రెండో భాగం | Sakshi
Sakshi News home page

రెండో భాగం

Published Sun, Jul 1 2018 12:33 AM

This week's second part - Sakshi

పదహారు మూరల గోచీ చీరల్లోంచి లంగాతో కట్టుకునే చీరల్లోకీ, శిఖలోంచి జడలోకీ, ‘బూలచ్చవ్వ’ను భూలక్ష్మిలోకీ క్రమంగా మార్చుకొచ్చాడు వెంకట్రెడ్డి. అక్షరాలు దిద్దించాడు. సంతకం పెట్టడం నేర్పించాడు. ఊళ్లో తొలి మిర్చి పంట ఆయన వేశాడు. తొలి గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌ ఆయన కట్టించాడు. గుప్పుమని ఒక్కసారి వచ్చే మంట వల్ల లైటర్‌తో వెలిగించడానికి ఆమె బుగులు పడితే నవ్వేవాడు.


బీడీ తాగుతూ అట్లా రెణ్నిమిషాలు విరామంగా కూర్చుంది భూలక్ష్మి. చలికాలం కాబట్టి సాయమానులో ముట్టించిన కట్టెల పొయ్యి రాజుకుంటోంది. మరీ ఎక్కువ పనులున్నప్పుడు ఆమెకు తోచదు. ఒంటిచేతిని మార్చి కాపుకుంటూ, పనులను మనసులో ఒక క్రమంలోకి సర్దుకుంది. పదింటి వరకు బావనయ్య, జంగమయ్య వస్తారు. ఈలోపు బల్లిపాతర దులపాలి; ఇల్లు కడుక్కోవాలి; ఇంటి వెనుకాల, కొన వాకిట్లో గచ్చునేల లేనిచోట అలుకు జల్లాలి; బియ్యం, పప్పు, చింతపండు, కూరగాయలు, ఇంక ఇతర సాహిత్యం సిద్ధం చేసుకోవాలి; కొబ్బరికాయ, అగరుబత్తులు తేవాలి; వీటికంటే ముందు మెంతులు, కాగితాలు కలిపి రుబ్బి చేటలను పుదిచ్చుకోవాలి. అట్లయితేనే ఆరుతాయి. ఎటూ భూదవ్వను రమ్మంది, రోజు కైకిలి ఇస్తానని. వస్తున్నది కావొచ్చు. అయిపోయిన బీడీని అదే పొయ్యిలో పారేసి, గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పెట్టింది చాయ్‌ కోసం. మళ్లీ బియ్యం ఇచ్చేదాకా ఉపవాసం ఉండాలి.

అది చుట్టు భవంతి ఇల్లు. మట్టిగోడలకు సిమెంటు పూత పూయించడం, నేలను గచ్చుచేయించడం మినహా మిగిలినదంతా పాత కట్టడమే. పాతబడినా వైభవం తెలుస్తోంది. ఇంతింట్లో ఆమె ఒక్కతే. ఇవ్వాళైనా కొడుకు, బిడ్డ ఉండింటే బాగుండేదనుకుంది. కొడుకు ఆమధ్య కంపెనీ తరఫున అమెరికా వెళ్లాడు. పక్షం రోజుల్లో ఎటూ దసరా; ఆ వరకు వస్తానన్నాడు. బిడ్డ ఇండోర్‌లో ఉంటోంది. అల్లుడు బ్యాంకు ఉద్యోగి. ‘దాని సంసారం దానిదైపోయె; అనుకున్నప్పుడల్లా రావస్తుందా?’ భూదవ్వ వాకిట్లోంచే ‘లచ్చక్కా’ అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చింది. ‘రాయే... కోడల్ది రానిచ్చిందానే నిన్ను... పో పో పొయ్యి మీద చాయ మరుగుతుంది చూడు; నాకో కప్పుల పోసియ్యి, నువ్వింత తాగి ఇగ పని మొదలువెట్టు.’

పాత మెత్తటి బట్ట తీసుకుని భర్త ఫొటో దగ్గరకు వెళ్తుండగా మొబైల్‌ ఫోన్‌ మోగింది. కూడబలుక్కుని అక్షరాలు చదవగలదు. రామస్వామి. ‘ఆ వదినె, అదే మొన్న చెప్తి గదా, పది పదిన్నర వరకు ఓపెనింగు.’ నలుగుట్లోకి వెళ్లడం భూలక్ష్మికి ఇంతకుముందైతే ఇబ్బందిగా ఉండేది. ఎంపీటీసీ అయ్యాక ఈమధ్య అలా వెళ్లి కుర్చీల్లో కూర్చోగలుగుతోంది. భర్త సర్పంచ్‌గా చేసిన చాలా ఏళ్ల తర్వాత మళ్లీ గతేడాదే ఆమెను ఈ రామస్వామి లాంటివాళ్లు ఒప్పించి నిలబెట్టారు. అయినా పూర్తిగా అలవాటుకానితనం ఒకటుంటుంది లోపల. ‘నేనెందుకోయి అక్కడ? పెద్దలకు బియ్యం ఇచ్చుడు గూడుండె ఇయ్యాళ.’

