ఫ్రెండ్సే... కానీ... | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్సే... కానీ...

Published Sun, Jul 17 2016 1:25 AM

ఫ్రెండ్సే... కానీ...

జీవన గమనం
నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మూడేళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మేమిద్దరం చాలాకాలంగా ఫ్రెండ్స్. అందువల్ల ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పలేకపోతున్నాను. ఆమె చాలామంది జులాయి అబ్బాయిలతో తిరగడం నేను కళ్లారా చూశాను. అయినా ఆమెను ప్రేమించడం మానుకోలేక పోతున్నాను. ఆమె వాళ్లతో తిరగడం తట్టుకోలేక పోతున్నాను. ఏం చేయాలో చెప్పండి.     
- సురేశ్, హైదరాబాద్

 
మనకు దొరకనిది ఎప్పుడూ బాధగానే ఉంటుంది. మోహం ఎక్కువైతే, అది వ్యామోహం అవుతుంది. ఎనిమిదో క్లాసులో ఉండగా ప్రేమలో పడ్డ మీరు, ఏ గమ్యం ఊహించి ప్రేమిస్తున్నారు? కేవలం తిరగడం (ఈ పదం మీరు వాడిందే) కోసం అయితే, మీరు నచ్చకే కదా ఆమె మీతో తిరగటానికి ఒప్పుకోవడం లేదు. లేకపోతే పెళ్లి చేసుకుందామని ప్రేమిస్తే మాత్రం, మీరు అదృష్టవంతులు. ఎందుకంటే భార్య అయిన తర్వాత తిరిగితే మరింత బాధ కదా. ఇలా పాజిటివ్‌గా ఆలోచించండి. జీవితంలో పైకి వస్తే, మిమ్మల్నే బోలెడు మంది ప్రేమిస్తారు. ఐన్‌స్టీన్ నుంచి అబ్దుల్ కలాం దాకా అందరూ ప్రేమించబడ్డారు.
 
నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. నా వయసు 23 ఏళ్లు. డిగ్రీ తర్వాత అక్వాఫార్మాలో పని చేశాను. రెండేళ్లుగా వాళ్ల షాప్‌లో అకౌంట్స్ చూస్తున్నాను. కారణం మా ఇంట్లో వాళ్లు ఆ షాప్ వాళ్లకు అప్పు ఉండటం. అది ఇప్పుడు తీరిపోయింది. ఇప్పుడు నాకు మార్కెటింగ్‌లో జాబ్ వచ్చింది. మంచి జీతం కూడా. చేయగలనన్న నమ్మకం కూడా నాకుంది. అయితే, మా ఇంట్లో వాళ్లకు అది ఇష్టం లేదు. షాప్‌లో పని చేయమని పోరుపెడుతున్నారు. ఎంత చెప్పినా వినడం లేదు. ఇన్నాళ్లూ వాళ్లకు నచ్చినట్లు ఉన్నాను. ఇక నుంచైనా నాకు నచ్చినట్లు ఉండాలనుకుంటు న్నాను. వాళ్లు మాత్రం ‘నువ్వు మా కంట్రోల్‌లోనే ఉండాలి. బయటకు వెళితే మా మాట వినవు’ అంటున్నారు. జీవితంలో ఇలా బతకాల్సిందేనా? ఏం చేయాలో మీరే సలహా ఇవ్వండి.
- రాకేశ్, నెల్లూరు

 
ఒక చక్కటి సాయంత్రం మీరొక నావలో వ్యాహ్యాళి వెళ్తున్నారనుకుందాం. మీతో పాటు కుళ్లిన శవం ఒకటి ప్రవాహంతో పాటూ వస్తోంది. భరించలేని దుర్గంధంతో ఉన్న ఆ శవం నుంచి దూరంగా వెళ్దామనుకున్నారు. ప్రవాహవేగంతో మీరూ వేగంగా ముందుకుపోతారా? ఎదురు తెడ్డు వేసుకుంటూ వెనక్కి పయనిస్తారా? ఏది ఎక్కువ శ్రమతో కూడిన వ్యవహారం?
 
ఈ ప్రశ్నకి రోవింగ్‌లో ఎంతో అనుభవం ఉన్నవారూ, నీటి మీద తరచూ ప్రయాణాలు చేసేవారు కూడా తప్పుడు సలహా ఇస్తారు. వేగంగా... ప్రవాహంతో పాటూ ముందుకు వెళ్లి పోవటమే మంచిదని అంటారు. విజ్ఞులు మాత్రం ముందుకు వెళ్లినా, వెనక్కి వెళ్లినా ఒకే శ్రమ అంటారు. నీటికి ఎదురు తెడ్డు వేసుకుంటూ వెళ్లాలంటే రెట్టింపు బలం అవసరం. చిత్రమేమిటంటే ముందుకు వెళ్లాలన్నా ‘రెట్టింపు శ్రమతోనే’ తెడ్డు వేయాలి. ఎందుకంటే, ప్రవాహశక్తి శవానికి, పడవకూ ఒకటే.

ప్రవాహవేగంతో శవం కూడా మనతో ప్రయాణం చేస్తోంది...! అది తెలుసుకోవటమే విజ్ఞత. మరేం చెయ్యాలి? చుక్కాని ఉంటే, కాస్త దిశ మార్చి పట్టుకోవాలి. తెరచాప ఉంటే గాలివాటం చూసుకోవాలి. అప్పుడు ప్రవాహమే మనల్ని దుర్గంధానికి దూరంగా తీసుకెళ్తుంది. ఇదే జీవితసూత్రం. ఈ సూత్రం తెలియని వారు దుర్గంధంతో పాటు పయనిస్తూ, తెడ్డు ఎంత వేగంగా వేసినా ఫలితం రాలేదని వాపోతారు. ఇష్టం లేని షాపులో పని కొనసాగించమని మీ పెద్దలు ఎందుకు చెబుతున్నారు? అప్పు తీరిపోయింది కదా. దానివల్ల వారికిగానీ, మీకు గానీ ఏం లాభం? మీకు మంచి ఉద్యోగం వచ్చిందంటున్నారు.

దానికి వారు ఎందుకు అడ్డుపడుతున్నారు? కొత్త ఉద్యోగం అంటే వారి నుంచి మీరు దూరంగా వెళ్లాలా? అది వారికి ఇష్టం లేదా? మార్కెటింగ్ అంటే బాగా తిరగాలా? అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని వారి భయమా? ఇంట్లో వారికి మనపై ఉండే ప్రేమలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. కానీ వారు ఇచ్చే సలహాలు కేవలం ప్రేమతో/ స్వార్థంతో కూడుకున్నవా? తర్కంతో కూడుకున్నవా? అన్నది మనం ఆలోచించుకోవాలి. మన జీవితం మనది కదా. అయితే, మీ పెద్దవాళ్లు ఎందుకు వద్దంటున్నారో క్లియర్‌గా తెలుసుకోండి. మీ వాదనలు వినిపించండి. వారి వాదనలు వినండి. అప్పుడు లాభనష్టాలు బేరీజు వేసుకొని మీ నిర్ణయంతో వారిని ప్రభావితం చేయండి.
- యండమూరి వీరేంద్రనాథ్

Advertisement
Advertisement