యథార్థ కల్పితం | Sakshi
Sakshi News home page

యథార్థ కల్పితం

Published Sun, Aug 23 2015 1:01 AM

యథార్థ కల్పితం

కథ
బయట ఆకాశం నిండా నల్లటి మబ్బులు పరుచుకుని ఉన్నాయి. ఉండుండి ఉరుములు మెరుపులు వస్తున్నాయి. లోపల వాతావరణం మాత్రం చాలా ప్లెజెంట్‌గా ఉంది. రూమ్ అంతా నీలిరంగు కాంతి పరుచుకుంది. మూడు కుర్చీలు, మధ్యలో గుండ్రటి పెద్ద గ్లాస్ టీపాయ్ ఉన్నాయి. దానిమీద ఐస్ క్యూబ్స్ ఉన్న ఫ్లాస్క్. ఆ పక్కనే అందమైన ప్యాకింగ్‌తో రెండు పెద్ద పెద్ద ప్యాకెట్లు ఉన్నాయి. దానిపక్కనే ఖరీదైన క్రిస్టల్ బౌల్లో వేయించిన జీడిపప్పు పెట్టి ఉంది. ఆ గదిలోకి రాగానే వింత పరిమళం.

దాన్ని ఆస్వాదిస్తూనే ముగ్గురూ లోపలికి వచ్చారు. ఈ ఊర్లోనే ఉండే రెండో మిత్రుడు, ‘‘అబ్బ, ఈ స్మెల్ ఏదో లోకాలకి తీసుకెళుతోంది గురూ!’’ అంటూ కన్నుగీటాడు. దానికి సమాధానంగా అమెరికా నుండి వచ్చిన మిత్రుడు, ‘‘అదేంటి? ఇది నువ్వు అరేంజ్ చేసింది కాదా?’’... అన్నాడు. ‘‘లేదు లేదు, నేను చెయ్యలేదు’’ అని మళ్లీ  ‘‘మన గురూజీకి నాకన్నా ఇక్కడ పరపతి ఎక్కువ. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్లతో మంచి ర్యాపో ఉంది. అంతా తనే చేశాడు. అందుకే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది అరేంజ్‌మెంట్’’ అన్నాడు ఇక్కడే ఉండే రెండో మిత్రుడు.  
 
అంతవరకు మౌనంగా వీళ్ల వెనకాలే ఉన్న మూడో మిత్రుడు, ‘‘బాబూ! మా పల్లెటూళ్లోని హాస్పిటల్‌కి మీలాంటి పెద్దవాళ్ల సహాయ సహకారాలు ఉండాలి. అందుకే మిమ్మల్ని ఇలా సంతోషపెట్టాలని నా తాపత్రయం’’ అని నవ్వుతూ అన్నాడు. ‘‘గ్రేట్! నీకు మంచి టేస్ట్ ఉందని అర్థమైంది మిత్రమా!’’ అంటూ అమెరికా మిత్రుడు భుజం తట్టాడు.  ‘‘ఎంతైనా హృదయ స్పందనల గురించి తెలిసున్నవారు, అమెరికాలో పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించిన హృదయాధిపతులు కదా! అందుకే బాబూ... నన్ను పొగడుతున్నావో, కిందకి లాగేస్తున్నావో తెలియటం లేదు. నాలిక పీకేస్తోంది. బ్లాక్ వెల్వెట్ పిలుస్తోంది. రా!  రా!’’... అన్నాడు.       
 