‘అరే మల్ల అదే మాట, నాకు దెల్వదా బియ్యం ఇచ్చుడని; అందరుంటరు, నువ్వు గూడుండాలె; ప్రతాపన్న గిట్ట అచ్చుటానికి ఎట్లా అదే టైమైతది; ఇచ్చుడైనంక ఫోన్‌ జెయ్యి, నేను అజయ్‌గాన్ని బండిచ్చి తోలుత, మర్చిపోవద్దు’. భూలక్ష్మి స్టూలు వేసుకుని ఎక్కి, పూలు ఎండిపోగా మిగిలిన దారాన్ని తీసేసి ఫొటోను నెమ్మదిగా కిందికి దించింది. రోజువారీ జీవితం ఎంత యాంత్రికంగా మారిపోయినా, మరణించినవారి ఫొటో ఒక క్షణం మనసును ఒక నెమ్మదిలోకీ, ఒక తలపోతలోకీ, ఒక వైరాగ్యపు నిట్టూర్పులోకీ జారవిడవగలదు! భూలక్ష్మి ఫొటోను చూస్తూ అలాగే నిలబడింది. ఆయన కళ్లు తననే చూస్తున్నట్టుగా ఉన్నాయి. ఈలోపు భూదవ్వ టీ తెచ్చింది.

పెళ్లైన కొత్తలో తను ‘శాయ’ అన్నప్పుడల్లా భర్త వెక్కిరించేవాడు. ఆ ఊరిలో వెంకట్రెడ్డి వాళ్లది పెద్ద రైతు కుటుంబం. అతడు ఒక్కడే కొడుకు. పొడుగ్గా దిట్టంగా ఉండేవాడు. ఆ ఇంటి లెక్కల ప్రకారం భూలక్ష్మి వాళ్లది అంతంత సంసారమే. ఓ కులపోళ్ల పెండ్లిలో వెంకట్రెడ్డి ఆమెను చూశాడు. కాదనడానికి భూలక్ష్మి తండ్రికి ఏ కారణం కనబడలేదు. వాళ్లిద్దరిదీ స్థూలంగా మంచి కాపురం కిందే లెక్క. కానీ ఈమె మోటు పద్ధతుల్ని సహించేవాడు కాదు. ఆయనకు, గిన్నెలోంచి అన్నాన్ని చంచాతో నిలువుగా అడుగెల్లా తీయాలి. భోజనం ముగించి లేచేముందు వేళ్ల మధ్య ఎంగిలి మెతుకులు ఉండకూడదు. నీళ్లు తాగాక గ్లాసును బోర్లించాలి. పళ్లు తోముకుంటూ వాకిట్లో నిలబడకూడదు.

దువ్వెన పళ్లకు వెంట్రుక చిక్కుకుని కనబడకూడదు. పదహారు మూరల గోచీ చీరల్లోంచి లంగాతో కట్టుకునే చీరల్లోకీ, శిఖలోంచి జడలోకీ, ‘బూలచ్చవ్వ’ను భూలక్ష్మిలోకీ క్రమంగా మార్చుకొచ్చాడు.అక్షరాలు దిద్దించాడు. సంతకం పెట్టడం నేర్పించాడు. ఊళ్లో తొలి మిర్చి పంట ఆయన వేశాడు. తొలి గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌ ఆయన కట్టించాడు. గుప్పుమని ఒక్కసారి వచ్చే మంట వల్ల లైటర్‌తో వెలిగించడానికి ఆమె బుగులు పడితే నవ్వేవాడు. అన్నంలో రాయి వచ్చినరోజు అదే రాయిని ఆమె అరచేతిలో వేసి నలిపినప్పుడు మాత్రం ఆమె సాయమానులో కూర్చుని ఏడ్చింది. చేనుపనుల కాడ మల్యాల రాజవ్వకు చేయి తగిలించిందని స్నానం చేసేదాకా ఇంట్లోకి రానివ్వలేదు.

