విదూషకుల విన్యాసాలు

21 May, 2019 00:19 IST|Sakshi

రెండో మాట 

ఏపీలో అధికారం కోల్పోతున్న తరుణంలో ఒక నాయకుడు  చేయరాని పనులకు, దుర్మార్గాలకు చంద్రబాబు నాయకత్వం వహించడం దురదృష్టకరం. ఏ కాంగ్రెస్‌ నుంచి వచ్చి ఎన్టీఆర్‌ పంచనచేరి రాజ్యచక్రాన్ని తిప్పాడో, ఆ పార్టీ విధానానికే విరుద్ధంగా అదే కాంగ్రెస్‌లో చేరడానికి అన్ని మార్గాలూ వెతుక్కుంటున్నారు. ఈ ప్రహసన యాత్రలో అంతర్భాగమే ‘జగడపాటి’ విదూషక పాత్ర! ఇతని విద్య తిమ్మిని బమ్మిని చేయడం. గురుశిష్యులిద్దరిదీ ఒకటే మనస్తత్వం. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగానే చంద్రగిరిలోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరగడానికి ముందురోజున ఓటర్లను ప్రభావితం చేసేలా ఊహాజనిత ఫలితాలను ప్రసారం చేసిన ఘనుడు లగడపాటి.

‘‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇంత ఘోరంగా జరుగుతాయా? ఇది ప్రజాస్వామ్య మేనా? చంద్రగిరిలో రికార్డయిన పోలింగ్‌ వీడి యోలు పరిశీలిస్తే ఒళ్లు  గగుర్పొడుస్తోంది’’.
– కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది (17.05.2019) ప్రకటన

‘‘దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ ఉండాలంటే.. నాయకుడు ఎంత గొప్పవాడైనా అతడి పాదాల కింద నలిగిపోయేలా ప్రజలు  తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అప్పగించి కూర్చోరాదు. అలాగే తాము త్యాగాలతో నిర్మించుకున్న రాజ్యాంగ వ్యవస్థల్ని దారి తప్పించి కూల్చివేయగల అధికారాల్ని  అతని చేతుల్లో పెట్టరాదు. రాజకీయాల్లో భక్తి భావన పతనానికి చివరికి వ్యక్తి నియంతృత్వానికి రాజమార్గం వేస్తుం దన్న సత్యాన్ని మరిచిపోరాదు’.
– 1949 నవంబర్‌ 25న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ నిర్ణయ సభలో చేసిన ఆఖరు ప్రసంగంలో హెచ్చరిక!

మేడిపండుగా భావించిన ‘పండు’ను కాస్తా పొట్టవిప్పి చూడగానే పురుగులమయంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ మారుతోందని  ఎప్ప టికన్నా హెచ్చుస్థాయిలో  గత 70 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రకు అపవాదుగా 2019 ఎన్నికల నిర్వహణ నిరూపించాయి. ఈ పతన దశకు ప్రస్తుత కేంద్ర, దేశంలోని వివిధ రాష్ట్రాల పాలకులు కారకులయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌లో పతనదశలో ప్రవేశించిన భ్రష్ట టీడీపీ నాయకుడు చంద్రబాబు అధికారం కోల్పోతున్న తరుణంలో ఒక నాయకుడు  చేయరాని పను లకు, దుర్మార్గాలకు నాయకత్వం వహించడం దురదృష్టకరం. కాంగ్రెస్‌ కేంద్ర అధిష్టానవర్గం నిరంకుశ పాలనా వ్యవస్థకు అంకురార్పణ చేస్తున్న తరుణంలో ఆ పరిణామానికి అడ్డుకట్టడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీని అష్టావక్రమార్గాల్లో నడిపించి భ్రష్టతవైపు మళ్ళించినవాడు చంద్రగిరి ప్రాంత చంద్రబాబు. అల్లుడిగా ఇంట్లో ప్రవేశించిన వ్యక్తి ‘నల్లి’ పోట్లు ద్వారా ఎన్టీఆర్‌ని సాగనంపి  ముఖ్యమంత్రి పదవికి ఎగబాకిన వాడు అనంతరం తన పార్టీకి ఏకు మేకవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ విభజనకు కారకుడు కావడం జగమె రిగిన సత్యం. తాజాగా  ఏ కాంగ్రెస్‌ నుంచి వచ్చి ఎన్టీఆర్‌ పంచనచేరి రాజ్యచక్రాన్ని తిప్పాడో, ఆ పార్టీ విధానానికే విరుద్ధంగా అదే కాంగ్రెస్‌లో చేరడానికి ఈ కష్టకాలంలో అన్ని మార్గాలూ వెతుక్కుంటున్నారు. ఈ ప్రహసన యాత్రలో అంతర్భాగమే ‘జగడపాటి’ విదూషక పాత్ర! ఇతని విద్య తిమ్మిని  బమ్మిని చేయడం. గురుశిష్యులిద్దరిదీ ఒకటే మనస్తత్వం. ఒకరు పార్లమెంటును స్తంభింపచేయడం కోసం మిరియాల కారం (పెప్పర్‌ స్ప్రే) సభ్యుల కళ్లలో  కొట్టడంలో నేర్పరి. మరొకరు అవసాన పదవీదశలో ఉన్న ముఖ్యమంత్రి. 

