ఎవరికీ దొరక్కుండానే ‘పోతాడా..?’ | Sakshi
Sakshi News home page

ఎవరికీ దొరక్కుండానే ‘పోతాడా..?’

Published Sat, Jul 9 2016 11:22 PM

ఎవరికీ దొరక్కుండానే ‘పోతాడా..?’ - Sakshi

కవర్ స్టోరీ
‘డాన్ కో పకడ్‌నా ముష్కిల్ భీ నహీ... నా ముమ్‌కిన్ భీ హై...’ అంటూ అమితాబ్ బచ్చన్ ‘డాన్’ సినిమాలో స్థిరంగా, నిదానంగా పలికిన ఈ డైలాగుకు అప్పట్లో థియేటర్లలో ఈలలు మోగాయి. ‘డాన్’లంటే సమాజంలో అబ్బురపాటుతో కూడిన ఆసక్తి అప్పటి నుంచే మొదలైంది. డాన్‌లను పట్టుకోవడం అంతటి అసాధ్యమైన విషయమా? అనే సందేహాలు కూడా...
 
డీ ఫర్ డాన్... డీ ఫర్ ధందా... డీ ఫర్ డేంజర్... అంతేకాదు, డీ ఫర్ దావూద్ కూడా! ముంబైని గడగడలాడించిన డాన్ దావూద్ ఇబ్రహీం జాడ కనుగొనడానికి ఇప్పటికే వందలాది కోట్లు ఖర్చు చేసిన భారత్ ఇంటెలిజెన్స్ సంస్థలతో పాటు అంతర్జాతీయ భద్రతా సంస్థలూ ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి పురోగతీ సాధించలేకపోయాయి.

ఇప్పుడు అతడు మరణశయ్యపై ఉన్నాడంటూ కొద్ది రోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. డయాబెటిక్ అయిన దావూద్ గ్యాంగరిన్‌తో బాధపడుతున్నాడని, రోజులు లెక్కిస్తున్నాడని పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, టీవీ చానెళ్లలో కథనాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో దావూద్ దొరక్కపోతాడా..? లేక ఎవరికీ దొరక్కుండానే ‘పోతాడా..?’ ఇది బిలియన్ డాలర్ల ప్రశ్న!

 
చీకటి రాజ్యం

మాఫియా వ్యాపారం ఒక చీకటి రాజ్యం. డాన్‌లు నడిపే డేంజరస్ ధందా ఇది. ప్రపంచంలోని నిషిద్ధ వస్తువులన్నింటినీ నిత్యావసరాల్లా విక్రయించే చీకటి విపణి ఇది. ఇందులో చట్టం గిట్టం జాన్తా నై. ఇక్కడ వ్యవహారాలన్నీ కరెన్సీ కట్టలతో ‘సామరస్యంగా’ సెటిలైపోతాయి. కాదూ కూడదని ఎవరైనా ఎదురు తిరిగితే తూటాలు మాట్లాడతాయి. నడివీధుల్లో నెత్తుటేర్లు ప్రవహిస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే కాదు, శాంతిభద్రతలకు కూడా పెనుసవాలుగా నిలుస్తున్న అధోజగత్తు ఇది. దీనిని సమూలంగా పెకలించకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి లేకపోలేదు. ఇక భవిష్యత్ తరాలు ఇలాంటి ‘డాన్’లనే ఆదర్శంగా తీసుకుంటే, యావత్ సమాజమే అతలాకుతలమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.
 
మరణశయ్యపై డాన్!
దావూద్ ఇబ్రహీం పూర్తి పేరు షేక్ దావూద్ ఇబ్రహీం కస్కర్. ముంబై మాఫియాను కొంతకాలం ఏకఛత్రాధిపత్యంగా ఏలాడు. అప్పట్లో ఇతడి డెన్ ఇక్కడే ఉండేది. ఇతడి గ్యాంగ్ ‘డీ కంపెనీ’గా పేరుమోసింది. ముంబైలో ఉన్నంత కాలం సినీప్రముఖులతో రాసుకు పూసుకు తిరిగేవాడు. సినిమాలకు ఫైనాన్స్ చేసేవాడని కూడా బాలీవుడ్‌లో చెప్పుకుంటారు. 1993లో ముంబై పేలుళ్ల తర్వాత భద్రతాదళాలు వేట మొదలుపెట్టడంతో ఈ ‘డాన్’ పలాయన మంత్రం చిత్తగించాడు. ముంబై నుంచి మకాం ఎత్తేసి విదేశాలకు పారిపోయాడు.

