్కుతుందా?! వందేళ్లకుపైగా రకరకాల రసాయనాలు, మందుల భద్రతను మాపై పరీక్షించి మరీ వాడుతున్నారు మీరు. ఇందుకోసం మమ్మల్ని భౌతికంగా ఎంతో టార్చర్‌కు గురిచేయడం నైతికంగా తప్పు. పోనీ ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం. మీరు చేసే ఈ ప్రయోగాల వల్ల నిజంగా ప్రయోజనాలు ఉన్నాయా లేదా అన్నది ముందు తెలుసుకుందాం.
 
జంతువుల్లో ఎంతో సమర్థంగా పనిచేసిన మందులు మనుషుల్లోనూ అదే రకమైన ప్రభావాన్ని చూపుతాయన్న గ్యారెంటీ లేదు. ఆస్తమానే ఉదాహరణగా తీసుకోండి. దీని మందు కోసం కొన్ని దశాబ్దాలుగా మాపై ప్రయోగాలు జరుగుతున్నాయి. తీరా చూస్తే ఇన్ని ప్రయోగాలు చేసి, ఇన్ని జంతువుల ప్రాణాలు తీసిన తర్వాత కూడా ఇప్పటివరకూ అందుబాటులోకి వచ్చింది రెండే రెండు చికిత్సా విధానాలు. గుండెపోటు చికిత్స విషయమూ ఇంతే. వెయ్యి దాకా మందులను జంతువులపై ప్రయోగించి, వాటిని బలి తీసుకుంటే... మనిషికి పనికొచ్చింది ఒక్కటంటే ఒక్క మందు!

ఈ రకమైన వ్యాధులు లేని, రాని జంతువులపై ప్రయోగాలు చేయడం వల్లే ఫలితాలు ఇలా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మిగిలిన చాలా వ్యాధులకు సంబంధించిన మందులు కూడా మనుషుల్లో ప్రభావం చూపకపోవడానికి సగం నుంచి 99.7 శాతం అవకాశాలు ఉన్నాయని అంచనా!  
 
మెరుగైన వైద్యానికి అవసరం కాదా?
 మేమంటే జంతువులం. ఏదో అలా బతికేస్తాం. కానీ మీరు మనుషులు. తెలివితేటలు ఉన్నవాళ్లు. మీ తెలివిని ఉపయోగించి టెక్నాలజీని ఎంతో అభివృద్ధి చేశారు. మరి దాన్ని వాడుకోవచ్చు కదా!

ఒకప్పుడు మరో ప్రత్యామ్నాయం లేక, మెరుగైన వైద్యం కోసం మామీద ప్రయోగాలు నిర్వహించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు వీటి ప్రయోజనం సున్నా అని జంతు పరిరక్షణ సంస్థల ప్రతినిధులు కుండ బద్దలుకొట్టి చెప్తున్నారు. అది మీకు వినపడదా? వినిపించుకోరా? మానవ జన్యుక్రమ నమోదు పూర్తి కావడం, కంప్యూటర్ శక్తి మునుపెన్నడూ ఊహించని స్థాయికి చేరుకోవడం జరిగింది కాబట్టి... జంతువుల స్థానంలో మానవ కణాలపైనే ప్రయోగాలు చేయవచ్చునని వారు అంటున్నారు. కణస్థాయిలో అత్యధిక వేగంతో వేర్వేరు పనులు నిర్వహించగల రోబోలు, ఆటోమెటిక్ యంత్రాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయట.

కంప్యూటేషనల్ బయాలజీ వంటి ఆధునిక సైన్స్ అంశాలు మంచి పురోగతి సాధించాయట. వీటి వల్ల కణాలు, జన్యువులు, వాటి పనితీరుపై మనిషికి ఎంతో అవగాహన పెరిగిందని, ఫలితంగా ఏ రసాయనమైనా మనిషిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కంప్యూటర్ సిములేషన్ తదితర పద్ధతుల ద్వారా తెలుసుకోవడం కష్టమేమీ కాదని తాజా అంచనా. ఈ సమాచారాన్ని అందుబాటులో ఉన్న జనాభా సమాచారంతో కలిపి విశ్లేషించడం ద్వారా జంతు ప్రయోగాల కంటే మెరుగైన విధంగా ఫలితాలు సాధించవచ్చట.

వ్యాధులను అర్థం చేసుకునేందుకు కుక్కలు, కోతుల్లో ఆ వ్యాధిని సృష్టించడం కంటే... మనిషికి వ్యాధులు వచ్చేందుకు కారణమవుతున్న అంశాలను గుర్తించే దిశగా ప్రయోగాలు చేపట్టడమూ జంతు ప్రయోగాల అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తాయని చెప్తున్నారు. మాకంటే ఇవన్నీ అర్థం కావు. మీకు అర్థమవుతాయి కదా!  మరి ఎందుకు ఇంకా మా ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారు!
 దయచేసి ఇక ఈ ప్రయోగాలు ఆపండి ఫ్రెండ్‌‌స. మమ్మల్ని బతకనివ్వండి. మీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం మా ప్రాణాలు తీయకండి.
- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా
 
ఇవన్నీ ప్రయోగాల్లో భాగమే!

తిండి తిప్పల్లేకుండా.. నీళ్లు కూడా అందకుండా మాడ్చడం.
కత్తులతో గాయాలు చేయడం. కాల్చడం. (గాయాలు తొందరగా మాన్పేదెలాగో తెలుసుకునేందుకు)
బలవంతంగా ఈతకొట్టేలా చేయడం, కరెంటుతో షాకులివ్వడం (ఒత్తిడి, ప్రవర్తనల అధ్యయనం కోసం)
శస్త్రచికిత్సలు చేయడం... కోలుకున్నాక ఇదే పని మళ్లీ మళ్లీ చేయడం. (మెరుగైన శస్త్రచికిత్స పద్ధతులు తెలుసుకునేందుకు)
బలవంతంగా ఆహారాన్ని నోట్లో కుక్కడం, రకరకాల విషవాయువులను పీల్చేలా చేయడం, కడుపులోకి, చర్మంపై ఇంజెక్షన్లు గుచ్చడం ( రసాయనాల దుష్ఫలితాలను అంచనా వేయడం కోసం)
వ్యాధులకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లకు గురిచేయడం. మందులు ఇవ్వడం
రకరకాల వైకల్యాలు, రోగాలు తెచ్చిపెట్టేలా జన్యువులను చేర్చడం, తొలగించడం.
మనుషుల్లో వచ్చే కేన్సర్, మధుమేహం, గుండెపోటు వంటి రోగాలను జంతువుల్లో సృష్టించడం.
కార్బన్ డైయాక్సైడ్ వంటి విష వాయువులిచ్చి చంపేయడం... మెడ విరిచేసి చంపేయడం... తల నరికేయడం వంటివి కూడా జంతు ప్రయోగాల్లో భాగమే.

Advertisement

What’s your opinion

Advertisement