నిజానికి చంద్రగిరిని వదిలేసి కుప్పం నియోజకవర్గానికి చంద్ర బాబు ఎందుకు వలసపోవలసి వచ్చింది? కాంగ్రెస్‌లో ఉండి చిత్తూరు జిల్లా  చంద్రగిరి నుంచి శాసనసభకు ఎన్నికైన∙వ్యక్తి.. ఎన్టీఆర్‌ను అంటకాగిన తర్వాత ఆ నియోజక వర్గాన్ని విడిచి ‘కుప్పం’ ఒడిలోకి ఎందుకు చేరవలసి వచ్చింది? పైగా, శిక్షా ప్రాంతంగా పేరు మోసిన కుప్పంకు బదిలీ కావడానికి అధికారులు ఎందుకు ఇష్టపడరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎడంగా, కడుకొసలో ఉన్న కుప్పం ఏనాడూ చంద్రగిరిలో అంతర్భాగమే కాదని చారిత్రికుల భావన. అందుకే, 1995 దాకా ఆంధ్ర ప్రదేశ్‌–కర్ణాటక–తమిళనాడు హద్దుల ముక్కోణం కూడలిలో ఉంది. ఏ అధికారినైనా శిక్షించాలంటే కుప్పానికి తోసి శిక్షిస్తారట. పైగా అమాయక తమిళనాడు పేదసాదలకు నిలయం కూడానట. ఈ ‘శిక్షాత్మక, సమ స్యాత్మక ప్రాంతాన్ని బాబు ఎంచుకుని తన రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నారు. రామకుప్పం, గూడుపల్లి, శాంతిపురం మండలాలతో కూడిన కుప్పాన్ని నియోజకవర్గంగా ఏర్పరచి, దానికి వ్యవసాయ క్షేత్రం అని పేరు జోడించారు. గతంలో తొలి ముఖ్యమంత్రి హోదాలో, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధకులు, శాస్త్ర వేత్తలు వద్దు వద్దన్నా మన వాతావరణానికి సానుకూలపడని ఏటవాలు ‘పోడు’ వ్యవసాయ పద్ధతుల్లో ఇజ్రాయెలీ సాగు పద్ధతుల్ని ప్రవేశపెట్టి చంద్రబాబు అభాసుపాలయ్యారు. ఇజ్రాయెలీ సాగుకు మన రైతుల్ని అలవాటు చేయడం కోసం సంప్రదాయ క్షేత్ర సరిహద్దుల్ని చెరిపేసి, రైతుల్ని ఇబ్బందుల పాల్జేసి, తమ భూముల్ని తామే గుర్తించలేని దుస్థి తిలోకి రైతుల్ని నెట్టి తీవ్ర విమర్శలకు గురైన బాబు కనీసం మర్యాద కోసమైనా, గౌరవ భావంతో రైతులకు పొరపాటు అయిందని కూడా క్షమాపణ చెప్పకుండా తప్పుకున్నారు.

అలాంటి చంద్రబాబు, బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మొన్నటిదాకా భాగస్వామ్య పక్షంగా ఉండి, ఇటీవలే విడాకులిచ్చి తిరిగి తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్‌ను అంటకాగుతూ ఎన్టీఆర్‌ ‘తెలు గుదేశం’ పార్టీని భూస్థాపితం చేసే వైపుగా ప్రయాణిస్తున్నారు. ప్రజా వ్యతిరేక చర్య అయిన నోట్ల రద్దును మోదీ ప్రకటించకముందే మన రాష్ట్రంలో మొదట ప్రస్తావించి, ‘రద్దు’ పద్దుకు ప్రతిపాదించింది తానే నని గొప్ప కోసం ప్రకటించి, బీజేపీ సంకీర్ణానికి విడాకులిచ్చిన మరు క్షణం ఆ నెపాన్ని మోదీ మీదికి సునాయాసంగా నెట్టేశారు బాబు. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్‌ కేంద్రాలలోనూ ఓట్ల రిగ్గింగ్‌కు భారీ స్థాయిలో పాల్పడిన ‘దేశం’ పార్టీ నాయకులు, కార్యకర్తల రక్షణ కోసం బాబు పడరానిపాట్లు పడుతున్నారు. పైగా, డబ్బుతో ఓట్ల కొనుగోళ్లకు తన చోటామోటా నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రోత్సహించిన బాబు ఢిల్లీలో ‘ఎన్నికల విధానం: జవాబు దారీతనం’ అన్న అంశంపై సదస్సులో (18.5.2019) మాట్లాడుతూ ‘పెద్ద నోట్లు రద్దుచేసి కొత్తగా రూ. 500, రూ. 2,000 నోట్లను ప్రవేశ పెట్టడంవల్ల రాజకీయ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచటం సులువైపోయింది. ప్రజలు కూడా రెండువేలు, అంతకుపైనే ఎక్కువగా ఆశిస్తున్నార’నీ చెప్ప  టం ప్రజల మధ్య నవ్వులాటగా మారిందని అతను గుర్తించటం లేదు.