కొన్నాళ్లు దుబాయ్‌లో తలదాచుకున్నాడని, తర్వాత పాకిస్థాన్‌లోని కరాచీలో నివాసం ఏర్పరచుకున్నాడని, పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐ అతడికి సహకరిస్తోందని వార్తలు వచ్చాయి. ఆ కథనాలు వెలువడిన వెంటనే దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అతడి అప్పగింత కోసం పాకిస్థాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భారత హోంశాఖ ప్రకటించింది. అయితే, పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం అతడు తమ దేశంలో లేనే లేడంటూ ఆ వార్తలను ఖండించింది.

గత ఏడాది దావూద్‌కు అరవయ్యేళ్లు నిండాయి. షష్టిపూర్తి సందర్భంగా అతడు రిటైర్మెంట్ ప్రకటించుకున్నట్లుగా కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే దావూద్ ఆరోగ్యం దిగజారి, గ్యాంగరిన్‌తో బాధపడుతూ మరణశయ్యపైకి చేరుకున్నాడని కథనాలు వచ్చాయి. అయితే, ప్రభుత్వ వర్గాలేవీ వాటిని ధ్రువీకరించడంలేదు. ఇదిలా ఉంటే, దావూద్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టి తెస్తామని, అతడి నేరాలపై విచారణ జరిపి, అతడికి శిక్ష పడేలా చేస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నెల్లాళ్ల క్రితం ప్రకటించారు.

ఇందుకు అవసరమైన అంతర్జాతీయ భద్రతా బలగాల సహకారం కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు. మన ఇంటెలిజెన్స్ సంస్థలతో పాటు ఇంటర్‌పోల్ వంటి అంతర్జాతీయ భద్రతా సంస్థలు కూడా దావూద్ ఇబ్రహీం కోసం గాలింపు సాగిస్తున్నా ఇంతవరకు ఎవరూ స్పష్టంగా అతడి జాడ కనుక్కున్న దాఖలాల్లేవు. ఈ పరిస్థితుల్లో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన మాట నిలబెట్టుకుంటారా... లేదా... వేచి చూడాల్సిందే!
 
డాన్ కా ‘భయో’డేటా
దావూద్ ఇబ్రహీం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ముమ్‌కా గ్రామంలో 1955 డిసెంబర్ 4న కొంకణి ముస్లిం కుటుంబంలో పుట్టాడు. తండ్రి ఇబ్రహీం కస్కర్ పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు.
 
ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్‌వార్‌లో పాల్గొనడంతో దావూద్ నేరచరిత్ర మొదలైంది. అప్పట్లో ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్ హాజీ మస్తాన్ తరఫున దావూద్ ఆ గ్యాంగ్‌వార్‌లో పాల్గొన్నాడు.
 
హాజీ మస్తాన్ గ్యాంగ్‌లో కొనసాగుతుండగానే 1980ల ప్రారంభంలో ఒక దోపిడీ కేసులో మొదటిసారిగా అరెస్టయ్యాడు. విడుదలయ్యాక నేరాలనే వృత్తిగా చేసుకుని, డాన్‌గా ఎదిగాడు.
 
హాజీ మస్తాన్ గ్యాంగ్, పఠాన్ గ్యాంగ్‌ల నడుమ గ్యాంగ్‌వార్‌ల తర్వాత దావూద్ మరింత ప్రమాదకరంగా మారాడు. హాజీ గ్యాంగ్‌లో కొనసాగుతున్న తన సోదరుడు సబీర్‌ను సుర్వే గ్యాంగ్ సహాయంతో పఠాన్ గ్యాంగ్ హత్య చేయడంతో దావూద్ ప్రతీకార దాడులకు తెగబడి, సుర్వే గ్యాంగ్, పఠాన్ గ్యాంగ్‌లను దాదాపు తుడిచిపెట్టేశాడు.
 
హాజీ మస్తాన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో, దావూద్ గ్యాంగ్ పగ్గాలను చేపట్టాడు. కొద్దికాలంలోనే ముంబై అండర్ వరల్డ్‌లో హాజీ మస్తాన్‌ను మించిన డాన్‌గా ఎదిగాడు.
 
ముంబైలో పాతనౌకలను ధ్వంసం చేసే పరిశ్రమలో భారీగా పెట్టుబడులు పెట్టాడు. కొంతకాలం దుబాయ్‌ని కేంద్రంగా చేసుకుని ఆయుధాల స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ రవాణా, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలు సాగిస్తూ ఆర్థికంగా బలపడ్డాడు.
 
ఆర్థికబలం పుంజుకున్నాక బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్స్ చేసేవాడు. బాలీవుడ్ వివాదాల సెటిల్‌మెంట్లలోనూ తలదూర్చేవాడు. క్రికెట్ బెట్టింగ్‌లను అనుకూలంగా మలచుకునేందుకు భారత్, వెస్టిండీస్ జట్లలోని కొందరు క్రికెటర్లనూ ‘మ్యానేజ్’ చేసేవాడనే ఆరోపణలు ఉన్నాయి.
 
బాలీవుడ్‌కు ‘ఆర్థిక’సాయం చేస్తున్న కాలంలోనే దావూద్ అప్పటి హీరోయిన్ మందాకినితో ప్రేమ వ్యవహారం నడిపాడు. తర్వాత అనితా ఆయూబ్‌తో ఎఫైర్ నడిపాడు. ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని, వారిద్దరికీ ఒక కొడుకు పుట్టాడని కూడా కథనాలు వచ్చాయి.
 
మోస్ట్ వాంటెడ్
దావూద్ ఇబ్రహీం భారత్‌కు మాత్రమే కాదు, అంతర్జాతీయ భద్రతా సంస్థలకు కూడా ‘బాగా కావాల్సిన’ (మోస్ట్ వాంటెడ్) నేరగాడు. ముంబైలో 1993లో జరిగిన పేలుళ్లకు ఆర్థిక సహకారం అందించడమే కాకుండా, పేలుళ్ల కుట్రలో కీలక పాత్ర పోషించినందుకు ఇతడిపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 2008లో జరిగిన ముంబై పేలుళ్లు సహా పలు ఉగ్రవాద చర్యల్లో దావూద్ పాత్ర ఉన్నట్లు భారత్, రష్యా ఇంటెలిజెన్స్ సంస్థలు ఆధారాలు సేకరించాయి.

యూపీఏ సర్కారు హయాంలో దేశాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలోనూ దావూద్‌కు వాటా ఉందనే కథనాలు వచ్చాయి. మొదట్లో మిగిలిన డాన్‌ల మాదిరిగానే మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, ఆయుధాల స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ రవాణా, అక్రమ వసూళ్లు, సెటిల్‌మెంట్లు, హవాలా లావాదేవీలు వంటి కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చినా, క్రమంగా ఉగ్రవాదులతోనూ చేతులు కలిపాడు. ‘డాన్’ ముదిరి టైస్టుగా మారాడు. ‘అల్ కాయిదా’ అధినేత ఒసామా బిన్ లాడెన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చాడని అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థలు తేల్చాయి.

చివరకు 2003లో దావూద్‌ను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా కూడా ప్రకటించాయి. జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో దావూద్‌పై, అతడి అనుచరులపై పలు ఆంక్షలు విధించడమే కాకుండా, ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతడి ఆస్తులను స్తంభించేలా చర్యలు తీసుకున్నారు. అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని చర్యలు ప్రారంభించినా ‘డీ కంపెనీ’ యథావిధిగా తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే వస్తోంది. పలు దేశాల్లో యథేచ్ఛగా తన ఆస్తులను పోగేసుకుంటూనే ఉంది.

గత ఏడాది ‘ఫోర్బ్స్’ పత్రిక ప్రకటించిన అంచనా ప్రకారం దావూద్ ఆస్తుల నికర విలువ 670 కోట్ల డాలర్లకు (రూ.45,181 కోట్లు) పైమాటే!  ఆసియా, యూరోప్, ఆఫ్రికాలలోని పది దేశాల్లో ‘డీ కంపెనీ’కి ఆస్తులు ఉన్నాయని, వీటిలో అత్యధికంగా బ్రిటన్‌లోనే 45 కోట్ల డాలర్ల (రూ.3034 కోట్లు) ఆస్తులు ఉన్నాయని అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థలు చెబుతున్నాయి.
 
