ఒక హత్య... ఒక సాక్షి... అసలేం జరిగింది? | Sakshi
Sakshi News home page

ఒక హత్య... ఒక సాక్షి... అసలేం జరిగింది?

Published Sun, Jun 7 2015 1:01 AM

ఒక హత్య... ఒక సాక్షి... అసలేం జరిగింది? - Sakshi

చేయని నేరం
నేరం చేస్తే చట్టం శిక్షిస్తుంది. కానీ అమాయకుల మీద నేరం మోపబడితే? పోలీసుల అందమైన కథనంతో నిర్దోషులు దోషులుగా నిర్ధారణ అయితే ఏమవుతుంది? రికీ జాక్సన్, విలీ బ్రిడ్జ్‌మాన్‌ల జీవితం అవుతుంది.
క్లీవ్‌లాండ్... అమెరికాలోని ఓహయో రాష్ట్రంలో జనసమ్మర్దం గల నగరం.
నలభై ఏళ్ల కిందట... అంటే 1975 మే 19న క్లీవ్‌లాండ్‌లో ఏం జరిగిందంటే...


ఓ వ్యాపారి హత్య జరిగింది. హెరాల్డ్ ఫ్రాంక్స్ అనే వ్యాపారిని దుండగులు అతడి దుకాణంలోనే అత్యంత దారుణంగా హతమార్చారు. దుండగులు హతుడిని చితకబాదారు. ముఖంపై యాసిడ్ పోశారు. చివరకు పాయింట్ 38 కేలిబర్ తుపాకితో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. వాటిలో ఒక తూటా హతుడి భార్య ఆనారాబిన్స్‌ను గాయపరచింది. ఈ సంఘటనకు ఎడ్డీ వెర్నాన్ అనే పన్నెండేళ్ల బాలుడు తప్ప వేరే సాక్షులెవరూ లేరు. నిందితులకు వ్యతిరేకంగా సంఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు కూడా లేవు.
 
పోలీసులు ఏం చేశారంటే..?
నిందితులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా, క్లీవ్‌లాండ్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఈ హత్య కేసులో ముగ్గురు యువకులను నిందితులుగా ఇరికించారు. కోర్టులో తమదైన శైలిలో ఒక కథ వినిపించారు. ఆ కథకు అనుకూలంగా పన్నెండేళ్ల బాలుడు ఎడ్డీ వెర్నాన్‌ను ప్రత్యక్ష సాక్షిగా ప్రవేశపెట్టారు. పోలీసుల కథ ప్రకారం... రికీ జాక్సన్, విలీ బ్రిడ్జ్‌మాన్ హత్యకు పాల్పడ్డారు. ఫ్రాంక్స్‌ను చంపేశాక, అతడి బ్రీఫ్‌కేసును దోచుకున్నారు.

ఆ సమయానికి విలీ మరో సోదరుడు రోనీ బ్రిడ్జ్‌మాన్ కారులో ఫ్రాంక్స్ దుకాణం వెలుపలే సిద్ధంగా ఉన్నాడు. నేరం పూర్తయ్యాక ముగ్గురూ పరారయ్యారు. పోలీసుల కథకు ‘ప్రత్యక్ష’సాక్షి వెర్నాన్ సాక్ష్యం బలం చేకూర్చింది. రికీ జాక్సన్, విలీ బ్రిడ్జిమాన్‌లకు కోర్టు తొలుత మరణశిక్ష విధించింది. వారికి సహకరించిన రోనీకి యావజ్జీవ శిక్ష విధించింది.

అయితే, 1977లో జరిగిన పునర్విచారణలో రికీ జాక్సన్, విలీ బ్రిడ్జిమాన్‌లకు మరణశిక్ష బదులుగా యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పును సవరించింది. విలీ, రోనీలు 2002, 2003లో పెరోల్‌పై విడుదలయ్యారు. పెరోల్ నిబంధనలు ఉల్లంఘించడంతో విలీ స్వల్ప వ్యవధిలోనే మళ్లీ జైలు పాలయ్యాడు. రికీకి ఎలాంటి పెరోల్ దొరకలేదు. ఇక జైల్లోనే తన బతుకు తెల్లారిపోతుందనుకున్నాడు. ఆశలు వదిలేసుకున్న దశలో అనుకోని మలుపు.
 
మలుపు తిరిగిందిలా..
కేసులో ప్రత్యక్ష సాక్షిగా సాక్ష్యం చెప్పిన వెర్నాన్ పెరిగి పెద్దవాడయ్యాడు. ఎదిగిన తర్వాత ఆత్మసాక్షి అతడిని కుదురుగా ఉండనివ్వలేదు. పోలీసుల ప్రోద్బలంతోనే రికీ జాక్సన్, బ్రిడ్జిమాన్ సోదరులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పానంటూ గత ఏడాది కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. సంఘటనా స్థలానికి దరిదాపుల్లో తాను లేనని, ఆ సమయానికి తాను స్కూలు బస్సులో ఉన్నానని తెలిపాడు. దీంతో రికీ జాక్సన్, విలీ బ్రిడ్జిమాన్‌లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించి, విడుదల చేసింది.

నేరం చేయకపోయినా అత్యధిక కాలం జైలులో గడిపిన రికీకి 20 లక్షల డాలర్లకు పైగా పరిహారం లభించనుంది. జైలులో మగ్గిన కాలానికి అనుగుణంగా బ్రిడ్జిమాన్ సోదరులకూ పరిహారం అందుతుంది. ఓహయో లెక్కల ప్రకారం నిరపరాధిగా జైలులో గడిపిన ప్రతి ఏడాదికి 40,330 డాలర్ల చొప్పున చెల్లిస్తారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ మొత్తాన్ని సవరిస్తారు.
 
పరిహారంతో తీరిపోతుందా..?
పరిహారంగా డబ్బిస్తారు సరే! కటకటాల వెనుక కరిగిపోయిన యవ్వన కాలాన్ని తిరిగిచ్చేదెవరు..? ఏ రకంగా లెక్కించి పరిహారం చెల్లిస్తారు..? వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు గానీ, ఒక్క నిరపరాధికైనా శిక్ష పడరాదన్న సహజ న్యాయసూత్రం ప్రపంచంలో సజావుగా అమలు కావడం లేదనేందుకు రికీ జాక్సన్, బ్రిడ్జిమాన్‌ల ఉదంతమే ఒక తాజా నిదర్శనం. నియంతృత్వ దేశాల్లో నిరపరాధులు కటకటాల వెనక్కి చేరడంలో విడ్డూరం ఏమీ లేకున్నా, ప్రజాస్వామ్యానికి పెద్దన్న వంటి అమెరికాలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తుండటమే వైచిత్రి! కథనాల అల్లికలో అమెరికా పోలీసులూ మెరికలేనన్నమాట.

Advertisement

తప్పక చదవండి

Advertisement