‘‘ఓ ఎస్, అన్నీ రెడీగానే ఉన్నాయి. మన నైట్స్ కూడా ఇక్కడే కాబట్టి ప్రాబ్లం లేదు. డిన్నర్ కూడా ఈ గెస్ట్‌హౌస్‌లో ఉన్న కుక్ చేసి పెట్టేస్తాడు. సో, ఈ రాత్రి కేవలం మన ముగ్గురి కోసమే. ఐదేళ్ల క్రితం ఎవరి దారిన వాళ్లం. చాలారోజుల తరువాత కలుసుకున్నాంగా, ఎంజాయ్ చేద్దాం. సరేనా!’’ అన్నాడు మూడోమిత్రుడు. ‘‘బయట వాతావరణం బాగా చల్లబడిపోయింది. బే ఆఫ్ బెంగాల్లో తుపాన్, దాని ప్రభావంతో రెండు రోజుల వరకు కుంభవృష్టి కురిసే సూచన అని ఇప్పుడే న్యూస్ అప్‌డేట్ వచ్చింది’’ అన్నాడు ఇక్కడే ఉండే మిత్రుడు.
 
‘‘నాకు ఎందుకో ఈ ముసురు అంటే అసహ్యం’’ అన్నాడు ఉన్నట్టుండి అమెరికా నుంచి వచ్చిన మిత్రుడు. ఒక నిమిషం పాటు మౌనంగా ఉండిపోయారు అందరూ.
 ‘‘అరె అదేమిటి! అందరూ అలా సెలైంట్ అయిపోయారు? ఇప్పుడు ఏ దేశ నాయకుడూ మరణించలేదు. చీర్ అప్ ఫ్రెండ్స్. నాకు మటుకు ఇలాంటి సమయంలో కథలు చెప్పుకోవాలనిపిస్తుంది’’ అని పల్లెటూరిలో ఉండే మూడోమిత్రుడు అన్నాడు.
 
‘‘అవునవును, నాకేమో చెప్పడం కన్నా వినడం ఇష్టం’’ అని రెండో మిత్రుడు అన్నాడు.
 ‘‘నాక్కూడా వినడమే ఇష్టం’’ అని అమెరికా మిత్రుడు అన్నాడు.
 అమెరికా మిత్రుడు కొంచెంసేపు గడిచాక, మూడోమిత్రుడితో, ‘‘అవునూ, ఇన్నాళ్లూ ఏమైపోయావు? నా పెళ్లికి పిలిచాను, తరువాత నేను అమెరికా వెళ్లాక కూడా నీ కాంటాక్ట్ కోసం ట్రై చేశాను. ఎందుకో ఎక్కడా చిక్కలేదు నువ్వు. లక్కీగా ఈ సెమినార్లో కనిపించావు. థాంక్ గాడ్’’ అన్నాడు.
 
‘‘అవును. నేను కూడా త్రీ మంత్‌‌స బ్యాక్, అనుకోకుండా కలవడం జరిగింది. ఆ పల్లెటూరిలో ఎంతో చక్కటి నర్సింగ్ హోమ్ రన్ చేస్తున్నాడని, అక్కడ ఉండేవాళ్లు అందరూ డాక్టర్ దేవుడు అంటారని కూడా తెలిసింది’’ అని రెండో మిత్రుడు అన్నాడు.  
 ‘‘అదే, మా ఊరిలో నర్సింగ్ హోమ్ పనులతో కాలం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. నా గురించి అంత పొగడద్దు. మానవత్వం, మనిషిగా మనిషికి సాయం చేయడం అంతే. జీవితంలో కొన్నిసార్లు మనం అనుకోకుండానే, అడగకుండానే సహాయం చేస్తాం.

డాక్టర్ అవడం వల్ల అనుకున్నవి చేసేందుకు ఎక్కువ అవకాశం వస్తుంది. అంతే! సరే సరే, ముందు ఇవి తీసుకోండి’’ అని గెస్ట్‌హౌస్‌లో ఉండే సర్వెంట్ రెడీ చేసిన గ్లాసులు చేతికి ఇచ్చాడు. పైగా ‘‘కరెక్ట్‌గానే ఫిక్స్ చేశానా’’ అని కూడా అన్నాడు ‘యా! యా! గుడ్’ అంటూ ఛీర్‌‌స చెప్పుకున్నారు. ‘‘సరే నువ్వు కథ చెప్పడం మొదలుపెట్టు మిత్రమా’’ అని అమెరికా మిత్రుడు అన్నాడు . ‘‘కథ నేను చెబు తాను. పాత్రలని మీరు ఊహించుకోండి’’ అని అన్నాడు మూడో మిత్రుడు. అప్పుడు కూడా ఇలాగే ముసురు, తుపాను, ఆగకుండా వర్షం అంటూ చెప్పసాగాడు. అమెరికా మిత్రుడు కుతూహలంతో ముందుకు వంగి వినసాగాడు.
   
