యాంగ్‌షూ ప్రకృతి చేసిన విన్యాసం | Sakshi
Sakshi News home page

యాంగ్‌షూ ప్రకృతి చేసిన విన్యాసం

Published Sun, Jul 26 2015 1:57 AM

యాంగ్‌షూ ప్రకృతి చేసిన విన్యాసం

 చెట్టులెక్కగలవా... ఓ నరహరి పుట్టలెక్కగలవా అంటూ చెంచులక్ష్మి ఆట పట్టించడాన్ని సినిమాల్లో చూశాం. ట్రెకింగ్, మౌంటెనీరింగ్ అంటూ కొండ వాలులు, పర్వత సానువుల వెంట పరుగులు తీసే సాహసికులను బయట చూస్తూనే ఉంటాం. ఇప్పుడు... అడ్వెంచర్ టూరిజం రాక్ క్లైంబింగ్ మీద సరదా పడుతోంది. అందుకు అనువైన శిఖరాల కోసం చైనా బాట పడుతోంది.
 
 చైనా దక్షిణభాగంలో గువాన్‌గ్జీ రీజియన్‌లో గుయిలిన్ నగరానికి సమీపంలో ఉంది యాంగ్‌షూ. ప్రకృతి చేసిన విచిత్రమైన విన్యాసాలే ఈ ఊరిని ప్రపంచం దృష్టిలో పడేటట్లు చేశాయి. యాంగ్‌షూ పట్టణానికి చుట్టూ  పచ్చటి శిఖరాలు చీమల పుట్టల్లా ఉంటాయి. వాటి మధ్యలో కొద్దిపాటి సమతల ప్రదేశం, ఓ పక్క ‘లీ’ నది ప్రవాహం. కొండవాలులో కట్టిన ఇళ్లు, వాటిని తొంగి చూడడానికే అన్నట్లు అర్ధచంద్రాకారంలో పెద్ద రంధ్రం. కొండకు ఇంత చక్కగా ఏ శిల్పకారుడో చెక్కినట్లు అర్ధవృత్తాకారం ఎలా వచ్చిం దని ఆశ్చర్యంగా చూసేలోపు గైడ్‌లు ఓ సైన్సు పాఠం చెప్పేస్తారు. ఈ కొండల్లోని లైమ్‌స్టోన్, డోలమైట్, జిప్సమ్ వంటివి నీటిలో కరిగిపోవడంతో ఏర్పడిన రంథ్రం అది. వర్షాలు కురిసి నీటిలో డోలమైట్ వంటివి కరిగిపోగా మిగిలిన రాతి రూపాలివి. చీమ పుట్టలను తలపించే కొండశిఖరాలు, గుహలు, భూగర్భ జలప్రవాహాలు, సహజంగా రూపొందిన విచిత్రమైన రూపాలు కూడ.
 
 యాంగ్ షూ కే ఎందుకంటే...
 ఇది పొల్యూషన్ ఫ్రీ టూరిస్టు స్పాట్. ఓ సైకిల్ అద్దెకు తీసుకుని పట్టణ వీధుల్లో తిరగవచ్చు. వాటర్ కేవ్‌లో మునిగి మడ్ బాత్, మడ్ ఫైట్ చేయవచ్చు. ఇది పెద్ద వాళ్లను చిన్నపిల్లలుగా మార్చేసే సరదా ఆట. మడ్‌ఫైట్ చేసిన తర్వాత ఆ పక్కనే ఉండే వేడినీటి గుండాల్లో సేదదీరడంలో ఉన్న హాయిని ఫీలవ్వాల్సిందే. ఇక్కడ మోటర్‌బైక్ ట్యాక్సీలను యువతులు నడుపుతుంటారు. గైడ్‌కు కానీ, ట్యాక్సీలకు కానీ బేరమాడకపోతే పది ‘రెన్‌మిన్‌బి’ల బదులు యాభై వరకు సమర్పించుకోవాలి. అచ్చమైన చీనీ వంట!
 రెస్టారెంట్లలో చైనీస్‌ఫుడ్‌తోపాటు పశ్చిమ దేశాల ఆహారం కూడా దొరుకుతుంది. చాలా రెస్టారెంట్లలో మెనూ చైనాభాషలోనే ఉంటుంది. పేరు పలకడానికి వచ్చినవే ఆర్డర్ చేయడం లేదా గైడ్ సహాయంతో ఆర్డర్ చేయడమే మార్గం. చైనా వాళ్ల వంటలను వారి ఇళ్లలోనే రుచి చూడాలంటే యాంగ్‌షూ నుంచి పది నిమిషాలు ప్రయాణించాలి. అక్కడ రైతులు ఇళ్లలో పర్యాటకులకు వండి పెట్టడంతోపాటు కలిసి భోజనం చేస్తారు.
 
 లీ నదిలో పడవ ప్రయాణం!
  యాంగ్‌షూ చిన్న పట్టణం. గుయిలిన్ లియాన్‌గ్జియాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగి రోడ్డు మార్గాన వెళ్లాలి. దీనికంటే అద్భుతమైన ప్రయాణం లీ నదిలో పడవలో వెళ్లడమే. కాలుష్య రహితమైన ప్రదేశంలో ప్రవాహ వేగం తెలియని నిశ్శబ్దమైన నదిలో పడవలో విహరిస్తుంటే... ఆకాశం కనిపిస్తుంది కానీ అందదు. నేల ఉందని తెలుసు కానీ తాకలేం. తీరం మాత్రం నేనున్నానని భరోసా ఇస్తున్నట్లు ఉంటుంది. ఏ నదిలో పయనిస్తున్నా ఇలాంటి అనుభవమే ఉంటుంది. కానీ లీ నదిలో పయనించేటప్పుడు, కొండలెక్కేటప్పుడూ పక్కనే యాంగ్‌షూ పట్టణంలో వీధులు, ఇళ్లు కనువిందు చేస్తుంటాయి.
 
 రాక్ క్లైంబింగ్! కొండల పైకి ఎక్కుతూ మంద్రంగా ప్రవహించే లీ నదిని చూస్తూ మధ్యలో వైవిధ్యమైన ఆర్కిటెక్చర్‌తో ఉన్న చైనా ఆలయాలను చూడడానికి ఆసియా దేశాలతోపాటు పాశ్చాత్య దేశాల నుంచి కూడా పర్యాటకులు క్యూ కడుతుంటారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement