సిల్లీ పాయింట్ | Sakshi
Sakshi News home page

సిల్లీ పాయింట్

Published Sat, Feb 14 2015 11:56 PM

సిల్లీ పాయింట్

ఆరు సిక్సర్లు...
 భారత అభిమానులందరికీ టి20 ప్రపంచకప్‌లో యువరాజ్ ఒకే ఓవర్లో బాదిన ఆరు సిక్సర్లు బాగా గుర్తుండిపోయాయి. అయితే అంతకు కొద్ది రోజుల క్రితమే 2007 వన్డే ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హెర్షల్ గిబ్స్ వన్డేల్లో ఈ ఘనత అందుకున్నాడు. సెయింట్ కిట్స్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. లెగ్‌స్పిన్నర్  డాన్ వాన్ బుంగ్ బాధిత బౌలర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు.
 
 సార్... కేసు పెట్టాలా...
 
 తొలి వరల్డ్ కప్ సమయంలో ఆసీస్ బౌలర్ జెఫ్ థాంప్సన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడిని ఎదుర్కోవాలంటే గొప్ప బ్యాట్స్‌మెన్ సైతం వణికిపోయేవారు. ఇక కొత్త కొత్తగా బరిలోకి దిగిన శ్రీలంక ఆటగాడు దులీప్ మెండిస్, సిద్ధార్థ వెట్టిముని పరిస్థితి అయితే మరీ ఘోరం. ఆ బంతులు మెరుపులాగా వచ్చాయి. సగటు వేగమే 100 మైళ్లతో సాగింది అని వారు గుర్తు చేసుకున్నారు.
 
 థామ్సన్ బంతి తలపై తగలడంతో మెండిస్‌ను హడావిడిగా ఆస్పత్రికి పంపించారు. ఆ తర్వాత యార్కర్‌తో వెట్టిమునిని అల్లాడించాడు. పైగా ‘ఇంకా విరగలేదు కదా, ఆడు’ అంటూ రెచ్చగొట్టిన థామ్సన్ తర్వాతి బంతి కూడా అక్కడే వేశాడు. ఈసారి నిజంగానే వెట్టిముని కాలు విరిగింది. వెంటనే అతనూ ఆస్పత్రికి చేరాడు. అయితే వీరిద్దరిని ఆస్పత్రిలో చూసిన ఒక పోలీస్ అధికారికి దాని వివరాలు తెలీదు. అతను ఆందోళంగా ‘మీపై దాడి చేసిన ఆ థామ్సన్ అనే వ్యక్తిపై కేసు పెట్టమంటారా’ అని అడగడంతో లంకేయులు బిక్క మొహం వేయాల్సి వచ్చింది.
 
 
 ట్రిపుల్ ట్రబుల్...
 ప్రపంచకప్ టోర్నీలలో డకౌట్‌గా వెనుదిరిగిన ఆటగాళ్ళలో కెన్యా ఆటగాడు షెమ్ గోచె రికార్డు మాత్రం అత్యంత ప్రత్యేకం. 2011 టోర్నీలో పాల్గొన్న ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మూడు సార్లు డకౌటయ్యాడు. మొత్తం టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన ఇతను మూడు బంతులే ఎదుర్కొన్నాడు. మూడు సార్లూ తొలి బంతికే అవుట్ కావడం విశేషం.
 
 100 మైళ్ల బంతి
 2003 ప్రపంచ కప్‌లో షోయబ్ అక్తర్ అధికారికంగా ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతకు ముందు ఏడాది న్యూజిలాండ్‌లోనూ అతను 100 మైళ్ల వేగాన్ని నమోదు చేసినా దానికి గుర్తింపు లభించలేదు. అయితే కేప్‌టౌన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. అతను వేసిన రెండో ఓవర్‌లో బంతి వేగం పెరుగుతూనే పోయింది. ఈ ఓవర్‌ని నిక్‌నైట్ ఎదుర్కోగా, షోయబ్ మెయిడిన్‌గా విసిరాడు.  రెండో బంతి 98.4 మైళ్లు నమోదు చేయగా, ఐదో బంతి 99.1 మైళ్ల వేగంతో వచ్చింది. ఆ ఓవర్ చివరి బంతి మాత్రం 100. 23 మైళ్ల వేగంతో దూసుకు రావడంతో షోయబ్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.
 