కుక్కిమంచంలో ఓ మూలకి ముసలాడు ముడుచుకొని కూచున్నాడు. ఒకటే ముసురు..! ఆకాశానికి చిల్లుపడినట్లు... ఆగకుండా వర్షం..!   ఎక్కడా తెరిపిలేదు, కురుస్తూనే ఉంది! తుపానుట, మూడు రోజుల వరకు తగ్గదుట, బిక్కుబిక్కుమంటూ ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని భయంభయంగా ఉన్నారు అందరూ. ‘చుట్ట ఉంటే బాగుండేది’ అని గొణుక్కుంటున్నాడు ముసలాడు. ‘‘ఎహే! నీలో నువ్వు మాట్లాడుకోమాక, బయటకు చెప్పు’’ అని కసిరాడు కొడుకు.  
 
‘‘నాకు తెలుసు, నాకు తెలుసు! తాతయ్య ఏమన్నాడో?’’ గెంతుతూ అన్నాడు మనవడు.
 ‘‘ఏందిరా, మధ్యలో నీ గోల! ఈ పూటకి గంజినీళ్లయినా దొరుకుతాయో లేదో అని నేను గుబులుపడి ఛస్తున్నాను’’ అని మొగుడి వైపుకి తిరిగి, ‘‘ఏందయ్యో, అట్టా గమ్మున కూకుంటే కూడు మన నోటికాడకు రాదు, ఓపాలి బయటకు వెళ్లి, ఎవరినన్నా అడగరాదూ? ఎన్ని రోజులని అర్ధాకలితో ఉంటాము’’ గట్టిగా అరిచింది ముసలాడి కోడలు.
 ‘‘ఒరే కొడకా! ఈ ముసురులో మిరపకాయ బజ్జీలు, బొమ్మిడాల పులుసు, తిని లంక పొగాకు చుట్ట కాలిస్తే, నా సామిరంగా! సొరగం, సొరగం కని పిస్తుందిరా’’ అని ముసలాడు కొడుకుతో ఎంతో తన్మయత్వంగా చెప్పాడు. ‘‘భలే ! భలే! తాతకి సొరగం కావాలిట, సొరగం’’ ముసలాడిని ఆట పట్టించాడు మనవడు.
 
ముసలాడి మాటలకి కొడుకు మొహం చిన్నబోయింది. ‘‘ఎదవ జన్మ, ఎదవ జన్మనీ... కడుపు నిండా అయ్యకి ఇంత కూడెట్టలేకపోతున్నాను, థూ! ఏం బతుకులే మనవి’’ అని పెళ్లాంవైపు తిరిగి బాధగా అన్నాడు.
 ‘‘ఊరుకో మావా! ఏం చేస్తాం, ఆ దేవుడికి దయలేదు. మనకింతే ప్రాప్తం, ఏదో ఉండబట్టలేక అనేశాను, నాకు మాత్రం తెల్దా ఏంటి?’’ అని మొగుడితో అభిమానంగా అంది.
 ‘‘నేను మటుకు ఏం చెయ్యనే, బయటికి వెళదామంటే మాయదారి వాన తగ్గటం లేదు. నాకూ బాధగానే వుంది.