కరాచీలో డెన్!
ముంబై నుంచి పరారైన తర్వాత పలుచోట్ల సురక్షిత స్థావరం కోసం ప్రయత్నాలు సాగించిన దావూద్ చివరకు పాక్ ఇంటెలిజెన్స్ అండదండలతో కరాచీ చేరుకుని, అక్కడ సురక్షిత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. పాక్ ప్రభుత్వం ఈ కథనాలను ఎంతగా ఖండిస్తున్నా, అతడికి పాక్ ప్రభుత్వం తరఫున అందుతున్న అన్ని రకాల సహాయ సహకారాల కారణంగానే అతడు అంతర్జాతీయ భద్రతా సంస్థలకు చిక్కకుండా తప్పించుకోగలుగుతున్నాడనేది దాదాపు బహిరంగ రహస్యం.

కరాచీలో సంపన్నులు నివసించే క్లిఫ్టన్ ఎన్‌క్లేవ్‌లో 36 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సకల సౌకర్యాలతో శత్రు దుర్భేద్యమైన కోటలాంటి ఇల్లు నిర్మించుకుని, అక్కడి నుంచి ‘ధందా’ సాగిస్తున్నాడని కథనాలు వచ్చాయి. ‘బిజినెస్ ఇన్‌సైడర్’ గత ఏడాది ప్రచురించిన పరిశోధనాత్మక కథనం ప్రకారం పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో దావూద్‌కు తొమ్మిది నివాస భవనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో తనయుడు బిలావల్ భుట్టో జర్దారీ నివాసానికి అత్యంత చేరువలో ఉంది.
 
దావూద్ ఫ్యామిలీ
షబీర్ అహ్మద్: దావూద్‌కు అన్న. ఇబ్రహీం కస్కర్ సంతానంలో ఇతడే పెద్దవాడు. పఠాన్‌గ్యాంగ్ చేతిలో 1981 ఫిబ్రవరి 12న హత్యకు గురయ్యాడు.
 
సయీదా కస్కర్: దావూద్‌కు అక్క. రత్నగిరి జిల్లాలోని స్వగ్రామం ముమ్‌కేలో నదిలో మునిగి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది.
 
నూరా ఉల్ హక్: దావూద్‌కు తమ్ముడు. ముంబైని వదిలి 1989లోనే గల్ఫ్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత తిరిగి ఇక్కడకు రాలేదు. అక్కడే 2009 మే నెలలో గుండెపోటుతో మరణించాడు
 
హసీనా ఇబ్రహీం పర్కర్: దావూద్ చెల్లి. ముంబైలోని నాగపడా ప్రాంతంలో ఉండేది. మాఫియా కార్యకలాపాలను శాసిస్తూ ‘గాడ్‌మదర్ ఆఫ్ నాగపడా’గా పేరుమోసింది. రెండేళ్ల కిందట గుండెపోటుతో మరణించింది.
 
ముంతాజ్ రహీం: దావూద్ చెల్లి. పెళ్లి తర్వాత కరాచీలో స్థిరపడింది.
 
దావూద్ ఇక్బాల్ కస్కర్: దావూద్ తమ్ముడు. ముంబై నుంచి పారిపోయాక కరాచీ డిఫెన్స్ కాలనీలో ఉండేవాడు. లాడెన్ హతం తర్వాత తనను కూడా అలాగే చంపేస్తారనే భయంతో పాక్-అఫ్ఘాన్ సరిహద్దులకు పారిపోయినట్లు కథనాలు వచ్చాయి. ముంబైలో ఉన్నప్పుడు అన్న అండతో రియల్ ఎస్టేట్ రంగంలో ‘ధందా’గిరీ చలాయించేవాడు.
 
అనీస్ అహ్మద్: దావూద్ తమ్ముడు. మాఫియా ‘ధందా’లో అన్నకు చేదోడుగా ఉండేది ఇతడే. ముంబై పేలుళ్ల తర్వాత అన్న దావూద్‌తో కలసి ఇక్కడి నుంచి పరారయ్యాడు. బాలీవుడ్ ప్రముఖులకు వచ్చే బెదిరింపు కాల్స్ వెనుక ఇతడి ప్రమేయం ఉందంటారు. అంతేకాదు, దావూద్‌కు వారసుడు ఇతడేనని కూడా అంటారు.
 
ఫర్జానా తుంగేకర్: దావూద్ చెల్లి. ఒక వ్యాపారిని పెళ్లి చేసుకుని, ముంబైలోని మజాగావ్ ప్రాంతంలో స్థిరపడింది.
 