నలుగురు మగవాళ్లు ఉన్నప్పుడు వెళ్తే ఆయన చూపు తట్టుకోవడం కష్టమయ్యేది. పక్కన ఏనాడూ నడిచేవాడు కాదు. ఎప్పుడూ పరుగులాంటి నడకతో ఆయన అడుగుల వెంటబడి ఈమె పోవడమే. (బీడీ మాత్రమే ఆమె భర్త దగ్గర నేర్చుకోలేదు. పిల్లలు కొంచెం పెద్దవాళ్లై హాస్టళ్లకు వెళ్లిపోయాక, భూలక్ష్మి దేహం తిరిగి బూలచ్చవ్వగా మారడానికి పట్టిన కాలంలోని ఒంటరితనంలో– ఆకు, జర్దా వేసుకునే ఆడవాళ్లను భర్త అసహ్యించుకునేవాడు కాబట్టి బీడీలో కుదురుకుంది. కట్ట అయిపోయినప్పుడు భూదవ్వ చాటుగా కొనుక్కొస్తుంటుంది. ఘాటు తగ్గడానికి, మొదట్లో పీకకు సన్నతువ్వాల అడ్డం పెట్టుకుని తాగితే, తువ్వాలంతా తుప్పురంగు మరకలే.)

చనిపోవడానికి కొన్ని రోజుల ముందునుంచీ మాత్రం వెంకట్రెడ్డి ధోరణిలో మార్పు వచ్చింది. ఆమె చేయి పట్టుకుని అలాగే కూర్చుండేవాడు. ‘లచ్చులు’ తమాయించుకోలేనంత ప్రేమ పొంగుకొచ్చినప్పుడు అలా పిలిచేవాడు. ‘నాకు ఏమన్నా అయితే పిల్లల్ని నువ్వు ఎట్ల జేసైనా సాదుతావనే నాకు భరోసా. నాకు దెలుసు నువ్వు ధైర్యవంతురాలివి’. అట్లాంటి మాటలు విన్నప్పుడల్లా పిల్లల్ని మరింత దగ్గరగా పొదువుకునేది ఆయనతో పాటు. ఇద్దరూ ఏడ్చేవాళ్లు. అమ్మా నాన్న ఎందుకేడుస్తున్నారో తెలియక పిల్లలు ఏడ్చేవాళ్లు. అప్పటికే ఆయనకు పంచాయితీలు చేస్తున్నాడని కేపన్న నుంచి మౌఖిక హెచ్చరికలు వస్తున్నాయి. సారా కాంట్రాక్ట్‌ తీసుకున్న తర్వాత ఏకంగా గోడమీద కరపత్రాలు వెలిశాయి. భూలక్ష్మి మానేయమని పోరింది, అలిగింది. వెంకట్రెడ్డి అప్పటికే భయంలో పడ్డాడు. కానీ ప్రభుత్వం ఇస్తున్నదాన్ని తాను అమ్మితే తప్పేమిటనే తర్కం దగ్గరే తచ్చాడాడు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా లౌక్యంగా పనిచేసుకోవడం ఆయనకు తెలుసు.

ఇట్లాంటి వ్యవహారంలో పోలీసులతో పని జరగదు, అంతా అయ్యాక శవపంచనామా చేయడం తప్ప వాళ్లు చేసేదేమీ ఉండదు. కానీ ఈలోపు రంగన్న నుంచి నలబై రెండు వేలు కావాలన్న బెదిరింపుతో మనిషొచ్చాడు. అప్పుడే ఆయన ఒక స్థిరానికొచ్చాడు. కాంట్రాక్ట్‌ వదిలేసుకుంటానని చెప్పాడు. కానీ వాళ్లు వదలలేదు. నువ్వు వదిలేసుకున్నా చందా మాత్రం ఇవ్వక తప్పదన్నారు. నలబై రెండు వేలు (ఈ పైన రెండేమిటో వెంకట్రెడ్డికి తర్వాతెప్పటికో స్ఫురించింది) తనకైనా తక్కువేమీ కాదు. అలాగని దానికోసం ప్రాణాల మీదికి తెచ్చుకునేంత మూర్ఖుడూ కాదు. కానీ ఎటూ ఇవ్వక తప్పదన్నప్పుడు ఆ దుకాణమేదో నడిపితే పోతుందికదా! ఈ ఆధిపత్య పోరులో వీళ్లన్నా తనకు అండగా నిలబడకపోరా? ఈ తాత్సారం కేపన్న సహించలేదు. కానీ సారా అమ్మే మనిషిని ఏం చేయాలి? ‘వాళ్లు’ చర్చించకపోలేదు. వెంకట్రెడ్డిని ఒక భావజాలానికి ప్రతినిధిగా చూడాలనీ, అది వ్యక్తి కన్నా ప్రజారోగ్యం పట్ల బాధ్యతలేని ఈ వ్యవస్థ మీది పోరాటమనీ, తీసుకోబోయే చర్య ఈ బాటలో నడవకుండా ఉండేందుకు మరికొందరికి గుణపాఠం కావాలనీ తేల్చారు.

భూదవ్వ చకచకా అన్ని పనులూ చేసుకొస్తోంది. ఇల్లూ వాకిలీ ఊడ్చింది. సగం బావెడు నీళ్లు చేదింది. అరుగు అంచులకు పుట్టమన్ను అలికింది. మొగురపు దిమ్మెలకు సున్నం పూసింది. భూలక్ష్మి అరుగంచుకు ముగ్గు కొట్టింది. కడపల మీద ముగ్గేసింది. బంతిపూల దండ గుచ్చింది. తలస్నానం చేసొచ్చి కూరాడు నీరాడులకు బొట్లు పెట్టింది. ఫొటోకు దండ వేసేముందు నీళ్లతో తడిపిన కుంకుమ బొట్టును భర్త నొసట పెట్టింది. ఆ పెట్టేముందు ఎడమచెవికంత నుంచి కుడిచెవికంత దాకా చూపుడువేలు, మధ్యవేలుతో మెల్లగా తడిమింది. ఈమె అలాగే  నిల్చుండిపోవడం గమనించి, కదిలించే ఉద్దేశంతో భూదవ్వ ‘అక్కా’ అని పిలిచింది. స్టూలు దిగుతూ, ‘ఏడ్చే ఓపిగ్గూడ లేదు తియ్యే’ అంది. చిన్నోడు ఏడిస్తే ఆ దీపావళి రాత్రి కాకరవత్తులు వాడితో మొదటిసారి పట్టించాడు వెంకట్రెడ్డి. పాముగోళీలు బుసబుసమని పొంగితే పాప కళ్లింత చేసుకుని చూసింది. బెల్లపు బువ్వ వండితే నలుగురూ ఇష్టంగా తిన్నారు. తర్వాత ఆయన విరామంగా బీడీ ముట్టించాడు.

భూలక్ష్మి మంచాలు వంచింది. దూరంగా పటాకుల మోత వినబడుతోంది. మధ్యలో కుక్కల అరుపులు. పొద్దుటినుంచీ ఆడటం వల్ల పిల్లలు పడుకున్నది పడుకున్నట్టే నిద్రపోయారు. చిన్నోడిని తన మంచంలోకి తెచ్చి పడుకోబెట్టుకోబోయి, భార్య ముఖంలోని మెత్తదనం గమనించి వెళ్లి పక్కన కూర్చున్నాడు. చీరకొంగును నోటికి అడ్డం పెట్టుకుని కూర్చున్నది తీసేసి, ‘మనం వేములవాడ వెళ్లిపోదం’ అంది. లోపల ఉన్న అన్ని భయాలకు ఆమెకు తోచిన పరిష్కారం అది. టౌనులో ఉంటే ప్రాణభయం అంతుండదు. కానీ ఈ భూమి, వ్యవసాయం, జీతగాడున్నా రోజూ చూసుకోవాల్సిన పనులు? ‘ఎంతొస్తే అంత, ఎంత పండితే అంత’ మళ్లీ కొనసాగించింది. ‘అంత అవసరమైతే పొద్దున రావాలె, మాపటాళ్లకల్లా పోవాలె, రాత్రి మాత్రం ఇక్కడ పండుకోవద్దు’. ఆయన జవాబివ్వలేదు.