రోజూ వచ్చే కూలీ పోయింది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మనవి’’ అని వాపోయాడు మొగుడు. ‘‘బాధపడమాక మావా’’ ఓదార్పుగా భుజం తట్టింది.
 పొద్దున్నే తినగా మిగిలిన అన్నం, కొంచెం నూకలతో కాచిన గంజిలో... ఒక ఎండిపోయిన ఉల్లిపాయని నంజుకొని నలుగురూ సర్దుకొని తిన్నారు.
 ‘అమ్మా కొంచెం కావలె’ అంటూ పిల్లాడు కొంతసేపు వాగివాగి పడుకున్నాడు. వాడి పక్కనే తల్లి ముడుచుకొని పడుకుంది.
 
ఇంతలో ‘అమ్మో అమ్మో అందరం చచ్చిపోతున్నామే, భయం వేస్తోంది’ అంటూ నిద్దట్లోనే ఏడుస్తున్నాడు పిల్లాడు. వెంటనే వాడిని పట్టుకొని ‘ఒరే అయ్యా! నేను నీ పక్కనే ఉన్నానురా! భయపడమాక. ఏటీ అవలేదు’ అంటూ వాడిని దగ్గరకు తీసుకుంది. ‘తినడానికి తిండి దొరకనప్పుడే ఆకలేస్తుంది అదేమిటో, చిత్రంగా!’... మనసులోనే అనుకుంది.
 ఇంతలో తడికని ఎవరో కొట్టినట్లు చప్పుడయ్యింది. ‘‘మావా! ఎవరో తలుపు కొడుతున్నారు’’ అంది.
 ‘‘ఎహే గాలికి కొట్టుకుంటోంది, ఈ తుఫానులో ఎవరొస్తారు’’ విసుగ్గా అన్నాడు మొగుడు. ఈసారి గట్టిగా తడికను బాదిన చప్పుడు ఇద్దరికీ వినిపించింది. అప్పుడు అతను గట్టిగా అరిచాడు ‘ఎవరూ’ అంటూ.

జవాబుగా ‘తలుపు తీయండి ప్లీజ్’ అంటూ ఒక సన్నటి గొంతు వినిపించింది. గబాగబా వెళ్లి తడికగొళ్లెం తీసేసరికి ఎదురుగా ఒక యువతి, యువకుడు తడిసిపోయి ఉన్నారు.
 ‘‘మేము ఇంట్లోకి రావచ్చా, ప్లీజ్’’ అని మొహమాటంగా ఆ యువతి అభ్యర్థించింది. ఆ మాటలకి అంతవరకూ బొమ్మలా నిలబడ్డవాడు, ‘లోపలికి రండి బాబూ. ఇలా కూకోండి’ అంటూ, పడుకున్న ముసలాడిని లేపి ఆ కుక్కి మంచాన్ని చూపించాడు.
 
ఇద్దరూ మొత్తం తడిసిపోయి ఉన్నారు. ఆ యువకుడిని నెమ్మదిగా ఆ మంచంమీద పడుకోబెట్టి, చుట్టూ చూసింది. అక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తే ఆ ఇంట్లో కప్పుకోడానికి దుప్పటి కూడా దొరకదని అర్థమైంది. పోనీ కొంచెం వేడివేడిగా టీ పడితే అనిపించి అటూ ఇటూ చూసింది.
 అది గమనించిన ఆ ఇంటామె ‘‘ఏం కావాలమ్మా?’’ అని అడిగింది. ‘‘కొంచెం టీ ఏమన్నా దొరుకుతుందా?’’ అని సందేహిస్తూ అడిగింది ఆ యువతి. ఏమీ చెయ్యలేని అశక్తతతో తలను అడ్డంగా ఊపింది.
 
‘‘పోనీ బయట ఏదైనా హోటల్లో దొరుకుతుందా?’’ అని అంటుండగానే ఆమెకి అర్థమైంది అది ఒక వృథా ప్రయత్నం అని.
 పెద్ద వాన పడటం, దారి కనిపించక పోవడం, కారు పంటపొలాల మధ్యలో ఆగిపోవడం, కారును స్టార్ట్ చేసే ప్రయ త్నంలో ఇద్దరూ జడివానలో తడవటం, అంతకుముందు రోజు కూడా వాటర్ ఫాల్లో నీళ్లలో తెగ నానడం... ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి వరుసగా జరగడంతో అతని శరీరం తట్టుకోలేక అకస్మాత్తుగా చలిజ్వరం వచ్చేసింది.
 
అసలు తను స్పృహలోనే లేడు. బట్టలు మార్చి పొడిబట్టలు వేయడానికి వేరే జతలేదు. బ్యాగ్ కూడా కారులో ఉండి పోయింది. అయినా కారు డిక్కీలోకి కూడా నీళ్లు వచ్చేశాయి. బహుశా అవి కూడా తడిసిపోయి ఉంటాయి. ఇలాంటి పరి స్థితిలో ఆ చలి, నెమ్ము నుంచి కాపాడా లన్న తన ప్రయత్నం ఎంతవరకు ఫలి స్తుంది! ఈ తుపాను రాత్రి, ఈ చల్లటి గాలిలో ఏదైనా జరగరానిది జరిగితే... ఆ ఊహే భయంకరంగా అనిపించింది ఆమెకి.
 
గుడిసెలో గుడ్డిదీపం ఒకటి వెలుగు తోంది. ఉన్న కొద్దిపాటి వెలుతురులో ఆ యువతి నాలుగువైపులా చూసింది. కునికి పాట్లు పడుతూ కూచున్నారు ఆ భార్యా భర్తలు. ‘అమ్మా చలేస్తుందే, గట్టిగా పట్టు కోవే’ అంటూ పిల్లాడు తల్లిని బల్లిలా అంటుకుపోతున్నాడు. తల్లి కొడుకును ఆప్యాయంగా దగ్గరగా ఒడిసిపట్టుకుంది.
 అంతే, కొంతసేపటికల్లా వాడు ప్రశాంతంగా నిద్రపోయాడు. ఎదురుగా ఉన్న కుక్కిమంచంలో ఆ యువకుడు చలికి తట్టుకోలేక వణికిపోతున్నాడు. పక్కనే కూచున్న ఆ యువతి అతని చెయ్యి పట్టుకుని భయంగా, దిగులుగా చూస్తూనే ఉంది.
 
వాళ్లని చూస్తున్న ఆ ఇంటామె మనసులోకి ఒక ఆలోచన వచ్చింది, అది రావడమే తడవు మొగుడి పక్కకు తిరిగి అతని చెవిలో ఏదో చెప్పింది. అతను ‘సర్లేవే! అట్టాగే, కాకపోతే ఈ ముసిలాడితోనే కొంచెము కట్టమేమో?’ అన్న్డాడు.
 ఆ యువతి దగ్గరకు వెళ్లి ‘‘అమ్మా, మేము బయటి అరుగుమీద పడుకుం టాము. మీరు హాయిగా నిద్రపోండి, ఏమీ భయం లేదు’’ అని చెప్పింది.
 ‘‘అయ్యో ఇంత వాన, చలిలో మీరు అందరూ బయట ఎలా పడుకుంటారు? వద్దు’’ అని అంది.  ‘‘మాకేటి పరవాలేదు. మాకిది అలవాటే. మీరు ఏమీ ఆలోచించ కుండా పడుకోండి’’ అని ఆమె మొగుడు చెప్పాడు.
 
‘నా చుట్టలేయే కోడలా’ అని ముసలాడు గొణుగుతున్నాడు. మెల్లగా ఒకరి తరువాత ఒకరు, గుడిసె తడిక తీసికొని, బయటకు వెళ్లి గుమ్మానికి పక్కనే ఉన్న మట్టి అరుగుమీదకి చేరారు. రివ్వున చల్లటిగాలి తగిలింది.
 ‘‘అయ్యో చచ్చిపోతానే ఈ చలికి’’ అంటూ ముసలాడు గట్టిగా అరిచాడు.
 
‘‘ఉష్, గట్టిగా అరవకు, ఇంద నీకు చుట్ట ఇస్తాను. అది కాల్చుకుంటూ కూకో’’ అన్నాడు కొడుకు. ‘‘అబ్బో! చుట్టే! అయితే ఎంత చలినయినా కాసేస్తాది’’ అంటూ మురిసిపోయి హుషారుగా‘ ఈ రేయి నన్నొల్లకే నా రంగసాని’ అంటూ పాడు కుంటున్నాడు.  
 ‘‘అబ్బో! ముసలోడికి చుట్టలుంటే దసరా పండగే’’ అని కోడలు సరదాగా అంటూ కొడుకుని దగ్గరకు తీసుకొంది. చూరు నుంచి నీళ్లు కారుతున్నాయి. ఎంత వెనక్కి ముడుచుకొని కూచున్నా మోకాళ్ల వరకు ధార కొడుతూనే ఉంది.
 పిల్లాడు మాత్రం ‘లోపలకి పోదామే, తడిసిపోతున్నాము’ అంటూ ఏడుపు మొదలెట్టాడు. ఎలాగో వాడిని సముదా యించి, దగ్గరకు తీసుకొని, తన చేతులని వాడికి రక్షణ వలయంలా చేసి, ఉన్న ఒక పాతచీరను వాడికి కప్పింది.
 
చాలాసేపు మేలుకునే ఉన్నారు కానీ, ఎప్పుడు కళ్లు మూతలు పడ్డాయో తెలియ లేదు. ఆ యువతి, యువకుడు వచ్చి వాళ్లని తట్టి లేపేసరికి రాత్రి జరిగినది గుర్తుకువచ్చి, ఆమె గభాల్న లేచి చుట్టూ చూసింది. తెలతెలవారుతోంది. పక్షుల కిలకిలలు, కోడికూతలు వినిపిస్తున్నాయి, వాన జోరు కూడా తగ్గింది. చిన్నగా తుంపర మాత్రం పడుతూనే ఉంది.
 రాత్రి పడుకోవటం వల్ల ఆ ఇద్దరి మొహాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఆమెని చూస్తూ, ‘‘చాలా థ్యాంక్సండీ, మీరు చేసిన సాయానికి’’ అన్నాడు ఆ యువకుడు.
 
అప్పుడు ఆమె అమాయకంగా, ‘‘ఏదో నాకు తెలిసినదే చేశాను. ఇందులో అంత గొప్పతనమేమీ లేదు బాబు. ఇలా వానల్లో, తుపాన్లలో తడవడం, వణకడం అన్నీ మామూలే మాకు. పాపం మీరే సానా ఇబ్బంది పడ్డారు’’ అంది. ఇంతలో యువ కుడి ఫోన్ మోగింది. యువతి ఆమెకు డబ్బులివ్వ బోయింది.
 ‘‘ఒద్దమ్మా! మీరి ద్దరూ చల్లగా ఉంటే అదే చాలు. అయినా మాకు ఎందుకు తల్లీ అంత డబ్బు. వద్దమ్మా’’ అని దృఢంగా అంది. చేసేదేమీ లేక ఆ యువతి, యువకుడు వెళ్లిపోయారు.
   
‘‘కథ కంచికి... మనం డిన్నర్ చేయటానికి’’ అని కథ చెప్పటం ముగించాడు మూడో మిత్రుడు.
 ‘‘పాపం, డబ్బులు కూడా వద్దనే పిచ్చివాళ్లు కూడా ఉంటారని నీ కథ ద్వారా అర్థమైంది’’... రెండో మిత్రుడు అన్నాడు. అమెరికా మిత్రుడు ఏదో ఆలోచిస్తూ, ‘‘ఈ కథ... అని అర్థోక్తిలో ఆగి, కొన్ని డౌట్స్ ఉన్నాయి మిత్రమా, ఇది నిజంగా జరిగిన కథా?’’ అన్నాడు.   
 
