కత్తి ఎవరు దించారు? | Sakshi
Sakshi News home page

కత్తి ఎవరు దించారు?

Published Sun, Jul 17 2016 3:30 AM

కత్తి ఎవరు దించారు? - Sakshi

పట్టుకోండి చూద్దాం
‘జానకి రామయ్యను ఎవరో హత్య చేశారట...’
‘చీమకు కూడా ఆపద తలపెట్టని వ్యక్తిని హత్య చేశారా?’
‘ఈ రోజుల్లో ఒక నీతి అంటూ ఉందా? హంతకులకు... మంచివాళ్లు ఏమిటి? చెడ్డవాళ్లు ఏమిటి?’
‘ఇంతకీ ఈ హత్య ఎవరు చేసి ఉంటారు?’
‘అది ఎవరూ చెప్పలేకపోతున్నారు!’
‘ఆయనకు వ్యాపారప్రత్యర్థులు కూడా ఎవరూ లేరు. అందరితో స్నేహంగా ఉంటారు’
‘ఇంతకీ ఇది హత్యేనా? లేక ఆత్మహత్యా?’
‘ఖచ్చితంగా హత్యే... డౌటే లేదు’
   
కేసు దర్యాప్తు చేయడానికి ఇన్‌స్పెక్టర్ నరసింహ రంగంలోకి దిగాడు. ‘‘నరసింహ ఎన్నో మిస్టరీలను ఛేదించవచ్చుగాక... ఈ మిస్టరీని మాత్రం ఛేదించలేడు. ఒక్క క్లూ కూడా దొరకడం లేదట’’ అనుకున్నారు నరసింహ అంటే గిట్టని వాళ్లు. నరసింహ కళ్లలో ఎలాంటి సందేహం కనిపించడం లేదు... మిస్టరీని ఛేదిస్తాననే ఆత్మవిశ్వాసం తప్ప. జానకిరామయ్య పీఏ ప్రియను ఇంటరాగేట్ చేశాడు నరసింహ.
 
ఇక్కడ ప్రియను గురించి కొంచెం చెప్పుకోవాలి. ఎంతో కాలంగా ప్రియ చాలా నమ్మకంగా జానకిరామయ్య దగ్గర పనిచేస్తోంది. ఈ ప్రియ ఎవరు అనే దానిపై కూడా రకరకాల గాసిప్‌లు ప్రచారంలో ఉన్నాయి. తన భార్యకు తెలియకుండా జానకిరామయ్య వేరే స్త్రీని పెళ్లి చేసుకున్నాడని, ఆమెకు కలిగిన సంతానమే ప్రియ అనే వాళ్లు లేకపోలేదు. అదెంత వరకు నిజమో, అబద్ధమో తెలియదుగానీ... హత్య మిస్టరీని ఛేదించడానికి ప్రియ కీలక వ్యక్తిగా మారింది.

ఇన్‌స్పెక్టర్‌తో ఆమె చెప్పిన విషయాలు:
 1. ఒక ఫైల్ ఇవ్వడానికి జానకి రామయ్యగారి క్యాబిన్‌లోకి వెళ్లాను. వెంటనే పెద్దగా అరిచాను. ఆయన వెన్నులో కత్తి దిగి ఉంది.
 2. హత్యకు ముందు ఆయన ఎవరితోనో గొడవపడి ఫైట్ చేసినట్లు ఉన్నాడు. టేబుల్ మీద ఫైల్స్ చిందరవందరగా పడి ఉన్నాయి. రిస్ట్‌వాచ్ పగిలిపోయింది.
 3. మధ్యలో ఒకసారి పెద్దగా అరుపులు వినిపించాయి. అలా అరవడం ఆయనకు అలవాటు కాబట్టి ఎప్పటిలాగే నేను పెద్దగా పట్టించుకోలేదు.
 4. టేబుల్‌పై కాఫీ మరకలు కనిపించాయి. నిజానికి ఆయనకు కాఫీ తాగే అలవాటు లేదు.
 5. ఛాంబర్‌లో ఒక మూల ఒక జత గ్లోవ్స్ కనిపించాయి.
 6. నాగరాజు, విజయ్, రమణ, శ్రీనివాస్, రాఘవ... విజిటర్స్ బుక్‌లో చాలామంది పేర్లే నమోదై ఉన్నాయి.
 ప్రియ క్యాబిన్‌లోకి వచ్చాడు ఇన్‌స్పెక్టర్.
 
ఓ మూలన ఉన్న డస్ట్‌బిన్‌లో రెండు కాఫీ కప్పులు కనిపించాయి.
ఇన్‌స్పెక్టర్: ఈ కప్పుల్లో ఎవరు కాఫీ తాగారు?
ప్రియ: ఒక కప్పులో నేను తాగాను... రెండో కప్పు నాగరాజుది.
ఇన్‌స్పెక్టర్: నాగరాజు ఎవరు?
ప్రియ: జానకిరామయ్యగారికి బాగా క్లోజ్
ఇన్‌స్పెక్టర్: నాగరాజు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
ప్రియ: ఏదో నెంబర్ అడగడం కోసమని వచ్చాడు. మరిచిపోయి... కాఫీ కప్పు నా టేబుల్ మీదే పెట్టి వెళ్లిపోయాడు... ఆ తరువాత నేనే ఈ కప్పును డస్ట్‌బిన్‌లో పడేశాను.
 మరి కొద్దిసేపు దర్యాప్తు జరిపిన తరువాత ఇన్‌స్పెక్టర్ నరసింహ...
 
‘‘ప్రియా... ఈ హత్య నువ్వే చేశావు’’ అన్నాడు.
 ‘‘నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు?’’ ఆశ్చర్యంగా అడిగింది ప్రియ.
 ‘‘నిన్ను అనుమానించడానికి బలమైన కారణాలు ఇవి...’’ అంటూ చెప్పుకుపోయాడు ఇన్‌స్పెక్టర్.
 ప్రియ నేరం ఒప్పుకోక తప్పలేదు.
 ప్రియను ఇన్‌స్పెక్టర్ అనుమానించడానికి కారణం ఏమిటి?
 
Ans:-
1. జానకిరామయ్యను వెనక నుంచి పొడిచారు. కాబట్టి ఫైట్ జరిగే అవకాశం లేదు.
2. ఫైట్ జరగలేదు కాబట్టి... రిస్ట్‌వాచ్ పగిలిపోయే అవకాశమే లేదు. ఇది కావాలనే చేసింది.
3. గ్లోవ్స్ వేసుకొని జానకిరామయ్యను పొడిచి ఉంటే... హంతకుడు ఆ గ్లోవ్స్‌ను అక్కడే వదిలేసి వెళ్లడు.
4. రెండు కాఫీకప్పులపై ఒక్కరివే ఫింగర్ ప్రింట్స్ కనిపించాయి.
 ఈ కారణాలతో ప్రియ చెప్పినవన్నీ అబద్ధాలనే విషయాన్ని కనిపెట్టాడు ఇన్‌స్పెక్టర్.

 
Advertisement
 
Advertisement