కానీ భార్య మాటలు ఆలోచనలో పడేశాయి. దబదబదబ. పెద్ద దర్వాజా చప్పుడైంది. ఈ సమయంలో ఎవరు కొడతారు? దబదబదబ. ‘ఎవరు?’ అనబోయిన వెంకట్రెడ్డి మనసు కీడు శంకించింది. దబదబదబ. భూలక్ష్మి కాళ్లూచేతులూ ఆడలేదు. భగవంతుడా, ఎప్పుడో ఎదుర్కోవాల్సి వస్తుందనుకున్న ఘట్టం ఈరోజే వచ్చిందా? కుక్కలు మొరుగుతున్నాయి. దబదబదబ. ఆమెకు తెలుస్తోంది, ఇది వివేకంతో మెదల్సాలిన క్షణమని. తను కూడా ఊహించని నిబ్బరం ఆమెలోకి ప్రవేశించింది. భర్తను జెప్పన అర్రలోని కాగులోకి వెళ్లి కూర్చోమని సైగ చేసింది. ఆయనకు అర్థమయ్యీ కాకపోతే రెక్క పట్టుకుని లాక్కెళ్లినంత పనిచేసింది. అందులో బియ్యమున్నా సగం ఖాళీగానే ఉంది. ఆయన వెళ్లి వంగి కూర్చున్నాడు. బీడీకట్ట, అగ్గిపెట్టె తీసి మంచం తలాపు కింద పెట్టింది. బీడీ కొరుకును జాలాట్లో పడేసి మోరీలోకి కొట్టుకు పోయేట్టుగా నీళ్లు పోసింది. చప్పున చెప్పులు గుర్తొచ్చాయి. ఎక్కడ దాయాలి? గుమ్మిలో వేసి, నిద్రలోంచి లేచినట్టుగా చిన్నవాకిట్లోకి వెళ్లి తలుపు తీసింది.

మొత్తం నలుగురు మనుషులు. చేతుల్లో ఆయుధాలు కనబడలేదు. ఎవరినైనా ఏమైనా చేయగలరంటే నమ్మలేనంత అతి మామూలుగా ఉన్నారు. తనకంటే పెద్దవాళ్లే అయివుండొచ్చు, అయినా ‘అక్క’ అనే మాట్లాడారు. వెంకట్రెడ్డి సంగతి ప్రత్యేకించి కాకుండా మామూలుగా అడిగారు. కేపన్న వచ్చిండని చెప్పమన్నాడు అందులో ఒకతను. అతడు కేపన్న అయివుండడు. నలుగురిలో బక్కగా ఎత్తుగా ఉన్న మనిషి కేపన్న అయివుంటాడని ఊహించుకుంది. ఇంట్లో ఎందుకు లేడని అడిగితే ఏం చెప్పాలో జవాబు అదివరకే సిద్ధం చేసుకుంది. ఆకలవుతోందంటే, కొంత బెల్లపుబువ్వ విస్తారిలో పెట్టిచ్చింది. పొద్దుటివి రెండు వరి రొట్టెలు మిగిలుంటే మామిడికాయ తొక్కు రాసిచ్చింది. వెళ్లిపోయారు. తలుపు వేసొచ్చి చిన్నగా భర్తను పిలిచింది. ‘పటేలా’. ఆయన బనీను చెమటతో తడిసింది. ముఖం పాలిపోయింది.

‘ఏమమ్మా, కొడుకు రాలేదా?’ పలకరించాడు బావనయ్య నేరుగా ఇంట్లోని బావి దగ్గరకు వస్తూ. ముందు ఆయనవీ, తర్వాత జంగమయ్యవీ కాళ్లు కడిగింది భూలక్ష్మి. పరిచివున్న చాపలో వేసివున్న పీటల్లో ఇద్దరూ వెళ్లి కూర్చున్నారు. సిద్ధం చేసిన చేటలు ముందర పెట్టింది భూదవ్వ. ‘ఊబిదిదార్ల ఇంట్ల తిరునామదారివి నీకేం పని?’ అని బావనయ్య గతేడాదిలాగే జంగమయ్యతో హాస్యమాడాడు. పెద్దల ప్రీత్యర్థం పుణ్యవచనం చదివారు. చేటల్లోని బియ్యాన్ని భూలక్ష్మి జోలెల్లో పోసింది. కూరగాయలు వేసింది. దేని కాగితం దానికి చుట్టి సాహిత్యం విడిగా ఇచ్చింది. చెరో అరవెయ్యి పదకొండు రూపాయల సంభావన సమర్పించుకుని దండం పెట్టింది. పదంటే పది నిమిషాల కార్యక్రమం. దీనికి పొద్దుటినుంచీ ఇద్దరు ఆడవాళ్లు నడుములు పడిపోయేలా పనిచేశారు. పీటమీదినుంచి లేస్తూ, ‘చొచొచొ, ఎంకట్రెడ్డి పటేలు...’ అని ఒక నిట్టూర్పు విడిచాడు బావనయ్య.

కార్యక్రమం జరుగుతుండగా వచ్చిన రామస్వామి పంపిన ‘అజయ్‌గాడు’ వాకిట్లో బండి ఆపుకొని, ముందు వీళ్లను పోనిద్దామన్నట్టుగా అక్కడే నిలుచున్నాడు. దాటిపోయేముందు పలకరింపుగా ‘ఏమోయి’ అన్నాడు బావనయ్య. బావనయ్య అంటే బావనయ్య. అంతకుమించిన భావం ఏమీ కనబరచలేదు వాడు. వాళ్లను సాగదోలడానికి వచ్చిన భూలక్ష్మితో, ‘ప్రతాపన్నొచ్చిండు, బాబాయి నిన్ను జెప్పన దోల్కరమ్మన్నడు’ అన్నాడు. తిరిగి వచ్చేదాకా భూదవ్వను ఇంట్లో ఉండమని చెప్పింది. ‘కూర పొయ్యిమీదేసి నువ్వింత తిను’ అంది. ‘బాగ సేపైందా ప్రతాపన్న గిట్టొచ్చి’ బండి ఎక్కుతూ అడిగింది. ‘అట్ల రాంగనే ఇట్ల బైలెళ్లిన’. ‘ప్రతాపన్న’ కొన్నేళ్లకిందటే ఆరోగ్య కారణాల వల్ల జన జీవన స్రవంతిలోకి వచ్చాడు. ఒక దూరపు రాజకీయ బంధువు చొరవతో నేరుగా ఎస్పీ దగ్గర లొంగిపోయాడు. ముందుగా ఆశయం కోసం కోల్పోయిన తన వ్యక్తిగత జీవితాన్ని కొన్నాళ్లు ఆస్వాదించాడు.

ఇరవై ఏళ్లలో కొంతమంది స్నేహితులతో అతడు పట్టుమని పది నిమిషాలు మాట్లాడింది లేదు. నెమ్మదిగా కుటుంబాన్ని ఒక దారికి తెచ్చాడు. ఊళ్లల్లో పాత పరిచయాలతో కొత్త వేషంలో తిరిగాడు. ఎవరైనా పంచాయితీలు తీర్చమని వస్తారు. సాధ్యమైనంత న్యాయంగా పోతాడని పేరు. ఐదారు మండలాల పెట్టు ఎవరింట్లో పెళ్లి జరిగినా అక్షింతలు వేసి వస్తాడు. ఎవరైనా చనిపోతే కుటుంబాన్ని తప్పక పరామర్శిస్తాడు. ప్రతి ఊరిలో తనదైన కొంత అనుచరగణం తయారైంది. రామస్వామి కూడా అందులో ఒకడు. స్థానికంగా పట్టొచ్చాక రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఛైర్మన్‌ అయ్యాడు. అమ్మాయి పెళ్లి చేశాడు. అల్లుడూ కూతురూ, మనవడితో సహా ఈమధ్యే అమెరికా నుంచి వచ్చి వెళ్లారు. ఏ పార్టీలో ప్రత్యేకంగా చేరకపోయినా ఈసారి అధికార పార్టీ ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వొచ్చని జనం ఊహిస్తున్నారు.

మండల కేంద్రం నాలుగు కిలోమీటర్ల దూరం. భూలక్ష్మి వెళ్లేసరికి ముప్పై నలబై మందిలో కొందరు కూర్చుని ఉన్నారు, కొందరు నిల్చుని మాట్లాడుతున్నారు. చిన్న షామియానా వేసి, కుర్చీలు వేశారు. రామస్వామి ఎదురొచ్చాడు మర్యాదగా ఆహ్వానిస్తున్నట్టు. మండలంలోని ఇతర ఎంపీటీసీలు, ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, స్థానిక విలేఖరుల్లో చాలామందిని ఆమె గుర్తుపట్టింది. ప్రతాపన్న ఫొటోతో కట్టిన ఫ్లెక్సీలోని ఒక్కో అక్షరమే చదివింది: ‘కత్తుల ప్రతాప్‌ (కేపన్న) గారికి స్వాగతం’. ఇక లేద్దాం అన్నట్టుగా  ప్రతాపన్న దగ్గరికి వెళ్లాడు రామస్వామి. అందరికీ నమస్కరిస్తూ, తన ఎత్తును సంబాళించుకోలేక సతమతమవుతున్నట్టుగా వంగి నడుస్తూ ఆయన భూలక్ష్మి వైపు వచ్చాడు. తెలియని మనిషీ కాదు, ఇంతకుముందు తారసపడలేదనీ కాదు. కానీ ఆ క్షణంలో ఆమెను అక్కడ చూడటం ఆయన మనసుకు ఇబ్బంది కలిగించింది. దాన్ని అధిగమించడానికి ‘బాగున్నరా అక్కా’ అని నవ్వుతూ పలకరించాడు. ‘అంత మంచిదేనే’ అని ఈమె ప్రతి నమస్కారం చేసింది.

