రాబందువు మన బంధువే! | Sakshi
Sakshi News home page

రాబందువు మన బంధువే!

Published Sun, Jun 11 2017 12:51 AM

రాబందువు మన బంధువే!

ఒకప్పుడు చనిపోయిన పశువులను ఊరి బయట పడేసేవారు. రాబందులకు అది  ఆహారం అయ్యేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. చనిపోయిన జంతువులను దహనమో, ఖననమో చేస్తున్నారు. దీనివల్ల రాబందులకు ఆహార కొరత ఏర్పడుతోంది. ఒకవేళ ఆహారం దొరికినా రసాయనాల ప్రభావంతో విషపూరితమై అది రాబందుల పాలిటి శాపంగా మారుతోంది. అడవులు తగ్గిపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, పారిశ్రామిక కాలుష్యం, రసాయనాల వాడకం... మొదలైన కారణాల వల్ల రాబందులు వేగంగా అంతరించిపోతున్న జాతిలో చేరాయి. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న  రాబందుల జాతిని సంరక్షించడానికి ప్రభుత్వం, రకరకాల స్వచ్ఛందసంస్థలు కృషి చేస్తున్నాయి.

ఈ ప్రయత్నానికి పౌరులు కూడా తోడైతే రాబందులు మళ్లీ విరివిగా కనిపించే రోజు ఎంతో దూరంలో లేదు అంటున్నారు కోయంబత్తూరు(తమిళనాడు)కు చెందిన సుబ్బయ్యభారతిదాసన్‌.రాబందుల సంరక్షణకు వ్యవస్థాగత కృషితో పాటు వ్యక్తిగత కృషి కూడా కీలకం అని నమ్ముతున్నారు భారతీదాసన్‌.అరుదైన మొక్కలను సంరక్షించడం కోసం ఒక నర్సరీని నిర్వహించేవారు దాసన్‌.

ఆ సమయంలోనే రాబందుల దీనస్థితి గురించి విని షాక్‌కు గురయ్యారు. బాధ నుంచి తేరుకొని రాబందుల సంరక్షణ కోసం కొద్దిమంది మిత్రులతో కలిసి ‘అరులగం’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. రాబందులను సంరక్షించుకోవ డానికి క్షేత్రస్థాయిలో పనిచేయడం ముఖ్యమని నమ్మారు భారతీదాసన్‌. ఇందులో భాగంగా గ్రామాలకు వెళ్ళి, ఆ గ్రామంలోని పెద్దలు, బడిపిల్లలు, రాజకీయనాయకులు... ఇలా రకరకాల వర్గాలతో మాట్లాడేవారు.

రాబందుల సంరక్షణ అనేది ఎంత ముఖ్యమైన అంశమో వారి అవగాహనలోకి తీసుకువచ్చేవారు. ప్రతి గ్రామంలో ‘వల్చర్‌ బ్రిగేడ్‌’ పేరుతో వాలంటీర్లను నియమిస్తున్నారు. అలా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 36,000 మంది వాలంటీర్లను నియమించారు. గ్రామాలలో స్థానిక కళాకారులతో కలిసి రాబందుల సంరక్షణ గురించి కళా ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ‘ఈ భూమి మీద మనకే కాదు... రాబందులకు కూడా జీవించే హక్కు ఉంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అవి మనకు చేసే మేలు విస్మరించలేనిది’ అంటూ ఎలుగెత్తి చాటుతున్న సుబ్బయ్య భారతీదాసన్‌కు ‘సేవింగ్‌ వల్చర్స్‌’ విభాగంలో ‘ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌’ (ఐయుసిఎన్‌) అవార్డ్‌ దక్కింది.

Advertisement
Advertisement