జైతూన్ అంతులే: దావూద్ చెల్లి. దుబాయ్ వ్యాపారి హమీద్ అంతులేతో పెళ్లి తర్వాత అక్కడే స్థిరపడింది.
 ముస్తకీం ఇబ్రహీం, మహమ్మద్ హుమయూన్ ఇబ్రహీం: దావూద్ కవల తమ్ముళ్లు. అయితే, మాఫియా నేరాలకు సంబంధించి వీరిపై ఎలాంటి కేసులూ లేవు. వీళ్లిద్దరూ కరాచీలోనే ఉంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇదివరకే వెల్లడించాయి. వీరిద్దరిలో హుమయూన్ లంగ్ కేన్సర్‌తో, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతూ కరాచీ ఆస్పత్రిలో కొద్దిరోజుల కిందటే మరణించాడు.
 
లేడీ డాన్
మెహజబీన్ అలియాస్ జుబీనా జరీన్: దావూద్ భార్య. లేడీ డాన్. ఎవరికీ భయపడని దావూద్... భార్య వద్ద మాత్రం భయపడతాడని చెబుతారు. ఆమె ఇంట్లో లేనప్పుడు విచ్చలవిడిగా పార్టీలు ఏర్పాటు చేసే దావూద్, ఇంకాసేపట్లో ఆమె వచ్చేస్తుందనే అనుమానం ఉంటే, అర్ధంతరంగానే పార్టీలకు ప్యాకప్ చెప్పిన సందర్భాలూ లేకపోలేదనే కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. దావూద్, జుబీన్‌లకు నలుగురు కూతుళ్లు. ఒక కొడుకు. పాక్ క్రికెటర్ జావెద్ మియాందాద్ కొడుకు జునైద్‌తో పెద్ద కూతురు మహ్రుక్ పెళ్లి జరిపించడంలో జుబీన్‌దే కీలక పాత్ర అని చెబుతారు.

ఇక రెండో కూతురు మహ్రీన్ అమెరికాలో స్థిరపడ్డ పాక్ వ్యాపారి ఆయూబ్‌ను పెళ్లాడింది. ఒక్కగానొక్క కొడుకు మొయిన్ లండన్‌లోని ఒక వ్యాపారి కూతురు సానియాను పెళ్లాడాడు. ఖురాన్‌ను కంఠోపాఠం చేసిన మొయిన్ ‘ధందా’కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అందుకే దావూద్ వారసుడిగా అనీస్ ‘డీ కంపెనీ’ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా.
 
మాఫియా పుట్టినిల్లు ఇటలీ
ఆధునిక మాఫియా కార్యకలాపాలకు మూలాలు ఇటలీలో ఉన్నాయి. సిసిలీ కేంద్రంగా తలెత్తిన మాఫియా గ్యాంగ్‌లు దశాబ్దాల పాటు ఇష్టారాజ్యం చలాయించాయి. తర్వాత ఈ మాఫియా ముఠాలు ఆర్థిక శక్తిగా ఎదిగిన అమెరికాలోనూ వేళ్లూనుకున్నాయి. అక్కడి నుంచి క్రమంగా ఇతర దేశాలకూ విస్తరించాయి. ముసోలినీ హయాంలో ఇటలీ మాఫియా కాస్త వెనక్కు తగ్గినా, ముసోలినీ మరణం తర్వాత తిరిగి విజృంభించాయి.

ఇక మన దేశంలో ముంబై కేంద్రంగా మాఫియా గ్యాంగ్‌లు అవతరించాయి. ఇతర దేశాల్లోని మాఫియా గ్యాంగ్‌లతో సంబంధ బాంధవ్యాలు నెరపుతూ చీకటి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాయి. ఇక్కడి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మాఫియా డాన్‌లు విదేశాల్లో స్థావరాలు ఏర్పరచుకుని, ఇక్కడ ఉంటున్న తమ మనుషుల ద్వారా ‘ధందా’లు నడిపించుకుంటున్నారు. సెటిల్‌మెంట్లు, బలవంతపు వసూళ్లు సాగించుకుంటున్నారు.
 