ఆ రోజు భూలక్ష్మి ఇలాగే నమస్కారాలు పెట్టింది. ‘మా పటేలును సంపుతున్నరుల్లో’ అని ఊరు ఊరంతా నిద్రలేచేంత గట్టిగా బొబ్బలు పెట్టింది. వెళ్లిన నలుగురు ఎంతసేపు వేచిచూశారో, పెద్ద దర్వాజా ఎక్కొచ్చి పందిరి మీదుగా నేరుగా చిన్న వాకిట్లో దూకారు. అట్లా దిగొచ్చని ఎవరైనా ఇంటి గురించి తెలిసినవాళ్లే చెప్పివుండాలి! వాకిలి దాకా వెంకట్రెడ్డి మామూలుగానే నడిచాడు. కానీ ధైర్యం సన్నగిల్లాక ఈడిగిలపడ్డాడు. ఘొరఘొరా ఈడ్చుకెళ్లారు. ధోవతి కాళ్ల మధ్యలో చిక్కుకుని పాదాల బరువు పడటం వల్ల ఊడిపోయింది. అట్లా చెడ్డీ మీద వాడకట్టువాళ్లు చూస్తుండగా తలవంచుకుని నిలబడే అవకాశం ఇవ్వకుండానే కట్టెలతో విరగబాదారు.

పెద్ద పెయ్యి కాబట్టిగానీ ఇంకొకరైతే అక్కడిదక్కడే చచ్చిపోయేవాడు. భూలక్ష్మి మట్టిలో కూలబడి బొచ్చె గుద్దుకుంటూ ఏడుస్తూనేవుంది. కింద పడిపోయిన వెంకట్రెడ్డిని తిరిగి నిలబెట్టి, గొడ్డలి మర్రేసి రెండు మోకాళ్ల చిప్పల మీద బలంగా కొట్టారు. ఠంగ్‌. ఆ దృశ్యం గుర్తొస్తే ఇప్పటికీ భూలక్ష్మి మోకాళ్లు వణుకుతాయి. ఆ దెబ్బలకు వెంకట్రెడ్డి అవయవాలకు ఒక్కరోజులోనే ఇరవైఏళ్ల ముసలితనం వచ్చింది. అక్కడ చిన్న మంట రాజేశారు. దబ్బునంతో జీడీగింజకు ఒకవైపు చిన్న రంధ్రాలు పొడిచి, గింజకు ఇంకోవైపు అదే దబ్బునాన్ని గుచ్చి మంట మీద కాల్చారు. జీడీ బుసబుసమని పొంగింది. వెంకట్రెడ్డి అప్పటికే పడిపోయివున్నాడు. కూర్చోబెట్టి ఒకతను గదువను పైకెత్తుతూ తల పట్టుకున్నాడు. ప్రతాపన్న చూస్తుండగా, ఇంకొకతను ఆ జీడీతో ఎడమ కణత దగ్గర మొదలుపెట్టి కుడి కణత వరకు పూర్తయ్యేలా నుదుటి మీద రాశాడు: నేను ప్రజారోగ్య కంటకుడను.

రెండు రోజులకు జీడీ అంటిన మేరంతా పుండయింది. కొన్ని రోజులకు పుండు మానుతూ పొట్టంతా రాలిపోయి, ఒళ్లు కాలిన మనిషి నొసలులా తయారైంది. ఏరెడ్డి మల్లయ్య వచ్చి కడుతున్న కట్లు తప్ప, అన్ని రోజులూ వెంకట్రెడ్డి మంచంలోంచి లేవలేదు, ఇంట్లోంచి బయటకు రాలేదు. ఒకరోజు ఒంటేలుకు పోదామని మంచంలోంచి లేచి, గుత్పకట్టె సాయంతో ఒక్కో అడుగు వేయడానికి ప్రయత్నించాడు. బలం చాలలేదు. కాళ్లు నిలబడలేదు. పాక్కుంటూ వచ్చి, బావి దగ్గరి జాలాట్లో పోసి, అలుపు తీర్చుకుంటూ అక్కడే అరుగంచుకు కూలబడ్డాడు. చినుకులు వస్తాయేమోనని చిన్న వాకిట్లోని దండెం మీద బట్టలు ఎండేసి, తలుపు దగ్గరికి వేసి, పొలం కాడికి వెళ్లినట్టుంది భూలక్ష్మి.