‘జవాబుదారీతనం’ గురించి ఊకదంపుడు కొట్టే బాబు రాష్ట్ర ఉన్నతాధికారుల క్రియాశీల నిర్ణయాలను, ఎన్నికల (కేంద్ర–రాష్ట్ర) కమి షన్‌ ఉన్నతాధికారుల్ని లెక్క చేయకుండా పోవటం– అంబేడ్కర్‌ శఠిం చిన రాజకీయ అహంకార ప్రదర్శన తప్ప మరొకటి కాదు. ఎన్నికల నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కిన వ్యక్తి అతను. ఈ అహంకారం తోనే చంద్రగిరి నియోజకవర్గంలోని కీలకమైన పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని దళిత, మైనారిటీలను ఓటు హక్కును వినియోగించుకో కుండా సుమారు 30 ఏళ్లుగా నిర్బంధ విధానాన్ని బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు వర్గం జాగ్ర త్తపడింది. ఈ పరిణామాలను బయటకు పొక్కనివ్వకుండా ‘వదరు బోతు’గా చంద్రబాబు– ‘చిలకజోస్యాల’ ‘రగడ’ (లగడ)పాటి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగానే పార్టీల ఎన్నికల ప్రచారంపై ఆంక్షలు ఉండగానే తుది ఫలితాల ప్రకటన వెలువడక ముందే చంద్రగిరిలోని ఏడు పోలింగ్‌ కేంద్రాలలో ఓటింగ్‌ జరగడానికి ముందు రోజున ఓటర్లను ప్రభావితం చేసేలా ఊహాజనిత ఫలితాలను ప్రసారం చేశారు. అందుకు ఫలితాన్ని అనుభవించక తప్ప లేదు– అయిదు పోలింగ్‌ కేంద్రాలలో అధికార పార్టీకి అనుకూలంగా బాహాటంగా వ్యవహరించిన అధికారులపై ఎన్నిక సంఘం వేటు వేయవలసి వచ్చింది. 

ఇదిలా ఉండగా, ఫలితాల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలిసి కూడా చంద్రబాబు ‘కాలుకాలిన పిల్లిలా’ దేశ ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో విఫలమవుతున్నారని, పరువుకోసంగానూ ‘దేశం’ ఓటమిని ఆంధ్రప్రదేశ్‌లో హుందాగా ఒప్పుకోవడానికి మనస్సు బిక్క చచ్చిపోయినందున ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలు, బెంగాల్, ఒడిశా నాయకులను తనలాగే కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టడానికి చేస్తున్న ప్రయ త్నాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. ఇందుకు కారణం– సొంత రాష్ట్రంలోనే తన అధికార పునాదులు బీటలు వారుతూండటమేనని మరువరాదు. పళ్ల బిగువుతోనే ఢిల్లీ, పంజాబ్, కోల్‌కతాల పంచల్లో తల దాచుకోచూడటం. దళిత ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రానివ్వకుండా, బెదిరింపుల ద్వారా దౌర్జన్య హింసల ద్వారా అడ్డుకుని వారి ఓట్లను వారి పేరిట తామే గుద్దుకున్న ‘దేశం’ నాయకత్వ చర్యలు వేనోళ్ల ఖండించి ఏవగించుకోవలసినవి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘రగడ పాటి’ జరిపిన సర్వే ఫలితాలు ఉభయ ప్రాంతాల తెలుగు ప్రజల మధ్య ఎంతగా నవ్వుల పాలయ్యాయో తెలిసిందే. 24 గంటలు గడవకముందే చంద్రబాబు మాజీ నియోజకవర్గమైన చంద్రగిరిలో భారీ బందోబస్తు మధ్య జరపవలసి వచ్చిన రీ–పోలింగ్‌ సందర్భంగా కూడా పరమ ‘బోకు’ జోస్యంగా, కాదు కాదు, పరమ అపహాస్యంగా మిగిలిపోను న్నది. పైగా ఇప్పటికే అడుగూడిన ప్రతిపక్ష నాయకులతో రేపు ఏపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతున్న చంద్రబాబు మంతనాలు చేస్తున్నారు.

యావద్భారతంలో ఆసేతు హిమాచల పర్యంతం ‘ప్రజాస్వామ్యం’ విలువలు 2019 ఎన్నికలలో మరింతగా దిగజారిపోవటం విచారకరం! ఎన్టీఆర్, వైఎస్‌. రాజశేఖరరెడ్డి హయాంలు తెలుగు వారి కీర్తి పతాకలను నిలబెట్టగా, వాటిని దించేయడానికి సాహసించినవారుగా, రేపటి పదవీభ్రష్టులుగా చంద్రబాబు అతని పార్టీ మిగిలిపోతారు. కానీ, రేపటి ఉషోదయానికి, పరిణామశీలమైన మార్పుకు ఆహ్వానం!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా