నిజం-అబద్ధం-అయితేకావొచ్చు | Sakshi
Sakshi News home page

నిజం-అబద్ధం-అయితేకావొచ్చు

Published Sun, Dec 29 2013 2:52 AM

నిజం-అబద్ధం-అయితేకావొచ్చు

అసంగతం

 కొన్ని నిజమైతే బాగుండనిపిస్తుంది. కొన్ని అబద్ధమైతే బాగుండనిపిస్తుంది. నిజానికీ అబద్ధానికీ మధ్యదూరం- అందులో ఏదో ఒకటి ఎదుటి పక్షం వహించేంతవరకే! అది తేలేవరకే చర్చ. ఈ సంవత్సరాంతాన 2013లో అలా విస్త్రృతంగా వార్తల్లోకొచ్చిన శాస్త్రీయాంశాల్లోని నిజానిజాలేమిటో చూద్దాం!
 
 1  
 సముద్ర రాక్షసి కనపడింది: అబద్ధం
 ఇదీ చందమామ కథలాంటిదే! సముద్రపుటడుగునెక్కడో అతి భారీ రక్కసిలాంటిదేదో ఉంటుందని నమ్మడం. ఇది నిజంగానే కనబడిందన్న వార్త రావడానికి కారణం, అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో అలాంటి ప్రాణి కనబడటం! అయితే, అది సముద్రసర్పంలా అనిపించే ఓర్ చేప అని తేలింది. 32 అడుగుల వరకు పెరిగే ఈ చేపలు సముద్రంలో 3000 అడుగుల లోతున మనుషుల కంటబడకుండా జీవిస్తాయి. ఇవిగనక ఉపరితలానికి వచ్చాయంటే, ఏ భూకంపానికో సంకేతమని జపనీయులు నమ్ముతారు.
 2
 
 అంతరిక్ష పిడుగు: నిజం
 ప్రతి సంవత్సరం భూమ్మీద భిన్న రూపాల్లోని ‘ఆకాశ ధూళి’ 15000 టన్నుల దాకా రాలిపడుతూనే ఉంటుంది. కానీ ఈసారి పడిన ఉల్క మనుషుల్ని వణికించినమాట నిజం. ఈ ఏడాది ఫిబ్రవరిలో- రష్యాలోని ‘చెల్యాబిన్‌స్క్’ ప్రాంతం మీద 23.3 కిలోమీటర్ల ఎగువన ఈ ఉల్క పేలి, నిప్పులు జిమ్ముకుంటూ భూవాతావరణంలోకి ప్రవేశించింది. 7000 భవనాలు ధ్వంసమైనాయి. 1500 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఆ సమయంలో విడుదలైన శక్తి హిరోషిమా మీద పడిన అణుబాంబుకన్నా 20-30 రెట్లు అధికం.
 3
 
 సాగరకన్యలు కనబడ్డారు: అబద్ధం
 మనదగ్గరే కాదు, ఇంకా ఎన్నో దేశాల్లోని ‘చందమామ’ కథల్లో కూడా సాగరకన్యలు కనిపిస్తారు. నడుము పైన అమ్మాయిలాగానూ, కిందిభాగమంతా చేపతోకలాగానూ ఉండే ఈ ‘మెయ్‌మెయ్డ్’ ఒక సృజనాత్మక ఊహ. కానీ ‘ఏనిమల్ ప్లానెట్’ వారు వాటిమీద ఏకంగా డాక్యుమెంటరీ తీశారు. కాకపోతే మనుషుల్తో నటింపజేసి. ప్రేక్షకుల్ని తప్పుదారి పట్టించారన్న విమర్శలు ఎన్నివచ్చాయో, వినోదాత్మకంగా ఉందన్న ప్రశంసలు అంతకంటే ఎక్కువొచ్చాయి. ఇప్పటికైతే సాహసవీరులు ఆరాటపడే సాగరకన్యలు లేనట్టే!
 
 4
 
 
 ప్రాచీన ఏనుగుకు కొత్త జీవితం: అయితేకావొచ్చు
 2007లో సైబీరియాలో యూరీ ఖుదీ అనే వేటగాడు మంచుతో కప్పివున్న  ఏనుగు మృతదేహాన్ని గుర్తించాడు. అంతరించిపోయిన భారీ ఏనుగు జాతికి చెందినదనీ, 10,000 ఏళ్ల క్రితపుదనీ, రెండున్నరేళ్ల వయసులో సింహాల దాడిలో చనిపోయివుంటుందనీ పరిశోధనలో తేలింది. ‘యూకా’ అని  పిలుస్తున్న ఆ భారీ ఏనుగుపిల్ల శరీరంలో వైటల్ ఆర్గన్స్ ఏమీ దక్కలేదు. అయినా, జన్యు పదార్థాన్ని భారతీయ ఏనుగు అండకణాల్లోకి ఎక్కించి, తిరిగి ఆ ఏనుగులను నడిపించే ఆలోచనైతే సాగుతోంది.
 
 5
 
 కుజపుష్పం: అబద్ధం
 కుజగ్రహం ఎప్పటికైనా మానవ నివాసయోగ్యమేనా అన్న భారీ లక్ష్యంతో ‘క్యూరియాసిటీ’ రోవర్ అక్కడ సంచరిస్తోంది. కారు పరిమాణంలో ఉన్న ఈ రోవర్ పంపిన కొన్ని ఫొటోల్లో తెల్లటి పుష్పాకృతి కనబడటంతో కుతూహలం మొదలైంది. పూవే ఉందంటే, ఇంకా చాలా ఉన్నట్టే కదా! అది రోవర్‌లోంచే విరిగిపడిన ప్లాస్టిక్ ముక్క కావొచ్చునని ‘నిర్ధారణ’కు వచ్చారు. ఇది అబద్ధమైనప్పటికీ ఆనందకరమైన విషయం కుజగ్రహం మీద నీటిజాడల్ని రోవర్ గుర్తించడం! అక్కడి మట్టి పరిమాణంలో రెండు శాతం మేర నీరు ఉండొచ్చని అంచనా!
 
 6
 
 భూవినాశనం: అబద్ధం
 యుగాంతం లాంటిదే ఇది కూడా! ‘డిఎ 14’గా పిలిచే ఒక ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టబోతోందనీ, భూమి మాడిమసైపోతుందనీ కొందరు భయపడ్డారు కూడా! అలాంటిదేం జరగకుండానే, దారి మళ్లిపోయింది. 45-50 మీటర్ల వ్యాసం, 40,000 టన్నుల బరువున్న ఈ ఆస్టరాయిడ్ భూమికి 27,700 కిలోమీటర్ల ‘సమీపం’దాకా వచ్చింది.
 
 7
 
 పెరిగిన చంద్రుడు: నిజం
 ఇది పూర్తి నిజం కాదు. పౌర్ణమిరోజు చంద్రుడు ప్రకాశవంతంగా కనబడతాడు. అదే పౌర్ణమి రోజు చంద్రుడు భూమికి అతిదగ్గరగా  గనక వస్తే దాన్ని సూపర్‌మూన్ అంటారు. భూమికి 3,56,990 కిలోమీటర్ల సమీపానికి చంద్రుడు వచ్చాడు. అలా ఇంతకుముందటికంటే పెద్దచంద్రుడు ఈ ఏడాది కనిపించాడు.

Advertisement
Advertisement