దానికి మూడో మిత్రుడు ‘‘ఇదో యథార్థ కల్పితం, దీని గురించి అంతకన్నా ఎక్కువ ఆలోచించకండి. రండి డిన్నర్ చేద్దాం’’ అంటూ ఇక ప్రశ్నలకి తావివ్వకుండా అన్నాడు.
 రాత్రి డిన్నర్ చేసేసి, ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి పడుకున్నారు. కొంచెం సేపయ్యాక రెండో మిత్రుడు, ‘‘నాకు నిద్దరపట్టటం లేదు మిత్రమా! నీ కథ వెంటాడ్తోంది. అందులో యువకుడు ఎవరు? ఆ యువతి ఏమైంది? తెలిసి సమాధానం చెప్పకపోతే నీ తల వేయి ముక్కలైపోతుంది సుమా! జాగ్రత్త’’ అని తర్జనితో బెదిరించాడు.
 ‘‘చాలా రాత్రయింది వెళ్లి పడుకో. పొద్దున్న చెబుతాలే!’’ అన్నాడు మూడో మిత్రుడు. తన గదిలోకి వెళ్లిపోయాడు రెండో మిత్రుడు.
   
మరునాడు ఉదయం, ఫోన్ రింగ్‌తో తెలివి వచ్చింది మూడో మిత్రుడికి. ఇంతలో గెస్ట్‌హౌస్ నౌకరు వచ్చి, ఒక ఉత్తరం చేతికిచ్చి ఆ అమెరికా సార్ ఏదో పనుందని పొద్దున్నే వెళ్లిపోయారు. మిమ్మల్ని నిద్ర లేపుతానంటే వద్దని చెప్పారు. ఆయన రూమ్‌లో మీ పర్సు మర్చిపోయారట రాత్రి. దానితోపాటే ఈ కాగితం కూడా మీకు ఇమ్మన్నాడు’’ భయం భయంగా చెబుతూ పర్సుతో పాటు ఉత్తరం కూడా ఇచ్చాడు.  
 
దాన్ని అందుకొని విప్పి చదవసాగాడు. ఇంతలో రెండో మిత్రుడూ వచ్చి, జరిగింది చూసి, తను కూడా ఉత్తరంలోకి తొంగిచూశాడు.
 అందులో, ‘‘మిత్రమా! నువ్వు చెప్పిన కథ యథార్థ కల్పితం కానే కాదు. అది పూర్తిగా యథార్థమే. అందుకే నిజంగా నువ్వు దేవుడివే’’ అని రెండే రెండు వాక్యాలు రాసి ఉంది.
 అర్థం కాక ప్రశ్నార్థకంగా మొహం పెట్టిన  రెండో మిత్రుడికి ‘‘నిన్న రాత్రి నువ్వు అడిగిన కథలోని యువతి ఈమె’’ అని తన పర్సులో ఫొటో చూపించాడు మూడో మిత్రుడు. ‘‘ఆమె, పక్కన నువ్వు... అంటే అర్థమైంది... మరి ఆ యువకుడు?’’ అడిగాడు చప్పున.
 ‘‘అదే, నువ్వు ఊహించినదే’ అన్నాడు మూడో మిత్రుడు పర్సు మూస్తూ. మరుక్షణం అమెరికా ఫ్రెండు కళ్లముందు కదిలాడు. ‘‘అంటే తను మోసగించిన అమ్మాయిని...’’
 చిన్నగా నవ్వాడు మూడో మిత్రుడు.
 ‘‘నువ్వు నిజంగానే దేవుడివిరా’’ అంటూ అతణ్ని వాటేసుకున్నాడు రెండో మిత్రుడు.    
 - మణి వడ్లమాని

Advertisement

తప్పక చదవండి

Advertisement