ముంబై మాఫియా
ముంబైకి 1940వ దశకం తొలినాళ్లలో అఫ్ఘానిస్థాన్ నుంచి వలస వచ్చిన అబ్దుల్ కరీం షేర్‌ఖాన్ అలియాస్ కరీంలాలా ఓడ రేవుల్లో పనిచేసేవాడు. చిల్లర గ్యాంగులను ఏకతాటిపైకి తెచ్చి ముంబైలో మొట్టమొదటి మాఫియా డాన్‌గా అవతరించాడు. అప్పట్లోనే తమిళనాడు నుంచి వలస వచ్చిన మస్తాన్ హైదర్ మీర్జా అలియాస్ హాజీ మస్తాన్ రంగంలోకి దిగాడు. హాజీ మస్తాన్ కేవలం మాఫియా వ్యవహారాలకే పరిమితం కాలేదు. సినీరంగంలోనూ తలదూర్చాడు. సినిమాల నిర్మాణానికి పెట్టుబడులు పెట్టాడు. సినీతారలకు తరచు పార్టీలు ఇచ్చేవాడు.

ముంబైలో ‘సెలబ్రిటీ డాన్’గా దాదాపు రెండు దశాబ్దాల పాటు చీకటి రాజ్యాన్ని శాసించాడు. తర్వాత 1985లో ‘దళిత ముస్లిం సురక్షా మహాసంఘ్’ స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తమిళనాడు నుంచి వలస వచ్చిన వరదరాజన్ ముదలియార్ మద్యం అక్రమ వ్యాపారంతో రంగంలోకి దిగాడు. హాజీ మస్తాన్‌తో దోస్తానా చేసి డాన్‌గా ఎదిగాడు. దావూద్ ఇబ్రహీం సహా ఇప్పటి డాన్‌లలో చాలామంది ఒకప్పుడు హాజీ మస్తాన్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నవారే. అప్పట్లో దావూద్‌కు ఛోటారాజన్ కుడిభుజంగా ఉండేవాడు. 1993లో ముంబై పేలుళ్ల సంఘటన తర్వాత దావూద్‌కు దూరమయ్యాడు. దీంతో దావూద్ మనుషులు అతడిపై బ్యాంకాక్‌లో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఛోటారాజన్ గత ఏడాది బాలిలో ఇండోనేసియన్ పోలీసులకు పట్టుబడ్డాడు.
 
బాలీవుడ్‌పై మాఫియా నీడ
మాఫియా కథల ఆధారంగా సినిమాలు రూపొందించే బాలీవుడ్‌ను మాఫియా పడగ నీడ వెన్నాడుతూనే ఉంది. టీ-సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ 1997లో మాఫియా దాడిలోనే ప్రాణాలు కోల్పోయారు. బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత రాకేశ్ రోషన్‌పై 2000 జనవరిలో మాఫియా సభ్యులు కాల్పులకు తెగబడ్డా అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. దావూద్ ఇబ్రహీంతో ‘సన్నిహిత’ సంబంధాలు ఉన్న నటి అనితా ఆయూబ్‌కు తన సినిమాలో అవకాశం ఇవ్వడానికి నిరాకరించిన నిర్మాత జావేద్ సిద్దికీ 1995లో మాఫియా దాడిలోనే బలైపోయారు.

మాఫియాతో సంబంధాలు కొనసాగించడం వల్లనే సంజయ్ దత్ అక్రమ ఆయుధాల కేసులో జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. మహేశ్ భట్, సుభాష్ ఘయ్ తదితర దర్శక నిర్మాతలు తమకు మాఫియా నుంచి బెదిరింపులు ఎదురైనట్లు మీడియాకు వెల్లడించారు. మాఫియా కార్యకలాపాలు కొనసాగిస్తూ బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి, ఆమె భర్త విక్రమ్ గోస్వామి రెండేళ్ల కిందట కెన్యాలో పట్టుబడ్డారు. మరో డాన్ అబు సలేంతో బాలీవుడ్ నటి మోనికా బేడీ కొన్నాళ్లు ప్రేమాయణం కొనసాగించిన సంగతి బహిరంగ రహస్యమే. అబు సలేం అరెస్టు తర్వాత ఇద్దరూ విడిపోయారు. అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తదితర బడా హీరోలకూ మాఫియా డాన్‌లతో పరిచయాలు ఉన్నాయి. ఛోటా షకీల్‌తో తాను మాట్లాడినట్లు షారుఖ్ బహిరంగంగానే అంగీకరించాడు.
- పన్యాల జగన్నాథదాసు

Advertisement

తప్పక చదవండి

Advertisement