 నంబర్ 10
 1999లో ఆస్ట్రేలియాతో వేదనాభరిత సెమీస్ ముగిసిన కొద్ది రోజులకు షాన్ పొలాక్ విశ్రాంతి కోసం డర్బన్ వెళ్లాడు. అక్కడ సాంప్రదాయ ఉత్సవంలో భాగంగా గుర్రాల రేసు జరుగుతోంది. ఒక వ్యక్తి వచ్చి దేనిపై పందెం కాస్తున్నారని పొలాక్‌ను అడిగాను. ఇంకా నిర్ణయించుకోలేదని పొలాక్ సమాధానమిచ్చాడు. ఆ వెంటనే సదరు వ్యక్తి ... దేనిపై పందెం కాస్తారో మీ ఇష్టం. కానీ 10 నంబర్‌పై మాత్రం వద్దు, అది అస్సలు పరుగెత్తలేదు అన్నాడు. అతని మాట విని నోటమాట రాని పొలాక్ మరింతగా బాధపడ్డాడు. ఎందుకంటే 10 నంబర్ జెర్సీ అంటే అలెన్ డొనాల్డ్‌ది. అతను పరుగెత్తకపోవడంతోనే దక్షిణాఫ్రికా ఓడింది. ఆ వ్యక్తి కావాలనే, వ్యంగ్యంగా అన్నాడని పొలాక్‌కు అర్థమైంది. అన్నట్లు పొలాక్ ఒక గుర్రంపై పందెం కాశాడు. కానీ గెలిచింది మాత్రం 10వ నంబర్ గుర్రమే!
 
 మిల్క్ మ్యాన్
 ప్రపంచ కప్ టైటిల్ గెలిచినప్పుడు ఏదైనా జట్టు చేసుకునే సంబరాల గురించి కొత్తగా చెప్పేదేముంది! ఇంగ్లండ్‌లో అయితే మైదానంలోనే షాంపేన్ బాటిళ్లు పొంగిపొర్లుతాయి. 1983 ప్రపంచకప్ గెలిచాక భారత జట్టు సంబరాల వీడియో మీరు ఎన్నో సార్లు చూసి ఉంటారు. ఈసారి దానిని మరింత జాగ్రత్తగా గమనించండి. ఫైనల్ గెలిచిన తర్వాత, ట్రోఫీని అందుకునే ముందు లార్డ్స్ బాల్కనీలో మనవాళ్లు అమితానందంలో ఉన్నారు. ఆ సమయంలో కెప్టెన్ కపిల్ దేవ్ చేతిలో ఏముందో చూడండి. ఒక పెద్ద పాల బాటిల్ పట్టుకొని మీకు కనిపిస్తాడు. డ్రెస్సింగ్ రూమ్‌నుంచి మిల్క్ బాటిల్‌తో అతను అలాగే బయటికి వచ్చేశాడు. ఇలాంటి దృశ్యం మీరెప్పుడూ చూడలేదేమో! చివరకు లీటర్ల కొద్దీ పాలు తాగే అలవాటు ఉన్న ధోని కూడా 2011 సమయంలో ఇలా కనిపించలేదు మరి.
 
 8000 మంది సెక్యూరిటీ
 2007లో వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచకప్‌నుంచి భారత్ నిష్ర్కమించింది. దాంతో అభిమానులు ఆటగాళ్లున్న  హోటళ్లపై దాడులు చేశారు. జహీర్ ఇంటిపై రాళ్లు రువ్వారు. ధోని ఇంటికి ఒక వైపు గోడ కూలగొట్టారు. ‘మేము  ఇంత ఆందోళనగా ఉన్నాం. మీ ఇంటి గురించి నీకేం బెంగ లేదా’ అని ప్రశాంతంగా కూర్చున్న మునాఫ్ పటేల్‌ను అడిగాడు సచిన్. ‘అన్నయ్యా, నేను ఉండే ఊర్లో ఎనిమిది వేల మంది ఉన్నారు. వాళ్లంతా నాకు సెక్యూరిటీ కల్పిస్తారు. ఇంక భయమేముంది’ అన్నాడు మునాఫ్. ‘ఇలాంటిది జరిగినప్పుడు మేమంతా నీ ఇంటికి వచ్చేస్తే చాలు’ అన్నాడు సచిన్.
 
 మళ్లీ టాస్
 2011 ప్రపంచ కప్ ఫైనల్లో టాస్ రెండు సార్లు వేశారు. ముంబైలోని వాంఖడే స్టేడియం ప్రేక్షకుల అరుపులతో హోరెత్తడంతో మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో గందరగోళానికి గురయ్యారు. భారత్, శ్రీలంక కెప్టెన్లలో ఎవరు ఏమన్నారో ఆయనకు అస్సలు వినిపించలేదు. దాంతో మళ్లీ టాస్ వేయాల్సి వచ్చింది.
 - మొహమ్మద్ అబ్దుల్ హాది
 

Advertisement
Advertisement