వెంకట్రెడ్డి ధోవతి, బనీను, చిన్నదాని లంగాజాకెట్, చిన్నోడి అంగీలాగూ, నాలుగు మడతలేసిన భూలక్ష్మి చీర, జాకెట్, బాడీ, ఎర్రరంగు లంగా. బొందెలు చేతుల్లా కిందికి వేలాడుతున్నాయి. లంగాలోని నీటితడి నెమ్మదిగా కిందికి జారుతూ అంచుల్లో నలుపు గాఢతను సంతరించుకుంటూ ఒక్కో చుక్క గుండ్రంగా ఉబ్బుతూ పట్టుజారి టప్పున అడవటాన్ని నిస్సహాయంగా చూస్తూ కూర్చున్నాడు. లోపల దవడలు సన్నగా వణికాయి. కళ్లలోంచి జారిన నీటిచుక్క తగిన ఉబ్బుకు రాక అలాగే కొలికిని పట్టుకుని వేలాడింది. సరిగ్గా వారం తర్వాత కడుపు నొప్పికి తాళలేక పురుగుల మందు తాగి మాజీ సర్పంచ్‌ ఆత్మహత్య అన్న వార్త కొత్తగా ప్రారంభమైన టాబ్లాయిడ్‌ పేజీల్లో వచ్చింది. ఆ ఊరిలో పురుగు మందు తాగి చనిపోయిన మొదటి మనిషి కూడా వెంకట్‌రెడ్డే అయ్యాడు.

రామస్వామి అందించిన కొబ్బరికాయను షట్టర్‌ ముందు కొట్టాడు ప్రతాపన్న. తర్వాత అగరుబత్తులు ముట్టించాడు. కత్తెరతో ఎర్ర రిబ్బన్‌ కత్తిరించడం ద్వారా మధుశాల వైన్స్‌ ప్రారంభమైంది. అందరూ చప్పట్లు కొట్టారు. అజయ్‌గాడు అందరి దగ్గరికి స్వీట్‌ ప్యాకెట్‌ పట్టుకెళ్లాడు, నోరు తీపి చేసుకొమ్మన్నట్టుగా. బీరు ప్రారంభ రోజు ధర యాబై రూపాయలు ఉంచారు. ఓ రామస్వామి స్నేహితుడు మంచి గిరాకీ కావాలని ఎక్కువ ధర పెట్టి బోణీ చేశాడు. ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత, పక్కనే ఉన్న స్నేహితుడి ఇంట్లో చిన్న సిట్టింగ్‌ ఏర్పాటుచేశాడు రామస్వామి. ప్రతాపన్న, ఎస్‌ఐ, విలేఖరులు లాంటి ముఖ్యమైనవాళ్లు అటు బయలుదేరారు. మళ్లీ అజయ్‌గాడు భూలక్ష్మిని దింపేందుకు బండి స్టార్ట్‌ చేశాడు. రామస్వామి పరుగున వచ్చి ఎవరూ చూడకుండా సీటుముందున్న కవర్లో నల్ల క్యారీబ్యాగ్‌ ఒకటి పెట్టాడు.

భూలక్ష్మి ఇంటికి వెళ్లేసరికి భూదవ్వ అన్నం తిని పళ్లెం కడుగుతోంది. రెండు నిమిషాలు కూర్చుని, భూలక్ష్మి స్థిమితపడిందని అనుకున్నాక, ‘నేను పోయొస్తా అక్కా’ అని చెప్పి వెళ్లిపోయింది. భూదేవికి ఆకలవుతోంది. అజయ్‌గాడు ఇంట్లో తెచ్చిపెట్టిన నల్లక్యారీబ్యాగ్‌ చూసింది. చల్లగా తగిలింది. పెద్ద దర్వాజా వేసొచ్చి, పంటికింద వేసుకోవడానికి ఏమున్నాయో వంటింట్లో చూసి, ఏకాంతంగా కూర్చుంది. ఇవ్వాళ్టి రోజు జీవితమంత పొడుగ్గా గడిచినట్టు అనిపించింది. భర్త తననే చూస్తున్నాడు. భూమ్మీద ఎవరికీ అర్థం చేయించలేని రహస్యమేదో ఆ కళ్లలో మెరిసినట్టు అనిపించింది. కాసేపటికి రామస్వామి ఫోన్‌. ‘ఆ వదినె, ఏ ఉట్టిగనే జేషిన. ఇంటికి మంచిగనే జేరినవ్‌ గదా అని’. తాగిన మాట తెలుస్తోంది. కొంచెం మౌనం తర్వాత గొంతు తగ్గించి, ‘లచ్చులు’ అన్నాడు. చల్లటి చేయికి వేడి తగిలినటై్ట పక్కకు జరుపుకుంది.
- పూడూరి రాజిరెడ్డి

Advertisement
Advertisement